Friday, 10 June 2016

రామాయణము బాల కాండ -ఐదవ సర్గ

                             రామాయణము 

                         బాల కాండ -ఐదవ సర్గ 

సప్త ద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని అనేక మంది రాజులు పరిపాలించారు . ఈ వంశమున సగరుడు అను వాడు  సుప్రసిద్దుడు . ఈ సగరుని 60000 మంది కుమారులు యజ్ఞాశ్వనిమిత్తమై సముద్రమును తవ్విరి . కావున దానికి సాగరము అని పేరు వచ్చెను . ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన అనేకమంది రాజులు జన్మించి వంశమునకు వన్నె తెచ్చెను . అట్టి మహా వంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము . 
సరయు నదీ తీరమున "కోసల "అను ప్రసిద్ద దేశము కలదు . అది ధన ,ధాన్య సంపదలతో తులతూగుచున్నది . అచటి జనులు మిక్కిలి సంతోషవంతులుగా వుండిరి . ఆ కోసల దేశమున "అయోధ్య "అను పేరు కల ఒక మహా నగరము కలదు . ఆ నగరమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింప చేసెను . ఆకారణము గా అది లోక ప్రసిద్ది చెందినది . ఆ మహా నగరము మిక్కిలి విశాలముగా అపూర్వ శోభతో విలసిల్లుచున్నది . అక్కడి వీధులు ఇరు వైపులా వృక్షములతో విశాలముగా వున్నవి . జలములచే తడపబడిన ఆ రాజ మార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడ ముచ్చటగా వున్నవి . కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరద మహారాజు దేవేంద్రుడి అమరావతి వలె అయోధ్యా పుర వైభవమును ఇనుమడింప చేసెను . 
ఆ పురము ప్రశస్త మైన ద్వారములతో ,ద్వారా భందములతో అందముగా ఉండెను . నగర మద్య భాగమున బారులు తీరిన అంగళ్లు (కొట్లు )తో మనోహరముగా ఉండెను . అక్కడ వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉండెను . అన్ని కళల అందు నిపుణులు అయినశిల్పులు ఆ నగరము అందు వుండిరి . ఆ పురి నృత్య కళా కుశులురు అయిన నటీ నటులతో శోభిల్లుచు ఉండెను . అందు చూడ ముచ్చటైన మామిడి తోపులు కలవు . చుట్టూ కల ప్రాకారము ఆ పురికి వడ్డాణము వలె మనోజ్ఞముగా ఉండెను . దాని చుట్టూ లోతైన అగడ్త ,శత్రు దుర్భేద్యమైన కోట కలవు . అక్కడ మేలు జాతికి చెందిన గుర్రములు ,వేగముగా నడవగల ఏనుగులు ,వృషభములు ,ఒంటెలు అనేకము కలవు . కప్పములు చెల్లించడానికి వచ్చిన సామంత రాజులతో ఆ నగరము కళకళ లాడుతూ ఉండెను . క్రయ విక్రములకై వచ్చిన విదేశీ వ్యాపారులతో ఆ నగరము రద్దీగా ఉండెను . రత్నములు పొదిగిన రాజ గృహములతో ,క్రీడా పర్వతములతో ,అంతస్తులతో కూడిన మేడలతో ఇంద్రుని అమరావతి నగరము వలె శోబిల్లిచూ ఉండెను . 
అష్టాపదాకారములో ఉన్న చిత్ర విచిత్రములైన రాజ గృహములతో అందముగా ఉండెను . అది అందమైన సుందరీమనులతో అలరారుచుండెను . నానా విధ రత్న శోభలతో కళకళ లాడుచుండెను . అక్కడి గృహస్థుల ఇండ్లు ఎత్తి దోషములు లేకుండా సమతలముపై నిర్మింపబడి కిక్కిరిసి ఉండెను . ఆ పురములో మేలైన వరి బియ్యము ,చెరుకు రసము వంటి మధుర జలములు సమృద్దిగా ఉండెను . దుందుభుల మ్రోతతో ,మృదంగ ద్వనులతో వీణా నాదములతో మద్దెలరవముల తో ఆ మహానగరము ఎంతో మారుమ్రోగుచుండెను . సిద్ద పురుషులకు తపః ఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరము నందలి గృహములు బారులుతీరి విద్వాంసులతో నిండి ఉండెను . ఆ నగరము నందలి యోధులు ,శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినవారు . సమర్ధులు ,శబ్ద బెది విద్యా నిపుణులు కాని వారు సహాయపడు వారు లేక ఒంటరిగా ఉన్న వారినికాని ,పారిపోవు చున్న వారిని కాని చంపేవారు కారు . వనము నందు మత్తిల్లి గర్వముతో గర్జించే సింహములను ,గాండ్రించు పెద్ద పులులను ,ఘర్జించు అడవి పందులను ఆ యోధులు ధీరులై వాడియైన శస్త్రములతో ,భాహు బలముతో సంహరించు చుండెడివారు . అట్టి వేలకొలది మహా రధులతో నిండి ఉన్న ఆ అయోధ్యా నగరమును దశరద మహా రాజు పరిపాలించుచు ఉండెను . 
అచటి ద్విజోత్తములు (బ్రాహ్మనోత్తములు )అందరును నిత్యాగ్ని హోత్రులు శమదమాది గుణ సంపన్నులు ,వేద వేదాంగముల యందు ,పారంగతులు ,సత్యమును పల్కుట యందు నిరతులు ,మిక్కిలి ప్రజ్ఞావంతులు ,కొల్లలుగా దానము చేయువారు . మహర్షులతో సమానులు అట్టి అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని ,దశరద మహారాజు కోసల దేశమును పరిపాలించుచు ఉండెను . 

బాలకాండ అయిదవ సర్గ సమాప్తము . 



               శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 












Thursday, 9 June 2016

రామాయణము బాల కాండము -నాల్గవ సర్గ

                రామాయణము 

           బాల కాండము -నాల్గవ సర్గ 


బ్రహ్మ దేవుని అనుగ్రహము వలన దివ్య జ్ఞానము పొందినవాడును ,మహా కావ్య నిర్మాణ చతురుడు అయిన వాల్మీకి మహర్షి కోసలాదీశుడై ఉన్న శ్రీ రాముని చరితమును మనోజ్ఞములైన శబ్దాలంకారాల శోభతో లోక కళ్యాణము నకై అద్భుతముగా రచించెను . 

 
వాల్మీకి మహర్షి  రామాయణమును 6 కాండలుగా ఇరువది నాలుగు వేల శ్లోకములతో రచించెను . తరువాత ఉత్తర కాండ నాకు రూపు దిద్దేను . మిక్కిలి ప్రజ్ఞాశాలి ,కాదు సమర్దుడు అయిన వాల్మీకి శ్రీ రామ పట్టాభిషేక అనంతర గాధను ,అశ్వమేధ యాగామునకు పిమ్మట జరగనున్న వృత్తాంతమును కుడా రచించెను . ఇక ఈ రామాయణమును కంటస్థం చేసి గానము చేయ గల వారు ఎవరు ?అని అతడు ఆలోచించ సాగెను . ఇలా ఆలోచిస్తూ ఆ మహర్షి అట్టి శిష్య ప్రాప్తికై భగవంతుని ద్యానించు చుండగా ,ముని వేషములలో ఉన్న కుశలవులు అక్కడికి వచ్చి ,ఆయన పాదములను ఆశ్రయించిరి . గురువు గారికి సేవ చేయడంలో నిరతులు ,అధ్యయనము పూర్తి అగు వరకు స్థిరమైన నిష్ఠ కలిగిన రాజకుమారులు ,మంచి విద్యార్ధులుగా ప్రసిద్ధికి ఎక్కినవారు ,సమాన స్థాయిలో గానము చేయగల సోదరులు ,చక్కని గాత్రము కలవారు ,తన ఆశ్రమ వాసులు అయిన లవకుశలను వాల్మీకి మహర్షి చూసెను . "వీరు రామాయణమును గానము చేయుటకు సమర్ధులు "అని తలిచేను . 
వేద తుల్యమైన రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్ధములను వ్యక్త పరుచుటకై వేద వేదాంగాములను అద్యయనము చేసిన లవ కుశులను వాల్మీకి మహర్షి స్వీకరించెను . రామాయణ కదామ్రుతమును లవకుశులకు ఉపదేశించెను . ఈ రామాయణము పటించుటకు ,మధురముగా గానము చేయుటకు అనువైనది . శృంగార ,వీర ,కరుణ ,హాస్య ,రౌద్ర ,భయానక ,శాంత మొదలగు నవ రసములతో పరిపుష్టమైనది . అట్టి రామాయణ కావ్యమును లవ కుశులు గానము చేసిరి . కవలలైన ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరి తేరినవారు . వీణాది వాదమున నేర్పరులు ,కమ్మని కంటము కలవారు ,రాముని రూపమునకు అచ్చు గుద్దినట్లుగా వున్నవారు . ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి . 
ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు స్థిత ప్రజ్ఞులు అయిన ఋషులు అందరు వచ్చినారు . వారందరూ కుర్చుని వుండగా గురువు అనుజ్ఞ మేరకు లవకుశులు రామాయణ గానము చేసిరి . ఆచట వున్నమునులు అందరు ఆ గానము విని పరమాశ్చర్య భరితులు అయిరి ,వారు ఆనందాశ్రువులతో బాగు బాగు అంటూ లవకుశులను ప్రశంసల వర్షములో మున్చివేసిరి . ప్రసన్నులైన ఆ మునులు అందరు లవకుశులకు తమ వద్ద నుండు కలశము ,జింక చర్మము మొదలైన బహుమతులు సమర్పించిరి . పిమ్మట ఆమునులు అందరు స్వస్తి వచనములతో వారిని ఆశీర్వదించి ,వారములు ఇచ్చిరి . "ఓ గాన కోవిదులారా !మీ కావ్య గానము అద్భుతముగా వున్నది . ఇది ఆయుర్వృద్ధి కరమైనది . పుష్టిని గూర్చునది . ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించిరి ". అని అచటి వారు అందరూ వారిని ప్రశంసించిరి . ఒకసారి వీధుల అందు ,రాజ మార్గముల అందు గానము చేయుచున్న లవకుశులను శ్రీ రాముడు చూసేను . వారిని శ్రీ రాముడు తన భవనమునకు రప్పించెను . శ్రీ రాముడు దివ్యమైన బంగారు సింహాసనము పై ఆసీనుడై ఉండెను . ఆ మహా వీరుని సమీపమున మంత్రులు సోదరులు వుండిరి . 
అశ్వమేధ యాగ దీక్షలో ఉన్న శ్రీ రాముడు ముద్దులొలుకుచున్న ఆ చిన్నారులను చూసి తమ్ములతో "దివ్యమైన వర్చస్సు కల ఈ చిరంజీవులు గానము చేసేటి విచిత్రార్డ పద విలపితమైన ఈ వృత్తాంతము వినుడు ". అని పలికి వారిని గానము చేయమని ప్రోత్సహించెను . ఆ బాలకులు ఇద్దరు ప్రసిద్ధికి ఎక్కిన ఆ రామాయణ గాధను మధురముగా ,రాగ యుక్తముగా ,వీణా తంత్రులను మీటుచు లయబద్దముగా శ్రావ్యమైన స్వరములతో గానము చేసిరి . ఆ మహా జన సభలో వీనులవిందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్యుల శరీరములు పులకింప చేసెను . మనసును ఆహ్లాద పరిచెను . హృదయములను ద్రవింప చేసెను . శ్రీ రాముడు సైతము సభలోని వారితో పాటు ఆ గానానందము తానును అనుభవింప దాలిచినవాడై ఆ గానము వినుటలోనే నిమగ్నుడై ఉండెను . దానిని ఎంత విన్నను వారికి తనివి తీరకుండెను . 

 ఇతి రామాయణ బాలకాండ నందలి నాల్గవ సర్గము సమాప్తము . 


                           శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 
















Wednesday, 8 June 2016

రామాయణము బాల కాండము -మూడవ సర్గ

                       రామాయణము 

                   బాల కాండము -మూడవ సర్గ 

 వాల్మీకి ముని ఇదివరకు తాను నారదుడి చే విన్న రామ గాధలో ఇంకేమన్నా విశేషాలు వున్నాయేమో అని ఆలోచించ సాగెను . ఆ వాల్మీకి ముని తూర్పు కొనలు గల దర్భలపై కుర్చుని ఆచమనము చేసి బ్రహ్మ దేవుడిని ధ్యానించి కళ్ళు ముసుకోనగా బ్రహ్మ వర ప్రభావముచే యదా తధముగా రామ కధ కళ్ళకు కట్టినట్లు కనపడెను . 
దశరదుని తపః ఫలముగా శ్రీ మహా విష్ణువు రఘు వంశమున శ్రీ రాముడిగా అవతరించుట ,తాటకాది రాక్షసులను వధింప గల ఆయన పరాక్రమము అందరికిని అనుకూలముగా వుండు సత్ప్రవర్తన ,అందరి ప్రేమ చూరగొనుట ,ఇతరుల అపరాధములను మన్నించుట ,అందరిని అనుగ్రహించు లక్షణము ,సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున ముని వర్ణించెను . శ్రీ రామ గాధకు అనుగుణము అగు తదితరములు అయిన విచిత్ర కధలను ,రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్లి యాగ సంరక్షణ చేయుట ,రాఘవుడు శివ ధనుర్భంగము గావించుట ,జానకి ,ఊర్మిళ ,మాండవి ,శ్రుతకీర్తులతో జరిగిన రామ ,లక్ష్మణ ,భరత ,శతృజ్ఞుల వివాహము ,శ్రీరామ పరుసురాముల సంవాదము ,అట్లే శ్రీ రాముని ఉదాత్త గుణములు కవి వర్ణించెను . రామునకు యువరాజు పట్టాభిషేక ప్రయత్నములను ,కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విగ్నము ఏర్పడుటను ,శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో కూడి వన వాసమునకు బయలుదేరుట ,దశరడుడు పుత్ర వియోగముతో మరణించుట మహర్షి వివరించెను . 
పుర జనులు దుఃఖించుట ,శ్రీ రాముడు వారి కళ్ళు గప్పి వెడలిపోవుట ,నిషాద రాజైన గుహునితో సంభాషించటం ,రధ సారది గా ఉన్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట ,మున్నగు విషయములను ఆ ముని వివరించెను . సీతా రామ లక్ష్మణులు గంగా నదిని దాటుట ,వారు భరద్వాజ మహా మునిని దర్శించుట ఆయన అనుజ్ఞ తో చిత్ర కూటమునకు చేరుట వాస్తు శాస్త్ర ప్రకారము అచట పర్ణ శాలను నిర్మించుట అందు నివసించుట  ,భరతుడు వశిష్టాదులతో  కూడి శ్రీ రాముని దర్శించుట ప్రసన్నుని చేసుకొనుట ,శ్రీ రాముడు స్వర్గస్తుడైన తండ్రికి తర్పనములను అర్పించుట ,భరతుడు శ్రీ రాముని పాదుకులను తీసుకొని వచ్చి వాటికి పట్టాభిషేకము చేయుట ,పిమ్మట అతడు నంది గ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించెను . 
శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో దండకారణ్యం లో  ప్రవేశించుట విరాధుని వధించుట శరభంగుని దర్శించుట సుతీక్షుని కలుకోనుట ,అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట ,అక్కడ అనసూయా దేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించుట అగస్త్య మహా మునిని దర్శించుట ఆయన నుండి ధనుర్భానములను తీసుకొనుట ,జటాయువు ను కలుసుకొనుట ,పంచవటిలో నివాసము ,శుర్పనఖ రాక మున్నగు విషయములు తెలుపబడినవి . కభందుని ,శబరిని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో పంపా తీరమునకు చేరుట హనుమంతుని కలుసుకొనుట, ఋష్య మూక పర్వతమునకు చేరి సుగ్రీవుని కలువుట ,రామ సుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు ,సుగ్రీవునకు రాముడు తన పై విశ్వాసము కలిగించుట ,వాలి సుగ్రీవుల యుద్దము ,రామునిచే వాలి వధ సుగ్రీవుని కిష్కిందకు రాజును చేయుట ,తారా విలాపము ,రామలక్ష్మణులు వర్షా కాలములో ప్రస్రవణ గిరిపై గడుపుట మొదలగు ఘట్టములను వివరింప బడెను . 
సుగ్రీవుని ఉపేక్షకు శ్రీ రాముడు కుపితుడు అగుట ,సేనల సమీకరణము ,సుగ్రీవుడు నల్దిక్కులకు వానర యోధులను పంపుచూ వారికి బౌగోళిక అంశములను తెలుపుట శ్రీ రాముడు హనుమంతునకు ఉంగరమును ఇచ్చుట ,జమ్భావదాదుల స్వయంప్రభము దర్శించుట ,ప్రాయోపవేశమునకు సిద్దపడిన అంగదుని సంపాతి దర్శనము మున్నగు అంశములు వర్ణితము . మహేంద్ర గిరి నుండి హనుమంతుని సముద్ర లంఘనము ,సముద్రుని ప్రేరణ తో మైనాకుని ఆతిధ్య ప్రయత్నము ,సురస ను జయించుట ,సింహికను వధించుట ,లంకా మలయ పర్వతముల దర్శనము ,రాత్రి లో మారుతి లంకలో ప్రవేశించి వొంటరిగా ఆలోచించుట ,పాన భూమిని ,అంత పురమును గాలించుట ,రావణుని దర్శించుట ,పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములు వర్ణింపబడినవి . 
మారుతి అశోక వనమునకు చేరుట రావణుడు సీతను భయపెట్టుట ,హనుమంతుడు సీతమ్మను చేరుట ,ఆమెకు ఉంగరమును సమర్పించుట ,రాక్షస స్త్రీలు సీతా దేవిని భయపెట్టుట ,త్రిజట స్వప్న వృత్తాంతము,సీతాదేవి చూడామణిని హనుమంతునకు ఇచ్చుట ,మారుతి అశోకవనమును ద్వంసమొనర్చుట అనువిషయములు ముని చే  చెప్పబడినవి . హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట ,కింకర అను పేరు గల రాక్షసులను ,తఃదితర రాక్షస యోధులను మారుతి మట్టు  పెట్టుట ,బ్రహ్మాస్త్రము చే భందితుడు అయిన వాయు సుతుడు రావణ సభకు చేరుట ,లంకను కాల్చుట సముద్రము పై తిరుగు ప్రయాణము ,మాడు భక్షణము ,ఆంజనేయుడు రాముని ఓదార్చుట చూడామణిని సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడినవి . 
శ్రీ రాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట ,నలుడు సముద్రముపై సేతువును నిర్మించుట ,సముద్రమును దాటి రాత్రి వేళ లంకను ముట్టడించుట ,విభీషణ శరణాగతి ,రాక్షస యోధులను వధించు వుపాయములను విభీషణుడు శ్రీ రామునకు తెలుపుట ,కుంభకర్ణ ,మేఘనాదుల సంహారము మున్నగు విషయములు వర్ణితము . శ్రీ రాముడు రావణుని పరిమార్చుట సీతా దేవిని చేరదీయుట ,విభీషణుని లంకాదిపతిని చేసి పుష్పకమును అధిరోహించుట ,విమానముపై అయోధ్యకు బయలుదేరుట ,భరతుని కలియుట ,శ్రీ రాముడు రాజ్యాభిషిక్తుడు అగుట వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపి వేయుట ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము మున్నగు విషయములు వర్నితములు . ఇంతవరకు గల రామాయణ కావ్య విశేషములు అన్నీ 6 కాన్డములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి . సీతా పరిత్యాగమును ,తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తర కాండము లో వివరించెను . 

ఇతి బాల కాండము మూడవ సర్గము సమాప్తము 


శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










Tuesday, 7 June 2016

రామాయణము బాల కాండము -రెండవ సర్గ

                         రామాయణము 

                            బాల కాండము -రెండవ సర్గ 

బ్రహ్మ దేవుని చూసిన వాల్మీకి మహర్షి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు అడిగెను . శాస్తోక్తముగా సర్వోపచారములు ఒనర్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను . లేచి నిలబడి ,ఏకాగ్ర చిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను . పిమ్మట ఆ బ్రహ్మ దేవునికి పాద్యము ,అర్ఘ్యము సమర్పించి ,ఆయనను సుఖాసీనుని గావించి స్థుతించెను. అనంతరం బ్రహ్మోపదేశముకు అర్హమగునట్లు పూజింప బడిన ఆసనము పై బ్రహ్మదేవుడు ఆసీనుడై ,వాల్మీకి మహర్షిని కూర్చోమని ఆజ్ఞాపించెను . ఆపుడు వాల్మీకి బ్రహ్మ ఆసనము కన్నా కొద్దిగా ఎత్తు తక్కువ ఉన్న ఆసనముపై కూర్చొనెను . బ్రహ్మ ఎదురుగా కూర్చున్నప్పటికీ వాల్మీకి క్రౌంచ పక్షుల గురించే ఆలోచిస్తూ బాద పడుతూ ఉండెను . ఆడ పక్షి ఏడుపు ని తలచుకుని బాదపడెను . అలాగే తాను అప్రయత్నముగా పలికిన శ్లోకము గురించి ఆలోచించు చు ఉండెను . 
అప్పుడు బ్రహ్మ చిరునవ్వుతో "నీవు కనికరముతో పలికిన మాటలు ఛందో బద్ద శ్లోకమే . ఈ విషయములో ఏ మాత్రమూ సందేహము లేదు . ఓ బ్రాహ్మనోత్తమా నీ వాక్కు సరస్వతీ సంకల్పమే . ఓ ఋషీశ్వర !నీవు రామ చరితమును సంపూర్ణముగా ఈ ఛందస్సులోనే రాయుము . శ్రీరాముడు ధర్మాత్ముడు ,కరుణాళువు ,సకల సద్గుణ సంపన్నుడు ,గొప్ప ప్రజ్ఞాశాలి అని లోకములో ఖ్యాతికెక్కినవాడు . అట్టి శ్రీరాముని చరితమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణించుము . 
ప్రతిభాముర్తి అయిన శ్రీరాముని చరితమును ,లక్ష్మణుని ఉదంతము ,సీతా దేవి వృత్తాంతము ,భారతాదుల గాధలు రావణాది రాక్షసుల కధలు లోక ప్రసిద్ధములు అయినవి . అన్నింటినీ వివరింపుము . నారదుడు నీకు స్పష్టముగా వివరింప ని విషయములు కూడా నీకు స్పురణకు వచ్చును . ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అక్కడే అంతర్ధాన మయ్యెను . అప్పుడు వాల్మీకి మహర్షి ఆయన శిష్యులు ఆశ్చర్యములో మునిగిపోయెను . అనంతరం శిష్యులందరూ వాల్మీకి క్రౌంచ పక్షులను చూస్తూ చెప్పిన శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసెను . అప్పుడు వాల్మీకి పరమాత్మను ధ్యానించి ఈ రామాయణ కావ్యమును ఇట్టి శ్లోకములతోనే రచించెద అని సంకల్పించుకొనేను . 
మిక్కిలి ధీశాలి ,ఋషులలో సుప్రసిద్దుడు అయిన వాల్మీకి శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములు ముల్లోకములలో గుభాలించేటట్టు రామాయణ కావ్యము స్మానాక్షరములు కల పాదములతో ,విశేష వృత్తములతో 24000 శ్లోకములతో మనోహరముగా వివరించెను . 

ఇతి ద్వితీయ సర్గము సమాప్తః 


              శశి,

 ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 
















రామాయణము బాల కాండ -రెండవ సర్గ

                     రామాయణము 

                      బాల కాండ -రెండవ సర్గ 

                      రామాయణము యొక్క ఆవిర్భావము 


ధర్మాత్ముడు ,శాభ్దార్ధ విశేషములను బాగుగా ఎరిగి ,వివరించుట అందు నేర్పరి అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి ,శిష్య సమేతుడై నారద మహర్షి ని విధి విదానముగా పూజించెను . దేవా ముని అయిన నారదుడు వాల్మీకి పూజలు అందుకుని ,ఆయన ఆజ్ఞను తీసుకొని ఆకాశ మార్గమున వెళ్ళిపోయెను . నారదుడు బ్రహ్మ లోకమునకు వెళ్ళిన తర్వాత వాల్మీకి మహా ముని గంగా తీరమునకు సమీపమున కల తామసా నదీ తీరమునకు వెళ్ళెను . 
ఆ మహర్షి తామసా నదీ తీరమునకు చేరి ,నిర్మలమైన ఆ జలమును చూసి పక్కనున్న శిష్యునితో ఇలా అనెను . "ఓ భరద్వాజా ఎ మాత్రము బురద లేని ఈ తీర్ధము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్చముగా ,రమణీయముగా వున్నది . నా స్నాన వస్త్రాన్ని ఇమ్ము . గంగా జలము వలె పవిత్రమైన ఈ తామసా తీర్ధమున స్నానము చేసెదను . నీవునూ ఇక్కడే స్నానము చేయుము ". మహా తపస్వి అయిన వాల్మీకి ఇలా ఆదేశించగా గురు సేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలము అందించెను . వాల్మీకి ఆ వనమును తిలకించుచు దివ్యమైన ఆ వన అందమునకు మిక్కిలి ఆశ్చర్య పడెను . 
అప్పుడు వాల్మీకి మహర్షి క్షణ కాలమైనను ఎడబాటు సహించలేని క్రౌంచ పక్షుల జంటను చూసెను . అన్యోన్య అనురాగముతో ఉన్న వాటి మధుర ద్వనులు వినెను . సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వబావము కల క్రూరుడు అయిన ఒక కిరాతకుడు వాల్మీకు చూస్తుండగానే క్రౌంచ పక్షుల జంట లోని మగ పక్షిని బాణముతో కొట్టెను . ఆ దెబ్బకు నేలపై పడి గిల గిల కొట్టుకుంటున్న మగ పక్షిని చూసి ఆడ పక్షి జాలి గొలుపు ద్వానితో ఎడవసాగెను . ఈ దృశ్యమును చూసిన వాల్మీకి మహర్షి హృదయము బాదతో నిండిపోగా ఇట్లు రతి క్రీడలో ఉన్న పక్షులను హింసించి విడదీయుట కసాయితనము అని భావించి "ఓ కిరాతుడా క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమై ఉన్న ఒక పక్షిని చంపితివి ఈ పాప కారణముగా నీవు ఎక్కువ కాలము జన్మించవు "అని శ్లోక రూపమున కిరాతుదితో పలికెను . 




తాను అప్రయత్నముగా  పలికిన శ్లోకము గురించే ఆలోచిస్తూ తన శిష్యులతో ఈ విధముగా అనెను . "నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల నాలుగు పాదములతో ఉన్నది . లయ బద్దమై వాద్య యుథముగా గానము చేయుటకు వీలుగా వున్నది . కనుక ఇది ఛందో బద్దమైన శ్లోకమే ". వాల్మీకి తాను పలికిన శ్లోకమునే తలుచు చు తన దైనందిక కార్యక్రమములు చేసుకొనెను . ఆయన శిష్యుడు భరద్వాజుడు ఆ శ్లోకమును కంటస్థముచేసెను . సృష్టి కర్త ,లోకములకు అధిపతి ,మహా తేజశ్శాలి అయిన బ్రహ్మ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా వాల్మీకి ఆశ్రమమునకు వచ్చెను . 




           శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .  








రామాయణము బాల కాండము -మొదటి సర్గ

                      రామాయణము 

                  బాల కాండము -మొదటి సర్గ 

శ్రీ రాముడు రాజు అవ్వడంతో ప్రజలందరూ  సంతోషించిరి . ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుతూ వున్నారు . ప్రజలందరూ ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తిస్తున్నారు . ఆయురారోగ్య భాగ్యములతో కరువు కాటకములు లేకుండా నిర్భయముగా ,హాయిగా జీవించుచున్నారు . రామ రాజ్యమున పుత్ర మరణములు లేకుండెను . స్త్రీలు పాతివ్రత్య ధర్మములు పాటించుచు నిత్య సుమంగులులై వర్దిల్లుచు వుందురు . అగ్ని ప్రమాదములు కాని ,జల ప్రమాదములు కాని వాయు భయములు కాని లేకుండెను . జ్వరాది భాదలు ,ఆకలి దప్పులు ,భాదలు చోరభయములు మచ్చుకైనను లేకుండెను . రాజ్యములోని నగరములు ,ఇతర ప్రదేశములు ధన ,దాన్యములతో ,పాడి పంటలతో తులతూగుతూ ఉండెను . జనులు కృత యుగములో వలె ఎల్ల వేళలా సుఖ శాంతులతో వర్ధిల్లుచూ ఉండెను . 

అనేకములైన అశ్వమేధాది క్రతువులు ,సువర్ణక యాగములు శ్రీ రాముడు నిర్వహించెను . బ్రాహ్మనోత్తములకు ,పండితులకు కోట్ల కొలది గోవులను దానము చేసెను . అతడు అపరిమితమైన ధన ,ధాన్యములను దానమోనర్చి వాసి కెక్కెను . రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ది పరిచెను . నాలు వర్ణముల వారిని ఈ లోకమున తమతమ వర్ణ ధర్మముల ప్రకారము నడిపించెను . ఆ ప్రభువు 11000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి ,అనంతరము వైకుంటము చేరెను . 
ఈ శ్రీరామ చరితము అంతః కరణమును శుద్ధి చేయును . సర్వ పాపములను రూపుమాపును . పుణ్య సాధనము ,వేదార్ధమును ప్రతిపాదించును కావున ఇది సర్వ వేద సారము . నిత్యమూ దీనిని నిష్టతో పటించు వారికి పాపములు అన్నియు పటాపంచములై పోవును . ఈ రామాయణము పటించినవారికి ఆయుష్యాభివ్రుద్ది కలుగును ,వారి పుత్ర పౌత్రులకు ,పరివారమునకు క్షేమ లాభములు కలుగును . మరియు అంత్య కాలమున మోక్ష ప్రాప్తి కలుగును . 
ఈ రామాయణమును పటించిన ద్విజులు వేదవేదాన్గముల అందు ,శాస్త్రముల అందు పండితులు అగుదురు . క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు . వైశ్యులకు వ్యాపార లాభములు కలుగును . శూద్రులు తోటి వారిలో శ్రేష్ఠులు అగుదురు . ఈ రామాయణమును పటించినవారు ,విన్న వారు పొందెడి ఫలము అనంతము అద్వితీయము . 

                            శశి ,

ఎమ్. ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






Monday, 6 June 2016

రామాయణము బాలకాండ -మొదటి సర్గ

                                రామాయణము 

                             బాలకాండ -మొదటి సర్గ       

అనంతరం  ప్రభువు అయిన సుగ్రీవుడు వివిధ ప్రదేశములనందు వున్న వానరులన్దరిని రప్పించి ,సీతాన్వేషనకై వారిని నల్దిక్కులకు పంపెను . మహా బల సంపన్నుడైన హనుమానుడు గృధ రాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనములు విస్తీర్ణము కల సముద్రమును ఒక్క గంతులో దాటెను . 
అంతట ఆ రామ బంటు రావణుడి చే పాలింప బడుతున్న లంకకు చేరెను . సీతాదేవి కోసం వెతుకుచూ అశోక వనమునకు చేరెను . అక్కడ రామ ధ్యానము నందు  నిమగ్నమైన సీతాదేవిని చూసేను . అప్పుడు ఆంజనేయుడు రామ ,సుగ్రీవుల మైత్రిని తెలిపి ,రామ నామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా ఇచ్చెను . ఆమెకై శ్రీ రాముడు పరితపించు చున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను . పిమ్మట అశోక వనమును ద్వంసము చేసెను . 
వాయు సుతుడు 5 గురు సేనా పతులను 7 గురు మంత్రి పుత్రులను అంతమొందించెను . శూరుడైన అక్షకుమారుని హతమార్చెను . ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముకు బుద్ది  పూర్వకముగా కట్టుబడెను . బ్రహ్మాస్త్రమునకు తాను బంధుడను కాకున్నను ,అయినట్లు నటించుచు రామ కార్యము కొరకై రాక్షసులు పెట్టు భాదలు సహించెను . 
రావణుని ఆజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పు అంటించ గా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును తప్ప లంకను దగ్ధము కావించెను . సీతా దేవికి తన కుశల వార్త తెలిపి ,శ్రీ రాముడికి సీతా దేవి జాడ చెప్పి సంతోష పెట్టుటకై అతి వేగముగా శ్రీ రాముడి చెంతకు చేరెను . కనుగొంటిని సీతమ్మను అని ఆ వృత్తాంత మంతా సవివరముగా రామునకు తెలిపెను . 
ఆ సమాచారమును విన్న శ్రీ రాముడు సుగ్రీవుడు మొదలగు వానర వీరులన్దరితో కలసి సముద్ర తీరమునకు చేరెను . అనంతరం సూర్య కిరణముల వంటి తీక్షణమైన భాణములతో దారి విడమని సముద్రమును అల్లకల్లోలము చేసెను . అప్పుడు సముద్రుడు తన నిజ రూపముతో రాముని ఎదురుగా నిలిచి రామునకు కొన్ని సూచనలు అందించెను . ఆ సూచనల మేరకు సముద్రముపై నలుని ద్వారా సేతువు (వారధి )నిర్మింప చేసెను . 


ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రణ రంగమున రావణుడిని హతమార్చెను . తదననంతరం సీతను సమీపించి పరుల పంచన ఉన్న ఆమెను స్వీకరించుటకు సందేహించెను . అందరి ఎదుట పరుషముగా మాట్లాడెను . సాధ్వి అయిన సీతా దేవి ఆ మాటలు భరించలేక అగ్నిలో ప్రవేశించెను . అప్పుడు అగ్ని దేవుడు ప్రత్యక్షమై "సీతాదేవి త్రికరణ సుద్దిగా పరమ సాద్వి ,దోష రహిత "అని ప్రకటించెను . అప్పుడు శ్రీ రాముడు పరమ సంతుష్ఠుడు అయ్యెను . శ్రీ రాముడి ధర్మ నిరతికి దేవతలు అందరు కొనియాడిరి . పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్టుడు అయిన విభీషణుని లంకా నగరానికి రాజుగా పట్టాభిషేకము చేసెను . 
తన విజయమును పొగడడానికి వచ్చిన దేవతల నుండి వరములను పొంది ,ఆ వర ప్రభావముతో రణరంగమున చనిపోయి పది ఉన్న వానరులను తిరిగి బతికించెను . పిమ్మట శ్రీరాముడు సీతా ,లక్ష్మణ ,సుగ్రీవ ,విభీషణ మొదలగు మిత్రులతో కలసి పుష్పక విమానమున అయోధ్యకు బయలుదేరెను . తమ రాకను తెలుపుటకు ముందుగా ఆంజనేయుని భరతుని వద్దకు పంపెను . చక్కగా పితృవాక్య పరిపాలన ఒనర్చిన శ్రీరాముడు నంది గ్రామమున తన సోదరుని కలిసి జటా దీక్షను పరిత్యజించెను . పిమ్మట సీతాదేవి కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను . 




                  శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు