Friday 10 June 2016

రామాయణము బాల కాండ -ఐదవ సర్గ

                             రామాయణము 

                         బాల కాండ -ఐదవ సర్గ 

సప్త ద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని అనేక మంది రాజులు పరిపాలించారు . ఈ వంశమున సగరుడు అను వాడు  సుప్రసిద్దుడు . ఈ సగరుని 60000 మంది కుమారులు యజ్ఞాశ్వనిమిత్తమై సముద్రమును తవ్విరి . కావున దానికి సాగరము అని పేరు వచ్చెను . ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన అనేకమంది రాజులు జన్మించి వంశమునకు వన్నె తెచ్చెను . అట్టి మహా వంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము . 
సరయు నదీ తీరమున "కోసల "అను ప్రసిద్ద దేశము కలదు . అది ధన ,ధాన్య సంపదలతో తులతూగుచున్నది . అచటి జనులు మిక్కిలి సంతోషవంతులుగా వుండిరి . ఆ కోసల దేశమున "అయోధ్య "అను పేరు కల ఒక మహా నగరము కలదు . ఆ నగరమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింప చేసెను . ఆకారణము గా అది లోక ప్రసిద్ది చెందినది . ఆ మహా నగరము మిక్కిలి విశాలముగా అపూర్వ శోభతో విలసిల్లుచున్నది . అక్కడి వీధులు ఇరు వైపులా వృక్షములతో విశాలముగా వున్నవి . జలములచే తడపబడిన ఆ రాజ మార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడ ముచ్చటగా వున్నవి . కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరద మహారాజు దేవేంద్రుడి అమరావతి వలె అయోధ్యా పుర వైభవమును ఇనుమడింప చేసెను . 
ఆ పురము ప్రశస్త మైన ద్వారములతో ,ద్వారా భందములతో అందముగా ఉండెను . నగర మద్య భాగమున బారులు తీరిన అంగళ్లు (కొట్లు )తో మనోహరముగా ఉండెను . అక్కడ వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉండెను . అన్ని కళల అందు నిపుణులు అయినశిల్పులు ఆ నగరము అందు వుండిరి . ఆ పురి నృత్య కళా కుశులురు అయిన నటీ నటులతో శోభిల్లుచు ఉండెను . అందు చూడ ముచ్చటైన మామిడి తోపులు కలవు . చుట్టూ కల ప్రాకారము ఆ పురికి వడ్డాణము వలె మనోజ్ఞముగా ఉండెను . దాని చుట్టూ లోతైన అగడ్త ,శత్రు దుర్భేద్యమైన కోట కలవు . అక్కడ మేలు జాతికి చెందిన గుర్రములు ,వేగముగా నడవగల ఏనుగులు ,వృషభములు ,ఒంటెలు అనేకము కలవు . కప్పములు చెల్లించడానికి వచ్చిన సామంత రాజులతో ఆ నగరము కళకళ లాడుతూ ఉండెను . క్రయ విక్రములకై వచ్చిన విదేశీ వ్యాపారులతో ఆ నగరము రద్దీగా ఉండెను . రత్నములు పొదిగిన రాజ గృహములతో ,క్రీడా పర్వతములతో ,అంతస్తులతో కూడిన మేడలతో ఇంద్రుని అమరావతి నగరము వలె శోబిల్లిచూ ఉండెను . 
అష్టాపదాకారములో ఉన్న చిత్ర విచిత్రములైన రాజ గృహములతో అందముగా ఉండెను . అది అందమైన సుందరీమనులతో అలరారుచుండెను . నానా విధ రత్న శోభలతో కళకళ లాడుచుండెను . అక్కడి గృహస్థుల ఇండ్లు ఎత్తి దోషములు లేకుండా సమతలముపై నిర్మింపబడి కిక్కిరిసి ఉండెను . ఆ పురములో మేలైన వరి బియ్యము ,చెరుకు రసము వంటి మధుర జలములు సమృద్దిగా ఉండెను . దుందుభుల మ్రోతతో ,మృదంగ ద్వనులతో వీణా నాదములతో మద్దెలరవముల తో ఆ మహానగరము ఎంతో మారుమ్రోగుచుండెను . సిద్ద పురుషులకు తపః ఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరము నందలి గృహములు బారులుతీరి విద్వాంసులతో నిండి ఉండెను . ఆ నగరము నందలి యోధులు ,శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినవారు . సమర్ధులు ,శబ్ద బెది విద్యా నిపుణులు కాని వారు సహాయపడు వారు లేక ఒంటరిగా ఉన్న వారినికాని ,పారిపోవు చున్న వారిని కాని చంపేవారు కారు . వనము నందు మత్తిల్లి గర్వముతో గర్జించే సింహములను ,గాండ్రించు పెద్ద పులులను ,ఘర్జించు అడవి పందులను ఆ యోధులు ధీరులై వాడియైన శస్త్రములతో ,భాహు బలముతో సంహరించు చుండెడివారు . అట్టి వేలకొలది మహా రధులతో నిండి ఉన్న ఆ అయోధ్యా నగరమును దశరద మహా రాజు పరిపాలించుచు ఉండెను . 
అచటి ద్విజోత్తములు (బ్రాహ్మనోత్తములు )అందరును నిత్యాగ్ని హోత్రులు శమదమాది గుణ సంపన్నులు ,వేద వేదాంగముల యందు ,పారంగతులు ,సత్యమును పల్కుట యందు నిరతులు ,మిక్కిలి ప్రజ్ఞావంతులు ,కొల్లలుగా దానము చేయువారు . మహర్షులతో సమానులు అట్టి అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని ,దశరద మహారాజు కోసల దేశమును పరిపాలించుచు ఉండెను . 

బాలకాండ అయిదవ సర్గ సమాప్తము . 



               శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment