Tuesday 7 June 2016

రామాయణము బాల కాండము -మొదటి సర్గ

                      రామాయణము 

                  బాల కాండము -మొదటి సర్గ 

శ్రీ రాముడు రాజు అవ్వడంతో ప్రజలందరూ  సంతోషించిరి . ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుతూ వున్నారు . ప్రజలందరూ ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తిస్తున్నారు . ఆయురారోగ్య భాగ్యములతో కరువు కాటకములు లేకుండా నిర్భయముగా ,హాయిగా జీవించుచున్నారు . రామ రాజ్యమున పుత్ర మరణములు లేకుండెను . స్త్రీలు పాతివ్రత్య ధర్మములు పాటించుచు నిత్య సుమంగులులై వర్దిల్లుచు వుందురు . అగ్ని ప్రమాదములు కాని ,జల ప్రమాదములు కాని వాయు భయములు కాని లేకుండెను . జ్వరాది భాదలు ,ఆకలి దప్పులు ,భాదలు చోరభయములు మచ్చుకైనను లేకుండెను . రాజ్యములోని నగరములు ,ఇతర ప్రదేశములు ధన ,దాన్యములతో ,పాడి పంటలతో తులతూగుతూ ఉండెను . జనులు కృత యుగములో వలె ఎల్ల వేళలా సుఖ శాంతులతో వర్ధిల్లుచూ ఉండెను . 

అనేకములైన అశ్వమేధాది క్రతువులు ,సువర్ణక యాగములు శ్రీ రాముడు నిర్వహించెను . బ్రాహ్మనోత్తములకు ,పండితులకు కోట్ల కొలది గోవులను దానము చేసెను . అతడు అపరిమితమైన ధన ,ధాన్యములను దానమోనర్చి వాసి కెక్కెను . రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ది పరిచెను . నాలు వర్ణముల వారిని ఈ లోకమున తమతమ వర్ణ ధర్మముల ప్రకారము నడిపించెను . ఆ ప్రభువు 11000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి ,అనంతరము వైకుంటము చేరెను . 
ఈ శ్రీరామ చరితము అంతః కరణమును శుద్ధి చేయును . సర్వ పాపములను రూపుమాపును . పుణ్య సాధనము ,వేదార్ధమును ప్రతిపాదించును కావున ఇది సర్వ వేద సారము . నిత్యమూ దీనిని నిష్టతో పటించు వారికి పాపములు అన్నియు పటాపంచములై పోవును . ఈ రామాయణము పటించినవారికి ఆయుష్యాభివ్రుద్ది కలుగును ,వారి పుత్ర పౌత్రులకు ,పరివారమునకు క్షేమ లాభములు కలుగును . మరియు అంత్య కాలమున మోక్ష ప్రాప్తి కలుగును . 
ఈ రామాయణమును పటించిన ద్విజులు వేదవేదాన్గముల అందు ,శాస్త్రముల అందు పండితులు అగుదురు . క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు . వైశ్యులకు వ్యాపార లాభములు కలుగును . శూద్రులు తోటి వారిలో శ్రేష్ఠులు అగుదురు . ఈ రామాయణమును పటించినవారు ,విన్న వారు పొందెడి ఫలము అనంతము అద్వితీయము . 

                            శశి ,

ఎమ్. ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment