Tuesday 7 June 2016

రామాయణము బాల కాండము -రెండవ సర్గ

                         రామాయణము 

                            బాల కాండము -రెండవ సర్గ 

బ్రహ్మ దేవుని చూసిన వాల్మీకి మహర్షి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు అడిగెను . శాస్తోక్తముగా సర్వోపచారములు ఒనర్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను . లేచి నిలబడి ,ఏకాగ్ర చిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను . పిమ్మట ఆ బ్రహ్మ దేవునికి పాద్యము ,అర్ఘ్యము సమర్పించి ,ఆయనను సుఖాసీనుని గావించి స్థుతించెను. అనంతరం బ్రహ్మోపదేశముకు అర్హమగునట్లు పూజింప బడిన ఆసనము పై బ్రహ్మదేవుడు ఆసీనుడై ,వాల్మీకి మహర్షిని కూర్చోమని ఆజ్ఞాపించెను . ఆపుడు వాల్మీకి బ్రహ్మ ఆసనము కన్నా కొద్దిగా ఎత్తు తక్కువ ఉన్న ఆసనముపై కూర్చొనెను . బ్రహ్మ ఎదురుగా కూర్చున్నప్పటికీ వాల్మీకి క్రౌంచ పక్షుల గురించే ఆలోచిస్తూ బాద పడుతూ ఉండెను . ఆడ పక్షి ఏడుపు ని తలచుకుని బాదపడెను . అలాగే తాను అప్రయత్నముగా పలికిన శ్లోకము గురించి ఆలోచించు చు ఉండెను . 
అప్పుడు బ్రహ్మ చిరునవ్వుతో "నీవు కనికరముతో పలికిన మాటలు ఛందో బద్ద శ్లోకమే . ఈ విషయములో ఏ మాత్రమూ సందేహము లేదు . ఓ బ్రాహ్మనోత్తమా నీ వాక్కు సరస్వతీ సంకల్పమే . ఓ ఋషీశ్వర !నీవు రామ చరితమును సంపూర్ణముగా ఈ ఛందస్సులోనే రాయుము . శ్రీరాముడు ధర్మాత్ముడు ,కరుణాళువు ,సకల సద్గుణ సంపన్నుడు ,గొప్ప ప్రజ్ఞాశాలి అని లోకములో ఖ్యాతికెక్కినవాడు . అట్టి శ్రీరాముని చరితమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణించుము . 
ప్రతిభాముర్తి అయిన శ్రీరాముని చరితమును ,లక్ష్మణుని ఉదంతము ,సీతా దేవి వృత్తాంతము ,భారతాదుల గాధలు రావణాది రాక్షసుల కధలు లోక ప్రసిద్ధములు అయినవి . అన్నింటినీ వివరింపుము . నారదుడు నీకు స్పష్టముగా వివరింప ని విషయములు కూడా నీకు స్పురణకు వచ్చును . ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అక్కడే అంతర్ధాన మయ్యెను . అప్పుడు వాల్మీకి మహర్షి ఆయన శిష్యులు ఆశ్చర్యములో మునిగిపోయెను . అనంతరం శిష్యులందరూ వాల్మీకి క్రౌంచ పక్షులను చూస్తూ చెప్పిన శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసెను . అప్పుడు వాల్మీకి పరమాత్మను ధ్యానించి ఈ రామాయణ కావ్యమును ఇట్టి శ్లోకములతోనే రచించెద అని సంకల్పించుకొనేను . 
మిక్కిలి ధీశాలి ,ఋషులలో సుప్రసిద్దుడు అయిన వాల్మీకి శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములు ముల్లోకములలో గుభాలించేటట్టు రామాయణ కావ్యము స్మానాక్షరములు కల పాదములతో ,విశేష వృత్తములతో 24000 శ్లోకములతో మనోహరముగా వివరించెను . 

ఇతి ద్వితీయ సర్గము సమాప్తః 


              శశి,

 ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 
















No comments:

Post a Comment