Wednesday 8 June 2016

రామాయణము బాల కాండము -మూడవ సర్గ

                       రామాయణము 

                   బాల కాండము -మూడవ సర్గ 

 వాల్మీకి ముని ఇదివరకు తాను నారదుడి చే విన్న రామ గాధలో ఇంకేమన్నా విశేషాలు వున్నాయేమో అని ఆలోచించ సాగెను . ఆ వాల్మీకి ముని తూర్పు కొనలు గల దర్భలపై కుర్చుని ఆచమనము చేసి బ్రహ్మ దేవుడిని ధ్యానించి కళ్ళు ముసుకోనగా బ్రహ్మ వర ప్రభావముచే యదా తధముగా రామ కధ కళ్ళకు కట్టినట్లు కనపడెను . 
దశరదుని తపః ఫలముగా శ్రీ మహా విష్ణువు రఘు వంశమున శ్రీ రాముడిగా అవతరించుట ,తాటకాది రాక్షసులను వధింప గల ఆయన పరాక్రమము అందరికిని అనుకూలముగా వుండు సత్ప్రవర్తన ,అందరి ప్రేమ చూరగొనుట ,ఇతరుల అపరాధములను మన్నించుట ,అందరిని అనుగ్రహించు లక్షణము ,సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున ముని వర్ణించెను . శ్రీ రామ గాధకు అనుగుణము అగు తదితరములు అయిన విచిత్ర కధలను ,రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్లి యాగ సంరక్షణ చేయుట ,రాఘవుడు శివ ధనుర్భంగము గావించుట ,జానకి ,ఊర్మిళ ,మాండవి ,శ్రుతకీర్తులతో జరిగిన రామ ,లక్ష్మణ ,భరత ,శతృజ్ఞుల వివాహము ,శ్రీరామ పరుసురాముల సంవాదము ,అట్లే శ్రీ రాముని ఉదాత్త గుణములు కవి వర్ణించెను . రామునకు యువరాజు పట్టాభిషేక ప్రయత్నములను ,కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విగ్నము ఏర్పడుటను ,శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో కూడి వన వాసమునకు బయలుదేరుట ,దశరడుడు పుత్ర వియోగముతో మరణించుట మహర్షి వివరించెను . 
పుర జనులు దుఃఖించుట ,శ్రీ రాముడు వారి కళ్ళు గప్పి వెడలిపోవుట ,నిషాద రాజైన గుహునితో సంభాషించటం ,రధ సారది గా ఉన్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట ,మున్నగు విషయములను ఆ ముని వివరించెను . సీతా రామ లక్ష్మణులు గంగా నదిని దాటుట ,వారు భరద్వాజ మహా మునిని దర్శించుట ఆయన అనుజ్ఞ తో చిత్ర కూటమునకు చేరుట వాస్తు శాస్త్ర ప్రకారము అచట పర్ణ శాలను నిర్మించుట అందు నివసించుట  ,భరతుడు వశిష్టాదులతో  కూడి శ్రీ రాముని దర్శించుట ప్రసన్నుని చేసుకొనుట ,శ్రీ రాముడు స్వర్గస్తుడైన తండ్రికి తర్పనములను అర్పించుట ,భరతుడు శ్రీ రాముని పాదుకులను తీసుకొని వచ్చి వాటికి పట్టాభిషేకము చేయుట ,పిమ్మట అతడు నంది గ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించెను . 
శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో దండకారణ్యం లో  ప్రవేశించుట విరాధుని వధించుట శరభంగుని దర్శించుట సుతీక్షుని కలుకోనుట ,అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట ,అక్కడ అనసూయా దేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించుట అగస్త్య మహా మునిని దర్శించుట ఆయన నుండి ధనుర్భానములను తీసుకొనుట ,జటాయువు ను కలుసుకొనుట ,పంచవటిలో నివాసము ,శుర్పనఖ రాక మున్నగు విషయములు తెలుపబడినవి . కభందుని ,శబరిని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో పంపా తీరమునకు చేరుట హనుమంతుని కలుసుకొనుట, ఋష్య మూక పర్వతమునకు చేరి సుగ్రీవుని కలువుట ,రామ సుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు ,సుగ్రీవునకు రాముడు తన పై విశ్వాసము కలిగించుట ,వాలి సుగ్రీవుల యుద్దము ,రామునిచే వాలి వధ సుగ్రీవుని కిష్కిందకు రాజును చేయుట ,తారా విలాపము ,రామలక్ష్మణులు వర్షా కాలములో ప్రస్రవణ గిరిపై గడుపుట మొదలగు ఘట్టములను వివరింప బడెను . 
సుగ్రీవుని ఉపేక్షకు శ్రీ రాముడు కుపితుడు అగుట ,సేనల సమీకరణము ,సుగ్రీవుడు నల్దిక్కులకు వానర యోధులను పంపుచూ వారికి బౌగోళిక అంశములను తెలుపుట శ్రీ రాముడు హనుమంతునకు ఉంగరమును ఇచ్చుట ,జమ్భావదాదుల స్వయంప్రభము దర్శించుట ,ప్రాయోపవేశమునకు సిద్దపడిన అంగదుని సంపాతి దర్శనము మున్నగు అంశములు వర్ణితము . మహేంద్ర గిరి నుండి హనుమంతుని సముద్ర లంఘనము ,సముద్రుని ప్రేరణ తో మైనాకుని ఆతిధ్య ప్రయత్నము ,సురస ను జయించుట ,సింహికను వధించుట ,లంకా మలయ పర్వతముల దర్శనము ,రాత్రి లో మారుతి లంకలో ప్రవేశించి వొంటరిగా ఆలోచించుట ,పాన భూమిని ,అంత పురమును గాలించుట ,రావణుని దర్శించుట ,పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములు వర్ణింపబడినవి . 
మారుతి అశోక వనమునకు చేరుట రావణుడు సీతను భయపెట్టుట ,హనుమంతుడు సీతమ్మను చేరుట ,ఆమెకు ఉంగరమును సమర్పించుట ,రాక్షస స్త్రీలు సీతా దేవిని భయపెట్టుట ,త్రిజట స్వప్న వృత్తాంతము,సీతాదేవి చూడామణిని హనుమంతునకు ఇచ్చుట ,మారుతి అశోకవనమును ద్వంసమొనర్చుట అనువిషయములు ముని చే  చెప్పబడినవి . హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట ,కింకర అను పేరు గల రాక్షసులను ,తఃదితర రాక్షస యోధులను మారుతి మట్టు  పెట్టుట ,బ్రహ్మాస్త్రము చే భందితుడు అయిన వాయు సుతుడు రావణ సభకు చేరుట ,లంకను కాల్చుట సముద్రము పై తిరుగు ప్రయాణము ,మాడు భక్షణము ,ఆంజనేయుడు రాముని ఓదార్చుట చూడామణిని సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడినవి . 
శ్రీ రాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట ,నలుడు సముద్రముపై సేతువును నిర్మించుట ,సముద్రమును దాటి రాత్రి వేళ లంకను ముట్టడించుట ,విభీషణ శరణాగతి ,రాక్షస యోధులను వధించు వుపాయములను విభీషణుడు శ్రీ రామునకు తెలుపుట ,కుంభకర్ణ ,మేఘనాదుల సంహారము మున్నగు విషయములు వర్ణితము . శ్రీ రాముడు రావణుని పరిమార్చుట సీతా దేవిని చేరదీయుట ,విభీషణుని లంకాదిపతిని చేసి పుష్పకమును అధిరోహించుట ,విమానముపై అయోధ్యకు బయలుదేరుట ,భరతుని కలియుట ,శ్రీ రాముడు రాజ్యాభిషిక్తుడు అగుట వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపి వేయుట ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము మున్నగు విషయములు వర్నితములు . ఇంతవరకు గల రామాయణ కావ్య విశేషములు అన్నీ 6 కాన్డములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి . సీతా పరిత్యాగమును ,తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తర కాండము లో వివరించెను . 

ఇతి బాల కాండము మూడవ సర్గము సమాప్తము 


శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment