Thursday 9 June 2016

రామాయణము బాల కాండము -నాల్గవ సర్గ

                రామాయణము 

           బాల కాండము -నాల్గవ సర్గ 


బ్రహ్మ దేవుని అనుగ్రహము వలన దివ్య జ్ఞానము పొందినవాడును ,మహా కావ్య నిర్మాణ చతురుడు అయిన వాల్మీకి మహర్షి కోసలాదీశుడై ఉన్న శ్రీ రాముని చరితమును మనోజ్ఞములైన శబ్దాలంకారాల శోభతో లోక కళ్యాణము నకై అద్భుతముగా రచించెను . 

 
వాల్మీకి మహర్షి  రామాయణమును 6 కాండలుగా ఇరువది నాలుగు వేల శ్లోకములతో రచించెను . తరువాత ఉత్తర కాండ నాకు రూపు దిద్దేను . మిక్కిలి ప్రజ్ఞాశాలి ,కాదు సమర్దుడు అయిన వాల్మీకి శ్రీ రామ పట్టాభిషేక అనంతర గాధను ,అశ్వమేధ యాగామునకు పిమ్మట జరగనున్న వృత్తాంతమును కుడా రచించెను . ఇక ఈ రామాయణమును కంటస్థం చేసి గానము చేయ గల వారు ఎవరు ?అని అతడు ఆలోచించ సాగెను . ఇలా ఆలోచిస్తూ ఆ మహర్షి అట్టి శిష్య ప్రాప్తికై భగవంతుని ద్యానించు చుండగా ,ముని వేషములలో ఉన్న కుశలవులు అక్కడికి వచ్చి ,ఆయన పాదములను ఆశ్రయించిరి . గురువు గారికి సేవ చేయడంలో నిరతులు ,అధ్యయనము పూర్తి అగు వరకు స్థిరమైన నిష్ఠ కలిగిన రాజకుమారులు ,మంచి విద్యార్ధులుగా ప్రసిద్ధికి ఎక్కినవారు ,సమాన స్థాయిలో గానము చేయగల సోదరులు ,చక్కని గాత్రము కలవారు ,తన ఆశ్రమ వాసులు అయిన లవకుశలను వాల్మీకి మహర్షి చూసెను . "వీరు రామాయణమును గానము చేయుటకు సమర్ధులు "అని తలిచేను . 
వేద తుల్యమైన రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్ధములను వ్యక్త పరుచుటకై వేద వేదాంగాములను అద్యయనము చేసిన లవ కుశులను వాల్మీకి మహర్షి స్వీకరించెను . రామాయణ కదామ్రుతమును లవకుశులకు ఉపదేశించెను . ఈ రామాయణము పటించుటకు ,మధురముగా గానము చేయుటకు అనువైనది . శృంగార ,వీర ,కరుణ ,హాస్య ,రౌద్ర ,భయానక ,శాంత మొదలగు నవ రసములతో పరిపుష్టమైనది . అట్టి రామాయణ కావ్యమును లవ కుశులు గానము చేసిరి . కవలలైన ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరి తేరినవారు . వీణాది వాదమున నేర్పరులు ,కమ్మని కంటము కలవారు ,రాముని రూపమునకు అచ్చు గుద్దినట్లుగా వున్నవారు . ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి . 
ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు స్థిత ప్రజ్ఞులు అయిన ఋషులు అందరు వచ్చినారు . వారందరూ కుర్చుని వుండగా గురువు అనుజ్ఞ మేరకు లవకుశులు రామాయణ గానము చేసిరి . ఆచట వున్నమునులు అందరు ఆ గానము విని పరమాశ్చర్య భరితులు అయిరి ,వారు ఆనందాశ్రువులతో బాగు బాగు అంటూ లవకుశులను ప్రశంసల వర్షములో మున్చివేసిరి . ప్రసన్నులైన ఆ మునులు అందరు లవకుశులకు తమ వద్ద నుండు కలశము ,జింక చర్మము మొదలైన బహుమతులు సమర్పించిరి . పిమ్మట ఆమునులు అందరు స్వస్తి వచనములతో వారిని ఆశీర్వదించి ,వారములు ఇచ్చిరి . "ఓ గాన కోవిదులారా !మీ కావ్య గానము అద్భుతముగా వున్నది . ఇది ఆయుర్వృద్ధి కరమైనది . పుష్టిని గూర్చునది . ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించిరి ". అని అచటి వారు అందరూ వారిని ప్రశంసించిరి . ఒకసారి వీధుల అందు ,రాజ మార్గముల అందు గానము చేయుచున్న లవకుశులను శ్రీ రాముడు చూసేను . వారిని శ్రీ రాముడు తన భవనమునకు రప్పించెను . శ్రీ రాముడు దివ్యమైన బంగారు సింహాసనము పై ఆసీనుడై ఉండెను . ఆ మహా వీరుని సమీపమున మంత్రులు సోదరులు వుండిరి . 
అశ్వమేధ యాగ దీక్షలో ఉన్న శ్రీ రాముడు ముద్దులొలుకుచున్న ఆ చిన్నారులను చూసి తమ్ములతో "దివ్యమైన వర్చస్సు కల ఈ చిరంజీవులు గానము చేసేటి విచిత్రార్డ పద విలపితమైన ఈ వృత్తాంతము వినుడు ". అని పలికి వారిని గానము చేయమని ప్రోత్సహించెను . ఆ బాలకులు ఇద్దరు ప్రసిద్ధికి ఎక్కిన ఆ రామాయణ గాధను మధురముగా ,రాగ యుక్తముగా ,వీణా తంత్రులను మీటుచు లయబద్దముగా శ్రావ్యమైన స్వరములతో గానము చేసిరి . ఆ మహా జన సభలో వీనులవిందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్యుల శరీరములు పులకింప చేసెను . మనసును ఆహ్లాద పరిచెను . హృదయములను ద్రవింప చేసెను . శ్రీ రాముడు సైతము సభలోని వారితో పాటు ఆ గానానందము తానును అనుభవింప దాలిచినవాడై ఆ గానము వినుటలోనే నిమగ్నుడై ఉండెను . దానిని ఎంత విన్నను వారికి తనివి తీరకుండెను . 

 ఇతి రామాయణ బాలకాండ నందలి నాల్గవ సర్గము సమాప్తము . 


                           శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 
















No comments:

Post a Comment