Thursday, 30 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదిరెండవ సర్గ

                                రామాయణము 


                                        బాలకాండ -ఇరువదిరెండవ సర్గ 


వశిష్టుని హిత వచనములను దశరధుని ముఖము వికశించెను . పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను . తల్లి కౌశల్య తండ్రి దశరధుడు రాముని ఆశీర్వదించిరి . పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులు పలికెను . దశరథ మహారాజు తన ముద్దు బిడ్డ అయిన రాముని మూర్ధమున ఆఘ్రాణించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునికి అప్పగించెను . ఆ సమయమున విశ్వామిత్రుని పక్కన చేరి వున్న రాజీవలోచనుడైన రాముని చూసి వాయువు వారికి సుఖ స్పర్శ కలిగించుచు దుమ్ములేకుండా వీచెను . మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రుడితో గూడి వెళుతుండగా చక్కగా పూలవాన కురిసేను . దేవదుందుభులు .శంఖములు మధురముగా ధ్వనించేను . విశ్వామిత్రుడు ముందు సాగిపోవుచుండగా జులపాల జుట్టు కల శ్రీరాముడు ధనుర్ధారియై ఆయనను అనుసరించెను . లక్ష్మణుడు ధనువు చేబట్టి  రాముడి ని అనుసరించెను . ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ,ధనస్సులను ధరించి ,తమ తమ శోభలతో అన్ని దిక్కులను వెలుగులు విరజిమ్ముచుండిరి . 
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో గూడి సరయు నదికి దక్షిణ తీరమున ఒకటిన్నర యోజనముల దూరము ప్రయాణము చేసిన పిమ్మట 'రామా ' అని మధురముగా సంభోదించి ఇలా అనెను . "నాయనా !ఈ నీటిని గ్రహించి ,ఆలసింపక ఆచమనమొనర్పుము . 'బాల ',అతిబల 'అణు మంత్రములను ఉపదేశించెదను శ్వీకరింపుము . ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ ఆకలి దప్పులు కానీ ఉండవు . నీ రూపకాంతులు తరగవు . నీవు నిదురించుచున్నను ఏమరపాటున వున్నాను రాక్షసులు నిన్నేమీ చేయలేరు . ఈ మంత్ర ప్రభావమున నీ భాహుబలములను ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవడును ఉండడు . ఈ భూలోకమునే కాదు ముల్లోకములలో నీకెవ్వరూ సాటిరారు . ఓ పుణ్యాత్ముడా !సౌందర్యము న కానీ ,సామర్ధ్యమున కానీ విషయం గ్రహణము నందు కానీ చక్కగా కార్య నిశ్చయము చేయుటలోకాని ,ప్రత్యుత్తరములు ఇచ్చుటలో కానీ లోకము నందు నీతో సమానుడు ఎవడు లేడు . 'బల ',అతిబల 'అను ఈ మాహా మంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు . ఈ రెండు విద్యలు లభించినచో ఇకముందు నీకు దీటైన వాడెవ్వడు వుండడు . ఓ పురుషోత్తమా !రఘురామా !మార్గమునందు 'బల ,;అతిబల 'అను మంత్రములు జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలుండవు .లోక కళ్యాణమునకై ఈ విద్యలు స్వీకరింపుము . ఈ రెండు విద్యలు అభ్యసించినచో నీకు సాటిలేని యశస్సు అబ్భును . ప్రభావాన్వితమైన ఈ రెండు విద్యలు బ్రహ్మ దేవుడినుండి ఆవిర్భవించినవి . 
అంతట శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి ,శుచియై విశ్వామిత్రుడి నుండి బల ,అతిబల విద్యలను స్వీకరించెను . అమిత పరాక్రమశాలి అయిన శ్రీ రాముడు ఆ విద్యలను గ్రహించి శరత్కాలం నందు సహస్ర కిరణుడై సూర్య భగవానుని వలె విరాజిల్లెను . రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలు ఒనర్చెను . పిమ్మట ఆ ముగ్గురు సరయు నదీ  తీరమందే ఆ రాత్రి గడిపిరి . దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణ శయ్యపై కలిసి పరుండిరి . అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను .  

రామాయను బాలకాండ ఇరువదిరెండవ సర్గ సమాప్తము . 


                         శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





















Wednesday, 29 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదియొకటవ సర్గ

                             రామాయణము 



                                   బాలకాండ -ఇరువదియొకటవ సర్గ 

దశరధుడు ఎటూ దిక్కు తోచనివాడై పుత్రవాత్సల్యముతో తడబడుచు పలికిన మాటలు విని విశ్వామిత్రుడు కుపితుడై ఇలా అనెను . "ఓ రాజా నా అభ్యర్ధన నెరవేరుస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పుటకు చూస్తున్నావు . ఇలా ప్రతిజ్ఞా భంగము చేయుట రఘు వంశజులకు తగదు . ఇలా చేయటము మీ వంశమునకే కళంకము . ఇట్లు మాట తప్పుట నీకు యుక్తము అనిపించినచో నా దారిన నేను వెళ్తాను . నీవు నీవారితో కూడి సుఖముగా ఉండు . "సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడు ఇలా కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతా కంపించెను . దేవతలు భయగ్రస్తులయిరి . నిష్టాగరిష్టుడు ,ధీరుడు ,మహానుభావుడు అయిన వశిష్ట మహర్షి జగత్తంతయు భయముతో చలించుట గమనించి దశరధునితో ఇలా అనెను . 
"ఓ రాజా !నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి . ధర్మమూర్తివి ,ధైర్యశాలివి ,సత్య వ్రతమును పాలించువాడవు . కనుక నీవు ధర్మ హానికి తలపడరాదు . ఓ రఘువంశోద్భవా 'మీ కోరిక నేను  నెరవేర్తును 'అని ప్రతిజ్ఞ చేసి ,ఆ మాటలను నిలబెట్టుకొని వానికి అశ్వమేధ యాగ ఫలము ,నీతులు బావులు తవ్వించిన ఫలము నశించిపోతాయి . కావున విశ్వామిత్ర మహర్షి వెంట రాముని పంపుము . రాముడు అస్త్ర విద్యలో ఆరితేరినవాడు అయినను కాకున్నను ,విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో వున్న అమృతము వలె ఆయనను రాక్షసులు ఏమి చేయలేరు . ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము ,గొప్ప శక్తి సామర్ధ్యాలు కలవాడు . మిక్కిలి ప్రజ్ఞాశాలి ,ఏ లోకమునందలి తాపసులలో మేటివాడు . వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగినవాడు ,చరాచరాత్మకము లైన ఈ మూడు లోకముల లో ఈయనతో సాటి అయిన అస్త్ర ప్రయోగాకుశులుడు  మరియొకడు లేడు . ఇకముందు ఎవ్వరు వుండబోరు . 
పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృశాశ్వుడను ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపములో విశ్వామిత్రునికి ఇచ్చివేసెను . కృశాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు ,వారు పెక్కు రూపములు కలవారు . మహావీరులు తేజశ్శాలురు, జయమును గూర్చువారు . జయ ,సుప్రభ అను దక్ష కన్యలు సుందరాంగులు . వారు ప్రకాశవంతమైన ,శత్రు సంహారకములైన నూఱు అస్త్ర ,శస్త్రములను సృష్టించిరి . అసుర సైన్యములను సంహరించుటకు జయ అను ఆమె మిక్కిలి శక్తి సంపన్నులు ,కామరూపులు శ్రేష్ఠులు అయిన  ఏబది మంది కుమారులను కనెను . 'సుప్రభ 'అను ఆమె 'సంహారులు 'అను పేరుకల ఏబది మంది పుత్రులను కనెను . వారు జయింప శక్యము కానివారు . అమోఘ పరాక్రమశాలురు . మిక్కిలి బలవంతులు . 
కుశికుని పుత్రుడైన విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నింటిని పూర్తిగా ఎరుగును . అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టించగలడు . ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు . కావున ఓ రాజా !ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు . విశ్వామిత్రుడు స్వయముగానే ఎదుర్కొనగలడు . నీ కుమారునకు మేలు చేయుటకే నీ వద్దకు వచ్చి నిన్ను ఇలా అభ్యర్ధిస్తున్నాడు . "వశిష్ట మహర్షి హిత వచనములను దశరధుడు ప్రసన్నచిత్తుడై ,మిక్కిలి పొంగిపోయెను . సూక్ష్మ బుద్ది గల ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను . 

రామాయణము  బాలకాండ  ఇరువదియొకటవ సర్గ సమాప్తము . 


                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  
















                                

Tuesday, 28 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదియవ సర్గ

                               రామాయణము 

          

                           బాలకాండ -ఇరువదియవ సర్గ 

దశరథ మహారాజు  ఆ విశ్వామిత్రుని మాటలు విని క్షణ కాలము నిశ్చేష్టుడయ్యెను . పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇలా అనెను . "రాజీవలోచనుడు అయిన నా రాముడు 16 యేండ్లు వయస్సు కూడా నిండనివాడు . కనుక ఇట్టి చిన్ని వయసులో ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకోవడం లేదు . ఇదిగో !ఈ అక్షౌహిణి సేనకు నేను అధిపతిని . ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరుల (నిశ అనగా రాత్రి , నిశ సమయములో చరించు వారు ,రాక్షసులు )తో పోరాడతాను . ఈ నా భటులు శూరులు పరమ పరాక్రమ శాలురు . వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు . రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు . దయచేసి శ్రీ రాముని మాత్రము కొరవలదు . నేనే ధనుర్భాణములు పట్టి మీ యాగ సంరక్షణ చేయగలను . యుద్ధ రంగమున సేనలకు ఆధిపత్యము వహించి నా కంఠము లో ప్రాణము ఉన్నంతవరకు పోరాడతాను . కనుక రాముని పంపవలసిందిగా కోరవద్దు . రాముడు పసివాడు ఇంకా ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు . శత్రువుల బలాబలాలు పసిగట్టలేడు . అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు . యుద్దములో ఆరితేరినవాడు కాదు . రాక్షసులు అందరూ కపట యుద్ధమున నిగ్గుదేలినవారు . కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు . 
రాముడిని ఎడబాసి క్షణ కాలము కూడా నేను ఉండలేను . కావున ఈ పసివాడిని కొరవద్దు . యజ్ఞ వ్రతము చేపట్టిన ఓ బ్రహ్మర్షీ !తప్పనిసరిగా రాముని వెంట తీసుకు వెళ్లదలిచినచో నేను కూడా నా చతురంగ బలములతో వెంట వస్తాను . 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది కష్టములను భరించియజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను . నా నలుగురు కుమారులలో రాముడంటే నాకు అత్యంత ప్రేమ పైగా ఇతడు పెద్దవాడు . కనుక రాముని తీసుకెళ్లవలదు . ఓ మునీశ్వరా !ఆ రాక్షసులెవరు ?వారి పరాక్రమము ఎట్టిది ?వారు ఎవరి కుమారులు ?వారి ఆకారములు ఎట్టివి ?వారికి ఎవరి అండ కలదు ? ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలెను ?అంతయు నాకు విశద పరుచుము . "అని పలికిన దశరధుని మాటలు విని విశ్వామిత్రుడు ఇలా పలికెను . 
"రావణుడు అను  రాక్షసుడు పౌలస్త్య వంశమున జన్మించెను . అతడు మిక్కిలి బలవంతుడు . గొప్ప పరాక్రమశాలి అతడికి పెక్కు రాక్షస బలములు కలవు . పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను . అతడు ఆ వార గర్వము చే లోకములను న భాదించుచున్నాడు . రాక్షస రాజైన ఆ రావణుడు 'విశ్రవసుడి 'కుమారుడు . కుబేరుని సోదరుడు . యజ్ఞమును విఘ్నము కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనలేదు . కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు సుబాహువు అను మహా బలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నము కలిగించుచున్నారు . "
విశ్వామిత్ర మహర్షి ఇలా పలుకగా దశరధుడు ఆ మునితో ఇలా అనెను . "దేవతలు ,దానవులు ,గంధర్వులు ,యక్షులు ,గరుత్మంతుడు ,నాగులు మొదలగు వారెవ్వరు యుద్దములో రావణుని ఎదుర్కొనలేరు . ఇంకా మానవుల విషయము చెప్పనేల ?ఆ రావణుడు యుద్ధ భూమిలో శత్రువుల బల పరాక్రముములను హరించి వేయును . కావున ఓ మునిపుంగవా !నేను నా సైన్యముతో కూడి కానీ పుత్ర సహితుడనై కానీ అతనిని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను . యజ్ఞమునకు విఘ్నము కలిగించు చున్న మారీచ ,సుబాహులు సుందోపసుందల కుమారులు ,యుద్ధమున వారు యమునితో సమానులు . కనుక నా ముద్దు బిడ్డడు రాముడిని మీతో పంపలేను . "
బ్రాహ్మణోత్తముడు ,కుశికుని వంశమువాడు ,మహా పురుషుడు అయిన విశ్వామిత్రుడు అసంగతములైన దశరధుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయెను . సమిధలతో ,ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లిన అగ్ని వలె ఆ మహర్షి మండిపడెను . 

రామాయణము  బాల కాండ ఇరువదియవ సర్గ సమాప్తము . 


                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Monday, 27 June 2016

రామాయణము బాలకాండ -పందొమ్మిదవ సర్గ

                                                    రామాయణము 

                                                              బాలకాండ -పందొమ్మిదవ సర్గ 

మహా తేజశ్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని ,పులకిత గాత్రుడై ఆయనతో ఇలా అనెను . "ఓ రాజశేఖరా !నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడవు . వశిష్ట మహర్షి యొక్క ఉపదేశములు విన్న వాడవు . కనుక నీవు ఇలా మాట్లాడుటయే యుక్తము . నేను సంకల్పించిన కార్యమును తెలుపుతాను . దానిని ఆచరింపుము . నీవు ఆడిన మాట తప్పకుము . ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞ దీక్షను చేపట్టితిని . కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు . నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పరిసమాప్తి అవుతుండగా సుశిక్షుతులు ,పరాక్రమవంతులు అయిన మారీచ ,సుబాహులు మాంస ఖండములను ,రక్తమును యజ్ఞ వేదికపై వర్షించునట్లు చేస్తున్నారు . నియమ నిష్టలతో నేను ఆచరిస్తున్న యజ్ఞము ఆ విధముగా విఘ్నములకు గురి అగుచున్నది . నా శ్రమ అంతయూ వృధా ఆగుతున్నది . కనుక ఉత్సాహము కోల్పోయి ,నా ఆశ్రమము నుండి నేను ఇచటికి వచ్చితిని . ఓ భూపతీ !అట్లు విఘ్నములు కల్గించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకు కానీ వారిని శపించుటకు కానీ యజ్ఞ దీక్షలోనున్న  నాకు యుక్తము కాదుకదా !
ఓ నరేంద్రా !సత్య పరాక్రముడు ,జులపాల జుట్టు కలవాడు ,శూరుడు ,నీ కుమారులలో పెద్దవాడు అయినా శ్రీ రాముని నావెంట పంపుము . ఈ రాముడు నా అండ దండలతో తన దివ్యమైన తేజః ప్రభావమునయాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్ధుడు . నా వెంట వచ్చి యాగమును సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములగు శ్రేయస్సులు సమకూరును . అందులకు సందేహము లేదు . ఈయన ఖ్యాతి ముల్లోకములలోను వ్యాపించును . ఏ విధముగానైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు . శ్రీరాముడు తప్ప మఱియొకడు ఎవరు వారిని చంపలేరు . ఓ మహారాజా ! ఆ రాక్షసులు బల గర్వముచే  పెక్కు పాప కృత్యములు చేసివున్నారు . అందువలన వారికి చావు దగ్గర పడింది . వారు ఏ విధముగానూ రాముని ముందు నిలవజాలరు . 
రాజీవలోచనుడైన నీ పుత్రుడు అగు శ్రీ రాముని 10 దినముల పాటు యాగ రక్షణార్ధమై వెంటనే నాతో పంపుము . ఇదియే నా అభీష్టము . ఓ దశరథ మహారాజా !ఏ మాత్రమూ ఆలస్యము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తి అగునట్లు చూడుము . నీకు మేలగుగాక . మనస్సున కలత చెందకుము ". ధర్మాత్ముడు మహా తేజశ్శాలీ అయిన విశ్వామిత్రుడు ఈ విధముగా పలికి మిన్నకుండెను . ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర పలుకులు విని ,తీవ్రమైన శోకమునకు గురయి ,భయముతో కృంగిపోయెను . విశ్వనామిత్రుడి వచనములు దశరధుని హృదయమును ,మనస్సును మిక్కిలి కలిచివేసెను . అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనము నందే మిగుల చలించిపోయెను . 



రామాయణము  బాలకాండ పందొమ్మిదవ సర్గ . 


                              శశి ,

                  ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















Sunday, 26 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమదవ సర్గ

                                రామాయణము 

     
                                  

                                           బాలకాండ -పదునెనిమదవ సర్గ 

విశ్వామిత్రుడి మాటలు విని ఆ ద్వార పాలకులు కలవరపడి ,భయముతో రాజభవనమునకు పరిగెత్తిరి . వారు రాజ ప్రాసాదానికి చేరి ,విశ్వామిత్ర మహర్షి రాకను గురించి ఇక్ష్వాక వంశజుడైన దశరథ మహారాజుకు నివేదించిరి . ఆ ద్వారపాలకులు తెలిపిన మాటలు విని ,దశరధుడు సంతోషముతో పురోహితులను వెంట తీసుకుని బ్రహ్మ వద్దకు ఇంద్రుడి వలె ఆ మహర్షికి ఎదురేగెను . కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని చూసి రాజు మిక్కిలి సంతోషించెను . పిమ్మట ఆయనకు అర్ఘ్య పాద్యాది సత్కారములను జరిపెను . ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్య పాద్యాది సత్కారములను శ్వీకరించెను . పిదప అతడు మాహారాజును కుశల ప్రశ్నలు అడిగెను . మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యధోచితముగా పలుకరించెను . ఈ విధముగా విశ్వామిత్రుడితో గౌరవింపబడిన వారై వారందరూ ఎంతో సంతోషించారు . పిమ్మట అందరూ రాజభవనమున ప్రవేశించి వారి వారి యోగ్యతలు ప్రకారము ఆసీనులయ్యిరి . 
మిక్కిలి ఉదారము కల దశరథ మహారాజు ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని పొగుడుతూ ఇట్లనెను . "ఓ మహర్షీ అమృతము లభించినట్లు ,నష్ట పోయినవారికి నిధి లభించినట్లు నీళ్లు లేనిచోట వర్షము కురిసినట్లు సంతానము లేనివారికి ధర్మపత్ని అందు పుత్రులు కలిగినట్లు ,మీ ఆగమనం మాకు మహదానందం కలిగించింది . మీకు స్వాగతము . ఓ ధర్మాత్మా !బ్రహ్మర్షీ మీరు ఇక్కడికి వచ్చుట మా అదృష్టము . ధన్యుడనైతిని . మీ అభీష్టమేమి ?అందుకై నేనేమి చేయవలెను ?నేడు నా జన్మ సఫలమైనది . జన్మ చరితార్ధమైనది . పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి . అనంతరము తపః ప్రభావమున బ్రహ్మర్షిత్వము సాదించితిరి . కనుక మీరు నాకు బహుదా పూజ్యులు . ఓ బ్రహ్మర్షి !అద్భుతమైన మీ ఆగమనం నన్ను అబ్భురపరిచింది . మా గృహము పావనమైనది ప్రభూ మీ సందర్శనము వల్ల నేను కృతార్థుడనయ్యాను మీరు ఏ కార్య నిమిత్తమై వచ్చారో తెలపండి . మీ కార్యము నెరవేర్చుటకై సిద్ధముగా వున్నాను . అనుగ్రహింపండి . 
ఓ కౌశికా !కార్య విషయమున సందేహమును పెట్టుకొనవలదు . మీరు పూజ్యులైన అతిధులు ,కావున గృహస్థుడైన నాకు దైవసమానులు . మీ కార్యమును నేను నెరవేర్చెదను . అర్ధ వంతములైన దశరధుడి మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీనులకు విందుగా ఉండెను . హృదయమునకు ఆహ్లాదమును కూర్చెను . అంతట ఉత్తమోత్త గుణములచే ఖ్యాతికెక్కిన వాడు , శమదమాది విశిష్ట గుణ సంపన్నుడు అయిన  విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయెను . 



      రామాయణము  బాలకాండ పదునెనిమిదవ సర్గ సమాప్తము . 




                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














Friday, 24 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమదవ సర్గ

                             రామాయణము 

                           బాలకాండ -పదునెనిమదవ సర్గ 

రఘు వంశజులలో మహా తేజశ్శాలీ అయిన శ్రీ రాముడు అమోఘమైన పరాక్రమము కలవాడు . సమస్త ప్రజలకు పూర్ణ చంద్రుడి వలె ఆహ్లాద కరుడు . రాముడు ఏనుగు ఎక్కి ,గుఱ్ఱమును అధిరోహించి ,రథమునందుండి యుద్ధము చేయుటలో కుశులుడు . ధనుర్విద్య నందు నిపుణుడు . సర్వదా తల్లి తండ్రుల సేవలో నిమగ్నుడై ఉండెడివాడు . ప్రజలను ఆనందింప చేయునట్టి అన్నయగు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు నిత్యమూ ఆయనను సేవించుటే ఒక మహా భాగ్యముగా భావించేవాడు . రామ సేవల అందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏ మాత్రమూ పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రియమును గూర్చు వాడు . అతడు రామునకు బహి ప్రాణము పురుషోత్తముడైన రాముడు లక్ష్మణుడు తన దగ్గర లేకపోతే నిద్రపోయేవాడు కాదు . తల్లి కౌశల్య తీసుకువచ్చిన కమ్మని భోజన పదార్ధములను లక్ష్మణుడు తోడు లేనిచే భుజించెడివాడుకాదు . అనగా రాముడు లక్ష్మణుడిని విడిచి  క్షణ కాలమైనా వుండేవాడుకాదు . రాముడు గుఱ్ఱమెక్కి వేటకు వెళ్లునప్పుడు లక్ష్మణుడు ధనస్సు చేబూని , అతడిని కాపాడుతూ వెంట నడిచి వెళ్ళేవాడు . 
   లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావము కలవాడు . అతడు భరతుడికి ప్రాణము ల కంటే ప్రియమైన వాడు  .  అట్లే శత్రుఘ్నుడు భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండేవాడు . చక్కని శుభ లక్షణ సంపన్నులు అగు తన నలుగురు ప్రియ పుత్రులతో కూడిన దశరధుడు ఇంద్ర ,యమ ,వరుణ ,కుభేరులు  అణు నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మ దేవుని వలె పరమానంద భరితుడయ్యెను . ఆ నలుగురు రాజకుమారులు వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసి గాంచిరి .  శ్రేష్ఠులైన ఆ రాజ కుమారులు వేద వేదాంగ ,స్మృతి ,పురాణేతిహాసములను శ్రద్దగా అధ్యయనము చేయుచుండిరి . ధర్మానుర్వేదము నందు నిష్ఠ కలిగి ఉండిరి . 

మహాత్ముడైన దశరధుడు యుక్తవయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడు జోడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోను ,భందువులతోను బాగా ఆలోచిస్తూ ఉండెను . ఆ విధముగా ఆలోచిస్తుండగా మహా తేజశ్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి అక్కడకు వచ్చెను . రాజును దర్షింప కోరి ఆ ముని ద్వార పాలకులతో "నేను గాది రాజు కుమారుడును ,కుశకుని వంశము వాడను , నా పేరు విశ్వామిత్రుడు ,నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలపండి . "అని పలికెను . 


                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















Thursday, 23 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమిదవ సర్గ

                              రామాయణము 

                           బాలకాండ -పదునెనిమిదవ సర్గ 

దశరథ మహారాజుకి పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతయు ఉత్సవములు జరిగాయి . అందు ప్రజలెల్లరు అత్యుత్సాహముతో పాల్గొనిరి . రాజ వీధులన్నీ కోలాహలంతో నిండిపోయెను . నటీ నటుల అభినయ ప్రదర్శన తొడను ,నర్తకుల యొక్క నృత్య వినోదములతో విలసిల్లెను . గాన వాద్య గోష్టులతో వంది మాగధ స్త్రోత్ర పాఠములతో ప్రతిధ్వనించేను . రాజు వాందరికి పారితోషకం ఇచ్చెను . బ్రాహ్మణోత్తములకు వేలకొలది గోవులను ధన ,కనక ,వస్తు ,వాహనములు దానము చేసెను . పుత్రులు జన్మించిన 11 దినముల తర్వాత దశరధుడు వారికి జాతకర్మనామకరణోత్సములను నిర్వహించెను . కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణము కల జ్యేష్ఠ పుత్రుడికి 'రాముడు 'అని, కైకేయి కుమారుడికి 'భరతుడు 'అని ,సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు ,శత్రుఘ్నుడు అనీ నామకరణము చేసెను . 



రాజు బ్రాహ్మణులను పుర జనులను గ్రామ వాసులను మృష్టాన్న భోజనంతో సంతృప్తిపరిచేను . ఇంకను బ్ర్రాహ్మణోత్తములకు బహు విధములగు రత్నములను పుష్కలముగా బహూకరించెను . పిమ్మట దశరధుడు తన నలుగురు పుత్రులకు అన్నప్రాసన చౌలోపనయనాది సంస్కారములను సకాలమున జరిపించెను . ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశ ప్రతిష్టను ఇనుమడింప చేయుచు తండ్రికి మిక్కిలి సంతోషము కూర్చుచుండెను . మఱియు సమస్త ప్రాణులకు శ్రీ మహా విష్ణువు వలె ఎంతయు ప్రేమపాత్రుడాయెను . ఆ రాజ కుమారులందరూ వేద శాస్త్రములు అభ్యసించిరి . ధనుర్విద్యనందు ఆరితేరిరి . ప్రజల హితమునందే ఆసక్తి కలవారైరి . వారందరూ విజ్ఞాన ఘనులు ,సకల సద్గుణ సంపన్నులు . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .