Wednesday 29 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదియొకటవ సర్గ

                             రామాయణము 



                                   బాలకాండ -ఇరువదియొకటవ సర్గ 

దశరధుడు ఎటూ దిక్కు తోచనివాడై పుత్రవాత్సల్యముతో తడబడుచు పలికిన మాటలు విని విశ్వామిత్రుడు కుపితుడై ఇలా అనెను . "ఓ రాజా నా అభ్యర్ధన నెరవేరుస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పుటకు చూస్తున్నావు . ఇలా ప్రతిజ్ఞా భంగము చేయుట రఘు వంశజులకు తగదు . ఇలా చేయటము మీ వంశమునకే కళంకము . ఇట్లు మాట తప్పుట నీకు యుక్తము అనిపించినచో నా దారిన నేను వెళ్తాను . నీవు నీవారితో కూడి సుఖముగా ఉండు . "సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడు ఇలా కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతా కంపించెను . దేవతలు భయగ్రస్తులయిరి . నిష్టాగరిష్టుడు ,ధీరుడు ,మహానుభావుడు అయిన వశిష్ట మహర్షి జగత్తంతయు భయముతో చలించుట గమనించి దశరధునితో ఇలా అనెను . 
"ఓ రాజా !నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి . ధర్మమూర్తివి ,ధైర్యశాలివి ,సత్య వ్రతమును పాలించువాడవు . కనుక నీవు ధర్మ హానికి తలపడరాదు . ఓ రఘువంశోద్భవా 'మీ కోరిక నేను  నెరవేర్తును 'అని ప్రతిజ్ఞ చేసి ,ఆ మాటలను నిలబెట్టుకొని వానికి అశ్వమేధ యాగ ఫలము ,నీతులు బావులు తవ్వించిన ఫలము నశించిపోతాయి . కావున విశ్వామిత్ర మహర్షి వెంట రాముని పంపుము . రాముడు అస్త్ర విద్యలో ఆరితేరినవాడు అయినను కాకున్నను ,విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో వున్న అమృతము వలె ఆయనను రాక్షసులు ఏమి చేయలేరు . ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము ,గొప్ప శక్తి సామర్ధ్యాలు కలవాడు . మిక్కిలి ప్రజ్ఞాశాలి ,ఏ లోకమునందలి తాపసులలో మేటివాడు . వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగినవాడు ,చరాచరాత్మకము లైన ఈ మూడు లోకముల లో ఈయనతో సాటి అయిన అస్త్ర ప్రయోగాకుశులుడు  మరియొకడు లేడు . ఇకముందు ఎవ్వరు వుండబోరు . 
పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృశాశ్వుడను ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపములో విశ్వామిత్రునికి ఇచ్చివేసెను . కృశాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు ,వారు పెక్కు రూపములు కలవారు . మహావీరులు తేజశ్శాలురు, జయమును గూర్చువారు . జయ ,సుప్రభ అను దక్ష కన్యలు సుందరాంగులు . వారు ప్రకాశవంతమైన ,శత్రు సంహారకములైన నూఱు అస్త్ర ,శస్త్రములను సృష్టించిరి . అసుర సైన్యములను సంహరించుటకు జయ అను ఆమె మిక్కిలి శక్తి సంపన్నులు ,కామరూపులు శ్రేష్ఠులు అయిన  ఏబది మంది కుమారులను కనెను . 'సుప్రభ 'అను ఆమె 'సంహారులు 'అను పేరుకల ఏబది మంది పుత్రులను కనెను . వారు జయింప శక్యము కానివారు . అమోఘ పరాక్రమశాలురు . మిక్కిలి బలవంతులు . 
కుశికుని పుత్రుడైన విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నింటిని పూర్తిగా ఎరుగును . అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టించగలడు . ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు . కావున ఓ రాజా !ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు . విశ్వామిత్రుడు స్వయముగానే ఎదుర్కొనగలడు . నీ కుమారునకు మేలు చేయుటకే నీ వద్దకు వచ్చి నిన్ను ఇలా అభ్యర్ధిస్తున్నాడు . "వశిష్ట మహర్షి హిత వచనములను దశరధుడు ప్రసన్నచిత్తుడై ,మిక్కిలి పొంగిపోయెను . సూక్ష్మ బుద్ది గల ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను . 

రామాయణము  బాలకాండ  ఇరువదియొకటవ సర్గ సమాప్తము . 


                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  
















                                

No comments:

Post a Comment