Thursday 30 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదిరెండవ సర్గ

                                రామాయణము 


                                        బాలకాండ -ఇరువదిరెండవ సర్గ 


వశిష్టుని హిత వచనములను దశరధుని ముఖము వికశించెను . పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను . తల్లి కౌశల్య తండ్రి దశరధుడు రాముని ఆశీర్వదించిరి . పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులు పలికెను . దశరథ మహారాజు తన ముద్దు బిడ్డ అయిన రాముని మూర్ధమున ఆఘ్రాణించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునికి అప్పగించెను . ఆ సమయమున విశ్వామిత్రుని పక్కన చేరి వున్న రాజీవలోచనుడైన రాముని చూసి వాయువు వారికి సుఖ స్పర్శ కలిగించుచు దుమ్ములేకుండా వీచెను . మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రుడితో గూడి వెళుతుండగా చక్కగా పూలవాన కురిసేను . దేవదుందుభులు .శంఖములు మధురముగా ధ్వనించేను . విశ్వామిత్రుడు ముందు సాగిపోవుచుండగా జులపాల జుట్టు కల శ్రీరాముడు ధనుర్ధారియై ఆయనను అనుసరించెను . లక్ష్మణుడు ధనువు చేబట్టి  రాముడి ని అనుసరించెను . ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ,ధనస్సులను ధరించి ,తమ తమ శోభలతో అన్ని దిక్కులను వెలుగులు విరజిమ్ముచుండిరి . 
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో గూడి సరయు నదికి దక్షిణ తీరమున ఒకటిన్నర యోజనముల దూరము ప్రయాణము చేసిన పిమ్మట 'రామా ' అని మధురముగా సంభోదించి ఇలా అనెను . "నాయనా !ఈ నీటిని గ్రహించి ,ఆలసింపక ఆచమనమొనర్పుము . 'బాల ',అతిబల 'అణు మంత్రములను ఉపదేశించెదను శ్వీకరింపుము . ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ ఆకలి దప్పులు కానీ ఉండవు . నీ రూపకాంతులు తరగవు . నీవు నిదురించుచున్నను ఏమరపాటున వున్నాను రాక్షసులు నిన్నేమీ చేయలేరు . ఈ మంత్ర ప్రభావమున నీ భాహుబలములను ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవడును ఉండడు . ఈ భూలోకమునే కాదు ముల్లోకములలో నీకెవ్వరూ సాటిరారు . ఓ పుణ్యాత్ముడా !సౌందర్యము న కానీ ,సామర్ధ్యమున కానీ విషయం గ్రహణము నందు కానీ చక్కగా కార్య నిశ్చయము చేయుటలోకాని ,ప్రత్యుత్తరములు ఇచ్చుటలో కానీ లోకము నందు నీతో సమానుడు ఎవడు లేడు . 'బల ',అతిబల 'అను ఈ మాహా మంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు . ఈ రెండు విద్యలు లభించినచో ఇకముందు నీకు దీటైన వాడెవ్వడు వుండడు . ఓ పురుషోత్తమా !రఘురామా !మార్గమునందు 'బల ,;అతిబల 'అను మంత్రములు జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలుండవు .లోక కళ్యాణమునకై ఈ విద్యలు స్వీకరింపుము . ఈ రెండు విద్యలు అభ్యసించినచో నీకు సాటిలేని యశస్సు అబ్భును . ప్రభావాన్వితమైన ఈ రెండు విద్యలు బ్రహ్మ దేవుడినుండి ఆవిర్భవించినవి . 
అంతట శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి ,శుచియై విశ్వామిత్రుడి నుండి బల ,అతిబల విద్యలను స్వీకరించెను . అమిత పరాక్రమశాలి అయిన శ్రీ రాముడు ఆ విద్యలను గ్రహించి శరత్కాలం నందు సహస్ర కిరణుడై సూర్య భగవానుని వలె విరాజిల్లెను . రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలు ఒనర్చెను . పిమ్మట ఆ ముగ్గురు సరయు నదీ  తీరమందే ఆ రాత్రి గడిపిరి . దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణ శయ్యపై కలిసి పరుండిరి . అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను .  

రామాయను బాలకాండ ఇరువదిరెండవ సర్గ సమాప్తము . 


                         శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





















No comments:

Post a Comment