Tuesday 28 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదియవ సర్గ

                               రామాయణము 

          

                           బాలకాండ -ఇరువదియవ సర్గ 

దశరథ మహారాజు  ఆ విశ్వామిత్రుని మాటలు విని క్షణ కాలము నిశ్చేష్టుడయ్యెను . పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇలా అనెను . "రాజీవలోచనుడు అయిన నా రాముడు 16 యేండ్లు వయస్సు కూడా నిండనివాడు . కనుక ఇట్టి చిన్ని వయసులో ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకోవడం లేదు . ఇదిగో !ఈ అక్షౌహిణి సేనకు నేను అధిపతిని . ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరుల (నిశ అనగా రాత్రి , నిశ సమయములో చరించు వారు ,రాక్షసులు )తో పోరాడతాను . ఈ నా భటులు శూరులు పరమ పరాక్రమ శాలురు . వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు . రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు . దయచేసి శ్రీ రాముని మాత్రము కొరవలదు . నేనే ధనుర్భాణములు పట్టి మీ యాగ సంరక్షణ చేయగలను . యుద్ధ రంగమున సేనలకు ఆధిపత్యము వహించి నా కంఠము లో ప్రాణము ఉన్నంతవరకు పోరాడతాను . కనుక రాముని పంపవలసిందిగా కోరవద్దు . రాముడు పసివాడు ఇంకా ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు . శత్రువుల బలాబలాలు పసిగట్టలేడు . అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు . యుద్దములో ఆరితేరినవాడు కాదు . రాక్షసులు అందరూ కపట యుద్ధమున నిగ్గుదేలినవారు . కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు . 
రాముడిని ఎడబాసి క్షణ కాలము కూడా నేను ఉండలేను . కావున ఈ పసివాడిని కొరవద్దు . యజ్ఞ వ్రతము చేపట్టిన ఓ బ్రహ్మర్షీ !తప్పనిసరిగా రాముని వెంట తీసుకు వెళ్లదలిచినచో నేను కూడా నా చతురంగ బలములతో వెంట వస్తాను . 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది కష్టములను భరించియజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను . నా నలుగురు కుమారులలో రాముడంటే నాకు అత్యంత ప్రేమ పైగా ఇతడు పెద్దవాడు . కనుక రాముని తీసుకెళ్లవలదు . ఓ మునీశ్వరా !ఆ రాక్షసులెవరు ?వారి పరాక్రమము ఎట్టిది ?వారు ఎవరి కుమారులు ?వారి ఆకారములు ఎట్టివి ?వారికి ఎవరి అండ కలదు ? ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలెను ?అంతయు నాకు విశద పరుచుము . "అని పలికిన దశరధుని మాటలు విని విశ్వామిత్రుడు ఇలా పలికెను . 
"రావణుడు అను  రాక్షసుడు పౌలస్త్య వంశమున జన్మించెను . అతడు మిక్కిలి బలవంతుడు . గొప్ప పరాక్రమశాలి అతడికి పెక్కు రాక్షస బలములు కలవు . పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను . అతడు ఆ వార గర్వము చే లోకములను న భాదించుచున్నాడు . రాక్షస రాజైన ఆ రావణుడు 'విశ్రవసుడి 'కుమారుడు . కుబేరుని సోదరుడు . యజ్ఞమును విఘ్నము కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనలేదు . కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు సుబాహువు అను మహా బలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నము కలిగించుచున్నారు . "
విశ్వామిత్ర మహర్షి ఇలా పలుకగా దశరధుడు ఆ మునితో ఇలా అనెను . "దేవతలు ,దానవులు ,గంధర్వులు ,యక్షులు ,గరుత్మంతుడు ,నాగులు మొదలగు వారెవ్వరు యుద్దములో రావణుని ఎదుర్కొనలేరు . ఇంకా మానవుల విషయము చెప్పనేల ?ఆ రావణుడు యుద్ధ భూమిలో శత్రువుల బల పరాక్రముములను హరించి వేయును . కావున ఓ మునిపుంగవా !నేను నా సైన్యముతో కూడి కానీ పుత్ర సహితుడనై కానీ అతనిని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను . యజ్ఞమునకు విఘ్నము కలిగించు చున్న మారీచ ,సుబాహులు సుందోపసుందల కుమారులు ,యుద్ధమున వారు యమునితో సమానులు . కనుక నా ముద్దు బిడ్డడు రాముడిని మీతో పంపలేను . "
బ్రాహ్మణోత్తముడు ,కుశికుని వంశమువాడు ,మహా పురుషుడు అయిన విశ్వామిత్రుడు అసంగతములైన దశరధుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయెను . సమిధలతో ,ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లిన అగ్ని వలె ఆ మహర్షి మండిపడెను . 

రామాయణము  బాల కాండ ఇరువదియవ సర్గ సమాప్తము . 


                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment