Sunday 26 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమదవ సర్గ

                                రామాయణము 

     
                                  

                                           బాలకాండ -పదునెనిమదవ సర్గ 

విశ్వామిత్రుడి మాటలు విని ఆ ద్వార పాలకులు కలవరపడి ,భయముతో రాజభవనమునకు పరిగెత్తిరి . వారు రాజ ప్రాసాదానికి చేరి ,విశ్వామిత్ర మహర్షి రాకను గురించి ఇక్ష్వాక వంశజుడైన దశరథ మహారాజుకు నివేదించిరి . ఆ ద్వారపాలకులు తెలిపిన మాటలు విని ,దశరధుడు సంతోషముతో పురోహితులను వెంట తీసుకుని బ్రహ్మ వద్దకు ఇంద్రుడి వలె ఆ మహర్షికి ఎదురేగెను . కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని చూసి రాజు మిక్కిలి సంతోషించెను . పిమ్మట ఆయనకు అర్ఘ్య పాద్యాది సత్కారములను జరిపెను . ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్య పాద్యాది సత్కారములను శ్వీకరించెను . పిదప అతడు మాహారాజును కుశల ప్రశ్నలు అడిగెను . మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యధోచితముగా పలుకరించెను . ఈ విధముగా విశ్వామిత్రుడితో గౌరవింపబడిన వారై వారందరూ ఎంతో సంతోషించారు . పిమ్మట అందరూ రాజభవనమున ప్రవేశించి వారి వారి యోగ్యతలు ప్రకారము ఆసీనులయ్యిరి . 
మిక్కిలి ఉదారము కల దశరథ మహారాజు ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని పొగుడుతూ ఇట్లనెను . "ఓ మహర్షీ అమృతము లభించినట్లు ,నష్ట పోయినవారికి నిధి లభించినట్లు నీళ్లు లేనిచోట వర్షము కురిసినట్లు సంతానము లేనివారికి ధర్మపత్ని అందు పుత్రులు కలిగినట్లు ,మీ ఆగమనం మాకు మహదానందం కలిగించింది . మీకు స్వాగతము . ఓ ధర్మాత్మా !బ్రహ్మర్షీ మీరు ఇక్కడికి వచ్చుట మా అదృష్టము . ధన్యుడనైతిని . మీ అభీష్టమేమి ?అందుకై నేనేమి చేయవలెను ?నేడు నా జన్మ సఫలమైనది . జన్మ చరితార్ధమైనది . పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి . అనంతరము తపః ప్రభావమున బ్రహ్మర్షిత్వము సాదించితిరి . కనుక మీరు నాకు బహుదా పూజ్యులు . ఓ బ్రహ్మర్షి !అద్భుతమైన మీ ఆగమనం నన్ను అబ్భురపరిచింది . మా గృహము పావనమైనది ప్రభూ మీ సందర్శనము వల్ల నేను కృతార్థుడనయ్యాను మీరు ఏ కార్య నిమిత్తమై వచ్చారో తెలపండి . మీ కార్యము నెరవేర్చుటకై సిద్ధముగా వున్నాను . అనుగ్రహింపండి . 
ఓ కౌశికా !కార్య విషయమున సందేహమును పెట్టుకొనవలదు . మీరు పూజ్యులైన అతిధులు ,కావున గృహస్థుడైన నాకు దైవసమానులు . మీ కార్యమును నేను నెరవేర్చెదను . అర్ధ వంతములైన దశరధుడి మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీనులకు విందుగా ఉండెను . హృదయమునకు ఆహ్లాదమును కూర్చెను . అంతట ఉత్తమోత్త గుణములచే ఖ్యాతికెక్కిన వాడు , శమదమాది విశిష్ట గుణ సంపన్నుడు అయిన  విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయెను . 



      రామాయణము  బాలకాండ పదునెనిమిదవ సర్గ సమాప్తము . 




                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment