Monday 27 June 2016

రామాయణము బాలకాండ -పందొమ్మిదవ సర్గ

                                                    రామాయణము 

                                                              బాలకాండ -పందొమ్మిదవ సర్గ 

మహా తేజశ్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని ,పులకిత గాత్రుడై ఆయనతో ఇలా అనెను . "ఓ రాజశేఖరా !నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడవు . వశిష్ట మహర్షి యొక్క ఉపదేశములు విన్న వాడవు . కనుక నీవు ఇలా మాట్లాడుటయే యుక్తము . నేను సంకల్పించిన కార్యమును తెలుపుతాను . దానిని ఆచరింపుము . నీవు ఆడిన మాట తప్పకుము . ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞ దీక్షను చేపట్టితిని . కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు . నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పరిసమాప్తి అవుతుండగా సుశిక్షుతులు ,పరాక్రమవంతులు అయిన మారీచ ,సుబాహులు మాంస ఖండములను ,రక్తమును యజ్ఞ వేదికపై వర్షించునట్లు చేస్తున్నారు . నియమ నిష్టలతో నేను ఆచరిస్తున్న యజ్ఞము ఆ విధముగా విఘ్నములకు గురి అగుచున్నది . నా శ్రమ అంతయూ వృధా ఆగుతున్నది . కనుక ఉత్సాహము కోల్పోయి ,నా ఆశ్రమము నుండి నేను ఇచటికి వచ్చితిని . ఓ భూపతీ !అట్లు విఘ్నములు కల్గించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకు కానీ వారిని శపించుటకు కానీ యజ్ఞ దీక్షలోనున్న  నాకు యుక్తము కాదుకదా !
ఓ నరేంద్రా !సత్య పరాక్రముడు ,జులపాల జుట్టు కలవాడు ,శూరుడు ,నీ కుమారులలో పెద్దవాడు అయినా శ్రీ రాముని నావెంట పంపుము . ఈ రాముడు నా అండ దండలతో తన దివ్యమైన తేజః ప్రభావమునయాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్ధుడు . నా వెంట వచ్చి యాగమును సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములగు శ్రేయస్సులు సమకూరును . అందులకు సందేహము లేదు . ఈయన ఖ్యాతి ముల్లోకములలోను వ్యాపించును . ఏ విధముగానైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు . శ్రీరాముడు తప్ప మఱియొకడు ఎవరు వారిని చంపలేరు . ఓ మహారాజా ! ఆ రాక్షసులు బల గర్వముచే  పెక్కు పాప కృత్యములు చేసివున్నారు . అందువలన వారికి చావు దగ్గర పడింది . వారు ఏ విధముగానూ రాముని ముందు నిలవజాలరు . 
రాజీవలోచనుడైన నీ పుత్రుడు అగు శ్రీ రాముని 10 దినముల పాటు యాగ రక్షణార్ధమై వెంటనే నాతో పంపుము . ఇదియే నా అభీష్టము . ఓ దశరథ మహారాజా !ఏ మాత్రమూ ఆలస్యము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తి అగునట్లు చూడుము . నీకు మేలగుగాక . మనస్సున కలత చెందకుము ". ధర్మాత్ముడు మహా తేజశ్శాలీ అయిన విశ్వామిత్రుడు ఈ విధముగా పలికి మిన్నకుండెను . ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర పలుకులు విని ,తీవ్రమైన శోకమునకు గురయి ,భయముతో కృంగిపోయెను . విశ్వనామిత్రుడి వచనములు దశరధుని హృదయమును ,మనస్సును మిక్కిలి కలిచివేసెను . అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనము నందే మిగుల చలించిపోయెను . 



రామాయణము  బాలకాండ పందొమ్మిదవ సర్గ . 


                              శశి ,

                  ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















No comments:

Post a Comment