Thursday 23 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమిదవ సర్గ

                              రామాయణము 

                           బాలకాండ -పదునెనిమిదవ సర్గ 

దశరథ మహారాజుకి పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతయు ఉత్సవములు జరిగాయి . అందు ప్రజలెల్లరు అత్యుత్సాహముతో పాల్గొనిరి . రాజ వీధులన్నీ కోలాహలంతో నిండిపోయెను . నటీ నటుల అభినయ ప్రదర్శన తొడను ,నర్తకుల యొక్క నృత్య వినోదములతో విలసిల్లెను . గాన వాద్య గోష్టులతో వంది మాగధ స్త్రోత్ర పాఠములతో ప్రతిధ్వనించేను . రాజు వాందరికి పారితోషకం ఇచ్చెను . బ్రాహ్మణోత్తములకు వేలకొలది గోవులను ధన ,కనక ,వస్తు ,వాహనములు దానము చేసెను . పుత్రులు జన్మించిన 11 దినముల తర్వాత దశరధుడు వారికి జాతకర్మనామకరణోత్సములను నిర్వహించెను . కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణము కల జ్యేష్ఠ పుత్రుడికి 'రాముడు 'అని, కైకేయి కుమారుడికి 'భరతుడు 'అని ,సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు ,శత్రుఘ్నుడు అనీ నామకరణము చేసెను . 



రాజు బ్రాహ్మణులను పుర జనులను గ్రామ వాసులను మృష్టాన్న భోజనంతో సంతృప్తిపరిచేను . ఇంకను బ్ర్రాహ్మణోత్తములకు బహు విధములగు రత్నములను పుష్కలముగా బహూకరించెను . పిమ్మట దశరధుడు తన నలుగురు పుత్రులకు అన్నప్రాసన చౌలోపనయనాది సంస్కారములను సకాలమున జరిపించెను . ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశ ప్రతిష్టను ఇనుమడింప చేయుచు తండ్రికి మిక్కిలి సంతోషము కూర్చుచుండెను . మఱియు సమస్త ప్రాణులకు శ్రీ మహా విష్ణువు వలె ఎంతయు ప్రేమపాత్రుడాయెను . ఆ రాజ కుమారులందరూ వేద శాస్త్రములు అభ్యసించిరి . ధనుర్విద్యనందు ఆరితేరిరి . ప్రజల హితమునందే ఆసక్తి కలవారైరి . వారందరూ విజ్ఞాన ఘనులు ,సకల సద్గుణ సంపన్నులు . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment