Saturday, 31 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువదిమూడవసర్గ

                                      రామాయణము 

                                       అయోధ్యకాండ -అరువదిమూడవసర్గ    

తనయుడు దూరముఅగుటచే దశరథ మహారాజు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ,నిద్రాహారాలు మాని మాటిమాటికి రాముడిని కలవరిస్తూ ఉండెను . రాముడు అరణ్యమునకు వెళ్లిన 6వ రోజు రాత్రి తానూ చేసిన తప్పును గుర్తుతెచ్చుకుని కౌసల్యతో ఆ విషయమును ఈ విధముగా చెప్పనారంభించెను . 
"కౌశల్యా !ఎవరుచేసిన పాపఫలితమును వారు తప్పక అనుభవించవలసి ఉంటుంది . నేను చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను . నేను యవ్వనంలో వున్నప్పుడు, అప్పటికి మన వివాహము ఇంకా జరగలేదు . నేను యువరాజుగా ఉన్నాను . నన్ను చూసినవాఱందరు యువరాజు శబ్దవేది విద్యలో నిపుణుడు అని మెచ్చుకొనెడివారు . ఆ సమయములో ఒకరోజు రాత్రిపూట నేను నా శబ్దవేది విద్యను ప్రదర్శించవలెననే కోరికతో అరణ్యమునకు వేటకు వెళ్ళ్లాను . కటిక చీకటిలో పొదలమాటున కూర్చుని వున్నాను . అక్కడికి దగ్గరలో ఒక సరస్సు కలదు . పొదలమాటున కూర్చున్న నేను ,అణ్యములో సంచరించు జంతువుల అడుగుల చప్పుడు బట్టీ నా బాణములు ప్రయోగించి వాటిని చంపుతున్నాను . 
అప్పుడు అక్కడ దగ్గరలో వున్నా సరస్సులో నీటి చప్పుడు వినిపించింది . ఆ చప్పుడు ఏనుగు నీరుత్రాగిన చప్పుడుగా భ్రమించి విషసర్పము వంటి భయంకరమైన బాణమును ప్రయోగించాను . ఆ బాణము తగిలిన వెంటనే మనిషి అరుపులు "హా తల్లీ ,హా తండ్రీ !ఈ చీకటిలో ఎవడు నన్ను బాణముతో కొట్టెను ?నేను ఎవరికీ అన్యాయము చేసాను ?నేను చేసిన పాపమేమిటి ?"అని మాటలు వినిపించాయి ఆమాటలు విని నేను ఒక్క క్షణము అచేతుడను అయ్యాను .  ఆ క్షణము  లో నాకు ఏమిచేయాలో తోచలేదు . కాసేపటికి తేరుకుని వడివడిగా ఆ మాటలు వినపడిన ప్రదేశమునకు చేరుకొని చూడగా అక్కడ ఒక ముని కుమారుడు నా బాణము తగిలి రక్తపు మడుగులో పడి  వున్నాడు . అతడు నన్ను చూసి ఎవరునీవు ?నేను నీకు ఏమి అపకారము చేసాను . రాత్రిపూట కిరాతులు సైతము వేటాడారు అలాంటిది నీవు నన్ను ఎందుకు బాణముతో కొట్టావు ?మా తల్లితండ్రులు కాదు వృద్దులు గ్రుడ్డివారు వారి దాహము తీర్చుటకై ఇప్పుడు నేను ఇక్కడకు వచ్చాను . 
నేను చనిపోయిన విషయము కూడా వారికి చెప్పేది వారు లేరుకదా . నా మీదకల అపారమైన ప్రేమాభిమానముల కారణముగా వారును నేను మరణించిన పిదప మరణింతురు . నీవు ఒకే బాణమునకు మూడు ప్రాణములు తీసిన ఘనుడవు "అని పలుకగా నేను మిగుల దుఃఖిస్తూ "ఓ ముని కుమారా !నేను కావాలని నిన్ను కొట్టలేదు . ఏనుగు నీరు త్రాగుతున్నదని భ్రమించి బాణము వేసాను . నా దురదృష్టము కొద్దీ అది నీకు తగిలినది . అయ్యో !ఇప్పుడు నాకు భ్రహ్మహత్యా పాతకము చుట్టుకోబోనున్నది కాబోలు "అని నేను దుఃఖిస్తూ ఉండగా . ఆ ముని కుమారుడు 
"ఓ మాహారాజా !నీకు భ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనదు . నేను బ్ర్రాహ్మణుడను కాను వైస్యుని వలన శూద్ర స్త్రీకి జన్మించాను . ముని వృత్తిని అవలింభించి వృద్ధులైన తల్లితండ్రులకు సేవ చేస్తూ జీవనము గడుపుతున్నాను . ఇక్కడకు దగ్గరలోనే మా తండ్రి ఆశ్రమము కలదు వారు నాకోసము దాహముతో ఎదురుచూస్తుంటారు . కావున నీటిని తీసుకెళ్లి వారికి ఇవ్వు . నీవు చెప్పకపోయినా దివ్యదృష్టిద్వారా జరిగినది తెలుసుకుని నీ వంశాన్నే శపించగలరు కావున నీవే వెళ్లి జరిగిన వృత్తాన్తమును వివరించుము . ఈ భాద ఓర్వలేకున్నాను . కావున ఈ బాణము తీసి పుణ్యము కట్టుకొనుము" . అని మిక్కిలి దీనంగా నన్ను వేడుకొనెను . ఆ ముని కుమారుని బాధ చూడలేక నేను ఆ బాంమౌను తీసివేయగా ఆమెని కుమారుడు ప్రాణములను వదిలివేసినాడు . అతడిని చూసి నేను మిక్కిలి విషాదమునకు గురి అయ్యాను . 

రామాయణము అయోధ్యకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Friday, 30 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ

                                       రామాయణము 

                                అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ

రామ జననియైన కౌసల్య తనకు దుఃఖము తెచ్చిపెట్టిన ఆ మహారాజుపై కుద్దురాలై పలికిన పరుషవాక్యములు విని ఆ దశరధుడు మిగుల కృంగిపోయెను . "కౌశల్య పలుకులు సత్యములు చేయని దోషములు చేసితిని ఇపుడు చింతించి ప్రయోజనము ఏమున్నది ?అని అతడు చింతించసాగెను .   అలా చాలాసేపు ఏడ్చి ఈ పరిస్థితికి కారణమేమిటా ?అని ఆలోచిo చగా పూర్వము శబ్దబేది బాణము ద్వారా తెలియక తానూ చేసిన దుష్కృత్యము గుర్తుకు వచ్చెను ,  కౌశల్యతో  ఓ కౌశల్యా నీకు అంజలి ఘటించి వేడుకుంటున్నాను . నా పట్ల ప్రసన్నురాలివి కమ్ము . నేను కావాలని ఇదంతా చేయలేదు . జరిగిన దానికి నేనును జీవచ్ఛవంలా వున్నాను . ఈ పరిస్థితిలో నన్ను ఇలా తూలనాడడం న్యాయమా ?కైకేయిని కన్నెత్తి చూచుటకు కూడా నేను ఇష్టపడుటలేదు . నిన్ను దోసిలి ఒగ్గి అర్ధిస్తున్నాను . నన్ను క్షమించు "అని పలుకుతూ ఎడ్వానారంభించెను . 
ఆ మాటలు విన్న కౌసల్య తానూ చేసిన పనికి పశ్చాత్తాపపడి భర్త దోసిలి పట్టుకుని "భాదతో కోపముతో పిచ్చిదానినై ఎదో తెలియక మాట్లాడాను . కోపముతో వున్నా వారికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు అంటారు . కనుక నేను పలికిన పలుకులకు నన్ను క్షమించండి . రాముడు అరణ్యవాసమునకు వెళ్లి నేటికీ 5 దినములు పూర్తి అయినది . నాకు 5 సంవత్సరములు గడిచినట్లుగా వున్నది . "అని పలికెను . 
సూర్యాస్తమయము అయి రాత్రి అయినది కౌసల్య మాట్లాడిన మాటలకు దశరధుడు కొంత ఊరడిల్లి దశరధుడు     నిద్రించెను . 

రామాయణము అయోధ్యకాండ అరువది యొకటవసర్గ సమాప్తము . 



శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ

                                     రామాయణము 

                                అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ 

కౌసల్య దేవి ఏడుస్తూ తన భర్తతో "ఓ మహారాజా !రఘువంశుడైన దశరధుడు మిక్కిలి దయాళువు ,ఉదారపురుషుడు ,ప్రియభాషి అని ముల్లోకములలో మీ ఘానా కీర్తి వ్యాపించినది . కానీ  అడవులకు పంపి అంతకు మించి అపకీర్తి మూటకట్టుకున్నావు . సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖములపాలై సీతతోకూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ?యవ్వనము అడుగిడిన సీత మిక్కిలి సుకుమారురాలు . సుఖములను అనుభవించవలిసిన ఈ తరుణములో ఆ జనక నందని చలికి ,ఎండకు  ఎలా తట్టుకోగలరు ?ఆమె ఇక్కడ రుచికరమైన ఆహారమును తింటూ ఆహ్లాదంగా సంగీతము వింటూ ఉండేది . అక్కడ కందమూలాదులను తింటూ భయంకరమైన మృగములను గర్జన వింటూ ఎంత భయపడుతోందో ?
శ్రీరాముడు మెత్తని దిండ్లను తలకింద పెట్టుకుని నిద్రించేవాడు . ఇప్పుడు కఠిన శిలలపై తన చేతినే తలగడగా చేసుకుని ఎలా నిద్రించుచున్నాడో ?శ్రీరాముని ముఖము పౌర్ణమి చంద్రుడు వలె ఎంతో చూడముచ్చటగా ఉండును అటువంటి మోమును మల్లి చూడగలనో  లేదో ? హృదయము వజ్ర  సమానమయినది . కావుననే శ్రీరాముడు దూరమైనను ముక్కలుకాక ఇంకను సజీవంగా వున్నది . ఓ రాజా !నీవు కైకేయి చెప్పుడు మాటలు విని ఏ మాత్రము ముందువెనకాలు ఆలోచించక జాలిలేనివాడవై సీతారామలక్ష్మణులు అడవుల పాలు చేసితివి . ఆ చిన్నారులు నీకారణముగా ఇప్పుడు అరణ్యములో దీనులై తిరుగుచున్నారు . 
శ్రీరాముడు   పదునాలుగు సంవత్సరములు వనవాసము పూర్తిచేసి వచ్చిన పిమ్మట భరతుడు ,కైకేయి రామునికి రాజ్యము ఇచ్చునో లేదో ,లేక వారు ఇచ్చినా రాజ్యమును రాముడు స్వీకరించునో లేదో?భార్యకు భర్తే రక్షణ నీవు కైకేయి మోజులోపడి  నన్ను పట్టిచ్చికోనప్పుడు నాకు రాముడే దిక్కు ఇప్పుడు నాకు ఆదిక్కును కూడా లేకుండా చేసావు . అన్ని విధములుగా నన్ను మృతప్రాయను చేసావు . నీవు చేసిన పని ఫలితముగా కేవలము నీ ముద్దులాభార్య కైక ,ఆమె కుమారుడు భరతుడు మాత్రమే సంతోషముగా వున్నారు . "అని పలికెను . 
కౌశల్య మాటలు విన్న మహారాజు మిగుల దుఃఖితుడై రామా !రామా !అని కలవరించుతూ ఏడవసాగెను . 

రామాయణము అయోధ్యకాండ అరువది యొకటవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday, 29 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువదియవసర్గ

                                    రామాయణము 

                             అయోధ్యకాండ -అరువదియవసర్గ 

అనంతరము కౌశల్యా దేవి భూతము ఆవహించినదానివలె పదేపదే వణుకుచు ప్రాణములేనిదాని వలె నేలపై పది సుమంత్రునితో "ఓ సుమంత్రా !సీతారామలక్ష్మణులు లేని ఈ అయోధ్యలో క్షణమైనా ఉండలేను . కనుక నన్ను వారి వద్ద దింపుము . వెంటనే రధమును వెనుతిప్పుము "అని పలుకుతూ బిగ్గరగా రోదించనారంభించెను . ఆమె మాటలు విన్న సుమంత్రుడు 
అమ్మా !సీతారామలక్ష్మణుల గూర్చి నీవు బాధపడవలిసిన  అవసరము లేదు . లక్ష్మణుడు ఎల్లప్పుడూ అప్రమత్తుడై శ్రీరామ పాదసేవ చేయుచున్నాడు . సీతా దేవి తన మనసు నందు రాముని నిలుపుకుని ఆ అరణ్య ప్రాంతములో సైతము అంతఃపురము వలె సంతోషముగా (భర్త చెంత వున్న కారణముగా )తిరుగుచున్నది . ఆమె అచట ఏమాత్రము ఇబ్బంది పడుటలేదు . రామలక్ష్మణులు నారచీరలు జటలు ధరించి మహర్షుల మార్గమును అనుసరించుచున్నారు . అచట లభించు కందమూలాదులనే సంతోషముగా శ్వీకరించుతున్నారు . తండ్రిగారి సత్య ప్రతిజ్ఞ నెరవేర్చుతున్నారు . పితృవాక్య పరిపాలనకు రూపమైన శ్రీరాముని చరితము ఆచంద్రార్కము నిలిచి ఉండును . "అని పలికెను . 
సుమంత్రుడి  మాటలు విన్నను కౌశల్యాదేవి శోకము వీడక రామా !,లక్ష్మణా !,సీతా !అని కలవరించుచు శోకమునే ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ అరువదియవ సర్గసమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము అయోధ్యకాండ -ఏబది తొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                        అయోధ్యకాండ -ఏబది తొమ్మిదవసర్గ 

సుమంత్రుడు మాటలు విన్న దశరధుడు తిరిగి సుమంత్రుడితో "ఇంకనూ శ్రీరామలక్ష్మణుల గూర్చి నాకు తెలుపుము . రాముడు ని తప్ప ఏమి చూచుటకు నా మనసు అంగీకరించుటలేదు . రాముని గూర్చి తప్ప వేరే ఏ విషయములు వినుటకు నా వీనులు సిద్ధముగా లేవు . కావున నాకు ఇంకనూ వారి గుఱించి తెలుపుము " పలుకగా 
సుమంత్రుడు "ప్రభూ రామలక్ష్మణులు జటలను ,నారచీరలు ధరించి మునుల వలె వనములో ప్రవేశించిరి . లక్ష్మణుడు అప్రమత్తుడై తన అన్నావదినలకు నిరంతరమూ అప్రమత్తుడై సేవచేయుచు ఉండెను . ఆ అరణ్యములో ముందు లక్ష్మణుడు ,మధ్య సీత ,వెనుక రాముడు నడుస్తూ వెళ్లిరి . వారిని చూసి నేను చేసెడిది లేక తిరుగుముఖం పట్టితిని . నన్ను తన సేవకు రమ్మని  వన వాసులచేత కబురుచేస్తారేమో అని పెక్కు కాలము గుహుని వద్దే ఎదురు చూసితిని . ఆయన చిత్రకూటములో నివాసము ఏర్పరుచుకున్న విషయము తెలిసిన తరువాతనే నేను వెనుతిరిగి వచ్చితిని . రధాశ్వములు రాముడు లేని కారణముగా ముందుకు సాగుటకు మొరాయించినవి . అయోధ్యలోని జనులంతా దీనవధానులై కాళీ రధమును చూచుచుంటిరి . "అని పలుకగా 
దశరధుడు "దుష్టస్వభావము కల కైక ఈ విషయములో నన్ను మిక్కిలి వత్తిడి చేసెను . దీని గురించి ఆలోచనాపరులైన పెద్దలను కానీ ,మిత్రులను కానీ ,అమాత్యులను కానీ వేదశాస్త్ర పండితులను కానీ ,మేధావులైన పురప్రముఖులను కానీ సంప్రదించలేదు . స్త్రీ వ్యామోహములో పది తొందరపడి ఈ దుష్కార్యమునకు పాల్పడితిని . ఓ సుమంత్రా !ఇట్లు జరగవలెనని వున్నది కాబోలు . ఈ రాజ్యము ఇంకా నా ఏలుబడిలో ఉన్నట్లయితే నాకు రాముని చూడవలెనని వున్నది వెనువెంటనే రాముని ఇక్కడకు తీసుకురా .  కానీ పక్షములో నన్ను అక్కడకు తీసుకువెళ్ళు . నా బంగారు కొండ రాముడు ఇప్పుడు ఎక్కడఉన్నాడో ? ఎన్ని కష్టాలు పడుతున్నాడో ?శ్రీరాముని చూడకపోయినచే నేను చనిపోవుట తధ్యము . అని అపారమైన దుఃఖసాగరమున మునిగిన దశరధుడు కౌసల్యతో 
"కౌశల్యా శ్రీరాముడు దూరమగుటచే నేను శోక సాగరమున మునిగితిని . ఆ దుఃఖ సాగరము అంతకంతకూ పెరిగి నన్ను దహించివేయుచున్నది . నాకు ఈ క్షణమే సీతారామలక్ష్మణులను చూడవలెనని వున్నది . కానీ నా పాప ఫలితముగా ఆ భాగ్యము నాకు దొరకుటలేదు "అని విలపించుచు దశరధుడు మూర్చితుడయ్యెను . ఆయన మాటలు విన్న కౌశల్య ఎంతయో భయపడెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



 

Wednesday, 28 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                        రామాయణము 

                 అయోధ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

 కొంతసేపటికి తేరుకున్న దశరధ మహారాజు శ్రీరాముని గురించి తెలుసుకొనుటకు సుమంత్రుడిని తనవద్దకు పిలిపించి "సుమంత్రా !అల్లారుముద్దుగా పెరిగిన నా గారాల కుమారుడు శ్రీరాముడు ఆ ఘోరారణ్యములో ఎక్కడ ఆసీనుడవుతున్నాడు . ఎక్కడ పరుండుతున్నాడు . ఏ ఆహారము తింటున్నాడు . అరణ్యములోకి వెళ్లునప్పుడు శ్రీరాముడు ఏమి చెప్పెను ? జనకుని ముద్దుల కూతురు సీత ఏమన్నది ?లక్ష్మణుడు ఏమనెను ?"అని అడిగెను . 
అప్పుడు సుమంత్రుడు "ప్రభూ !శ్రీరాముడు అరణ్యములో బండరాళ్ళమీద ఆసీనుడవుతున్నాడు . నేలపై తృణశయ్యపై నిద్రిస్తున్నాడు . శ్రీరాముడు నన్ను వీడి వెళ్లునప్పుడు మీకు సాష్టాంగ నమస్కారము చేశానని చెప్పమన్నాడు . తల్లులను కుశలమడమన్నాడు . భరతుడిని రాజ్యభారం జాగ్రత్తగా వహించి తల్లులను తండ్రిని జాగ్రత్తగా చూసుకొనమని చెప్పమన్నాడు . ఇంకనూ ధర్మబద్ధముగా నివసిస్తానన్నానని చెప్పు అని పలికెను . ఇక విదేహానందని ఏమి మాట్లాడక భర్తను చూచి కన్నీటిపర్యంతమయ్యెను . లక్ష్మణుడు మాత్రము మహారాజు తన మాటకు తిరుగులేదనా ఈ నిర్ణయము తీసుకొనెను . ఈ నిర్ణయము నేను అంగీకరింపను . ఇది అధర్మము . మహారాజు కైకేయి మోహములో పడి కన్నకొడుకుని అడవులపాలు చేసెను . ఇకనుండి రాముడే నాకు తండ్రి సమస్తము అని పలికెను . "
అని సుమంత్రుడు దశరధ మహారాజుతో చెప్పెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ -ఏబదియేడవసర్గ

                             రామాయణము 

                        అయోధ్యకాండ -ఏబదియేడవసర్గ 

సీతారామలక్ష్మణులు గంగను దాటి వారు కనుమరుగయ్యేవరకు సుమంత్రుడు ,గుహుడు చూస్తూనే ఉండి ,వారు కనుమరుగయిన  పిదపవారిరువురు గుహుని ఇంటికి చేరి సీతారాంలక్ష్మణుల గురించి చర్చించుకొనిరి . సీతారామలక్ష్మణులు గంగను దాటుట ,భారద్వాజమాశ్రమాన్ని దర్శించుట ,పిదప చిత్రకూటము చేరుకొనుట మున్నగు విషయములన్నీ గుహుడు తన దూతల ద్వారా తెలుసుకొనెను . గుహుని ద్వారా ఆ సమాచారాన్ని సుమంత్రుడు తెలుసుకుని అయోధ్య కు తిరుగు ప్రయాణమయ్యెను . 
రాముడు లేక కాలి రధముతో వెళ్లిన తనను అయోధ్యావాసులు రాముడేడి అని అడిగితే ఏమి సమాధానము చెప్పగలను? అని తలచుకుని మిక్కిలి చింతించుచు 3 రోజులకు అయోధ్యకు చేరెను . రాముడు లేని అయోధ్య శూన్యములా కనిపించెను . శూన్యముగా వున్న రధమును చూసి ప్రజలు రాముడెక్కడ ?రాముడెక్కడ ?అని అడుగుతూ రధము వెంట పరుగులు తీయగా సుమంత్రుడు "నేను తనవెంట వస్తానన్నా వినకుండా అయోధ్యకు వెళ్ళు అని ఆ స్వామి పదేపదే చెప్పుటచే తప్పక నేను తిరిగి వచ్చాను . వారు గంగను దాటి ఆవలి తీరమునకు చేరిరి "అని చెప్పెను . 
సుమంత్రుడు మాటలు విన్న ప్రజలు మిక్కిలి దుఃఖితులై భోరుభోరున ఎడ్వసాగిరి . వారి ఆక్రన్దనలు విని తట్టుకోలేక సుమంత్రుడు వేగముగా రధమును నడిపి దశరధుని అంతః పురములో ప్రవేశించెను . అక్కడ కూడా అందరూ దీనవధనులై ఉండిరి . దశరధ మహారాజు మిక్కిలి కృంగిపోయి ఉండెను . సుమంత్రుడు ఆయనను చేరి జరిగిన వృత్తాన్తమును ఆయనకు వివరించెను . ఆ మాటలు విన్న దశరధుడు ఏడుస్తూ నేలపై పడి స్పృహ కోల్పోయెను . కౌశల్య మిగిలిన స్త్రీలతో కలసి దశరధుని లేపి పరుండబెట్టెను . కొంతసేపటికి తేరుకున్న దశరధుడు దుఃఖ భారంతో ఏమి మాట్లాడలేకపోయెను . అది చూసిన కౌశల్యా దేవి" మహారాజా !మీరు కైకేయి కోసము రాముని అడవులకు పంపారు . అతడు అక్కడ కష్టపడుతుంటాడు మీరు మీ ముద్దుల భార్యతో ఇక్కడ హాయిగా వుండండి . కనీసం రాముడు ఎలావున్నాడని అడగడానికి కూడా మీ నోరు రావడంలేదా ?కైకేయి అంటే మీకు భయము అనుకోవడానికి ఇక్కడ కైకేయి లేదుకదా . కనుక మీరు నిర్భయముగా సుమంత్రుడితో మాట్లాడవచ్చును . "
ఆ మాటలు విన్న దశరధుడు నేలపై పది ఏడవసాగెను . అది చూసిన అంతః పుర స్త్రీలు బిగ్గరగా ఎడ్వాసాగిరి . వారి ఏడ్పులు విని అయోధ్య ప్రజలుసైతం ఎడ్వాసాగిరి . ఆ విధముగా ఆ క్షణమున సమస్త అయోధ్య ఏడ్పులతో నిండిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .