Wednesday 28 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదియేడవసర్గ

                             రామాయణము 

                        అయోధ్యకాండ -ఏబదియేడవసర్గ 

సీతారామలక్ష్మణులు గంగను దాటి వారు కనుమరుగయ్యేవరకు సుమంత్రుడు ,గుహుడు చూస్తూనే ఉండి ,వారు కనుమరుగయిన  పిదపవారిరువురు గుహుని ఇంటికి చేరి సీతారాంలక్ష్మణుల గురించి చర్చించుకొనిరి . సీతారామలక్ష్మణులు గంగను దాటుట ,భారద్వాజమాశ్రమాన్ని దర్శించుట ,పిదప చిత్రకూటము చేరుకొనుట మున్నగు విషయములన్నీ గుహుడు తన దూతల ద్వారా తెలుసుకొనెను . గుహుని ద్వారా ఆ సమాచారాన్ని సుమంత్రుడు తెలుసుకుని అయోధ్య కు తిరుగు ప్రయాణమయ్యెను . 
రాముడు లేక కాలి రధముతో వెళ్లిన తనను అయోధ్యావాసులు రాముడేడి అని అడిగితే ఏమి సమాధానము చెప్పగలను? అని తలచుకుని మిక్కిలి చింతించుచు 3 రోజులకు అయోధ్యకు చేరెను . రాముడు లేని అయోధ్య శూన్యములా కనిపించెను . శూన్యముగా వున్న రధమును చూసి ప్రజలు రాముడెక్కడ ?రాముడెక్కడ ?అని అడుగుతూ రధము వెంట పరుగులు తీయగా సుమంత్రుడు "నేను తనవెంట వస్తానన్నా వినకుండా అయోధ్యకు వెళ్ళు అని ఆ స్వామి పదేపదే చెప్పుటచే తప్పక నేను తిరిగి వచ్చాను . వారు గంగను దాటి ఆవలి తీరమునకు చేరిరి "అని చెప్పెను . 
సుమంత్రుడు మాటలు విన్న ప్రజలు మిక్కిలి దుఃఖితులై భోరుభోరున ఎడ్వసాగిరి . వారి ఆక్రన్దనలు విని తట్టుకోలేక సుమంత్రుడు వేగముగా రధమును నడిపి దశరధుని అంతః పురములో ప్రవేశించెను . అక్కడ కూడా అందరూ దీనవధనులై ఉండిరి . దశరధ మహారాజు మిక్కిలి కృంగిపోయి ఉండెను . సుమంత్రుడు ఆయనను చేరి జరిగిన వృత్తాన్తమును ఆయనకు వివరించెను . ఆ మాటలు విన్న దశరధుడు ఏడుస్తూ నేలపై పడి స్పృహ కోల్పోయెను . కౌశల్య మిగిలిన స్త్రీలతో కలసి దశరధుని లేపి పరుండబెట్టెను . కొంతసేపటికి తేరుకున్న దశరధుడు దుఃఖ భారంతో ఏమి మాట్లాడలేకపోయెను . అది చూసిన కౌశల్యా దేవి" మహారాజా !మీరు కైకేయి కోసము రాముని అడవులకు పంపారు . అతడు అక్కడ కష్టపడుతుంటాడు మీరు మీ ముద్దుల భార్యతో ఇక్కడ హాయిగా వుండండి . కనీసం రాముడు ఎలావున్నాడని అడగడానికి కూడా మీ నోరు రావడంలేదా ?కైకేయి అంటే మీకు భయము అనుకోవడానికి ఇక్కడ కైకేయి లేదుకదా . కనుక మీరు నిర్భయముగా సుమంత్రుడితో మాట్లాడవచ్చును . "
ఆ మాటలు విన్న దశరధుడు నేలపై పది ఏడవసాగెను . అది చూసిన అంతః పుర స్త్రీలు బిగ్గరగా ఎడ్వాసాగిరి . వారి ఏడ్పులు విని అయోధ్య ప్రజలుసైతం ఎడ్వాసాగిరి . ఆ విధముగా ఆ క్షణమున సమస్త అయోధ్య ఏడ్పులతో నిండిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


 






 

No comments:

Post a Comment