Tuesday, 31 January 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది అయిదవసర్గ

                                         రామాయణము 

                                        అయోధ్యకాండ -ఎనుబది అయిదవసర్గ 

నిషాద రాజైన గుహుడు ఆ విధముగా పలికిన పిమ్మట ,భరతుడు నిషాద రాజుతో "సోదరా !నీవు మా అన్న అగు శ్రీరామునికి పరమ మిత్రుడవు ,మాయీ అపారసేనకు ఆతిధ్యము ఇవ్వదలిచితివి చాలా సంతోషము . ఆతిధ్యము ఇచ్చినట్లే భావించుము .  ఈ దండకారణ్యం లో భారద్వాజముని ఆశ్రమమునకు దారి తెలుపుము . "అని పలికెను . 
నిషాద రాజు గుహుడు "నేను నా సేన లోకల శ్రేష్టమైన విలుకాళ్లు మీకు తోడుగా వచ్చి ,దగ్గర ఉండి మిమ్ము ఆశ్రమమునకు చేర్చెదను . స్వామీ !నాదొక సందేహము . మీ అన్న అగు శ్రీరాముడు ఎవ్వరికిని కీడు తలపెట్టనివాడు . అట్టి వానిని చూచుటకు ఇంత సైన్యముతో వెళ్ళవలసిన పని ఏమున్నది ?దయతో నా  సందేహమును తీర్చుము "అని పలికెను . 
ఆ మాటలు విన్న భరతుడు తనకు రాజ్యకాంక్ష ఏమాత్రము లేదని ,తన అన్నను తిరిగి రాజ్యమునకు తీసుకు వచ్చుటకు మాత్రమే వెళ్తున్నానని స్పష్టం చేసెను . ఆ మాటలు విన్న గుహుడు మిక్కిలి సంతోషించెను . భరతుడు తన సేనను విశ్రమించుటకు ఆజ్ఞను ఇచ్చెను . పిమ్మట అతడు తన గుడారములో చేరి శ్రీరామునకై చింతించుచు ఉండెను . గుహుడు అతడిని ఓదార్చెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదియైదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Monday, 30 January 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది నాల్గవసర్గ

                                              రామాయణము 

                                            అయోధ్యకాండ -ఎనుబది నాల్గవసర్గ 

ఆ ప్రాంతమునకు రాజైన గుహుడు గంగా తీరమున కల భరతుని సేనను చూచి తన అనుచరులతో " ఈ సమీపముననే ఉన్న మహా సేనను చూడుడు ఇంతటి మహా సేనను నేను మనసున సైతము ఊహించలేదు . ఇది ఓ మహా సముద్రము వలె వున్నది . రాధములపై ఎగురుచున్న ఆ కోవిదారధ్వజము (ఎఱ్ఱకాంచనము )ఇక్ష్వాకు ప్రభువుల చిహ్నము . దీనిని బట్టీ ఆ రధమును ఉన్న వాడు నిశ్చయముగా భరతుడే . అతడు దుర్భుద్ధితో ఇటు వచ్చియుండును . దశరథ మహారాజు యొక్క రాజ్యలక్ష్మి సుసంపన్నమైనది అది ఇతరులకు దుర్లభమయినది . దానిని కైకేయి సుతుడు శాశ్వతముగా హస్తగతము చేసుకోనదలిచినట్లున్నాడు . అందులకు భరతుడు శ్రీరాముని సన్నిహితులమైన మనల్ని భందించుటకాని ,చంపుట కానీ చేయును . పిమ్మట అతడు రాముని అడ్డుని కూడా శాశ్వతముగా తొలగించుకోనున్నాడు కాబోలు . ఏదేమయినా నేను అతడి వద్దకు వెళ్లి విషయము సావధానంగా కనుక్కొని వత్తును . మన సేనను యుద్ధమునకు సిద్దము కమ్మని తెలపండి "
ఆవిధముగా పలికి సేనలకు యుద్ధమునకు సిద్దము కమ్మని ఆజ్ఞను ఇచ్చి విషయము తెలుసుకొనుటకు పండ్లు ,తేనే మున్నగు వస్తువులను తీసుకుని భరతుని వద్దకు వెళ్లి ,భరతుని అనుమతితో గుడారములోకి ప్రవేశించి తానూ తెచ్చిన పండ్లు ,తేనెలు వినయముతో సమర్పించెను . పిమ్మట భరతుని తన ఆతిధ్యము శ్వీకరించి ఈ రాత్రికి తన ఇంట బస చేయవలసినదిగా ప్రార్ధించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది నాల్గవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ _ఎనుబదిమూడవసర్గ సమాప్తము .

                                   రామాయణము 

                             అయోధ్యకాండ _ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

భరతుడు ప్రాతః కాలమునే లేచి శ్రీరాముని చూడవలెననే కోరికతో ఉత్తమమయిన రథములను అధిరోహించి త్వరత్వరగా బయలుదేరెను . మంత్రులు పురోహితులు మున్నగువారు మేలుజాతి గుఱ్ఱములు తో కూడిన రధములపై భరతునికి ముందు భాగమున ప్రయాణించుచుండిరి . 9 వేల ఏనుగులు భరతుని అనుసరించెను . వివిధాయుధములతో విలుకాండ్రు అరువదివేల రధములతో భరతుని అనుసరించిరి . ఇంకనూ లక్షమంది అశ్వికులు తమ గుఱ్ఱములపై భరతుని వెంట సాగిపోయిరి . కౌశల్య ,సుమిత్ర ,కైకేయి సైతము రామలక్ష్మణులను చూడవలెననే కోరికతో ఆ యాత్రలో పాల్గొనిరి . పిదప బ్రాహ్మణాది త్రివర్ణముల వారు ,వివిధ వృత్తులవారు రామలక్ష్మణులను చూచు వేడుకతో భరతుని వెంట సాగిపోవుచు ,ఆ సోదరుల అపూర్వ గాధలను తమలో తాము ప్రస్తావించుకొనుచు ఆనందమును పొంగిపోవుచుండిరి . 
ఆవిధముగా అందరూ సంతోషముతో భరతుని అనుసరించి ముందుకు సాగుచుండిరి . శృంగిబేరి పురము చేరి గంగానదీ తీరమున విశ్రాంతి తీసుకొనుటకు సేనలకు ,తనతో వచ్చిన జనులకు భరతుడు  ఆదేశము ఇచ్చెను . ఆ గంగా జలములలో దశరధుని తర్పణములు విడిచి ,పిదప తన స్థావరంలో విశ్రమించి ,రాముని తిరిగి రాజ్యమునకు తెచ్చుటకు ఉపాయములు ఆలోచించుచు అచట వసించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది మూడవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday, 29 January 2017

రామాయణము అయోధ్యకాండ - ఎనుబది రెండవసర్గ

                             రామాయణము 

                      అయోధ్యకాండ      -      ఎనుబది రెండవసర్గ 

వశిష్టుని ఆజ్ఞను అనుసరించి అచటికి వచ్చిన వారందరితో ఆ సభ నిండుగా ఉండెను . అపుడు వశిష్ఠుడు భరతునితో "నాయనా !భారతా !మీ తండ్రి దశరధ మహారాజు ధర్మబద్ధముగా ఈ కోశలదేశమును పెద్దకాలము పాలించెను . ధనధాన్య సంపదలతో తులతూగుచున్న ఈ రాజ్యమును మీ తండ్రి నీకు అప్పగించారు . మీ అన్న అగు శ్రీరాముడు సైతము దీనిని అంగీకరించారు . కావున నీవు వెంటనే ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడవు కమ్ము . రాజ్యమును రక్షించుము "అని పలికిరి . 
ఆ మాటలు విన్న భరతుడు మిక్కిలి బాధపడుతూ మనసులోనే శ్రీరాముని శరణు వేడుకుని ,వశిష్టునితో "ఓ గురువర్యా !శ్రీరాముడు బ్రహ్మచర్యా నిష్టాగరిష్టుడు ,సకల విద్యలలో ఆరితేరినవాడు ఎల్లపుడు ధర్మమును ఆచరించినవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని రాజ్యమును పొందుటకు నావంటివాడు ఎట్లు అర్హుడు అగును . ఓ మహాముని ఈ రాజ్యము శ్రీరామునిది నేనును ఆయన వాడను . శ్రీరాముడు నా కంటే వయసులో పెద్దవాడు . అంతేకాదు గుణములచేతనూ శ్రేష్ఠుడు .,ఉదాత్తుడు కనుక ఈ రాజ్యమును పాలించుటకు దశరథ మహారాజు వలె అతడే అర్హుడు . 
శ్రీరాముని రాజ్యము నేను శ్వీకరించుట మహా పాపము అట్టి పాపము చేసిన యెడల నాకు నిష్కృతి ఉండదు . నా తల్లి చేసిన ఈ పాపకృత్యమును నేను ఎప్పటికి అంగీకరింపను . ఈ రాజ్యమును రాముడే పాలించగలడు "అని పలికెను . 
ఆ మాటలు విని సభాసదులందరూ ఆనందాశ్రువులు రాల్చిరి . అంతట భరతుడు సభాసదులను ఉద్దేశించి "శ్రీరాముని వద్దకు వెళ్లి ఆయనను రాజ్యమునకు మరల్చదలిచితిని . తమరు ఎల్లరు నాతొ వనములకు రండు . ఇంతక ముందే నేను పంపిన సేనలు వాన దారులను శుభ్రపరచి అచట విడుదులను ఏర్పాటు చేసినవి . "అని పలికి
 సుమంత్రునితో "ఓ సుమంత్రా !మీరు వెంటనే అందరకూ వనములకు బయలుదేరమని నా ఆజ్ఞగా తెలుపుము . చతురంగబలమును సిద్దము చేయుము మనము రేపే బయలుదేరి వనములకు వెళ్ళెదము . "అని పలికెను . 
భరతుడి ఆజ్ఞను వెంటనే సుమంత్రుడు పాటించెను . ప్రతి గృహములోను పురుషులు వనములకు శ్రీరాముని దగ్గరకు వెళ్ళుటకు సిద్ధమయ్యెను . వేగముగా వెళ్ళు అశ్వములు ,రథములు ,కాల్బలము సిద్ధమయ్యెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది రెండవ సర్గసమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము అయోధ్యకాండ -ఎనుబదియొకటవసర్గ

                            రామాయణము 

                                 అయోధ్యకాండ -ఎనుబదియొకటవసర్గ 

ఆ విధముగా భరతుడి మాటలకు అందరూ సంతోషించిరి . ఆ రాత్రి భరతుడు జరిగినది తలచుకుంటూ బాధతో గడిపెను . తెల్లవారిన పిదప భరతుడిని నిద్రలేపుటకు స్తుతి పాఠకులు ,వందిమాగధులు ,మంగళకరమైన స్త్రోత్రములతో భరతుడిని స్తుతించుట ఆరంభించిరి . బంగారు వాద దండముతో జాములను సూచించు గారాలను మ్రోగించిరి . వందలకొలది శంఖములను పూరించిరి . వివిధ వాద్యముల ద్వారా మధుర ధ్వనులను కావించిరి . 
భరతుడు మేల్కొని నేను రాజుని కాను అని పలుకుచు ఆ వాద్యములు అన్నిటిని ఆపివేసెను . పిదప శత్రుఘ్నుడితో "నా తల్లి కైకేయి వలన ఎంతటి మహాపరాధము జరిగినదో కదా . ఎవ్వరిని మాటవరసకు కూడా బాధించి ఎరుగని రాముడు అడవులకు వెళ్ళినాడు . తండ్రి మరణించాడు . ఇప్పుడీ రాజ్యము చుక్కాని లేని నావ వలె విలవిలలాడుచున్నది . "అని పలుకుతూ రోధించెను . భరతుడి ఏడ్పు ,మాటలు విన్న అంతః పుర స్త్రీలు సైతము ఎడ్వాసాగిరి . 
భరతుడు ఇట్లు ఏడ్చుచుండగా రాజధర్మములు బాగుగా ఎరిగిన వశిష్ఠుడు తన శిష్యులతో కూడి సభాభవనములోకి ప్రవేశించెను . ఆ మహర్షి సముచితాసనము పై కూర్చుండి దూతలతో ఇలా ఆజ్ఞాపించెను . "మీరు కడుజాగరూకులై బ్ర్రాహ్మణోత్తములను ,క్షత్రియ ప్రముఖులను ,వైశ్యప్రవరులను ,భరతుడిని ,శత్రుఘ్నుడిని భరతుడి మేనేమామ అగు యధాజిత్తుని సుమంత్రుని ,ఇంకనూ మన శ్రేయోభిలాషులైన పురజనులను ఈ సభకు తీసుకురండు . "
దూతల కబురు విని వారందరూ అశ్వముల మీద రథముల మీద అచటికి ఏతెంచిరి . అప్పుడా ఆ సభాభవనము దశరధుడు బతికి వున్నప్పుడు వలె జనులతో కళకళలాడెను . 

          రామాయణము అయోధ్యకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము అయోధ్యకాండ -ఎనుబదియవసర్గ

                                                      రామాయణము 

                                                     అయోధ్యకాండ -ఎనుబదియవసర్గ 

భరతుడి ఆజ్ఞను అనుసరించి అడవి మార్గమును శుభ్రపరచి ,సున్నము ఇసుకతో గచ్చు చేసెను . అడ్డుగా వున్న మూళ్ళ మొక్కలని తొలగించి ,మొక్కలు లేని చోట మొక్కలు నాటెను . మరియు విశ్రాంతి గృహములను ఏర్పాటు చేసెను . ఆ గృహముల చుట్టూ కందకములు త్రవ్వబడెను . ఆ విధముగా ఏర్పాటు చేయబడిన రాజమార్గము చూచుటకు ఎంతో శోభాయమానంగా ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదియవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Saturday, 28 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బది తొమ్మిదవసర్గ

                                రామాయణము 

               అయోధ్యకాండ -డెబ్బది తొమ్మిదవసర్గ                         

దశరథ మహారాజు మరణించిన పదునాల్గవ రోజు ప్రభాత వేళ రాజాకార్యములను నిర్వహించునట్టి    మంత్రివర్యులు ఒక చోట సమావేశమై భరతునితో "  మహా యశస్వి అయిన ఓ రాకుమారా !మనకు  మహారాజు అయిన దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైన ,శ్రీరాముని ,బలశాలి అయిన లక్ష్మణుని అడవులకు పంపి ,తాను స్వర్గస్తుడాయెను . ఇప్పుడు ఈ రాజ్యమునకు రాజు ఎవ్వరు లేరు . కనుక ఈ రాజ్యాధికారమును మీరే శ్వీకరింపవలెను . మహారాజు స్వయముగా రామలక్ష్మణులను అరణ్యములకు పంపి రాజ్యాధికారమును నీకు ఏర్పాటు చేసెను . కనుక నీవు రాజు అగుట న్యాయసమ్మతమే . కావున వెంటనే పట్టాభిషిక్తుడవయి మమ్ము ,ఈ రాజ్య ప్రజలను రక్షింపుము . " అని పలికెను . 
వారి మాటలకు భరతుడు "జ్యేష్ఠుడకు రాజ్యము అప్పగించుట పరంపరగా వచ్చుచున్న ఆచారము . కనుక అనుభవజ్ఞులు ,పెద్దలు అయిన మీరు ఇటుల మాట్లాడుట ఏమాత్రము తగదు . మా సోదరులలో పెద్దవాడైన శ్రీరామునికే రాజ్యమును అప్పగించెదను . ఆయనకు మారుగా నేను వనవాసము చేసెదను . చతురంగ బలముతో కూడిన సేనను సిద్దపరుచుము . నేను ఈ క్షణమే బయలుదేరి వెళ్లి ,మా అన్నను తీసుకువచ్చెదను . పట్టాభిషేకమునకు కావలిసిన సమస్త వస్తువులను తీసుకువెళ్లి అక్కడనే రామునికి పట్టాభిషేకము చేసి ఆయనను రాజుగా తీసుకువచ్చెదను . 
ఈ కైకేయి పేరుకు మాత్రమే నా తల్లి ఈమెలో మాతృ భావము ఏమాత్రము లేదు . ఈమె కోరికను నేను నెరవేరనివ్వను . ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజు కాగలడు . నేను మాత్రము కారడవులలో నివసించెదను . శిల్పులు ముందుగా వెళ్లి ఎగుడుదిగుడుగా వుండు బాటలు సరిచేయవలెను . అడవుల బాటలు బాగుగా ఎరిగిన వారు మనకు రక్షణగా మనతో వత్తురు "అని పలికెను . 

 భరతుడి మాటలు విని ఆ ముని శ్రేష్ఠులు అందరూ మిక్కిలి సంతోషించిరి . వారి కనుల వెంట ఆనంద భాష్పములు రాలినవి . వారి మదిలోని దుఃఖము పటాపంచలయ్యెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది తొమ్మిదవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .