Sunday 29 January 2017

రామాయణము అయోధ్యకాండ - ఎనుబది రెండవసర్గ

                             రామాయణము 

                      అయోధ్యకాండ      -      ఎనుబది రెండవసర్గ 

వశిష్టుని ఆజ్ఞను అనుసరించి అచటికి వచ్చిన వారందరితో ఆ సభ నిండుగా ఉండెను . అపుడు వశిష్ఠుడు భరతునితో "నాయనా !భారతా !మీ తండ్రి దశరధ మహారాజు ధర్మబద్ధముగా ఈ కోశలదేశమును పెద్దకాలము పాలించెను . ధనధాన్య సంపదలతో తులతూగుచున్న ఈ రాజ్యమును మీ తండ్రి నీకు అప్పగించారు . మీ అన్న అగు శ్రీరాముడు సైతము దీనిని అంగీకరించారు . కావున నీవు వెంటనే ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడవు కమ్ము . రాజ్యమును రక్షించుము "అని పలికిరి . 
ఆ మాటలు విన్న భరతుడు మిక్కిలి బాధపడుతూ మనసులోనే శ్రీరాముని శరణు వేడుకుని ,వశిష్టునితో "ఓ గురువర్యా !శ్రీరాముడు బ్రహ్మచర్యా నిష్టాగరిష్టుడు ,సకల విద్యలలో ఆరితేరినవాడు ఎల్లపుడు ధర్మమును ఆచరించినవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని రాజ్యమును పొందుటకు నావంటివాడు ఎట్లు అర్హుడు అగును . ఓ మహాముని ఈ రాజ్యము శ్రీరామునిది నేనును ఆయన వాడను . శ్రీరాముడు నా కంటే వయసులో పెద్దవాడు . అంతేకాదు గుణములచేతనూ శ్రేష్ఠుడు .,ఉదాత్తుడు కనుక ఈ రాజ్యమును పాలించుటకు దశరథ మహారాజు వలె అతడే అర్హుడు . 
శ్రీరాముని రాజ్యము నేను శ్వీకరించుట మహా పాపము అట్టి పాపము చేసిన యెడల నాకు నిష్కృతి ఉండదు . నా తల్లి చేసిన ఈ పాపకృత్యమును నేను ఎప్పటికి అంగీకరింపను . ఈ రాజ్యమును రాముడే పాలించగలడు "అని పలికెను . 
ఆ మాటలు విని సభాసదులందరూ ఆనందాశ్రువులు రాల్చిరి . అంతట భరతుడు సభాసదులను ఉద్దేశించి "శ్రీరాముని వద్దకు వెళ్లి ఆయనను రాజ్యమునకు మరల్చదలిచితిని . తమరు ఎల్లరు నాతొ వనములకు రండు . ఇంతక ముందే నేను పంపిన సేనలు వాన దారులను శుభ్రపరచి అచట విడుదులను ఏర్పాటు చేసినవి . "అని పలికి
 సుమంత్రునితో "ఓ సుమంత్రా !మీరు వెంటనే అందరకూ వనములకు బయలుదేరమని నా ఆజ్ఞగా తెలుపుము . చతురంగబలమును సిద్దము చేయుము మనము రేపే బయలుదేరి వనములకు వెళ్ళెదము . "అని పలికెను . 
భరతుడి ఆజ్ఞను వెంటనే సుమంత్రుడు పాటించెను . ప్రతి గృహములోను పురుషులు వనములకు శ్రీరాముని దగ్గరకు వెళ్ళుటకు సిద్ధమయ్యెను . వేగముగా వెళ్ళు అశ్వములు ,రథములు ,కాల్బలము సిద్ధమయ్యెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది రెండవ సర్గసమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment