Saturday 28 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బది తొమ్మిదవసర్గ

                                రామాయణము 

               అయోధ్యకాండ -డెబ్బది తొమ్మిదవసర్గ                         

దశరథ మహారాజు మరణించిన పదునాల్గవ రోజు ప్రభాత వేళ రాజాకార్యములను నిర్వహించునట్టి    మంత్రివర్యులు ఒక చోట సమావేశమై భరతునితో "  మహా యశస్వి అయిన ఓ రాకుమారా !మనకు  మహారాజు అయిన దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైన ,శ్రీరాముని ,బలశాలి అయిన లక్ష్మణుని అడవులకు పంపి ,తాను స్వర్గస్తుడాయెను . ఇప్పుడు ఈ రాజ్యమునకు రాజు ఎవ్వరు లేరు . కనుక ఈ రాజ్యాధికారమును మీరే శ్వీకరింపవలెను . మహారాజు స్వయముగా రామలక్ష్మణులను అరణ్యములకు పంపి రాజ్యాధికారమును నీకు ఏర్పాటు చేసెను . కనుక నీవు రాజు అగుట న్యాయసమ్మతమే . కావున వెంటనే పట్టాభిషిక్తుడవయి మమ్ము ,ఈ రాజ్య ప్రజలను రక్షింపుము . " అని పలికెను . 
వారి మాటలకు భరతుడు "జ్యేష్ఠుడకు రాజ్యము అప్పగించుట పరంపరగా వచ్చుచున్న ఆచారము . కనుక అనుభవజ్ఞులు ,పెద్దలు అయిన మీరు ఇటుల మాట్లాడుట ఏమాత్రము తగదు . మా సోదరులలో పెద్దవాడైన శ్రీరామునికే రాజ్యమును అప్పగించెదను . ఆయనకు మారుగా నేను వనవాసము చేసెదను . చతురంగ బలముతో కూడిన సేనను సిద్దపరుచుము . నేను ఈ క్షణమే బయలుదేరి వెళ్లి ,మా అన్నను తీసుకువచ్చెదను . పట్టాభిషేకమునకు కావలిసిన సమస్త వస్తువులను తీసుకువెళ్లి అక్కడనే రామునికి పట్టాభిషేకము చేసి ఆయనను రాజుగా తీసుకువచ్చెదను . 
ఈ కైకేయి పేరుకు మాత్రమే నా తల్లి ఈమెలో మాతృ భావము ఏమాత్రము లేదు . ఈమె కోరికను నేను నెరవేరనివ్వను . ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజు కాగలడు . నేను మాత్రము కారడవులలో నివసించెదను . శిల్పులు ముందుగా వెళ్లి ఎగుడుదిగుడుగా వుండు బాటలు సరిచేయవలెను . అడవుల బాటలు బాగుగా ఎరిగిన వారు మనకు రక్షణగా మనతో వత్తురు "అని పలికెను . 

 భరతుడి మాటలు విని ఆ ముని శ్రేష్ఠులు అందరూ మిక్కిలి సంతోషించిరి . వారి కనుల వెంట ఆనంద భాష్పములు రాలినవి . వారి మదిలోని దుఃఖము పటాపంచలయ్యెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది తొమ్మిదవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









            

No comments:

Post a Comment