Sunday 29 January 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబదియొకటవసర్గ

                            రామాయణము 

                                 అయోధ్యకాండ -ఎనుబదియొకటవసర్గ 

ఆ విధముగా భరతుడి మాటలకు అందరూ సంతోషించిరి . ఆ రాత్రి భరతుడు జరిగినది తలచుకుంటూ బాధతో గడిపెను . తెల్లవారిన పిదప భరతుడిని నిద్రలేపుటకు స్తుతి పాఠకులు ,వందిమాగధులు ,మంగళకరమైన స్త్రోత్రములతో భరతుడిని స్తుతించుట ఆరంభించిరి . బంగారు వాద దండముతో జాములను సూచించు గారాలను మ్రోగించిరి . వందలకొలది శంఖములను పూరించిరి . వివిధ వాద్యముల ద్వారా మధుర ధ్వనులను కావించిరి . 
భరతుడు మేల్కొని నేను రాజుని కాను అని పలుకుచు ఆ వాద్యములు అన్నిటిని ఆపివేసెను . పిదప శత్రుఘ్నుడితో "నా తల్లి కైకేయి వలన ఎంతటి మహాపరాధము జరిగినదో కదా . ఎవ్వరిని మాటవరసకు కూడా బాధించి ఎరుగని రాముడు అడవులకు వెళ్ళినాడు . తండ్రి మరణించాడు . ఇప్పుడీ రాజ్యము చుక్కాని లేని నావ వలె విలవిలలాడుచున్నది . "అని పలుకుతూ రోధించెను . భరతుడి ఏడ్పు ,మాటలు విన్న అంతః పుర స్త్రీలు సైతము ఎడ్వాసాగిరి . 
భరతుడు ఇట్లు ఏడ్చుచుండగా రాజధర్మములు బాగుగా ఎరిగిన వశిష్ఠుడు తన శిష్యులతో కూడి సభాభవనములోకి ప్రవేశించెను . ఆ మహర్షి సముచితాసనము పై కూర్చుండి దూతలతో ఇలా ఆజ్ఞాపించెను . "మీరు కడుజాగరూకులై బ్ర్రాహ్మణోత్తములను ,క్షత్రియ ప్రముఖులను ,వైశ్యప్రవరులను ,భరతుడిని ,శత్రుఘ్నుడిని భరతుడి మేనేమామ అగు యధాజిత్తుని సుమంత్రుని ,ఇంకనూ మన శ్రేయోభిలాషులైన పురజనులను ఈ సభకు తీసుకురండు . "
దూతల కబురు విని వారందరూ అశ్వముల మీద రథముల మీద అచటికి ఏతెంచిరి . అప్పుడా ఆ సభాభవనము దశరధుడు బతికి వున్నప్పుడు వలె జనులతో కళకళలాడెను . 

          రామాయణము అయోధ్యకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment