Tuesday, 25 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదిరెండవసర్గ

                                        రామాయణము 

                                       అరణ్యకాండ -అరువదిరెండవసర్గ 

శ్రీరాముడు సీతకొరకు అంతటా వెతికి వెతికి సీతా !సీతా !అని బిగ్గరగా అరుచుచు ఏడవసాగెను . పిమ్మట అతడు లక్ష్మణుని పట్టుకుని "లక్ష్మణా !సీతను రాక్షసులు చంపివేసి ఉండును . లేకుంటే ఆమె న ఎదుటికి రాకుండా ఇంతసేపు ఉండదు . లక్ష్మణా !సీత లేకుండా నేను బ్రతకజాలను .   నా మాట విని నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్లు . అచటికి వెళ్లిన పిదప భరతుని కౌగలించుకుని అయోధ్యను పరిపాలించమని నా ఆజ్ఞగా చెప్పు . తల్లులని జాగ్రత్తగా చూసుకో . ముఖ్యముగా కౌసల్యా మాత ను జాగ్రత్తగా చూసుకో "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం .  ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

Sunday, 23 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియొకటవసర్గ

                                          రామాయణము 

                                          అరణ్యకాండ -అరువదియొకటవసర్గ 

శ్రీరాముడు చుట్టుపక్కల అంతయు వెతికి తిరిగి ఆశ్రమమునకు వచ్చెను . అచట చెల్లాచెదురుగా పది వున్నదర్భలు ,ఆసనములను చూసేను . అప్పుడు ఆ మాహానుభావుడు లక్ష్మణుని గట్టిగా పట్టుకుని "లక్ష్మణా !సీత ఏమయిపోయినది . రక్కసులెవరైనా ఆమెను భక్షించి ఉండునా ?లేక అపహరించివుండునా ?సుకుమారి ఆ రాకుమారి కి ఎట్టి కష్టము వచ్చినదో కదా !ఆమె ఎడబాటు నేను తట్టుకొనలేక మరణించుట తధ్యము . పిమ్మట నేను ఊర్ధ్వ లోకములకు వెళ్ళినచో అచట మన తండ్రి "నేను విధించిన 14 ఏండ్లు అరణ్యవాసము పూర్తిచేయకనే ఇలా వచ్చితివి " నన్ను ఛీ కొట్టుట తధ్యము . "అని పలికెను . 
అప్పుడు లక్ష్మణుడు అన్న ను ఓదార్చుచు "అన్నా !వదినగారికిఎత్తి అపకారము జరిగివుండదు . కంగారు పడకుము . మనిద్దరమూ కలసి వదినగారిని వెతుకుదాము .  అరణ్యములో పూలు కోయుటకో లేక స్నానము చేయుటకో ,విహారమునకో వదినగారు వెళ్ళివుండవచ్చు "అని చెప్పెను . అయినను రాముడు ఊరడిల్లక "లక్ష్మణా !మనము ఇప్పుడే అరణ్యమంతా వెతికినాము కదా !సీత జాడ లభించలేదు "అని దీనవధానుడై చుట్టుపక్కల కళ్ళతోనే వెతుకుచు నిస్సహాయుడై కంట నీరు ధారగా కారుచుండగా సీతా !సీతా !అని అరుచుచు ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








 

Friday, 21 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -అరువదియవసర్గ 

శ్రీరాముడు సీతాదేవి కొఱకు ఆశ్రమము చుట్టపక్కలంతా బాగుగా వెదికినను ప్రయోజనము లేకుండెను . ఆ ఆశ్రమములో సీతాదేవి రావణుడి నుండి తప్పించుకొనుటకు పెనుగులాడినపుడు అచట ఉన్న దర్భలు .ఆసనములు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయెను . ఆ ప్రదేశము శోభావిహీనముగా ఉండెను . అచటి వృక్షములు ,పుష్పములు అన్నియు సీతాదేవి లేకపోవుటచే వాడినట్లుగా ఉండెను . అట్టి ప్రదేశమును చూసి రాముడు మిగుల సోకించెను . 
"సీతను ఎవరైనా అపహరించుకుపోయారా ?చంపివేసిరా ?లేక నన్ను ఆటపట్టించుచున్నదా ?ఎవ్వరితోడు లేకుండకపోవుటచే భయపడి వనములలో తిరిగుచున్నదా ?పూవులను ,పండ్లను సేకరించుకొనుటకు ఎచటికైనా వెళ్ళినదా ?స్నానార్ధమై సరస్సుకి వెళ్ళినదా ?జలములు తెచ్చుటకై నదికి వెళ్ళినదా ?"అని పరిపరి విధములుగా రాముడు ఆలోచించుచువుండెను . సీతాదేవి కనపడక పోవుటచే శోకముచే ఆయన కండ్లు ఎరుపెక్కేను . పిచ్చివాని వలె చెట్లు వెంట పరుగెట్టసాగెను . 
కనపడిన ప్రతి చెట్టును సీతజాడ చూసితిరా అని ప్రశ్నించసాగెను . కనపడిన ప్రతి మృగమును సీతాదేవి ఆచూకీకై అడుగసాగెను . కానీ ఫలితము శూన్యము . ఆయన సీతాదేవి వృక్షముల వెనక దాగుకుని ఆటపట్టించుననుకొని "వృక్షముల వెనక దాగుకొని నన్ను ఆటపట్టించినది చాలు ఇక బయటకు రా "అని పిలువసాగెను . కానీ సీతాదేవి రాకపోవుటచే "సీతాదేవిని రాక్షసులు భక్షించి ఉండును . కావునే ఆమె కనిపించుటలేదు "అని భావించెను . శ్రీరాముడు ఆవిధముగా విశాలమైన దట్టమైన అడవులలో పరిగెడుతూ మిక్కిలి అలసిపోయెను . అయినప్పటికీ సీతాదేవిని వెతుకుతూ పిచ్చివాని వలె తిరుగసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday, 20 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                                      రామాయణము 

                                                     అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణునితో పదేపదే సీతాదేవిని వదిలివచ్చినందుకు పరుషముగా మాట్లాడసాగెను . అప్పుడు లక్ష్మణుడు అరుపులు విని సీతాదేవి భయపడి లక్ష్మణుని సహాయముకై వెళ్ళమనుట ,లక్ష్మణుడు అంగీకరించకపోవడంతో సీతాదేవి పరుషముగా మాట్లాడుట ఆ మాటలు తట్టుకోలేక లక్ష్మణుడు రాముని వద్దకు బయలుదేరుట మొదలైన వృత్తాంతమును అంతయు శ్రీరామునికి తెలిపెను . అయినను శ్రీరాముడు లక్ష్మణుని "మీ వదినగారు తెలియక అటుల మాట్లాడినప్పటికీ నీవు ఆమెను విడిచి రాకుండా వుండవలసినది "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

రామాయణము అరణ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                                              రామాయణము 

                                             అరణ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

రాముడు సీతాదేవికి ఏ ఆపద సంభవించిందో అని భయపడుతూ లక్ష్మణునితో కలిసి వడివడిగా ఆశ్రమమువైపు నడవసాగెను . ఆయన మిక్కిలి అలసిపోయినప్పటికీ సీతాదేవిపై కల అపారమైన ప్రేమ వలన ఆయన ఎచ్చటా విశ్రమించకుండా తన నడక సాగించెను . బడలిక చేత ఆయన ముఖము మిక్కిలి వాడి ఉండెను . 
ఆ విధముగా రామ్లష్మణులు ఇరువురూ పరుగులాంటి నడకతో ఆశ్రమము చేరి సీతాదేవి కొరకు ఆశ్రమము అంతా వెతికేను . ఆశ్రమము చుట్టుపక్కలా ,సీతాదేవి తానూ కలిసి తిరిగిన విహారప్రాంతములు అన్నియు వెతికేను . కానీ ఫలితం శూన్యం . పిమ్మట శ్రీరాముడు సీతాదేవి కనిపించక క్షణకాలం శ్రీరాముడు నిస్చేస్తుడయ్యెను . 

రామాయణము అరణ్యకాండ ఏబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

Tuesday, 18 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదియేడవసర్గ

                                              రామాయణము 

                                                  అరణ్యకాండ -ఏబదియేడవసర్గ 

బంగారుజింక రూపములో వున్న మారీచుని చంపి శ్రీరాముడు వెనుతిరిగి ఆశ్రమము వైపు వడివడిగా నడవసాగెను . ఆ మహానుభావుడు తన మనసులో "నాకు దుశ్శకునము లు కనిపించుచున్నవి . సీతాదేవి ఆశ్రమములో క్షేమముగానే ఉండును కదా !ఆ రాక్షసుడు మరణిస్తూ సీతా !లక్ష్మణా !అని బిగ్గరగా అరిచాడు . ఆ అరుపులు విని సీత నాకేదో ఆపద సంభవించిందని బయపడి లక్ష్మణుని నా వద్దకు తప్పక పంపును . అక్కడ ఆమె ఒక్కటే ఉంటుంది . "అని ఆలోచిస్తూ నడవసాగెను . 
ఇంతలో దీనవధనుడైన   లక్ష్మణుడు రాయుడికి ఎదురుపడెను . లక్ష్మణుని చూసిన రాముడు కంగారుపడి ,"లక్ష్మణా !మీ వదిన సీతను ఒక్కదాన్నే వదిలి నువ్వు ఎందుకు వచ్చావు ?"అని మందలించెను . అసురులు తిరిగే ఈ అరణ్యప్రాంతములో ఆమెను ఇలా వదిలి వచ్చుట క్షేమము కాదు . మనము చంపుటచే పగ పూనిన రాక్షసులు ఆమెను చంపుట  తినివేయుట చేసివుండెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

Monday, 17 July 2017

రామాయణము అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ

                                           రామాయణము 

                                               అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ 

సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు ఇంద్రుని పిలిచి "ఓ దేవరాజా !దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకు పోయి లంకలో ఉంచాడు . దీనివలన రాక్షసుల వినాశనం కలిగి లోకములకు మేలు కలుగుతుంది . కానీ పతివ్రతా శిరోమణీ ,సాధ్వీ ,సుకుమారురాలు అయిన సీతాదేవి లంకలో అడుగుపెట్టింది మొదలు ఏమియు తినుటలేదు . ఆ పతివ్రతా శిరోమణి అటుల తినకుండా వున్నా యెడల ఆమె ప్రాణములకే ముప్పు వచ్చును . 
ఆమె అటుల మరణించుట లోకములకు మంచిది కాదు . కావున నీవు వెళ్లి ఆ సాధ్వికి దివ్యపాయసమును అందించుము . "అని ఆజ్ఞాపించేను . అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి లంకా నగరమునకు బయలుదేరెను . నిద్రాదేవి ప్రభావంతో రాక్షసులందరూ నిద్రించెను .

 అప్పుడు ఇంద్రుడు సీతాదేవి వద్దకు వెళ్లి "సాధ్వీ !నేను సురారాజుని . మహాత్ముడైన శ్రీరామునికి కార్యసిద్ధికై తోడ్పడగలను . కనుక నీవు శోకింపవలదు . 
నా మాయా ప్రభావమున రక్కసులందరూ నిద్రలో మునిగి ఉండిరి . శ్రీరాముడు సముద్రము దాటి వచ్చుటకు నేను సహాయము చేసెదను . నీ భోజనమునకై నేను దివ్య పాయసమును తెచ్చితిని . ఓ పూజ్యురాలా !ఈ పాయసమును ఆరగింపుము .దీని ప్రభావమున ఆకలి దప్పులు నిన్ను ఎప్పటికి బాధించవు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి "నీవు ఇంద్రుడివే అని నేను నమ్ముట ఎట్లు ?నేను ఇదివరకు శ్రీరాముడు తో కలసి వనవాసము చేసినప్పుడు దూరమునుండి నిన్ను చూసితిని . నేను ఆనాడు   చూసిన ఆ దేవా లక్షణములు చూపించిన యెడల నమ్మెదను "అని పలికెను . 

ఆ మాటలు విన్న ఇంద్రుడు సీతాదేవి ఆంతర్యము గ్రహించి ,తన దేవలక్షణములు ప్రదర్శించెను . ఆయన కాళ్ళు నెలకు తాకక ఉండెను . ఆయన కళ్ళు రెప్ప పడక ఉండెను . దివ్య వస్త్రములు దేదీప్యమానంగా వెలుగుచూవుండెను . ఆయన ధరించిన పూల మాల వాడక ఉండెను . ఆ లక్షణములు చూసిన సీతాదేవి ఆయన ఇంద్రుడని గ్రహించి ,తన భర్త పేరు వినుటచే మిక్కిలి సంతోషపడెను . ఇంద్రుడు అందించిన దివ్యపాయసమును భక్షించెను . పిమ్మట ఆవిడకు కల ఆకలిదప్పికలు తొలగిపోయెను . పిమ్మట ఇంద్రుడు సీతాదేవి వద్ద సెలవు తీసుకుని అచ్చటనుండి వెళ్లిపోయెను . 

రామాయణము అరణ్యకాండ ప్రక్షిప్తసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .