Monday 17 July 2017

రామాయణము అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ

                                           రామాయణము 

                                               అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ 

సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు ఇంద్రుని పిలిచి "ఓ దేవరాజా !దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకు పోయి లంకలో ఉంచాడు . దీనివలన రాక్షసుల వినాశనం కలిగి లోకములకు మేలు కలుగుతుంది . కానీ పతివ్రతా శిరోమణీ ,సాధ్వీ ,సుకుమారురాలు అయిన సీతాదేవి లంకలో అడుగుపెట్టింది మొదలు ఏమియు తినుటలేదు . ఆ పతివ్రతా శిరోమణి అటుల తినకుండా వున్నా యెడల ఆమె ప్రాణములకే ముప్పు వచ్చును . 
ఆమె అటుల మరణించుట లోకములకు మంచిది కాదు . కావున నీవు వెళ్లి ఆ సాధ్వికి దివ్యపాయసమును అందించుము . "అని ఆజ్ఞాపించేను . అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి లంకా నగరమునకు బయలుదేరెను . నిద్రాదేవి ప్రభావంతో రాక్షసులందరూ నిద్రించెను .

 అప్పుడు ఇంద్రుడు సీతాదేవి వద్దకు వెళ్లి "సాధ్వీ !నేను సురారాజుని . మహాత్ముడైన శ్రీరామునికి కార్యసిద్ధికై తోడ్పడగలను . కనుక నీవు శోకింపవలదు . 
నా మాయా ప్రభావమున రక్కసులందరూ నిద్రలో మునిగి ఉండిరి . శ్రీరాముడు సముద్రము దాటి వచ్చుటకు నేను సహాయము చేసెదను . నీ భోజనమునకై నేను దివ్య పాయసమును తెచ్చితిని . ఓ పూజ్యురాలా !ఈ పాయసమును ఆరగింపుము .దీని ప్రభావమున ఆకలి దప్పులు నిన్ను ఎప్పటికి బాధించవు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి "నీవు ఇంద్రుడివే అని నేను నమ్ముట ఎట్లు ?నేను ఇదివరకు శ్రీరాముడు తో కలసి వనవాసము చేసినప్పుడు దూరమునుండి నిన్ను చూసితిని . నేను ఆనాడు   చూసిన ఆ దేవా లక్షణములు చూపించిన యెడల నమ్మెదను "అని పలికెను . 

ఆ మాటలు విన్న ఇంద్రుడు సీతాదేవి ఆంతర్యము గ్రహించి ,తన దేవలక్షణములు ప్రదర్శించెను . ఆయన కాళ్ళు నెలకు తాకక ఉండెను . ఆయన కళ్ళు రెప్ప పడక ఉండెను . దివ్య వస్త్రములు దేదీప్యమానంగా వెలుగుచూవుండెను . ఆయన ధరించిన పూల మాల వాడక ఉండెను . ఆ లక్షణములు చూసిన సీతాదేవి ఆయన ఇంద్రుడని గ్రహించి ,తన భర్త పేరు వినుటచే మిక్కిలి సంతోషపడెను . ఇంద్రుడు అందించిన దివ్యపాయసమును భక్షించెను . పిమ్మట ఆవిడకు కల ఆకలిదప్పికలు తొలగిపోయెను . పిమ్మట ఇంద్రుడు సీతాదేవి వద్ద సెలవు తీసుకుని అచ్చటనుండి వెళ్లిపోయెను . 

రామాయణము అరణ్యకాండ ప్రక్షిప్తసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment