Friday 21 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -అరువదియవసర్గ 

శ్రీరాముడు సీతాదేవి కొఱకు ఆశ్రమము చుట్టపక్కలంతా బాగుగా వెదికినను ప్రయోజనము లేకుండెను . ఆ ఆశ్రమములో సీతాదేవి రావణుడి నుండి తప్పించుకొనుటకు పెనుగులాడినపుడు అచట ఉన్న దర్భలు .ఆసనములు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయెను . ఆ ప్రదేశము శోభావిహీనముగా ఉండెను . అచటి వృక్షములు ,పుష్పములు అన్నియు సీతాదేవి లేకపోవుటచే వాడినట్లుగా ఉండెను . అట్టి ప్రదేశమును చూసి రాముడు మిగుల సోకించెను . 
"సీతను ఎవరైనా అపహరించుకుపోయారా ?చంపివేసిరా ?లేక నన్ను ఆటపట్టించుచున్నదా ?ఎవ్వరితోడు లేకుండకపోవుటచే భయపడి వనములలో తిరిగుచున్నదా ?పూవులను ,పండ్లను సేకరించుకొనుటకు ఎచటికైనా వెళ్ళినదా ?స్నానార్ధమై సరస్సుకి వెళ్ళినదా ?జలములు తెచ్చుటకై నదికి వెళ్ళినదా ?"అని పరిపరి విధములుగా రాముడు ఆలోచించుచువుండెను . సీతాదేవి కనపడక పోవుటచే శోకముచే ఆయన కండ్లు ఎరుపెక్కేను . పిచ్చివాని వలె చెట్లు వెంట పరుగెట్టసాగెను . 
కనపడిన ప్రతి చెట్టును సీతజాడ చూసితిరా అని ప్రశ్నించసాగెను . కనపడిన ప్రతి మృగమును సీతాదేవి ఆచూకీకై అడుగసాగెను . కానీ ఫలితము శూన్యము . ఆయన సీతాదేవి వృక్షముల వెనక దాగుకుని ఆటపట్టించుననుకొని "వృక్షముల వెనక దాగుకొని నన్ను ఆటపట్టించినది చాలు ఇక బయటకు రా "అని పిలువసాగెను . కానీ సీతాదేవి రాకపోవుటచే "సీతాదేవిని రాక్షసులు భక్షించి ఉండును . కావునే ఆమె కనిపించుటలేదు "అని భావించెను . శ్రీరాముడు ఆవిధముగా విశాలమైన దట్టమైన అడవులలో పరిగెడుతూ మిక్కిలి అలసిపోయెను . అయినప్పటికీ సీతాదేవిని వెతుకుతూ పిచ్చివాని వలె తిరుగసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment