Wednesday, 29 May 2019

రామాయణము సుందరకాండ -అరువదిమూడవసర్గ

                            రామాయణము 

                     సుందరకాండ -అరువదిమూడవసర్గ 

దధిముఖుడు వంటినిండా దెబ్బలతో ,కంగారుగా వచ్చుట చూసిన సుగ్రీవుడు అతడికి ఎదురువెళ్ళి ,"మామ !ఏమి జరిగినది ?ఎందుకు ఇంతగా కంగారు పడుతున్నావు ?నీ వంటిమీద ఈ దెబ్బలన్నీ ఏమిటి ?నీ సంరక్షణలో వున్న మధువనము సురక్షితముగానే వున్నది కదా !"అని ప్రశ్నించెను . 
అప్పుడు దధిముఖుడు "మహారాజా !హనుమ అంగదాది దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరవీరులు ,మధువనములో ప్రవేశించి వనమును నాశనము చేయుచున్నారు . ఫలములు భక్షించుచున్నారు . మధువులను త్రాగుతున్నారు . మిగిలినవి పాఱఁబ్రోయుచున్నారు . నీ తండ్రి సమయములో కానీ ,మీ అన్న వాలి సమయములో కానీ ,ఇంతకాలమూ నీ పాలనలో కానీ ఏ ఒక్క వానరుడు కూడా ఆ వనము వైపు కన్నెత్తి చూచుటకు కూడా సాహసించలేదు . కానీ ఈ రోజు వీళ్ళకి ఇంత ధైర్యము వచ్చుటకు కారణమేమిటో తెలియటం లేదు . పైగా నన్ను ,అక్కడి వనపాలకులను కొట్టారు . వీళ్ళకి ఇంత తెగింపు ఎక్కడినుండి వచ్చినదో తెలియటం లేదు . "అని పలికెను . 
దధిముఖుడి అవతారము సుగ్రీవుడు మాట్లాడుట గమనించిన లక్ష్మణుడు అచటికి వచ్చి ఏమి జరిగినదని ప్రశ్నించెను . అప్పుడు సుగ్రీవుడు "లక్ష్మణా !దక్షిణ దిక్కుగా సీతాదేవి అన్వేషణ కొరకు వెళ్లిన హనుమ అంగదాది వీరులందరు మధువనములో ప్రవేశించి ,అక్కడి వనపాలకులను కొట్టి ,వనమును పాడుచేయుచున్నారట ,వానరులెవ్వరికీ ఆవైపు చూసే ధైర్యము కూడా లేదు . కానీ వీరు ఇలా చేస్తున్నారంటే వారికి తప్పకుండా సీతామాత జాడ తెలిసివుంటుంది . "అని పలికి దధిముఖుడివైపు తిరిగి 
"మామా !సీతాదేవి జాడను కనిపెట్టిన వాళ్ళు నాకెంతో ఇష్టమైన మధువనమును నాశనము చేయుచున్న నాకు కోపము రావటము లేదు . పైగా సీతాదేవి జాడ కనుగొన్నందుకు కాను సంతోషముగా వున్నది . వారిని ఇష్టమొచ్చినట్టు తిననీ పర్వాలేదు . వారిని వీలయినంత శీఘ్రముగా ఇక్కడికి రమ్మని చెప్పు . వారి నోటితోనే సీతాదేవిని చూసాము అనే వార్త వినాలని వున్నది "అని పలికెను . 

రామాయణము సుందరకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Tuesday, 28 May 2019

రామాయణము సుందరకాండ -అరువదిరెండవసర్గ

                                  రామాయణము 

                                         సుందరకాండ -అరువదిరెండవసర్గ 

దధిముఖుడు వెళ్లిన పిమ్మట వానరవీరులు మధువులు త్రాగుతూ ఆడుతూ అరుచుచూ మితిమీరిన సంతోషముతో ఒకరినొకరు కిందపడవేస్తూ ,నవ్వుతూ ఆడుతూ ,తూలుతూ ,ఎక్కువైన మధువును వలకపోస్తూ గoతులువేయసాగిరి . అప్పుడు ఆ వన సంరక్షకులు తమ నాయకుడైన దధిముఖుడని ఈదర ఉంచుకుని ,తమ బలముతో వానరులనుచెదర కొట్టాలని పెద్ద పెద్ద చెట్లను పీకి వానరులను వాటితో కొట్టుటకు వచ్చిరి .అది చూసిన హనుమ అంగదుడు వారిని చిత్తుచిత్తుగా కొట్టి వెళ్లకొట్టిరి . 
అప్పుడు దధిముఖుడు తన సైన్యముతో "వారిని ఇక్కడే ఉండనివ్వండి . సుగ్రీవునికి ఈ వనమన్న ప్రాణము . వీరు ఈ వనమును ధ్వంసము చేయుచున్నారని తెలిసినచో మన ప్రభువు వీరందరికి మరణదండన విధించును . ఇప్పుడు ఆయన శ్రీరాముని వద్ద వున్నాడు . మనము అక్కడికే వెళ్లి ఈ విషయమును వివరించి చెబుదాము . "అని పలికి తన అనుచరులతో సహా ఆకాశములోకి ఎగిరి రామలక్ష్మణ సుగ్రీవులు ఉన్న వనమునకు వెళ్లెను 

రామాయణము సుందరకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -ఆరుదియొకటవసర్గ

                             రామాయణము 

                          సుందరకాండ -ఆరుదియొకటవసర్గ 

జాంబవంతుడు పలికిన మాటలకు వానరులందరూ సమ్మతించి ,మహేంద్రగిరి నుండి పైకి ఎగిరిరి . పిమ్మట వారందరూ తిన్నగా రామలక్ష్మణ సుగ్రీవుల వద్దకు వెళ్లక దారిలో వున్న మధు వనములో ప్రవేశించి ,అచటి ఫలములను తిని మధువులను త్రాగిరి . 
ఈ మధువనము సుగ్రీవునికి అత్యంత ఇష్టమైన వనము సుగ్రీవునికి బయపడి వానరులెవ్వరూ ఆ వనంలోకి ప్రవేశించు సాహసము చేయరు . సీతాదేవి జాడను కనిపెట్టిన సంతోషముతో ఇప్పుడు హనుమదాది వీఁరులంతా మధువనంలోకి ప్రవేశించిరి . 
వారందరూ కడుపు నిండుగా ఫలములను భుజించిరి . మధువును త్రాగిరి . కొందరు వానరులు ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదికి దూకిరి . ఇంకొందరు నవ్వుచుండిరి . మరికొందరు ఏడ్చుచుండిరి . కొంతమంది పాటలు పాడుచుండిరి , ఇంకొంతమంది నాట్యము చేయుచుండిరి ,పెక్కుమంది అక్కడి వృక్షములను ధ్వంసము చేయుచుండిరి . 
ఈ  విధముగా వారు ఆ మధువనములో విజృంభించుచుండగా ఆ వన పాలకుడు ,సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు వారందరీ అదిలించ ప్రయత్నము చేసెను . కానీ వానరులెవరూ పట్టించుకోకపోవువటంతో వారిలో కొందరిని చేతితో చరిచి ,పెద్దగా అరిచి వారిని ఆ వనము నుండి బయటకు పంపించు ప్రయత్నము చేసెను . అప్పుడు ఆ వానరులలో కొందరు దధిముఖుడను కొట్టిరి ,ఇంకొందరు రక్కిరి ,మరికొందరు కొరికిరి . ఈ విధముగా దధిముఖుడను హింసించి బయటకు ప్రాలద్రోలిరి . 

రామాయణము సుందరకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  






Sunday, 26 May 2019

రామాయణము సుందరకాండ - అరువదియవసర్గ

                                   రామాయణము 

                               సుందరకాండ - అరువదియవసర్గ 

లంకా నగర విశేషములన్నీ సవివరముగా తెలుసుకున్న పిమ్మట అంగదుడు "ఓ వానరవీరులారా !సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా మనము జానకీ దేవిని తీసుకువెళ్లకుండా మనమే వెళ్ళుట మంచిది కాదనిపిస్తోంది . హనుమ లంకా నగరంలోని పెక్కు మంది రాక్షసులను పరిమార్చినాడు . ఇక లంకలో కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు . లంకా నగరము కూడా దగ్దమయిపోయినది . వారు ఆ ఇబ్బంది లోనుండి బయటపడకముందే మనము దండెత్తి వెళ్లి మిగిలిన రాక్షసులను ,రావణుని చంపి సీతామాతను తీసుకువచ్చి శ్రీరాముని ముందు పెట్టినచో శ్రీరాముడు లక్ష్మణుడు ,మన ప్రభుబీవైన సుగ్రీవుడు కూడా చాలా సంతోషిస్తారు . 
ఆ విధముగా సీతారాములను కలిపి మనము పుణ్యము మూటకట్టుకొనవచ్చును . పైగా ఈ లంకలో వున్న కొద్దీ మంది రాక్షసుల కోసము సుగ్రీవుని ,రామలక్ష్మణులను , వానరులను ఇబ్బంది పెట్టుట ఎందుకు ?మనమే సీతామాతను తీసుకుని రామలక్ష్మణుల ,సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము . "అని పలికెను . ఆ మాటలు విన్న జాంబవంతుడు "అంగదా !సీతామాతను ఈ కష్టముల నుండి రక్షించి సీతారాములను కలపవలెననే నీ ఉత్సాహము చూడముచ్చటగా ఉన్నది . కానీ ,వానరప్రభువైన సుగ్రీవుడు మనల్ని దక్షిణదిశకు వెళ్లి వెతకమనే చెప్పాడు . కానీ సీతామాతను తీసుకురమ్మని చెప్పలేదు . అదీకాక ,శ్రీరాముడు మన వానరసేనల ముందు "సీతాదేవిని అపహరించినవాడిని చంపుతా"అని తన వంశము మీద ఒట్టు పెట్టి ప్రతిజ్ఞ చేసినాడు . మనము జానకీదేవిని తీసుకువెళ్ళినచో ఆయన ప్రతిజ్ఞ విఫలమగును . అందువలన మనము త్వరగా వెళ్లి రామలక్ష్మణ సుగ్రీవులకు జానకీదేవి జాడ గురించి చెప్పెదము "అని పలికెను . 

రామాయణము సుందరకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము సుందరకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                సుందరకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

హనుమ లంక నుండి వచ్చిన పిమ్మట వానరవీరులందరూ అక్కడి విశేషములను తెలుసుకొనిరి . పిమ్మట అనంతర కర్తవ్యమును గూర్చి చర్చించుచు ఆ సముద్ర తీరమునే ఉండిరి . 

రామాయణము సుందరకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Thursday, 23 May 2019

రామాయణము సుందరకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                                  రామాయణము 

                               సుందరకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

వానరులంతా హనుమ  చుట్టూ చేరి అక్కడి విశేషములను అడిగిరి . అప్పుడు హనుమ సవివరముగా తానూ సముద్రమును లంఘించుట ,దారిలో తనకు ఆటంకములు వచ్చుట ,మైనాక పర్వతము అడ్డుగా వచ్చుట ,లంకా నగరమును చేరుట లంకిణిని ఓడించుట ,లంకా నగర ప్రవేశము సీతాదేవి కొరకు లంకా నగరమును వెతుకుట ,ఎట్టకేలకు సీతామాతను కనిపెట్టుట ,అప్పుడే అక్కడికి వచ్చిన రావణుని సీతాదేవి తిరస్కరించుట ,రాక్షస స్త్రీలు సీతాదేవిని బయపెట్టుట, ఆమె ఆత్మహత్య చేసుకోనాలని ఆలోచించుట ,సీతాదేవితో తను మాట్లాడుట ధైర్యము చెప్పుట ,పిమ్మట అశోకవన ధ్వంసము ,రాక్షసులతో యుద్ధము ,పిమ్మట వారికి లొంగిపోవుట ,తోకకు నిప్పు అంటించుట ,లంకానగరమునకు నిప్పు పెట్టుట ,సీతాదేవి క్షేమమును కళ్లారా చూసి తిరిగి వచ్చుట మొదలగు విషయములన్నీ చెప్పెను . 

రామాయణము సుందరకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -ఏబదియేడవసర్గ

                                     రామాయణము 

                                      సుందరకాండ -ఏబదియేడవసర్గ 

హనుమ రెక్కలులేని ఒక మహా పర్వతము వలే ఆకాశములోకి ఎగిరెను . అలా ఎగురుతూ మార్గ మధ్యలో మైనాక పర్వతమును తన చేతితో స్పృశించెను . పిమ్మట అతడు పెద్దగా సింహనాదమొనర్చెను . హనుమ ఆవలిగట్టు దగ్గరకు వచ్చేసరికి పెద్దగా సింహనాదములు చేయుచు వాలము ఊపుచుండెను . ఆ మహాగర్జనలు విన్న అంగదాది మహా వీరులు ,జాంబవంతుడు "ఇది హనుమ కంఠ ధ్వనియే అతడు ఈ విధముగా గర్జించుచున్నాడంటే అతడు తప్పక సీతామాతను చూసి ఉంటాడు "అని నిర్ణయమునకు వచ్చి ,సంతోషముతో వారిలో కొందరు పెద్దగా అరవసాగిరి . కొందరు గంతులువేయసాగిరి . ఇంకొందరు ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదికి దూకసాగిరి . 
ఇలా సంబరంగా హనుమ కోసము ఎదురుచూస్తున్న వానరవీరులు హనుమ రావటం చూసి అతడికి ఎదురుగా హనుమ దిగు చోటికి వెళ్లిరి . వానరవీరులలో కొందరు హనుమను కౌగిలించుకొనిరి . ఇంకొందరు చెట్ల కొమ్మలను ఇరిపి హనుమకు ఆసనంగా తెచ్చిరి . ఇంకొందరు ఫలములు ,పళ్ళు తీసుకొచ్చి సమర్పించిరి . అందరూ హనుమను మళ్లీ క్షేమముగా చూసినందుకు గాను ,సంతోషముతో  హనుమ చుట్టూ చేరిరి . 

హనుమ వారితో "చూసాను సీతామాతను "అని ప్రకటించెను . ఆ మాట విన్న వానరులు కేరింతలు కొట్టిరి . సమగ్రముగా వివరము చెప్పమని అడిగిరి . అప్పుడు హనుమ "లంకలో రాక్షస స్త్రీల కాపలాలో అశోకవనంలో దీనవదనముతో శ్రీరాముని స్మరిస్తూ వున్న సీతాదేవిని చూసాను . ఆమె జుట్టు మొత్తము ఒకే జడగా ఉన్నది . ఆమె ఉపవాసములతో కృశించి వున్నది . "అని చెప్పెను . అప్పుడు వానరవీరులందరూ హనుమను పొగిడిరి . 

రామాయణము సుందరకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .