Thursday 23 May 2019

రామాయణము సుందరకాండ -ఏబదియేడవసర్గ

                                     రామాయణము 

                                      సుందరకాండ -ఏబదియేడవసర్గ 

హనుమ రెక్కలులేని ఒక మహా పర్వతము వలే ఆకాశములోకి ఎగిరెను . అలా ఎగురుతూ మార్గ మధ్యలో మైనాక పర్వతమును తన చేతితో స్పృశించెను . పిమ్మట అతడు పెద్దగా సింహనాదమొనర్చెను . హనుమ ఆవలిగట్టు దగ్గరకు వచ్చేసరికి పెద్దగా సింహనాదములు చేయుచు వాలము ఊపుచుండెను . ఆ మహాగర్జనలు విన్న అంగదాది మహా వీరులు ,జాంబవంతుడు "ఇది హనుమ కంఠ ధ్వనియే అతడు ఈ విధముగా గర్జించుచున్నాడంటే అతడు తప్పక సీతామాతను చూసి ఉంటాడు "అని నిర్ణయమునకు వచ్చి ,సంతోషముతో వారిలో కొందరు పెద్దగా అరవసాగిరి . కొందరు గంతులువేయసాగిరి . ఇంకొందరు ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదికి దూకసాగిరి . 
ఇలా సంబరంగా హనుమ కోసము ఎదురుచూస్తున్న వానరవీరులు హనుమ రావటం చూసి అతడికి ఎదురుగా హనుమ దిగు చోటికి వెళ్లిరి . వానరవీరులలో కొందరు హనుమను కౌగిలించుకొనిరి . ఇంకొందరు చెట్ల కొమ్మలను ఇరిపి హనుమకు ఆసనంగా తెచ్చిరి . ఇంకొందరు ఫలములు ,పళ్ళు తీసుకొచ్చి సమర్పించిరి . అందరూ హనుమను మళ్లీ క్షేమముగా చూసినందుకు గాను ,సంతోషముతో  హనుమ చుట్టూ చేరిరి . 

హనుమ వారితో "చూసాను సీతామాతను "అని ప్రకటించెను . ఆ మాట విన్న వానరులు కేరింతలు కొట్టిరి . సమగ్రముగా వివరము చెప్పమని అడిగిరి . అప్పుడు హనుమ "లంకలో రాక్షస స్త్రీల కాపలాలో అశోకవనంలో దీనవదనముతో శ్రీరాముని స్మరిస్తూ వున్న సీతాదేవిని చూసాను . ఆమె జుట్టు మొత్తము ఒకే జడగా ఉన్నది . ఆమె ఉపవాసములతో కృశించి వున్నది . "అని చెప్పెను . అప్పుడు వానరవీరులందరూ హనుమను పొగిడిరి . 

రామాయణము సుందరకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment