Sunday 26 May 2019

రామాయణము సుందరకాండ - అరువదియవసర్గ

                                   రామాయణము 

                               సుందరకాండ - అరువదియవసర్గ 

లంకా నగర విశేషములన్నీ సవివరముగా తెలుసుకున్న పిమ్మట అంగదుడు "ఓ వానరవీరులారా !సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా మనము జానకీ దేవిని తీసుకువెళ్లకుండా మనమే వెళ్ళుట మంచిది కాదనిపిస్తోంది . హనుమ లంకా నగరంలోని పెక్కు మంది రాక్షసులను పరిమార్చినాడు . ఇక లంకలో కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు . లంకా నగరము కూడా దగ్దమయిపోయినది . వారు ఆ ఇబ్బంది లోనుండి బయటపడకముందే మనము దండెత్తి వెళ్లి మిగిలిన రాక్షసులను ,రావణుని చంపి సీతామాతను తీసుకువచ్చి శ్రీరాముని ముందు పెట్టినచో శ్రీరాముడు లక్ష్మణుడు ,మన ప్రభుబీవైన సుగ్రీవుడు కూడా చాలా సంతోషిస్తారు . 
ఆ విధముగా సీతారాములను కలిపి మనము పుణ్యము మూటకట్టుకొనవచ్చును . పైగా ఈ లంకలో వున్న కొద్దీ మంది రాక్షసుల కోసము సుగ్రీవుని ,రామలక్ష్మణులను , వానరులను ఇబ్బంది పెట్టుట ఎందుకు ?మనమే సీతామాతను తీసుకుని రామలక్ష్మణుల ,సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము . "అని పలికెను . ఆ మాటలు విన్న జాంబవంతుడు "అంగదా !సీతామాతను ఈ కష్టముల నుండి రక్షించి సీతారాములను కలపవలెననే నీ ఉత్సాహము చూడముచ్చటగా ఉన్నది . కానీ ,వానరప్రభువైన సుగ్రీవుడు మనల్ని దక్షిణదిశకు వెళ్లి వెతకమనే చెప్పాడు . కానీ సీతామాతను తీసుకురమ్మని చెప్పలేదు . అదీకాక ,శ్రీరాముడు మన వానరసేనల ముందు "సీతాదేవిని అపహరించినవాడిని చంపుతా"అని తన వంశము మీద ఒట్టు పెట్టి ప్రతిజ్ఞ చేసినాడు . మనము జానకీదేవిని తీసుకువెళ్ళినచో ఆయన ప్రతిజ్ఞ విఫలమగును . అందువలన మనము త్వరగా వెళ్లి రామలక్ష్మణ సుగ్రీవులకు జానకీదేవి జాడ గురించి చెప్పెదము "అని పలికెను . 

రామాయణము సుందరకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment