Wednesday 29 May 2019

రామాయణము సుందరకాండ -అరువదిమూడవసర్గ

                            రామాయణము 

                     సుందరకాండ -అరువదిమూడవసర్గ 

దధిముఖుడు వంటినిండా దెబ్బలతో ,కంగారుగా వచ్చుట చూసిన సుగ్రీవుడు అతడికి ఎదురువెళ్ళి ,"మామ !ఏమి జరిగినది ?ఎందుకు ఇంతగా కంగారు పడుతున్నావు ?నీ వంటిమీద ఈ దెబ్బలన్నీ ఏమిటి ?నీ సంరక్షణలో వున్న మధువనము సురక్షితముగానే వున్నది కదా !"అని ప్రశ్నించెను . 
అప్పుడు దధిముఖుడు "మహారాజా !హనుమ అంగదాది దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరవీరులు ,మధువనములో ప్రవేశించి వనమును నాశనము చేయుచున్నారు . ఫలములు భక్షించుచున్నారు . మధువులను త్రాగుతున్నారు . మిగిలినవి పాఱఁబ్రోయుచున్నారు . నీ తండ్రి సమయములో కానీ ,మీ అన్న వాలి సమయములో కానీ ,ఇంతకాలమూ నీ పాలనలో కానీ ఏ ఒక్క వానరుడు కూడా ఆ వనము వైపు కన్నెత్తి చూచుటకు కూడా సాహసించలేదు . కానీ ఈ రోజు వీళ్ళకి ఇంత ధైర్యము వచ్చుటకు కారణమేమిటో తెలియటం లేదు . పైగా నన్ను ,అక్కడి వనపాలకులను కొట్టారు . వీళ్ళకి ఇంత తెగింపు ఎక్కడినుండి వచ్చినదో తెలియటం లేదు . "అని పలికెను . 
దధిముఖుడి అవతారము సుగ్రీవుడు మాట్లాడుట గమనించిన లక్ష్మణుడు అచటికి వచ్చి ఏమి జరిగినదని ప్రశ్నించెను . అప్పుడు సుగ్రీవుడు "లక్ష్మణా !దక్షిణ దిక్కుగా సీతాదేవి అన్వేషణ కొరకు వెళ్లిన హనుమ అంగదాది వీరులందరు మధువనములో ప్రవేశించి ,అక్కడి వనపాలకులను కొట్టి ,వనమును పాడుచేయుచున్నారట ,వానరులెవ్వరికీ ఆవైపు చూసే ధైర్యము కూడా లేదు . కానీ వీరు ఇలా చేస్తున్నారంటే వారికి తప్పకుండా సీతామాత జాడ తెలిసివుంటుంది . "అని పలికి దధిముఖుడివైపు తిరిగి 
"మామా !సీతాదేవి జాడను కనిపెట్టిన వాళ్ళు నాకెంతో ఇష్టమైన మధువనమును నాశనము చేయుచున్న నాకు కోపము రావటము లేదు . పైగా సీతాదేవి జాడ కనుగొన్నందుకు కాను సంతోషముగా వున్నది . వారిని ఇష్టమొచ్చినట్టు తిననీ పర్వాలేదు . వారిని వీలయినంత శీఘ్రముగా ఇక్కడికి రమ్మని చెప్పు . వారి నోటితోనే సీతాదేవిని చూసాము అనే వార్త వినాలని వున్నది "అని పలికెను . 

రామాయణము సుందరకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment