Friday, 28 June 2019

రామాయణము యుద్ధకాండ -పదిహేడవసర్గ

                                  రామాయణము 

                                     యుద్ధకాండ -పదిహేడవసర్గ 

విభీషణుడు ఆ విధముగా రావణునితో పలికి ,అక్కడ నుండి బయలుదేరి ,ఆకాశ మార్గములోనే ,రామలక్ష్మణులు సుగ్రీవాది వానరులు ఉన్న సముద్ర ఆవలి తీరమునకు చేరి ,ఆకాశములోనే నిలిచి తనను చూస్తున్న సుగ్రీవుడితో మిగిలిన వానరులతో "నా పేరు విభీషణుడు ,నేను రావణుని తమ్ముడిని ,పేరులో మాత్రమే కాక ప్రవర్తనలో కూడా దుర్మార్గుడైన ఆ రాక్షసుడు సీతాదేవిని అపహరించెను . దారిలో అడ్డు వచ్చిన జటాయువును చంపెను . నేను అనేకసార్లు అది మంచిపని కాదు ,సీతామాతను క్షేమముగా శ్రీరామచంద్రుడికి అప్పగించమని చెప్పివున్నాను . కానీ అతడు నా మాటలు పెడచెవిన పెట్టటమే కాకుండా నన్ను నానా దుర్భాషలాడేను . సభలో నన్ను అవమానించేను . అది తట్టుకోలేక నేను అతడిని వదిలి శ్రీరాముడిని శరణు వేడి ఆయన పక్షంలో చేరుటకు వచ్చి ఉన్నాను . ఈ విషయములు శ్రీరామునికి విన్నవించి ఆయన దర్శనమునకు నాకు అనుమతి ఇవ్వమని అడగండి "అని పలికెను . 
ఆ మాటలు విన్న సుగ్రీవుడు పరుగుపరుగున వెళ్లి శ్రీరామునికి విభీషణుడు వచ్చిన విషయము విన్నవించెను . పిదప శ్రీరాముడి ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు విభీషుణుడు నమ్మదగినవాడు కాదని తెలిపెను , పిమ్మట శ్రీరాముడు మిగిలిన వానర ప్రముఖులను కూడా వారివారి అభిప్రాయములు తెలుపమని అడిగెను . అప్పుడు అక్కడ వున్న ప్రముఖులైన వానరులు ,జాంబవంతుడు తమతమ అభిప్రాయమును తెలిపిరి . చివరిలో హనుమ విభీషణుడిని నమ్మవచ్చునని తన అభిప్రాయమును తెలిపెను . 

రామాయణము యుద్ధకాండ పదిహేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Thursday, 27 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునాఱవసర్గ

                                 రామాయణము 

                                  యుద్ధకాండ -పదునాఱవసర్గ 

విభీషణుడు పలికిన మాటలు విన్న రావణుడు మిక్కిలి కోపముతో "ఓ విభీషణా !ప్రాణాపాయకరమై ,కోపముతో బుసలు కొట్టుచున్న మహా విషసర్పముతో కలిసి అయినా జీవించవచ్చును కానీ ,మిత్రుడి వలె ప్రవర్తించుచు ,శత్రుపక్షపాతబుద్ధితో వున్న జ్ఞాతితో మాత్రము ఎన్నడూ నివసింపరాదు . రాక్షసా !ఈ లోకములోని దాయాదుల స్వభావము నేను పూర్తిగా ఎరుగుదును . ఈ జ్ఞాతులందరూ తమ దాయాదులు దుఃఖములు పాలయినపుడు మిక్కిలి సంతోషపడుదురు . 
అదే వారు తమకంటే ఉన్నత స్థితిలో వున్నా ,విడవాసుడైనా ,కార్యదక్షుడైనా ,శూరుడైనా అట్టి వాడిని ఈ జ్ఞాతులు ఎల్లప్పుడూ అవమానించుచు ఉందురు . ఈ జ్ఞాతులు తమ దాయాదులు కష్టములలో ఉన్నప్పుడు చేయూతనివ్వకపోగా ,ద్రోహము తలపెట్టుచుందురు . మిక్కిలి ఆనందించుచుందురు . 
ఓ విభీషణా !నేను అన్నిలోకములలో గౌరవాదరములు పొందినవాడను ,ఐశ్వర్యవంతుడను ,ఉత్తమవంశమున జన్మించినవాడను ,శత్రువులను పాదాక్రాంతులను చేసుకొనినవాడను . ఇటువంటి నా ఔన్నత్యములు చూసి నాజ్ఞాతివైన నీవు ఇంతగా అసూయపడుచున్నావు . ఛీ !నీవు వంశమున చెడబుట్టినవాడవు . నా తమ్ముడవైనందున బ్రతికిపోయావు . నీవు త్రప్పు ఇంకొకరు ఇలా మాట్లాడినచో వారిని వెనువెంటనే చంపివేసెదను . "అని పలికెను . 
రావణుడు ఇలా పలుకగా ధర్మవర్తనుడైన విభీషణుడు 'ఇక ఇచట ఉండరాదు 'అని భావించి ,గదను చేతబూని ఆకాశములోకి ఎగిరెను . విభేషణుడి వేనుక మరో నలుగురు రాక్షసులు కూడా ఆకాశములోకి ఎగిరిరి . అలా ఆకాశములోకి ఎగిరిన విభీషణుడు ,రావణునితో "రావణా !నీవు నాకంటే పెద్దవాడివగుటచే ఇష్టము వచ్చినట్టు పలుకుచున్నావు . ఆయువు మూడినవారు తమ హితము కోరి పలికిన మంచి మాటలను చెవికి ఎక్కించుకోరు . ఆపద వచ్చినపుడు రాజు హితాహితములు పట్టించుకొనక రాజుకు నచ్చినట్టే మాట్లాడువారు ఈ లోకములో కోకొల్లలు . నీ హితము కోరే నేను పరుష వచనములు పలికితిని . అందులకు నన్ను క్షమించుము . ఏది ఏమైనను నిన్ను నీవు రక్షించుకొనుము . ఈ లంకా నగరమును కూడా రక్షించుకొనుము . నేను వెళ్లిపోవుచున్నాను . నీవు హాయిగా ఉండుము . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునాఱవసర్గ సమాప్తము . 

       శశి ,

ఎం.  ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Wednesday, 26 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునైదవసర్గ

                                  రామాయణము 

                                       యుద్ధకాండ -పదునైదవసర్గ 

విభీషణుడు ఎంతో దూరదృష్టితో పలికిన పలుకులు విన్న ఇంద్రజిత్తు "ఓ పినతండ్రీ !నీవు పిరికివాని వలె నిరర్ధకములైన మాటలు మాట్లాడుతున్నావేమిటి ?మన పౌలస్త్య వంశములో ఇంతటి పిరికివాడు ఇప్పటివరకు పుట్టివుండలేదు . మానవమాత్రులైన రాకుమారులు మనముందు ఒక లెక్కా ?మనలోని ఒక సాధారణ రాక్షసుడు కూడా వారిని చంపగలడు . నీవు భయపడటమే కాకుండా మమ్మల్నందరినీ భయపెట్టుటకు చూస్తున్నావు . నేను త్రిలోకాధిపతి ఐన ఇంద్రుడినే రాజ్యభ్రష్టుడిని చేసి ,భూలోకములో బంధించాను . అప్పుడు దేవతలందరూ నాలుగువైపులా భయముతో పారిపోయారు . అంతటి మహావీరుడైన నాకు మానవమాత్రులు ఒక లెక్కా ?"అని పలికెను . 
ఇంద్రజిత్తు మాటలు విన్న విభీషణుడు "నాయనా !ఇంద్రజిత్తూ ! నీవు ఇంకా బాలుడవు ఈ విషయములు అన్ని అర్ధము చేసుకునే వయసు నీకు లేదు . నీవు బాల్యచాపముతో ఇలా పలుకుతున్నావు . శ్రీరాముని బాణములు బ్రహ్మదండములు వలె ,నిప్పులు గ్రక్కేవి . మృత్యుసమములు . "అని పలికి రావణునితో "మహారాజా !రత్నములు ,విలువైన ఆభరణములు ,దివ్యవస్త్రములు కానుకులుగా సమర్పిస్తూ సీతాసాధ్విని శ్రీరామునికి అప్పగించుట ఉత్తమము "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday, 20 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునాల్గవసర్గ

                               రామాయణము 

                                యుద్ధకాండ -పదునాల్గవసర్గ 

కుంభకర్ణుడి ,మహాపార్శ్వుడి ,రావణుని మాటలు విన్న విభీషణుడు "మహారాజా !సీతాదేవి మీ కంటికి ఒక సుందరస్త్రీలా కనిపిస్తోందేమో ?కానీ నిజానికి ఆమె ఒక భయంకరమైన సర్పము వంటిది . ఆ సర్పము జోలికి వెళ్లిన ఎవడు ప్రాణములతో వుండలేడు . అటువంటి మహా సర్పమును నీ మెడకు చుట్టుకోకు . భయంకరమైన వానరసైన్యముతో రాముడు లంకపై దండెత్తక ముందే సీతను ఆమె భర్తకు అప్పగించు . నీవు కానీ ,కుంభకర్ణుడు కానీ ఇంద్రజిత్తు కానీ మహాపార్శ్వుడు కానీ ఇంకా మిగిలిన రాక్షస ప్రముఖులు కానీ యుద్దములో శ్రీరాముని ఎదురుగా నిలిచి బ్రతకలేరు . నీవు ఇంద్రుడి వెనక దాగుకున్నా ,పాతాళములో దాక్కున్నా రాముడి బాణముల నుండి తప్పించుకొనలేవు ". అని పలికెను . 
ఆ మాటలు విన్న ప్రహస్తుడు "మాకు దేవదానవయక్షగంధర్వకిన్నెరకింపురుషులలో ఎవరివల్లా భయములేదు ఇక సాధారణ మానవుడైన రాముడికి భయపడుట హాస్యాస్పదం "అని పలికెను . ఆ మాటలు విన్న విభీషణుడు "ప్రహస్తా !చెడు ప్రవర్తన కలవాడు ఏ విధముగా స్వర్గమును పొందలేడో ,నౌకలేనివాడు ఏ విధముగా సముద్రమును దాటలేడో అదే విధముగా సీతాపహరణ దోషము చేసిన రావణుడు కానీ అతని పరివారము కానీ రాముడిని యుద్దములో జయించలేరు . శ్రీరాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన పురుషోత్తముడు . అతడు అవలీలగా విరాధుడు ,కబంధుడు ,వాలి ,ఖరదూషణాదులు ఇంకా పదునాలుగువేల రాక్షసయోధులను పరిమార్చాడు . అట్టి మహావీరుడు ఎదుట దేవతలు కూడా ఓడిపోవుదురు . 

రావణుడు వ్యసన లొనుడై తానూ నశించుటే కాక సమస్త రాక్షస లోకమును నశింపచేయుటకు పూనుకొనియున్నాడు . మీరందరూ రావణుని హితులు అతడి చేత పెక్కు ప్రయోజనములు పొందినవారు . మిత్రులు . భయంకరములైన శక్తివంతములైన భూతములు పట్టిన వాడిని ,అతడి హితులు బలవంతముగా ఆ ప్రభావము నుండి లాగినట్టు ,మీరు ఇతడి జుట్టుపట్టి లాగి అయినను అనుచితమార్గము నుండి మరల్చండి . ప్రభువు హితము కోరి సముచిత సూచనలు చేయండి "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









రామాయణము యుద్ధకాండ -పదమూడవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -పదమూడవసర్గ 

కుంభకర్ణుడి మాటలు విన్న రావణుడు కోపముతో ఊగిపోసాగెను . అది గమనించిన మహాపార్శ్వుడు లంకాధిపతి కోపము తొలగించుటకు "ప్రభూ !నీవు ఆ సీతకు సంవత్సరకాలం గడువు ఇవ్వవలిసిన అవసరము ఏమి వున్నది ?ఆమెకు ఇష్టము లేకున్నా వివాహము చేసుకొనవచ్చును కదా !ఎందుకు ఆమె అంగీకారము కొఱకు ఎదురుచూడటం ?ఆమెను బలవంతముగా తీసుకువచ్చినట్టే ,వివాహము కూడా చేసుకో "అని పలికెను . 
ఆ మాటలకు కొంత శాంతించిన రావణుడు "ఓ మహాపార్శ్వా !చాలాకాలము క్రితము జరిగిన ఒక రహస్య సంఘటనను నీకు ఇప్పుడు చెబుతాను విను . ఒకనాడు 'పుంజకస్థల 'అను అప్సరస బ్రహ్మదేవుడి వద్దకు ఆకాశమార్గములో వెళుతుండగా చూసి ఆమెను వివాహము చేసుకోవాలని బలవంతముగా తీసుకువచ్చుటకు ప్రయత్నించాను . కానీ అతి కష్టము మీద ఆమె నా నుండి తప్పించుకుని అట్లే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ,జరిగిన విషయము చెప్పినది . అప్పుడు బ్రహ్మదేవుడు కోపముతో నాకు "స్త్రీ కి ఇష్టములేకుండా బలవంతము చేస్తే మరుక్షణమే తలపగిలి చస్తావని శపించాడు "ఆ శాపమునకు భయపడే ఈ సీతను బలవంతముగా వివాహము చేసుకొనుట లేదు . ఈ లోకములో నా అంత శక్తివంతుడు మరొకడు లేడు . అది తెలియక రాముడు సైన్యముతో యుద్ధమునకు వచ్చుచున్నాడు . వజ్రతుల్యమైన నా బాణములతో ఆ రాముడిని క్షణములో పరిమార్చెదను "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Monday, 17 June 2019

రామాయణము యుద్ధకాండ -పన్నెండవసర్గ

                                 రామాయణము 

                                   యుద్ధకాండ -పన్నెండవసర్గ 

రావణుడు సభలో వేంచేసి ఉన్న రాక్షస ప్రముఖులందరినీ చూసి "ఓ రాక్షప్రముఖులారా !రాముడు సుగ్రీవుడితో కూడి సమస్త వానర భల్లూక సేనలతో కలిసి సముద్రము ఆవలి తీరమునకు చేరినాడు అని మన గూఢచారులద్వారా తెలిసినది . ఏది ఏమయినప్పటికీ సీతను రాముడికి అప్పగించేది లేదు . సీతను నేను చాలా ఇష్టపడి తీసుకువచ్చాను . ఆమె తన మనసు మార్చుకొనుటకు ఒక సంవత్సరము గడువు ఇచ్చాను . ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమును ఆలోచించండి . కుంభకర్ణుడు 6 నెలల నుండి నిద్రలో వున్నాడు . ఈరోజే నిద్రలేచాడు సభకు కూడా వచ్చి వున్నాడు "అని పలికెను .

అప్పుడు విషయము అంతా తెలుసుకున్న కుంభకర్ణుడు రావణునితో "అన్నా !నీవు సీతాదేవి విషయములో చేసినది చాలా తప్పు నిన్ను ఇప్పటివరకు రాముడు చంపకుండా ఉండుట ,నీ అదృష్టము . నీవు ఇప్పుడు సలహా అడుగుట కంటే ,సీతాదేవిని అపహరించునపుడు మా అందరి సలహా అడిగివుంటే బాగుండేది . సరే జరిగినదేదో జరిగినది . యుద్ధ విషయములో నీవు బయపడనవసరము లేదు . రాముడు ఒక బాణము వేసి ,రెండవ బాణము తీసే లోపల నేను అతడి రక్తమును మొత్తము త్రాగివేసెదను . పర్వతాకారములో ఉన్నశరీరముతో నేను యుద్ధరంగములో ఉండగా నన్ను జయించుట దేవేంద్రుడికి సైతము సాధ్యము కాదు . ఇక సాధారణ మానవుడైన ,శ్రీరాముడు ఒక లెక్కా ?వారనులందరిని చంపివేయుదును . రాముడు మృత్యు ముఖమునకు చేరిన పిమ్మట సేత శాశ్వతముగా నీకు వశమవుతుంది . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పన్నెండవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము యుద్ధకాండ -పదకొండవసర్గ

                                  రామాయణము 

                                  యుద్ధకాండ -పదకొండవసర్గ 

రావణుని మంచి కోరి ,విభీషణుడు మంచి చెప్పినప్పటికీ ,రావణుడు వినిపించుకోలేదు . ఇప్పుడు యుద్ధము అనివార్యమని గ్రహించిన రావణుడు తక్షణ కర్తవ్యము ఆలోచించుటకు సభకు రధాన్ని అధిరోహించి ,సభా భవనమునకు వెళ్లి ప్రముఖులైన రాక్షసులకు సభకు రమ్మని కబురుపెట్టెను . రావణుడి కబురు అందుకున్న రాక్షస ప్రముఖులు వెనువెంటనే వారివారి రథాలను అధిరోహించి ,సభాభవనమునకు వెళ్లిరి . ముందుగా విభేషణుడు సభకు వచ్చి రావణుడి పాదాలకు నమస్కరించి ,తన ఆసనంపై కూర్చున్నాడు . మిగిలిన రాక్షసప్రముఖులు కూడా అదే విధముగా ముందుగా రావణుడి పాదములకు నమస్కరించి ,తమతమ ఆసనములపై కూర్చున్నారు . 

రామాయణము యుద్ధకాండ పదకొండవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .