Thursday 20 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునాల్గవసర్గ

                               రామాయణము 

                                యుద్ధకాండ -పదునాల్గవసర్గ 

కుంభకర్ణుడి ,మహాపార్శ్వుడి ,రావణుని మాటలు విన్న విభీషణుడు "మహారాజా !సీతాదేవి మీ కంటికి ఒక సుందరస్త్రీలా కనిపిస్తోందేమో ?కానీ నిజానికి ఆమె ఒక భయంకరమైన సర్పము వంటిది . ఆ సర్పము జోలికి వెళ్లిన ఎవడు ప్రాణములతో వుండలేడు . అటువంటి మహా సర్పమును నీ మెడకు చుట్టుకోకు . భయంకరమైన వానరసైన్యముతో రాముడు లంకపై దండెత్తక ముందే సీతను ఆమె భర్తకు అప్పగించు . నీవు కానీ ,కుంభకర్ణుడు కానీ ఇంద్రజిత్తు కానీ మహాపార్శ్వుడు కానీ ఇంకా మిగిలిన రాక్షస ప్రముఖులు కానీ యుద్దములో శ్రీరాముని ఎదురుగా నిలిచి బ్రతకలేరు . నీవు ఇంద్రుడి వెనక దాగుకున్నా ,పాతాళములో దాక్కున్నా రాముడి బాణముల నుండి తప్పించుకొనలేవు ". అని పలికెను . 
ఆ మాటలు విన్న ప్రహస్తుడు "మాకు దేవదానవయక్షగంధర్వకిన్నెరకింపురుషులలో ఎవరివల్లా భయములేదు ఇక సాధారణ మానవుడైన రాముడికి భయపడుట హాస్యాస్పదం "అని పలికెను . ఆ మాటలు విన్న విభీషణుడు "ప్రహస్తా !చెడు ప్రవర్తన కలవాడు ఏ విధముగా స్వర్గమును పొందలేడో ,నౌకలేనివాడు ఏ విధముగా సముద్రమును దాటలేడో అదే విధముగా సీతాపహరణ దోషము చేసిన రావణుడు కానీ అతని పరివారము కానీ రాముడిని యుద్దములో జయించలేరు . శ్రీరాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన పురుషోత్తముడు . అతడు అవలీలగా విరాధుడు ,కబంధుడు ,వాలి ,ఖరదూషణాదులు ఇంకా పదునాలుగువేల రాక్షసయోధులను పరిమార్చాడు . అట్టి మహావీరుడు ఎదుట దేవతలు కూడా ఓడిపోవుదురు . 

రావణుడు వ్యసన లొనుడై తానూ నశించుటే కాక సమస్త రాక్షస లోకమును నశింపచేయుటకు పూనుకొనియున్నాడు . మీరందరూ రావణుని హితులు అతడి చేత పెక్కు ప్రయోజనములు పొందినవారు . మిత్రులు . భయంకరములైన శక్తివంతములైన భూతములు పట్టిన వాడిని ,అతడి హితులు బలవంతముగా ఆ ప్రభావము నుండి లాగినట్టు ,మీరు ఇతడి జుట్టుపట్టి లాగి అయినను అనుచితమార్గము నుండి మరల్చండి . ప్రభువు హితము కోరి సముచిత సూచనలు చేయండి "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment