Thursday 20 June 2019

రామాయణము యుద్ధకాండ -పదమూడవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -పదమూడవసర్గ 

కుంభకర్ణుడి మాటలు విన్న రావణుడు కోపముతో ఊగిపోసాగెను . అది గమనించిన మహాపార్శ్వుడు లంకాధిపతి కోపము తొలగించుటకు "ప్రభూ !నీవు ఆ సీతకు సంవత్సరకాలం గడువు ఇవ్వవలిసిన అవసరము ఏమి వున్నది ?ఆమెకు ఇష్టము లేకున్నా వివాహము చేసుకొనవచ్చును కదా !ఎందుకు ఆమె అంగీకారము కొఱకు ఎదురుచూడటం ?ఆమెను బలవంతముగా తీసుకువచ్చినట్టే ,వివాహము కూడా చేసుకో "అని పలికెను . 
ఆ మాటలకు కొంత శాంతించిన రావణుడు "ఓ మహాపార్శ్వా !చాలాకాలము క్రితము జరిగిన ఒక రహస్య సంఘటనను నీకు ఇప్పుడు చెబుతాను విను . ఒకనాడు 'పుంజకస్థల 'అను అప్సరస బ్రహ్మదేవుడి వద్దకు ఆకాశమార్గములో వెళుతుండగా చూసి ఆమెను వివాహము చేసుకోవాలని బలవంతముగా తీసుకువచ్చుటకు ప్రయత్నించాను . కానీ అతి కష్టము మీద ఆమె నా నుండి తప్పించుకుని అట్లే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ,జరిగిన విషయము చెప్పినది . అప్పుడు బ్రహ్మదేవుడు కోపముతో నాకు "స్త్రీ కి ఇష్టములేకుండా బలవంతము చేస్తే మరుక్షణమే తలపగిలి చస్తావని శపించాడు "ఆ శాపమునకు భయపడే ఈ సీతను బలవంతముగా వివాహము చేసుకొనుట లేదు . ఈ లోకములో నా అంత శక్తివంతుడు మరొకడు లేడు . అది తెలియక రాముడు సైన్యముతో యుద్ధమునకు వచ్చుచున్నాడు . వజ్రతుల్యమైన నా బాణములతో ఆ రాముడిని క్షణములో పరిమార్చెదను "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment