Wednesday 26 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునైదవసర్గ

                                  రామాయణము 

                                       యుద్ధకాండ -పదునైదవసర్గ 

విభీషణుడు ఎంతో దూరదృష్టితో పలికిన పలుకులు విన్న ఇంద్రజిత్తు "ఓ పినతండ్రీ !నీవు పిరికివాని వలె నిరర్ధకములైన మాటలు మాట్లాడుతున్నావేమిటి ?మన పౌలస్త్య వంశములో ఇంతటి పిరికివాడు ఇప్పటివరకు పుట్టివుండలేదు . మానవమాత్రులైన రాకుమారులు మనముందు ఒక లెక్కా ?మనలోని ఒక సాధారణ రాక్షసుడు కూడా వారిని చంపగలడు . నీవు భయపడటమే కాకుండా మమ్మల్నందరినీ భయపెట్టుటకు చూస్తున్నావు . నేను త్రిలోకాధిపతి ఐన ఇంద్రుడినే రాజ్యభ్రష్టుడిని చేసి ,భూలోకములో బంధించాను . అప్పుడు దేవతలందరూ నాలుగువైపులా భయముతో పారిపోయారు . అంతటి మహావీరుడైన నాకు మానవమాత్రులు ఒక లెక్కా ?"అని పలికెను . 
ఇంద్రజిత్తు మాటలు విన్న విభీషణుడు "నాయనా !ఇంద్రజిత్తూ ! నీవు ఇంకా బాలుడవు ఈ విషయములు అన్ని అర్ధము చేసుకునే వయసు నీకు లేదు . నీవు బాల్యచాపముతో ఇలా పలుకుతున్నావు . శ్రీరాముని బాణములు బ్రహ్మదండములు వలె ,నిప్పులు గ్రక్కేవి . మృత్యుసమములు . "అని పలికి రావణునితో "మహారాజా !రత్నములు ,విలువైన ఆభరణములు ,దివ్యవస్త్రములు కానుకులుగా సమర్పిస్తూ సీతాసాధ్విని శ్రీరామునికి అప్పగించుట ఉత్తమము "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment