Thursday 27 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునాఱవసర్గ

                                 రామాయణము 

                                  యుద్ధకాండ -పదునాఱవసర్గ 

విభీషణుడు పలికిన మాటలు విన్న రావణుడు మిక్కిలి కోపముతో "ఓ విభీషణా !ప్రాణాపాయకరమై ,కోపముతో బుసలు కొట్టుచున్న మహా విషసర్పముతో కలిసి అయినా జీవించవచ్చును కానీ ,మిత్రుడి వలె ప్రవర్తించుచు ,శత్రుపక్షపాతబుద్ధితో వున్న జ్ఞాతితో మాత్రము ఎన్నడూ నివసింపరాదు . రాక్షసా !ఈ లోకములోని దాయాదుల స్వభావము నేను పూర్తిగా ఎరుగుదును . ఈ జ్ఞాతులందరూ తమ దాయాదులు దుఃఖములు పాలయినపుడు మిక్కిలి సంతోషపడుదురు . 
అదే వారు తమకంటే ఉన్నత స్థితిలో వున్నా ,విడవాసుడైనా ,కార్యదక్షుడైనా ,శూరుడైనా అట్టి వాడిని ఈ జ్ఞాతులు ఎల్లప్పుడూ అవమానించుచు ఉందురు . ఈ జ్ఞాతులు తమ దాయాదులు కష్టములలో ఉన్నప్పుడు చేయూతనివ్వకపోగా ,ద్రోహము తలపెట్టుచుందురు . మిక్కిలి ఆనందించుచుందురు . 
ఓ విభీషణా !నేను అన్నిలోకములలో గౌరవాదరములు పొందినవాడను ,ఐశ్వర్యవంతుడను ,ఉత్తమవంశమున జన్మించినవాడను ,శత్రువులను పాదాక్రాంతులను చేసుకొనినవాడను . ఇటువంటి నా ఔన్నత్యములు చూసి నాజ్ఞాతివైన నీవు ఇంతగా అసూయపడుచున్నావు . ఛీ !నీవు వంశమున చెడబుట్టినవాడవు . నా తమ్ముడవైనందున బ్రతికిపోయావు . నీవు త్రప్పు ఇంకొకరు ఇలా మాట్లాడినచో వారిని వెనువెంటనే చంపివేసెదను . "అని పలికెను . 
రావణుడు ఇలా పలుకగా ధర్మవర్తనుడైన విభీషణుడు 'ఇక ఇచట ఉండరాదు 'అని భావించి ,గదను చేతబూని ఆకాశములోకి ఎగిరెను . విభేషణుడి వేనుక మరో నలుగురు రాక్షసులు కూడా ఆకాశములోకి ఎగిరిరి . అలా ఆకాశములోకి ఎగిరిన విభీషణుడు ,రావణునితో "రావణా !నీవు నాకంటే పెద్దవాడివగుటచే ఇష్టము వచ్చినట్టు పలుకుచున్నావు . ఆయువు మూడినవారు తమ హితము కోరి పలికిన మంచి మాటలను చెవికి ఎక్కించుకోరు . ఆపద వచ్చినపుడు రాజు హితాహితములు పట్టించుకొనక రాజుకు నచ్చినట్టే మాట్లాడువారు ఈ లోకములో కోకొల్లలు . నీ హితము కోరే నేను పరుష వచనములు పలికితిని . అందులకు నన్ను క్షమించుము . ఏది ఏమైనను నిన్ను నీవు రక్షించుకొనుము . ఈ లంకా నగరమును కూడా రక్షించుకొనుము . నేను వెళ్లిపోవుచున్నాను . నీవు హాయిగా ఉండుము . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునాఱవసర్గ సమాప్తము . 

       శశి ,

ఎం.  ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment