Saturday 30 September 2017

రామాయణము కిష్కిందకాండ -నాల్గవసర్గ

                                      రామాయణము 

                                        కిష్కిందకాండ -నాల్గవసర్గ 

హనుమంతుడు లక్ష్మణుని మధుర వచనములు విని సుగ్రీవుని తలుచుకుని సుగ్రీవునికి మేలు జరుగునని సంతోషించి రామలక్ష్మణులతో "ఓ వీరులారా !వనములతో ,భయమకరమైన క్రూర మృగములతో దట్టముగా వున్న ఈ వనంలోకి మీరు ఎలా వచ్చితిరి . ?అని ప్రశ్నించగా లక్ష్మణుడు "ఓ వానరవీరా !దశరధుడు అను మహారాజు కలడు ఆయన మిక్కిలి ధార్మికుడు . పుత్రసంతానములేక పుత్రసంతానముకోసము వారు పుత్రకామేష్టి యాగము చేయగా తత్ఫలితముగా ఆయనకు నలుగురు పుత్రులు జన్మించారు . వారిలో అగ్రుడు శ్రేష్ఠుడు శ్రీరాముడు ,మా అన్నగారు నేను ఈయన చిన్న తమ్మడు లక్ష్మణుడిని . 

తండ్రి మాట నిలుపుటకై అన్నగారు సమస్త రాజ్యభోగములను ,రాజ్యాధికారమును విడిచి ,అడవులలో ఉండుటకు వచ్చెను . నేను ,ఆయన ధర్మపత్ని ,జనకనందిని అయిన సీతాదేవి ఆయనను అనుసరించి వచ్చితిమి . 

మేమెవరమూ లేని సమయము చూసి మాయావి ఐన ఒక రాక్షసుడు మా వదినగారిని అపహరించాడు . 

ఆవిడను వెతుకుతూ ఇచటికి వచ్చితిమి . కబంధుడు అనే రాక్షసుడు మరణించుతూ తన పూర్వరూపమును ధరించి సుగ్రీవుని కలిసిన సీతాదేవి జాడ తెలియును అని తెలిపెను . సుగ్రీవుని కొరకై అన్వేషించుచున్నాము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న హనుమంతుడు "ఓ రాకుమారులారా !మా రాజు సుగ్రీవునుకును మీ సహాయము అవసరము . అదృష్టవశమున మీ దర్శనము మాకు లభించినది . ప్రస్తుతము మా ప్రభువు తన అన్న వాలి తో వైరము ఏర్పడి రాజ్యభ్రష్టుడైనాడు . ఆ వాలి సుగ్రీవుని వంచించి ,ఆయనను రాజ్యభ్రష్టుడిని చేయుటయే కాక ఆయన భార్య రుమను అపహరించెను . తత్ఫలితముగా వనములపాలైతిమి . సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాదేవిని వెతుకుటకు మీకు సహాయపడగలడు . "అని పలికి బ్రాహ్మణరూపము వదిలి తన వానరరూపమును దాల్చి రామలక్ష్మణులు ఇరువురిని తన భుజములపై ధరించి సుగ్రీవుని వద్దకు తీసుకెళ్ళేను . 

రామాయణము కిష్కిందకాండ నాల్గవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Tuesday 19 September 2017

రామాయణము కిష్కిందకాండ -మూడవసర్గ

                               రామాయణము 

                                  కిష్కిందకాండ -మూడవసర్గ 

ఆంజనేయుడు సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు సన్యాసి వేషములో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి వారిని బాగుగా పొగిడి ,వారి రూపలావణ్యములను మెచ్చుకుని అచటకు వచ్చుటకు కల కారణమును అడిగెను . రామలక్ష్మణులు మాట్లాడక మౌనముగా ఉండుటచే ,తిరిగి ఆంజనేయుడు "స్వామీ !నా పేరు హనుమంతుడు అంటారు . నేను సుగ్రీవుడు మంత్రిని అతడు తన అన్న వలన బయపడి ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నారు . సుగ్రీవుడు బలపరాక్రమవంతుడు . సూర్యుని పుత్రుడు . అతడు మీతో స్నేహము చేయ కోరుతున్నాడు . మీ గురించి వివరములు తెలుసుకొనుటకు నన్ను మారు వేషములో ఇచటికి పంపినాడు . నేను వానరుడను "అని పలికి వారి సమాధానమునకై  నిరీక్షించుచు ఉండెను . 


రాముడు హనుమంతుడి  మాటలు విని లక్ష్మణుడితో "లక్ష్మణా !ఈ వచ్చినవాడు సకల శాస్త్రములను బాగుగా నేర్చినవాడు . వ్యాకరణశాస్త్ర విషయములను అన్నిటిని బాగుగా ఎరిగినవాడు . కావుననే ఇతని మాటలలో ఒక్క వ్యాకరణ దోషపదము లేదు . స్వరము మధ్యమ స్వరములో వున్నది . ఇతడితో తగు మర్యాదగా మాట్లాడుము . సుగ్రీవుడితో చెలిమి కోసము మనము వెతుకుతుండగా ,ఆయనే మన కొరకు పంపినాడు . ఈయన మాటలకు చంపుటకు కట్టి ఎత్తిన శత్రువు కూడా శత్రుత్వమును విడనాడును "అని పలికెను . 
లక్ష్మణుడు రాముడి మాటలు విని హనుమంతుడితో "ఓ వానరశ్రేష్టా !మహాత్ముడైన సుగ్రీవుని గుణగణములను కబంధుని వలన ఇదివరకే వినివుంటిమి . వానర ప్రభువైన సుగ్రీవుని వెతుకుతూ మేము ఇచటికి చేరితిమి . ఓ మారుతీ !మైత్రి విషయమున సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి . నీ సూచనలు మేము పాటించెదము . "అని పలికెను . పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని మాటలకు ఏంటో సంతోషించెను . సుగ్రీవుని కార్యము (సుగ్రీవుని  బాధలు తొలగునని )ఫలించునని సంతోషపడెను . 

         రామాయణము కిష్కిందకాండ మూడవసర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Sunday 17 September 2017

రామాయణము కిష్కిందకాండ -రెండవసర్గ

                                        రామాయణము 

                                         కిష్కిందకాండ -రెండవసర్గ 

చక్కని బలిష్టమైన రూపము ,శ్రేష్టమైన ఆయుధములు ధరించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు ,అతడితో వున్న మిగిలిన వానరులు మిక్కిలి బయపడసాగిరి . ఏమిచేయాలో ఆలోచించసాగిరి . సుగ్రీవుడు మాత్రము మిక్కిలి బయపడసాగెను అతడు తన మంత్రులతో "వీరు జింకచర్మము ధరించి సన్యాసుల వలేవున్నానూ ,వీరు శ్రేష్టమైన ఆయుధములను ధరించివున్నారు . కావున వీరిని తప్పకుండా వాలి పంపి ఉంటాడు . మనలను పరిమార్చుటకే వీరు ఇచటికి వచ్చివుంటారు . "అని పలికెను 

అప్పుడు ఆంజినేయుడు సుగ్రీవునికి ధైర్యము చెప్పి "వారు వాలి అనుచరులు అయివుండరు . వాలికి కల శాప కారణముగా ఈ పర్వతము మీదకు వచ్చుటకు ధైర్యము చెయ్యడు కావున నీవు భయపడవలిసిన అవసరము లేదు "అని పలికెను . అయినను సుగ్రీవునికి నమ్మకము కుదరక ఆంజినేయుడిని "వారి వద్దకు మారు వేషములో వెళ్లి వారితో తగిన విధముగా మాట్లాడి ,వారిని బాగుగా పొగిడి వారి నుండి విషయము రాబట్టుము "అని పలికెను . 
ఆవిధముగా సుగ్రీవుడు ఆంజినేయుడిని ఆజ్ఞాపించుటచే ఆంజినేయుడు రామలక్ష్మణుల వద్దకు మారు వేషములో వెళ్ళుటకు సంసిద్ధుడయ్యెను . 

రామాయణము కిష్కిందకాండ రెండవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 






Saturday 16 September 2017

రామాయణము కిష్కింధాకాండ -మొదటిసర్గము

                               రామాయణము 

                                కిష్కింధాకాండ -మొదటిసర్గము 

ఆ మనోహరములైన ప్రదేశములను చూచుచు రామలక్ష్మణులు ముందుకు నడుచుచుండిరి . ఆ ప్రదేశములు చూసి రాముడు సీతను గుర్తుతెచ్చుకుని మిక్కిలి వ్యాకులపడసాగెను . "లక్ష్మణా !నాకు సీత కనిపించినచో నేను సీతతో కలిసి ఇచటనే ఉండేదను . నాకు అమరసుఖములు కానీ అయోధ్యాధిపత్యము కానీ వద్దు . జానకి దొరికిన చాలు . అచట భరతుడు నాకోసము నందీ గ్రామములో ఉపవాసదీక్షలో భరతుడు బాధపడుతున్నాడు . రాక్షసుడి చే అపహరించబడి సీత ఎంత బాధపడుతున్నదో ,వారిరువురు అలా బాధపడుతుండగా నాకు ఈ రమ్యమైన ప్రకృతి ఏమాత్రము సంతోషమును కలిగించుటలేదు . 

పుణ్యాత్ముడైన జనకమహారాజు సీత క్షేమసమాచారమును ప్రశ్నించినచో నేనేమి సమాధానము చెప్పగలను . నా మీద కల ప్రేమతో కోరి ఈ వనములకు వచ్చి కష్టములు తెచ్చుకున్నది . కానీ నేను ఆమెను రక్షించలేకపోవుచున్నాను . "అని బాధతో మాట్లాడుతున్న రాముడితో లక్ష్మణుడు "అన్నా !బాధించకు వదిన తప్పక లభించును . ఆ రావణుడు పాతాళములో దాగివున్నను మన చేతిలో చావు తధ్యము . నీవు ఊరడిల్లుము "అని ఓదార్చెను . వారిరువురు అటుల మాట్లాడుకుంటూ ఋష్యమూక పర్వతము దగ్గరదగ్గరకు వచ్చిరి . వారిని చూసిన సుగ్రీవుడు ,ఇతర వానరులు వాలి పంపగా వచ్చిన వీరులని భావించి భయముతో అచటికి దగ్గరలో ఉన్న మాతంగమహర్షి ఆశ్రమములోకి పరుగిడిరి . 

రామాయణము కిష్కిందకాండ మొదటిసర్గము సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ .ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము అరణ్యకాండ -డబ్బదియైదవసర్గ

                                             రామాయణము 

                                           అరణ్యకాండ -డబ్బదియైదవసర్గ 

రామలక్ష్మణులు  ఆ శబరి చెప్పిన విశేషములను తలచుకుంటూ ,ఆ పంపా సరోవరం అందాలు చుట్టూ వున్నా వనములు చూసుకుంటూ వాటి మహాత్యములను తలచుకుంటూ ఋశ్యమూకపర్వతము వైపుగా అడుగులువేయసాగిరి . దారిలో కల ప్రకృతి సౌందర్యములు చూచుచున్నను రాముడికి ఏ మాత్రము సంతోషము కలుగకుండెను . అతడు సీతాదేవినే తలుచుకుని బాధపడసాగెను . పంపాసరస్సు లో స్నానమాచరించి వారు ముందుకు సాగసాగిరి . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియైదవసర్గసమాప్తము . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Friday 15 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదినాల్గవసర్గ

                                   రామాయణము 

                              అరణ్యకాండ -డబ్బదినాల్గవసర్గ 

రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన మార్గములో ప్రయాణించుచు ,పంపా సరోవరం యొక్క పశ్చిమమునకు చేరిరి . అచట శబరి ఆశ్రమమునకు చేరిరి . శబరి వారిని సముచితముగా ఆహ్వానించి సాదరముగా ఆదరించెను .

 అతిథిమర్యాదలు చేసెను . పిమ్మట శ్రీరాముడు శబరి ని కుశలప్రశ్నలు వేసెను . అప్పుడు శబరి "రామా !నిన్ను కన్నులారా చూచుటచే నా తపస్సు సిద్దించినది . నేనుఇచట మా గురువులు (మాతంగమహర్షి శిష్యులు )కు సేవలు చెసెదిదానను . నీవు చియారకూటములో వున్న సమయములో వారు దివ్యవిమానములు రాగా వాటిపై ఉన్నతలోకములకు వెడలిరి . వారు వెళ్తూ "శబరీ !నీవు ఇచటనే వుండుము . దశరథ తనయుడైన శ్రీరాముడు ఇచటికి వచ్చును . అతడి దర్శనభాగ్యముచే నీకు కైవల్యము ప్రాప్తించును "అని చెప్పిరి . ఆనాటి నుండి నీ కోసమే ఎదురుచూచుచు వున్నాను . "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు "శబరీ !మీ గురువుల గొప్పతనమును నేనునూ వింటిని . వారు నివసించిన ప్రదేశమును చూడగోరుతున్నాను "అని అడిగెను . అప్పుడా శబరి "మా గురువులు దివ్య గంగను ఆవాహన చేసినకారణముగా ఈ పంపా సరోవరం ఏర్పడినది . వారు పూజ చేసుకోను ప్రదేశము ఈ సరోవరమునకు పశ్చిమ దిశన వారు పూజచేసుకోను ప్రదేశము కలదు . ఈ దట్టమైన చెట్లతో ,మృగములతో కూడిన వనమును మాతంగవనము అని పిలిచెదరు , వారు ఉపవాసములచే కృశించి ,వార్ధక్యం చే వంగి న కారణముచే సప్త సముద్రముల చెంతకు వెళ్లలేక వాటిని  గూర్చి ఆలోచించుచుండగా అవే  వచ్చి ఇచట తీర్ధముగా ఏర్పడినవి . దీనిని సప్తసాగరతీర్ధము అని పిలిచెదరు . 
ఈ తీర్థమున వారు స్నానమాచరించి ,ఈ చెట్లపై వారి వస్త్రములను ఆరబెట్టుకునేవారు . వారి స్పర్శ కారణముగా అవి నేటికీ చెక్కుచెదరక ఉండెను . వారు కమలములు ,కలువలు మొదలగు పూలతో దేవతలను పూజించెడివారు . ఆ పూలు నేటికీ వాడక వున్నవి . ఓ రామా !ఈ వనశోభలను కన్నులారా గాంచితివి . దాని మహాత్యమును పూర్తిగా వింటివి . మీ అనుమతి అయినచో ఈ దేహమును పరిత్యజించాకోరుచున్నాను . నేను ఈ ఆశ్రమమున పరిచారికాని కనుక నేనునూ ఆ దివ్యపురుషుల కడకే చేరెదను "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు" శబరీ నీ అతిధి మర్యాదలకు ,నీవు చెప్పిన విషయములకు ఎంతో సంతోషించాను . నీకు నచ్చినచోటికి వెళ్లుము "అని అనుమతి ఇచ్చెను . శబరి అప్పటికప్పుడే తన శరీరమును అగ్నికి ఆహుతి చేసి దివ్య ఆభరణాలు ,వస్త్రములు ధరించి దివ్య తేజస్సుతో పరంధామమునకు చేరెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదినాల్గవసర్గసమాప్తము . 

                                    శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 11 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదిమూడవసర్గ

                                           రామాయణము 

                                          అరణ్యకాండ -డబ్బదిమూడవసర్గ 

కార్యసాధన గూర్చి బాగుగా ఎరిగిన కబంధుడు ఇంకనూ రామునితో "ఓ రామా !పశ్చిమ దిశగా వెళ్లుము దారిలో మీకు రసవంతమైన ఫలములతో కూడిన పెక్కు చెట్లు కలవు వాటి ఫలములు అమృతతుల్యములు . ఆ దిశగా వెళ్తూ దారిలోని పర్వతములు అన్ని దాటుతూ పంపాసరోవరము చేరుము . అచటి నీరు మిక్కిలి నిర్మలములు . రామా !అచటి కానుగ చెట్లు నిరంతరము పూలతో నిండి ఉండును . మాతంగమహర్షి శిష్యుల ప్రభావమున ఆ పూలను ఎవ్వరు త్రుంపలేరు . మాలలుగా ధరించలేరు ,అవి వాడవు ,తరగవు . 
పూర్వము మతంగ మహర్షి శిష్యులు అచట నివసించుచుండెడివారు . వారు ఎంతో భక్తి శ్రద్దలతో తమ గురువు కొరకు ఫలములు సమిధలు తెచ్చెడివారు . వాటి బరువుకు వారికి పట్టిన స్వేదములు గాలివశమున చెట్లపై పడి పూలుగా మారినవి కావున అవి వాడవు . శిష్యులందరూ అచటి నుండి వెళ్ళిపోయినప్పటికీ ఒక సన్యాసిని మాత్రము అచటనే వున్నది . ఆమె "శబరి "ఆమె దీర్గాయురాలు . నిన్ను దర్శించిన పిమ్మట ఆమె స్వర్గమునకు చేరును . 
క్రమముగా పంపాసరోవరము పశ్చిమము వైపుకు చేరినచో అచట ఒక దివ్య ఆశ్రమము కలదు . ఆ ఆశ్రమము చెంతకు చేరుట సామాన్యులకు దుర్లభము , ఆ ఆశ్రమమునకు సమీపముననే ఋశ్యమూకం అను పేరు కల పర్వతము కలదు . ఆ ఋష్యమూక పర్వతముపై నిదురించిన వారికి వారి కలలో లభించిన సంపదలు నిజముగా లభించును . దురాచారుడు నిదురించునపుడు అతడిని రాక్షసులు పట్టుకుని చంపుదురు . ఆ పర్వతముపై రకరకములైన గజములు మొదలగు జంతువులూ తిరుగుచుండెను . ఆ ఋష్యమూక పర్వతముపై ఒక గుహ కలదు . సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కలిసి ఆ గుహ నందే వసించుచున్నాడు . "అని పలికి రాము ఐ ఆజ్ఞకై ఆకాశమునే నిలిచి ఉండెను . రామలక్ష్మణులు "ఇకనీవు వేళ్ళు "అని కబంధునికి ఆజ్ఞ ఇచ్చిరి . పిమ్మట కబంధుడు స్వర్గమునకు చేరెను . 

రామాయణము అరణ్యకాండ దబ్బదిమూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











Saturday 9 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ

                                  రామాయణము 

                                అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ 

రామలక్ష్మణులు కబంధుని మాటలు విన్న తర్వాత ,గిరి సమీపమున గోతిని తవ్వి అందు కబంధుని పడవేసి అతడి దేహమును కట్టెలతో ఎండు ఆకులతో దహనమొనర్చిరి . అతడి దేహము పూర్తిగా దహనమయిన పిమ్మట ఒక దివ్య తేజస్సుతో కూడి దివ్యాభరణములు ,వస్త్రములు ధరించిన ఒక దివ్యపురుషుడు ఆ చితి మంటలనుండి వచ్చెను . అతడు "రామా !నాకు శాప విమోచనము కలిగించినందుకు కుతజ్ఞుడను . 
నీకు నీ భార్య సీతాదేవి లభించుటకు ఒక వీరుడితో స్నేహము చేయుట ఉత్తమము అని నా భావన . కిష్కింద అను వానర రాజ్యమునకు వాలి రాజు అతడు వానరుడు . అతడు ఇంద్రుని అంశతో జన్మించాడు . అతడి తమ్ముడు కారణాంతరముల వలన అతడి అన్న గారిచే రాజ్యము నుండి వెడలగొట్టబడి ఋశ్యమూకం అను పర్వతముపై నలుగురు వానరులతో కలిసి జీవించుచున్నాడు . అతడికి ఈ భూమి మీద తెలియని ప్రదేశము లేదు . సూర్యుడి కాంతి పడు యావత్ భూమి అతడికి తెలుసు . 
అతడు సీతాదేవిని అన్వేషించుటలో నీకు తప్పక తోడ్పడగలడు . అతడికి నీవు చేయవలసిన సహాయము ఒకటి కలదు ఆ పని నీ వలన అయినను అవకపోయినను అతడు నీకు సహాయపడగలడు . అతడు వానరుడని చులకనగా చూడకు . సీతను ఎత్తుకెళ్లిన రాక్షసుడు ఆమెను మీరు పర్వతముపై దాచినను ,పాతాళములో దాచినాను వాడిని చంపి ఆమెను నీకు అప్పగించగల సమర్థుడు . కావున నీవు అతడితో మైత్రి ఏర్పరుచుకొనుము . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదిరెండవసర్గసమాప్తము . 

                                      శశి ,

ఎం . ఏ, ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








  

Friday 8 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ

                                 రామాయణము 

                              అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ 

మహానుభావా !రామా !పూర్వము నేను మిక్కిలి సుందరమైన రూపము కలిగి స్ఫురద్రూపి (కావలిసిన రూపము లోకి మారగల శక్తి కలవాడి)నై అప్పుడప్పుడు భయంకరమైన రూపము ధరించి ,అరణ్యములలో తపము చేయుచున్న మునుల చెంతకు వెళ్లి వారిని భయపెట్టుచుండెడివాడను . ఒకరోజు స్థూలశిరుడు అను పేరుకల ఒక మహర్షిని నేను ఆ విధముగానే భయపెట్టితిని . అప్పుడా మహర్షి కోపముతో" లోకభయంకరమైన ఈ రూపమే నీకు శాశ్వతముగా ఉండిపోవును "అని శపించెను . 

అప్పుడు నేను నా అపరాధమును గ్రహించి కరుణించమని ఆ మునిని వేడుకొనగా ,ఆ ముని ఇక్ష్వాకువంశీయుడైన శ్రీరాముడు నీ చెంతకు వచ్చి ,నీ భుజములను ఖండించి ,నిన్ను అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు నీకు శాప విముక్తి కలుగునని ఆ ముని చెప్పెను . అప్పటి నుండి రాక్షసాకారములో నేను ఉండిపోయితిని . అప్పుడు నేను బ్రహ్మకై ఘోర తపమొనర్చి ఆయనను మెప్పించి వరములను పొందితిని . ఆ వర గర్వముచే నేను దేవేంద్రుడిపైకి యుద్ధమునకు వెళ్ళితిని . 
అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధముచే నా శిరస్సుపై కొట్టెను . అప్పుడు నా శిరస్సు ,కాళ్ళు పొట్టలోకి కూరుకుపోయేను . అప్పుడు నేను దేవేంద్రునితో ఇటుల వున్న నేను ఎలా బతకగలను అని ప్రార్ధించగా దేవేంద్రుడు దయతలిచి నాకు పొడవైన చేతులను ,పొట్టపై నోటిని ప్రసాదించెను . అప్పటి నుండి నేను ,నా దీర్ఘబాహువులతో దొరికిన మృగములను పట్టి తింటూ బ్రతుకుచున్నాను . ఎప్పటికైనను రాముడు వచ్చి నాకు ఈ రూపము నుండి విముక్తి కలిగించునని ఎదురుచూచుచున్నాను . ఓ రామా !నీవు తప్ప నన్ను ఎవరు చంపజాలరు . కావున నన్ను దహనమొనర్పి ముక్తిని కలిగించు "అని ప్రార్ధించెను 
అప్పుడు శ్రీరాముడు కబంధునితో "కబంధా !నేను నా తమ్ముడు లేకుండుట చూసి ,నా భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు . నాకు అతడి పేరు తప్ప వివరములు ఏమియు తెలియవు . ఒకవేళ నీకు తెలిసినచో చెప్పుము "అని అడిగెను . అప్పుడా కబంధుడు రామా ఈ రూపములో నాకు జ్ఞానము లేదు నీవు నన్ను దహనమొనర్చినచో నేను నీకు తెలిసినంతవరకూ చెప్పగలను . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం .ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday 7 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదియవసర్గ

                                           రామాయణము 

                                                అరణ్యకాండ -డబ్బదియవసర్గ 

తన చేతులలో చిక్కుకున్న రామలక్ష్మణులను చూసి కబంధుడు ఓ క్షత్రియ శ్రేష్ఠులారా !నా ఆకలి సమయములో బాగుగా దొరికినారు . నాకు మిమ్ములను ఆహారముగా ఆ దేవుడే పంపినాడు . "అని పలికెను . ఆ మాటలు విన్న రామలక్ష్మణులు ఆ రాక్షసుడి భుజములను నరికివేసిరి . శ్రీరాముడు కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేసినారు . అప్పుడా రాక్షసుడు భూమ్యాకాశములు ,దశదిశలు పిక్కటిల్లేలా అరుస్తూ నేలపై పడిపోయెను . 

అపుడా రాక్షసుడు ఆ రఘువీరులను చూసి 'మీరెవరని ప్రశ్నించెను . అప్పుడు లక్ష్మణుడు "ఈయన రఘువంశతిలకుఁడైన శ్రీరాముడు నేను ఈయన తమ్ముడు లక్ష్మణుడను .ఈ రామచంద్రుని భార్య  ను  ఒక రక్కసుడు అపహరించుటచే ఆమెను వెతుకుచూ ఇలా వచ్చితిమి . నీవెవరు ? కంఠము ,ముఖము లేక ఇటుల వికృతముగా ఎందులకు ఉంటివి ?"అని ప్రశ్నించగా ఆ రాక్షసుడు తన గాధను జ్ఞప్తికి తెచ్చుకుని వారికి తన కథను చెప్పసాగెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Monday 4 September 2017

రామాయణము అరణ్యకాండ -అరువదితొమ్మిదవసర్గ

                                                      రామాయణము 

                                                        అరణ్యకాండ -అరువదితొమ్మిదవసర్గ 

రామలక్ష్మణులు జటాయువుకి జలతర్పణములు అర్పించినపిమ్మట నైరుతి దిశగా సీతాదేవిని వెతుకుతూ నడసాగెను . ఆ మార్గము దట్టమైన చెట్లతో పొదలతో ప్రవేశించుటకు వీలులేకుండా ఉండెను . ఆ అరణ్యమున రామలక్ష్మణులు నడుచుచు ముందుకు సాగుతుండెను . అచట వారికి ఒక గుహ కనిపించెను . ఆ గుహ వద్ద స్థూలకాయురాలైన ఒక రాక్షసి ఉండి వీరిని అడ్డగించెను . లక్ష్మణుడు ఆ రాక్షసి ముక్కు చెవులు కోసివేసెను . అప్పుడా రాక్షసి బిగ్గరగా అరుస్తూ అచటి నుండి పారిపోయెను . 
రామలక్ష్మణులు ఆ అరణ్యములో ముందుకు సాగుతుండగా లక్ష్మణునినికి అనేక దుశ్శకునములు ఎదురయ్యెను . అందువలన వారిరువురు ,ధనుర్భాణములను ధరించి సిద్ధముగా ఉండెను . అంత కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారముకల ఒక రాక్షసుడు వారికి కనిపించెను .. అతడికి ముఖము ,మెడ లేకుండెను . పొట్టలో నోరు ఉండెను . అతడి చేతులు మిక్కిలి పొడుగుగా ఉండెను . మొండెము ఒక్కటే ఉండుటచే ఆ రక్కసుడు మిక్కిలి భయంకరముగా ఉండెను . 

ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూసి తన చేతులతో వారిని చెరో చేతితో మిక్కిలి గట్టిగా పట్టుకొనెను . రాముడు ధైర్యము సడలక ఉండెను కానీ ,లక్ష్మణుడు ప్రాణ సమానుడైన తన అన్నగారు ఆ రాక్షసుడు చేతిలో చిక్కుకొనుట చూసి దిగులుపడెను . పిమ్మట అతడు రాముడితో "అన్నా !నా గురించి ఆలోచించకు ,నన్ను వీడికి ఆహారముగా వదిలి నీవు వెడలిపో నీకు వదిన తప్పక దొరుకును . నన్ను మాత్రము మరువకుము "అని పలికెను . 
తమ్ముడి మాటలకు రాముడి ధైర్యము కొద్దిగా సడలేను కానీ ,లక్ష్మణుని చూసి ధైర్యము తెచ్చుకొనెను . 

రామాయణము అరణ్యకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .