Monday 11 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదిమూడవసర్గ

                                           రామాయణము 

                                          అరణ్యకాండ -డబ్బదిమూడవసర్గ 

కార్యసాధన గూర్చి బాగుగా ఎరిగిన కబంధుడు ఇంకనూ రామునితో "ఓ రామా !పశ్చిమ దిశగా వెళ్లుము దారిలో మీకు రసవంతమైన ఫలములతో కూడిన పెక్కు చెట్లు కలవు వాటి ఫలములు అమృతతుల్యములు . ఆ దిశగా వెళ్తూ దారిలోని పర్వతములు అన్ని దాటుతూ పంపాసరోవరము చేరుము . అచటి నీరు మిక్కిలి నిర్మలములు . రామా !అచటి కానుగ చెట్లు నిరంతరము పూలతో నిండి ఉండును . మాతంగమహర్షి శిష్యుల ప్రభావమున ఆ పూలను ఎవ్వరు త్రుంపలేరు . మాలలుగా ధరించలేరు ,అవి వాడవు ,తరగవు . 
పూర్వము మతంగ మహర్షి శిష్యులు అచట నివసించుచుండెడివారు . వారు ఎంతో భక్తి శ్రద్దలతో తమ గురువు కొరకు ఫలములు సమిధలు తెచ్చెడివారు . వాటి బరువుకు వారికి పట్టిన స్వేదములు గాలివశమున చెట్లపై పడి పూలుగా మారినవి కావున అవి వాడవు . శిష్యులందరూ అచటి నుండి వెళ్ళిపోయినప్పటికీ ఒక సన్యాసిని మాత్రము అచటనే వున్నది . ఆమె "శబరి "ఆమె దీర్గాయురాలు . నిన్ను దర్శించిన పిమ్మట ఆమె స్వర్గమునకు చేరును . 
క్రమముగా పంపాసరోవరము పశ్చిమము వైపుకు చేరినచో అచట ఒక దివ్య ఆశ్రమము కలదు . ఆ ఆశ్రమము చెంతకు చేరుట సామాన్యులకు దుర్లభము , ఆ ఆశ్రమమునకు సమీపముననే ఋశ్యమూకం అను పేరు కల పర్వతము కలదు . ఆ ఋష్యమూక పర్వతముపై నిదురించిన వారికి వారి కలలో లభించిన సంపదలు నిజముగా లభించును . దురాచారుడు నిదురించునపుడు అతడిని రాక్షసులు పట్టుకుని చంపుదురు . ఆ పర్వతముపై రకరకములైన గజములు మొదలగు జంతువులూ తిరుగుచుండెను . ఆ ఋష్యమూక పర్వతముపై ఒక గుహ కలదు . సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కలిసి ఆ గుహ నందే వసించుచున్నాడు . "అని పలికి రాము ఐ ఆజ్ఞకై ఆకాశమునే నిలిచి ఉండెను . రామలక్ష్మణులు "ఇకనీవు వేళ్ళు "అని కబంధునికి ఆజ్ఞ ఇచ్చిరి . పిమ్మట కబంధుడు స్వర్గమునకు చేరెను . 

రామాయణము అరణ్యకాండ దబ్బదిమూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment