Friday 15 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదినాల్గవసర్గ

                                   రామాయణము 

                              అరణ్యకాండ -డబ్బదినాల్గవసర్గ 

రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన మార్గములో ప్రయాణించుచు ,పంపా సరోవరం యొక్క పశ్చిమమునకు చేరిరి . అచట శబరి ఆశ్రమమునకు చేరిరి . శబరి వారిని సముచితముగా ఆహ్వానించి సాదరముగా ఆదరించెను .

 అతిథిమర్యాదలు చేసెను . పిమ్మట శ్రీరాముడు శబరి ని కుశలప్రశ్నలు వేసెను . అప్పుడు శబరి "రామా !నిన్ను కన్నులారా చూచుటచే నా తపస్సు సిద్దించినది . నేనుఇచట మా గురువులు (మాతంగమహర్షి శిష్యులు )కు సేవలు చెసెదిదానను . నీవు చియారకూటములో వున్న సమయములో వారు దివ్యవిమానములు రాగా వాటిపై ఉన్నతలోకములకు వెడలిరి . వారు వెళ్తూ "శబరీ !నీవు ఇచటనే వుండుము . దశరథ తనయుడైన శ్రీరాముడు ఇచటికి వచ్చును . అతడి దర్శనభాగ్యముచే నీకు కైవల్యము ప్రాప్తించును "అని చెప్పిరి . ఆనాటి నుండి నీ కోసమే ఎదురుచూచుచు వున్నాను . "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు "శబరీ !మీ గురువుల గొప్పతనమును నేనునూ వింటిని . వారు నివసించిన ప్రదేశమును చూడగోరుతున్నాను "అని అడిగెను . అప్పుడా శబరి "మా గురువులు దివ్య గంగను ఆవాహన చేసినకారణముగా ఈ పంపా సరోవరం ఏర్పడినది . వారు పూజ చేసుకోను ప్రదేశము ఈ సరోవరమునకు పశ్చిమ దిశన వారు పూజచేసుకోను ప్రదేశము కలదు . ఈ దట్టమైన చెట్లతో ,మృగములతో కూడిన వనమును మాతంగవనము అని పిలిచెదరు , వారు ఉపవాసములచే కృశించి ,వార్ధక్యం చే వంగి న కారణముచే సప్త సముద్రముల చెంతకు వెళ్లలేక వాటిని  గూర్చి ఆలోచించుచుండగా అవే  వచ్చి ఇచట తీర్ధముగా ఏర్పడినవి . దీనిని సప్తసాగరతీర్ధము అని పిలిచెదరు . 
ఈ తీర్థమున వారు స్నానమాచరించి ,ఈ చెట్లపై వారి వస్త్రములను ఆరబెట్టుకునేవారు . వారి స్పర్శ కారణముగా అవి నేటికీ చెక్కుచెదరక ఉండెను . వారు కమలములు ,కలువలు మొదలగు పూలతో దేవతలను పూజించెడివారు . ఆ పూలు నేటికీ వాడక వున్నవి . ఓ రామా !ఈ వనశోభలను కన్నులారా గాంచితివి . దాని మహాత్యమును పూర్తిగా వింటివి . మీ అనుమతి అయినచో ఈ దేహమును పరిత్యజించాకోరుచున్నాను . నేను ఈ ఆశ్రమమున పరిచారికాని కనుక నేనునూ ఆ దివ్యపురుషుల కడకే చేరెదను "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు" శబరీ నీ అతిధి మర్యాదలకు ,నీవు చెప్పిన విషయములకు ఎంతో సంతోషించాను . నీకు నచ్చినచోటికి వెళ్లుము "అని అనుమతి ఇచ్చెను . శబరి అప్పటికప్పుడే తన శరీరమును అగ్నికి ఆహుతి చేసి దివ్య ఆభరణాలు ,వస్త్రములు ధరించి దివ్య తేజస్సుతో పరంధామమునకు చేరెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదినాల్గవసర్గసమాప్తము . 

                                    శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment