రామాయణము
అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ
శ్రీరాముడు జటాధారి అగుట ,నారచీరలు ధరఁచుట మొదలగు విషయములు విని ,భరతుడు తట్టుకొనలేక బిగ్గరగా ఏడవసాగెను . పక్కనే ఉన్న శత్రుఘ్నుడు భరతుని ఓదార్చుటకు యత్నించెను . ఏడ్పులు విని ముగ్గురు మాతలు అచటికి వచ్చిరి . కౌశల్య భరతుని దీన స్థితిని చూసి చలించిపోయి ,భరతుని అక్కున చేర్చుకుని ఏడవసాగెను . భరతునితో "నాయనా ఏమయినది ఎందుకిలా అయిపొతున్నావ్ ?ఈ సమస్త ఇక్ష్వాకు వంశమునకు నేవే దిక్కు . ఏమయినది ?మీ అన్న గురించి ఏమయినా అప్రియముగా విన్నావా ?"అని ప్రశ్నించెను .
అప్పుడు భరతుడు తేరుకుని "అమ్మా !ఏమిలేదు మీరు కంగారు పడకండి నేను ఎట్టి అప్రియ పలుకులు వినలేదు "అని ఆవిడను ఓదార్చెను . పిదప భరతుడు అచటి నుండి బయటకు వచ్చి గుహునితో "ఓ నిషాద రాజా !మా అన్నా వదినలు ఏమి భుజించారు ?ఎక్కడ విశ్రమించారు ?నా మీద దయ ఉంచి తెలుపుడు అని పలుకగా ,గుహుడు తనకు అత్యంత ప్రియమైన శ్రీరాముని గురించి అడుగుటచే మిక్కిలి ఉత్సాహముతో
"భరతా !రామ ఆగమన వార్త విని నేను అనేక ఫలములు ,తినుబండారములు ,రసములు ,తేనే మున్నగు అనేక పదార్థములను ఆయన చెంతకు తీసుకువెళ్లి శ్వీకరించమని కోరితిని . కానీ శ్రీరాముడు నేను క్షత్రియుడిని ఒకరికి ఇచ్చుట కానీ ఒకరినుండి తీసుకొనరాదు అని చెప్పి మమ్ములను ఒప్పించెను . లక్ష్మణుడు వారికై తెచ్చిన జలములు మాత్రమే తీసుకుని సీతారాములు ఆ రాత్రి ఉపవసించిరి . సీతారాములు తాగగా మిగిలిన నీటిని తాగి లక్ష్మణుడు ఆరోజు ఉపవసించెను . లక్ష్మణుడు స్వయముగా ఏర్పరిచిన దర్భ శయ్యపై సీతారాములు విశ్రమించిరి . ఇదిగో ఇక్కడే ఆ రోజు సీతారాములు విశ్రమించారు . వారు విశ్రమించిన పిదప లక్ష్మణుడు విశ్రమించక వారిని జాగరూపుడై రక్షించెను . నేనును ధనుర్భాణములు ధరించి లక్ష్మణునితో పాటు జాగరూకుడనై ఉంటిని . నా సైన్యము సైతము ఆ రాత్రి మాతో పాటు ఉండెను . "అని గుహుడు భరతునికి ఆ ఆయా ప్రదేశములను చూపించెను .
రామాయణము అయోధ్యకాండ ఎనుబదియేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment