Wednesday, 15 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూటరెండవసర్గ

                                            రామాయణము 

                                          అయోధ్యకాండ -నూటరెండవసర్గ 

భరతుడు చెప్పిన తండ్రి మరణవార్త విని నిశ్చేష్టుడయ్యెను . చేతులు " అయ్యో తండ్రీ మమ్ము వీడి ఎక్కడకు వెల్తివి "అంటూ బిగ్గరగా ఏడ్చుచు నేలపై పడి స్పృహ కోల్పోయెను . సీతా ,లక్ష్మణ,భరత ,శత్రుఘ్నులు రాముని చుట్టూ చేరి ఎడ్వసాగిరి. వారి అశ్రువులతో రాముని శరీరము తడిసిపోయెను . కొంతసేపటికి స్పృహ తెచ్చుకున్న రాముడు తమ్ములను కౌగలించుకుని ఏడ్చెను . 
పిమ్మట భరతునితో "భరతా !తండ్రి నా  వియోగముతో మరణించెను . చివరి చూపుకు నేను నోచుకోలేకపోతిని . ఆయనకు నిర్వర్తించవలసిన కార్యములు ఏమి చేయలేని వాడనయ్యాను . వారికి ఉత్తరక్రియలు నిర్వర్తించి నీవు ఆయన ఋణము తీర్చుకుంటివి . నీవు మిక్కిలి అదృష్టవంతుడివి . తండ్రి లేని అయోధ్యతో ఇక నాకు పనిలేదు . నా వనవాసము పూర్తయ్యిన పిదప కూడా నేను అయోధ్యలో అడుగుపెట్టలేను . 
మన తండ్రి నిరంతరము ఎన్నో మంచి విషయము చెబుతుండేవారు . నన్ను ఆజ్ఞాపించేవారు . నా మీద మిక్కిలి అభిమానము చూపించెడివారు . ఇక మీదట నాతొ అలా ఎవరు ఉండగలరు ?"అంటూఎడ్వసాగెను  . అన్నదమ్ములు నలుగురు ఒకరినొకరు పట్టుకొని ఎడ్వసాగిరి . పిదప సుమంత్రుడు ,వశిష్ఠుడు మున్నగు వారు వారిని ఓదార్చెను . పిదప వారందరూ మందాకినీ నదీ తీరమునకు వెళ్లిరి . అచట శ్రీరాముడు తండ్రికి తర్పణములు విడిచెను . 
పిదప అతడు తినే గారే పిండి ,రేగిపళ్ళు మొదలగు పదార్థములతో తండ్రికి పిండము పెట్టెను . శ్రీరాముడు తమ్ములను చూచి "మహారాజుకి గారే పిండితో పిండము పెట్టవల్సివచ్చినది . జనులు వారు తిను ఆహారమునే దేవతలకు నివేదనగా పెట్టుదురు కదా "అంటూ ఏడ్చెను . తమ్ములు కూడా ఏడ్చిరి . వారి ఏడుపులు విన్న సేన ఏమయినదో అని ఆందోళన పడుతూ ఆ రోదన వినపడిన దిశగా త్వరత్వరగా వచ్చిరి . చిత్రకూట పర్వతముపై దర్భాసనముపై కూర్చున్న శ్రీరాముని వద్దకు జనులు వచ్చి వారి పాదములపై పడి ఎడ్వసాగిరి . శ్రీరాముని చూసి కొద్దికాలమే అయినను పెక్కుకాలము అయినట్లుగా వారు ఎడ్వసాగిరి . శ్రీరాముడు వారిని లేపి హత్తుకొనెను . వారందరి రోదనలతో ఆ అరణ్యములోని గుహలు మారుమ్రోగేను . 

రామాయణము అయోధ్యకాండ నూటరెండవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







 

No comments:

Post a Comment