Wednesday 27 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -4)

           సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -4)

ఆ విధముగా పరమేశ్వరుడి అందు కోపము కలిగి ఉన్న దక్షుడు ,దానం చేసి యజ్ఞ యాగాది క్రతువులందు పరమేశ్వరునికి లేకుండా చేయ సంకల్పించి మహా మునులను రావించి తన ఇంట వాజిపేయంబను ఒక యాగమును మొదలుపెట్టెను . తదననంతరం మరియొక యజ్ఞమును అద్భుతంబగు సన్నాహంబులతో చేయదలిచి సకలలోకములలో వున్న వారందరినీ పిలిచెను అల్లుడి పై అలుక కారణం గా సతీ శంకరులను మాత్రం పిలవలేదు . 
 



విశ్వకర్మచే నిర్మింపబడిన యాగాశాలయందు  యాగమును తిలకించుటకు వచ్చిన వారందరూ కూర్చున్నారు . ఇంద్రుడు ,విష్ణుమూర్తి ,యక్షులు ,సిద్దులు ,సాద్యులు ,గంధర్వులు ,దేవతలు ,దానవులు ,మొదలగు సకల జనులచే యజ్ఞశాల కనుల పండుగగా ఉండెను . దక్షుడు యజ్ఞదీక్ష వహించి ధర్మపత్నీ సమేతముగా నిలిచి వుండగా మారీచుడాదిగా గల మహర్షులు సతీ శంకరులను పిలువలేదా అని ప్రశ్నించిరి . అప్పుడు దక్షుడు అహంకారంతో ,కోపముతో ,ఎర్రబడిన కన్నులతో పరమేశ్వరుడిని అనేక రకాలుగా నిందించుచు స్మశానవాసి ,పిశాచ నాయకుడు ,కపాల పాత్ర అందు భుజించువాడు అగు శివుడికి ఈ మహా యాగములొ పాల్గొను అర్హత లేదు కావున పిలవలేదని చెప్పెను . అతని మాటలు విన్న కొందరు శివుడ్ని దుషించుటే కాదు ఆ మాటలు విన్నా పాపం చుట్టుకుంటుందని అక్కడనుండి వెళ్ళిపోయిరి . పరమేశ్వరుడు లేనిచో ఈ యజ్ఞము పూర్తి కాదని శివుడు లేని ఈ యజ్ఞం వల్ల యజ్ఞ కర్తలకు ప్రేక్షకులకు కూడా అనేక ఆపదలు వస్తాయని దధీచి యక్షునకు చెప్పి ,గౌతముడు మొదలయిన మునులను తీసుకుని వెళ్ళిపోయెను . ఈ విధముగా యజ్ఞశాలను విడిచి అనేక మంది వెడలిపోయెను . అలా వెళ్ళే వారందరినీ దక్షుడు పాషండులు ,పాపాత్ములు అని నిందించుచు ఉండెను . 
దక్ష ప్రజాపతి యజ్ఞమును చేయుచున్నారని ,ఆ యాగమునకు విశ్వా దేవతలు ,మరుత్తులు ,గాంధర్వ ,సిద్ద ,విద్యాధర ,కిన్నెర ,యక్ష మొదలగు దేవతా ముఖ్యులు ,కశ్యప ,అగస్త్య వామదేవాశ్రి ,భ్రుగు ,మరీచ ,నారద ,పరాశర ,గర్గ ,భార్గవ మొదలగు పరమ మునీంద్రులు వెళ్ళారని , తన చెలికత్తెలచె తెలుకున్న సతీ దేవి ,పరమేశ్వరుడి ని దాని గూర్చి అడుగగా శివుడు "దేవీ మీ తండ్రి మనలను పాపకర్ములమని ,హీనులమని ,భావించి ఆహ్వానించలేదు  . పిలువకుండా వెళ్తే కష్టములు ప్రాప్తిస్తాయి . నీ సంకల్పం గ్రహించి వున్నాను . నీవు అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నము మానుకొనుట మంచిది . "అని హితవు చెప్పెను . తల్లి తండ్రులపై గల సహజ ప్రేమతో సతీ దేవి "పుట్టింటికి వెళ్ళుటకు ఆహ్వానం ఎందుకు ?మిమ్ము ఆహ్వానింప లేదు కావున మీరు రావద్దు . నేను వెళ్లి మా తండ్రి మిమ్ములను ఎందుకు ఆహ్వానించలేదో కారణము తెలుసుకుని మిమ్ములని ప్రార్ధించి పిలుచుకు పోయేట్లు యథ్నించెదను . కావున రుద్ర గణమును సహాయముగా ఇచ్చి నన్ను పంపమని "ప్రార్ధించెను . అయినా పరమేశ్వరుడు అంగీకరించక పోవడముతో సతీ దేవి ఆయన పాదములపై పడి పంపమని ప్రార్ధించెను . కాదనలేక ఈశ్వరుడు నందీశ్వరుడిని రక్షకుడిగా నియమించి రుద్ర గణములను తోడుగా ఇచ్చి పంపెను . 
ఆ విధముగా సతీ దేవి దక్ష యజ్ఞమునకు బయలుదేరినది . 




శశి ,

                                 ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment