Thursday 14 April 2016

రామ కధామృతము

                  రామ కధామృతము 



విష్ణు మూర్తి దశావతారాలలో ఎంతో విశిష్టమైనది రామావతారము . ఎటువంటి మాయలు ప్రదర్శించకుండా ఎన్నో కష్టాలకు వోర్చి ధర్మాన్ని నిలబెట్టిన మహాను భావుడు ఇక్ష్వాకు కుల తిలకుడు శ్రీ రాముడు . ఎన్ని యుగాలు గడిచినా ఆడపిల్లలు రాముడి లాంటి భర్త కావాలని ,తండ్రి తన కొడుకు రాముడు లా వుండాలని కోరుకుంటున్నారు . రాముడు మంచి బాలుడు అనే వాక్యం మనం చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు వింటూనే ఉంటాము  అంటే  రాముడు ఎంతటి శుభ లక్షణ శోభితుడో స్పష్టంగా అర్ధమవుతుంది . 

    ఇక సీతా దేవి పతివ్రత, పరమ సాధ్వి ,అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని ,ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న స్త్రీ జాతి ఆణిముత్యం సీత . 
  రామాయణం లోని భాగాలను కాండలు అంటారు . 

రామ జన్మ వృత్తాంతం  ;

అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్న దశరధ మహా రాజు పుత్రులు లేరనే భాధతో పుత్రార్ది అయి ఋష్యశృంగుని బ్రహ్మత్వంలో పుత్ర కామేష్టి యజ్ఞాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో చక్కగా ఆచరించాడు . తత్ ఫలితం గా యజ్ఞ ప్రసాద మహత్తు చే దశరద మహారాజుకు తన ముగ్గురు పట్ట పురాణుల నందు నలుగురు కుమారులు రామ ,లక్ష్మణ ,భరత,శతృజ్ఞులు  జనియించినారు . ముద్దు మురిపాలతో రాకుమారులు నలుగురూ అయోధ్యలో పెరిగి పెద్దవారవుతున్నారు . 

సీతా జన్మ వృత్తాంతం ;

మిధిలా రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు . ఆయనకు పిల్లలు లేని కారణం గా చింతతో ఉండెను . ఒకనాడు ఆయన  యజ్ఞం చేసి  భూమిని దున్నుతుండగా భూమిలో పసిపాప  దొరికింది ఆ పాపే  సీతాదేవి . తరువాత జనక మహారాజుకి ఊర్మిళ జన్మించింది . జనక మహారాజు తమ్ముడు కుశ ద్వజుడికి మాండవి ,శ్రుతకీర్తి జన్మించారు . నలుగురు అక్కచెల్లెళ్ళు ఎంతో అన్యోన్యం గా పెరుగుతున్నారు . 

విశ్వామిత్రుడి  రాక ;

విశామిత్రుడు తన యాగ పరిరక్షనార్ధం రాముడిని తీసుకు వెళ్లాలని భావించి అయోధ్యకు వచ్చి దశరధ మహా రాజుని రాముడిని పంపించమని అడుగుతాడు . దశరధుడు మొదట భయపడినా తన కుల గురువు వశిష్టుడు చెప్పడంతో పంపిస్తాడు . విశ్వామిత్రుడి వెనక వెళ్ళిన రామ లక్ష్మణులు బల, అతిబల ,దండ చక్ర ,ధర్మ చక్ర ,కాల చక్ర ,విఘ్న చక్ర ,ఐషీక , ఐంద్ర ,వజ్ర ,ఆగ్నేయ వాయువ్య ,వారుణాస్త్రాలు వాటి ఉపసంహరనలు  విశ్వామిత్రుడి వలన పొందారు . 

విశ్వామిత్రుడి యజ్ఞానికి కావలి కాసి దానిని పాడు చేయడానికి వచ్చిన మారీచ సుభాహులను ఎదుర్కుని యజ్ఞాన్ని సంపూర్ణమయ్యేలా చేసారు . తదుపరి విశ్వామిత్రుడితో శివ ధనస్సు సందర్శనార్ధం మిధిలా నగరానికి వెళ్ళారు . మార్గ మద్యములో అహల్యకు శాప విమోచనం కావించాడు పరం పావన మూర్తి శ్రీరాముడు . 
  సీతా స్వయం వరములో శివధనుర్భగము ద్వారా సీతా రాముల వివాహం నిశ్చయమైనది . ఇరువురి కుల గురువుల ప్రోద్బల్యం తో రాముడు -సీత ,లక్ష్మణుడు -ఊర్మిళ ,భరతుడు -మాండవి ,శాత్రుగ్నుడు -శ్రుతకీర్తి  ల వివాహములు అంగరంగ వైభవముగా జరిగాయి . 

సీతా రాముల వనవాసం ;


రాకుమారుల వివాహము కొత్త కోడళ్ళ రాకతో అయోధ్యా ప్రజలు రాజ మందిరము ఆనందములో మునిగి వున్నారు . కొంత కాలానికి ధశరద మహారాజుకి తన కుమారుడు రాముడికి రాజ్య భారాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని ఏర్పాట్లు చేస్తాడు . కాని ధశరదుడి చిన్న భార్య కైక మంధర వుద్భోదతో  తనకు ఇస్తానన్న వరాలను ఇప్పుడు ఇవ్వమని ఆ వరాలు భరతుడిని రాజ్యాభిషిక్తుడిని చేయడం ,రాముడిని వనవాసానికి పంపడం . అని కోరుకుంది . రామ వియోగాన్ని వుహించలేని మహారాజు కుప్పకులిపోతాడు . రాముడు జరిగిన వృత్తాంతాని తెలుసుకుని ,లక్ష్మణుడు ,సీత వెంట రాగ వనవాసానికి బయలుదేరతాడు . రాముడి మీద అభిమానం తో అయోధ్యా వాసులు చాలా దూరం రాముడి వెంటే వెళ్ళారు . 

అరణ్య వాసం లో సీతా రాములు కొంత కాలం చిత్రకూటం మీద తదుపరి పచవటిన నివసించారు . ఆ సమయములలో శ్రీరాముడు అనేక మంది రాక్షసులను హతమార్చి జగానికి శాంతిని కలుగజేసెను ఆ సమయములోనే శుర్పనఖ ముక్కు చెవులను కోసాడు లక్ష్మణుడు . 
  శూర్పనఖ  మాయ మాటలు నమ్మిన రావణుడు మారీచుని బంగారు లేడిగా మారమని   ,ఆ లేడిని వెంబడిస్తూ రాముడు వల్లగ సీతను అపహరించి లంకకు తీసుకు  వెళ్లి తన అశోక వనము నందు ఉంచెను . సీతకోరకు రాముడు ఎంతో విలపించెను .  వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేసెను .  ఆంజనేయుడు సీతా జాడ కనిపెట్టి చెప్పెను .  ఆంజనేయుడు ,సుగ్రీవుడు ,జామ్భావంతుడు , మొదలగు వానరులంతా  తోడు నిలువగా ,లంక పై దండెత్తి రావణుడిని సంహరించి సీత ను చెర విడిపించెను . సీతా సమేతుడై శ్రీ రాముడు  అయోధ్యకు వెళ్ళెను . అక్కడ సీతారాముల పట్టాభిషేకము ఎంతో దివ్యముగా అత్యంత వైభవముగా జరిగెను . శ్రీ రాముడు ప్రజానురంజకముగా రాజ్యమును పాలించెను . శ్రీ రాముడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవారు . వానలు సకాలంలో పది పంటలు సుభిక్షముగా పండేవి .  కావుననే నేటికి రామ రాజ్యము అను నానుడి ప్రజలలో వినుపించును . రామ నామం రాయడం చేతనే రాళ్ళు కూడా లంకకు వారధి కట్టు సమయములో సముద్రములో తేలి ఆడినవి . అంతటి గొప్ప శక్తి కలిగినది రామ నామము .మంగళ కారుడు శ్రీ రాముడు . నమ్మిన వారిని కాచే దైవం సీతాపతి . 


                    

  జనులందరికి శ్రీ రామ రక్షా కలుగు గాక 
సర్వ్ జన సుఖినో భవంతు . 

                                                           శశి ,                                 

                                                      ఎం ఎ ,తెలుగు ,తెలుగు పండితులు .   
















No comments:

Post a Comment