Sunday 20 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదినాల్గవసర్గ

                             రామాయణము 

                  అయోధ్యకాండ -నలుబదినాల్గవసర్గ 

ఉత్తమ వనిత అయిన కౌశల్యా దేవి ఆవిధముగా విలపించుచుండగా విశిష్ట ధర్మములు తెలిసిన సుమిత్రాదేవి "రాముడు మిక్కిలి బలపరాక్రమములు కలిగిన రాముడికి ఏ అపకారము కలగదు రాముడు తోడుగా ఉండగా సీతా ఏ ఇబ్బంది ,చింత లేక వనములోనైనా సుఖముగా ఉండగలదు . అతి త్వరలో రాముడు తిరిగి వచ్చి అయోధ్యను ఏలగలడు కావున చింతించవలదు . శ్రీరామునికి అనేక దివ్యాస్త్రములు తోడుగా కలవు . కావున ఏ చిన్న ఇబ్బంది కూడా వారికి వనములో కలుగజాలదు "అని పరిపరి విధములుగా ఓదార్చసాగెను . 
సుమిత్రాదేవి ఆవిధముగా ఓదార్చగా కౌశల్యాదేవి బాధ అంతా తొలగిపోయి భవిష్యత్తు మీదకల ఆశతో ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబదినాల్గవసర్గసమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Saturday 19 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదిమూడవసర్గ

                                            రామాయణము 

                                               అయోధ్యకాండ -నలుబదిమూడవసర్గ 

పుత్ర దుఃఖముతో కృశించి ,శయ్యపై పడుకుని వున్న మహారాజును చూసి కౌశల్య తానూ శోక మూర్తియై రాముడు వనవాస ము గురించి ,అక్కడ సీతారామలక్ష్మణులు పడు బాధలను గూర్చి తలచుకుని మిక్కిలి దుఃఖిత అయ్యెను . రాజ్యము భరతుడికి ఇచ్చినను రాముని రాజ్యములో ఉండనిచ్చిన బాగుండునని పదేపదే తలచుకుని ఏడ్చెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది మూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday 16 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదిరెండవసర్గ

                                         రామాయణము 

                                         అయోధ్యకాండ -నలుబదిరెండవసర్గ 

వనములకు వెళ్లుచున్న శ్రీరాముని రాధా చక్రముల వేగమునకు రేగిన దుమ్ము కనపడునంతవరకు దశరథ మహారాజు అచటనే నిలబడి శ్రీరాముడు కనపడకుండుటచే దుమ్ము వంక చూస్తూ నిలబడెను .   అది కూడా కనుమరుగయినా తదుపరి మహారాజు ఆర్తితో అలమటించుచు నేలపై పడిపోయెను . అది చూసి కౌశల్య ,కైకేయిలు ఆయనను లేపుటకు వచ్చిరి . అప్పుడు దశరధుడు కైకేయితో నీవు నన్ను తాకకుండుము . నేను నిన్ను త్యజించుచున్నాను . నేటి నుండి నేను నీకు నేను భర్తను కాను . నిన్ను ఆశ్రయించుకున్నవారికి కూడా నేను ప్రభువును కాను  అని పలికెను . 
కౌశల్యా దేవి ఆయనను లేవనెత్తెను . దశరధుడు తన భవనంలోకి వెళ్లుటకు వెనుతిరిగేను . కౌశల్యాదేవి భవనమునకు వెళ్లెను . రాముడు లేని భవనము,ఆ రాత్రి  ఆయనకు కాళరాత్రి వలె అనిపించెను . "అల్లారు ముద్దుగా భోగభాగ్యాల మధ్య పెరిగిన నా శ్రీరాముడు ఎన్ని కష్టములు అనుభవించునో ,జనకుని ముద్దుల కూతురు సింహ గర్జనలు మొదలగు క్రూర మృగముల అరుపులకు ఎంత భయపడునో "అని తలుచుకుని మిక్కిలి పరితపించసాగెను ." ఈ 14 సంవత్సరముల తదుపరి రాముని చూచు కన్నులు ఎంత భాగ్యము కలవో ,ఆ భాగ్యము నాకు వున్నదో లేదో "అని వెక్కి వెక్కి ఏడవసాగెను . 
ఇంకనూ ఆయన కౌశల్య ను పిలిచి "పవిత్రురాలా !నన్ను ఒక్కసారి నీ చేతితో తాకుము . నీవు తాకిన ఆ స్పర్శ రామునిదిగా భావింతును . (కౌశల్యా రాముని జనని కావున )"అని పలికెను . తల్పంపై   పరుండి ,అనుక్షణము శ్రీరామునేస్మరించుచున్న మహారాజుని చూసి ,కౌశల్యా దేవి ఆయన పక్కన కూర్చుండి శోకమూర్తియై విలపించెను . 

              రామాయణము అయోధ్యకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Sunday 13 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదిఒకటవసర్గ

                                       రామాయణము 

                                 అయోధ్యకాండ -నలుబదిఒకటవసర్గ 

పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వనవాసమునకు వెళ్లిన పిమ్మట అంతః పుర స్త్రీల ఆర్తనాదములు మిన్నుముట్టెను . పుత్రుని ఎడబాటుకు మిగుల విలవిలలాడుచున్న ఆ దశరథ మహారాజు అంతః పురమున చెలరేగిన భయంకరమైన ఆ ఆర్తనాదములను విని ,ఇంకను దుఃఖముతో కృంగిపోయెను . జనులందరు రాముని వనవాస బాధలో మునిగిపోయి ఉండిరి . అందుచే నిత్యకార్యకలాపములన్నీ స్తంభించిపోయెను . నిత్యాగ్నిహోత్రులు అగ్ని కార్యము చేయకుండిరి . గృహస్తుల ఇండ్లలో స్త్రీలు పొయ్యిలు వెలిగించలేదు . పౌరులందరిని దైన్యమావహించెను . పౌరులలో ఏ ఒక్కరికి ఆహారవిహారముల మీదకు మనసు పోకుండెను . ఒక్కరి ముఖమునందయినను సంతోషము లేకుండెను . 
గాలులు చల్లదనము కోల్పోయెను . చంద్రుడు సౌమ్య లక్షణము నకు దూరమయ్యెను సూర్యతాపము సన్నగిల్లెను . జగత్తంతయు క్షోభమున మునిగెను . శ్రీరాముని మిత్రులందరూ మతులు పోయినవారై ,శోకభారమున మంచము పట్టిరి . వారి కదలికలే ఆగిపోయెను . మహాత్ముడైన శ్రీరాముడు లేకుండుటచే తీవ్ర భయశోకములు అలముకొనగా అయోధ్య ,ఇంద్రుని భయము కారణముగా పర్వతములతో కూడిన భూమి వలె ఎంతో చలించెను . మఱియు అది యోధుల రోదన ధ్వనులతో ,గజాశ్వముల దుఃఖనాదములతో ప్రతిధ్వనించేను . 

రామాయణము అయోధ్యకాండ నలుబదిఒకటవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
 


 

Friday 11 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదియవ సర్గ

                             రామాయణము 

                     అయోధ్యకాండ -నలుబదియవ సర్గ                

సీతారామలక్ష్మణులు తల్లితండ్రుల సేవకు దూరమగుచున్నందుకు దీనులై .మహారాజు కు ప్రదక్షణ పూర్వకముగా పాదాభివందనములు చేసిరి . తండ్రి అనుజ్ఞ తీసుకుని తల్లి కౌశల్యా మాతకు నమస్కారము చేసెను . పిమ్మట సుమిత్రాదేవికి నమస్కారము చేసెను . వారిని సుమిత్రాదేవి దీవించెను లక్ష్మణుడికి  అన్నగారికి ,వదినగారి సేవచేయమని ప్రోత్సాహపరిచేను . 

ఆ విధముగా అందరికి వీడ్కోలు పలికి సీతారామలక్ష్మణులు వనవాసమునకు బయలుదేరిరి . దశరధుడు సీతాదేవికి ఇచ్చిన 14 సంవత్సరములకు సరిపడా వస్త్రములు ,ఆభరణములను సుమంత్రుడు రథములో పెట్టించెను . ఇంకా రామలక్ష్మణుల కొరకు ఆయుధములు ,కవచములు డాళ్లు ,పలుగు ,గంప మొదలగు వాటిని రధము వెనక భాగములో పెట్టెను . అంతసీతారామలక్ష్మణులు శీఘ్రముగా రధమును అధిరోహించిరి . 
సుమంత్రుడు' జరుగుము జరుగుము 'అని అరుచుచు రధమును ముందుకు నడిపెను . ఆ విధముగా రాముడు వనవాసమునకు బయలుదేరుట చూసిన జనులు పెక్కు మంది మూర్చిల్లిరి .మిగిలిన వారు దుఃఖముతో ఎక్కీఎక్కి ఏడ్చిరి . మదపుటేనుగుల ఘీంకారములతో ,దిక్కుతోచక తిరుగుతున్న గుఱ్ఱముల సకిలింపులతో ,వాటి ఆభరణములు రొదతో జనుల చెవులు దిమ్మెక్కెను . జనులు దిక్కుతోచనివారయ్యెను . ఆ జనులలో పెక్కు మంది రధము వెనుక పరిగిడిరి . కొంత మంది రధమును ఇరువైపులా ,వెనకభాగములో రధమును పట్టుకుని వేలాడిరి . 
స్త్రీల మధ్య వున్న దశరథ మహారాజు శ్రీరాముని ఒక్కసారి చూస్తాను అని బయటకు వచ్చెను . తండ్రి దీనావస్థను రధము మీద నుండే గమనించిన శ్రీరాముడు రధమును త్వరగా పోనిమ్ము అని సుమంత్రుని తొందరపెట్టెను . రధమునకు వేలాడుతున్న జనులు ఓ సారధి !ఒక్కసారి రధమును ఆపుము  మా రాముని కన్నులారా చూడనిమ్ము . అని పలుకసాగిరి . అప్పుడు సుమంత్రునికి ఎవరి మాటను పాటించాలో అర్ధము కాకుండెను . శ్రీరాముని రధము ముందుకు సాగిపోవుచుండగా లేచిన దుమ్ము జనుల కన్నీటి జలములతో అణగారిపోయెను . ప్రజలందరు మిక్కిలి పరితాపమునకు గురిఅయ్యిరి . వారి కన్నీటి తో ఆ నగర వీధులన్నీ తడిసిపోయెను . శ్రీరాముడు కానరాకపోవటం ,జనుల దీనావదనాలు చూసిన దశరధుడు ఒక్కసారిగా స్పృహతప్పిపోయెను . అది చూసి జనులందరూ ఆక్రన్దనలు చేసిరి . 
రాముని చూడవలెనని కోరిక బలీయమగుటచే కౌశల్యాదేవి రధము వెళ్లన వైపు పరుగెడుతూ రామా !లక్ష్మణా !సీతా !అని ఆక్రోశించసాగెను . దశరధుడు తేరుకుని రధమును ఆపుము ఆపుము అని అరిచెను . రాముడు త్వరగా పోనిమ్ము అని పలికెను సుమంత్రుడు ఎవరి ఆజ్ఞను పాటించాలో తెలియని స్థితిలో పడెను . చివరకి రాముని ఆజ్ఞను పాటించి రధమును వేగముగా నడిపెను . అంతః పురజనులు రాముడు కనిపించనంత దూరము వెళ్లిన పిమ్మట మనస్సులోనే రామునికి ప్రదక్షణ నమస్కారములు చేసి వెనుతిరిగిరి . వారు తమ కన్నీటి ధారాలను ఆపుకొనలేకుండిరి . అప్పుడు దశరధుని శరీరము చెమర్చి ఉండెను . అతని శరీరమంతా మిక్కిలి వాడిపోయివుండెను . అత్యంత దీనావస్థలో ఆ మహారాజు రాణులతో కూడి తన పుత్రుని వైపే చూస్తూ అచటనే నిలబడిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Thursday 10 November 2016

రామాయణము అయోధ్య కాండ --ముప్పదితొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                 అయోధ్య కాండ --ముప్పదితొమ్మిదవసర్గ 

భార్యలతో కూడి వున్న దశరథ మహారాజు శ్రీరాముడు పలికిన మాటలు విని నిస్చేష్టుడయ్యెను . దుఃఖభారంతో కన్నులలో నీళ్లు నిండివుండగా ఆ మహారాజు రాముని చూడలేకపోయెను . అతి కష్టము మీద చూసినా మాట్లాడలేకపోయెను . ఎల్లప్పుడూ మేలురకములైన పట్టువస్త్రములలో శ్రీరాముడిని చూసే దశరధుడు నారచీరలలో ఆయనను చూసి భాద తట్టుకొనలేక మూర్చితుడయ్యెను . కొంతసేపటికి తేరుకుని రామా రామా !అని కలవరించుతూ మంత్రి సుమంత్రుడిని పిలిచి" రధము మీద రాముని తో పాటు కొంత దూరము నీవు కూడా వేళ్ళు . నా ధనాగారము నుండి 14 సంవత్సరములకు సరిపడా  మేలురకములైన వస్త్రములు ,ఆభరణములు తెప్పించి సీతకు ఇమ్ము "అని ఆజ్ఞాపించెను . 
సుమంత్రుడు దశరధుడు ఆజ్ఞ మేరకు మేలుజాతి గుఱ్ఱములతో రధమును తెచ్చెను . సీత తనకు ఇవ్వబడిన ఆభరణములను ధరించేను . అప్పుడు కౌశల్య సీతాదేవితో పతివ్రతలు ఆచరించవలసిన ధర్మములను ,భర్తకు చేయవలసిన సేవలను ,ఇవ్వవలసిన విలువను వివరించి చెప్పెను . సీతాదేవి ఎంతో వినమ్రతతో ఆ మాటలు అన్నీ విని తప్పక వాటిని ఆచరిస్తానని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Wednesday 9 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                           రామాయణము 

                                         అయోధ్యకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

సీతాదేవి తన పాటి అగు శ్రీరాముని సమక్షంలోనే నిస్సహాయురాలిలా  నారచీరలు ధరించుట చూసిన అక్కడి వారంతా దశరధుని ఛీ కొట్టుచూ ఈసడించిరి . వాటిని విన్న దశరధుని రాజ్యము మీద ,కీర్తిప్రతిష్టల మీద ,చివరకు జీవితమూ మీదనే విరక్తి కలిగెను . అతడు కైకేయి తో "ఓ కైకేయి !ఈ జానకి జనకమహారాజు ముద్దుల కుమార్తె ,మిక్కిలి సుకుమారి ,పతివ్రత ఈమె వల్కలములు ధరించుట యుక్తము కాదు . ఆమె నీకు చేసిన అపకారము ఏమి ?ఆమె చక్కని వస్త్రములతో ఆభరణములతో వనములకు వెళ్తుంది . "అని పలికెను . 
ఆ విధముగా పలుకుతూ దశరధుడు క్రింద పడిపోయి మిక్కిలి దుఃఖిస్తూ ఉండెను . అప్పుడు శ్రీరాముడు "తండ్రి నేను వనములకు బయలుదేరుతున్నాను . నా తల్లి కౌశల్య పతివ్రత,వృద్ధురాలు . నా వనవాస దుఃఖంలో మునిగి వున్నది . నేను లేనిచో ఆవిడ తన ప్రాణములనే త్యజించవచ్చును . కావున ఆవిడను జాగ్రత్తగా చూసుకొనుము . నేను లేనని భాద తెలియకుండా జాగ్రత్తగా ,ప్రేమగా చూసుకొనుము . ఈమెను కాపాడేది భారము నీదే "అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                             శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                      


Tuesday 8 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదియేడవసర్గ

                                       రామాయణము 

                       అయోధ్యకాండ -ముప్పదియేడవసర్గ 

వినయ విధేయతలు కల శ్రీరాముడు మంత్రులలో వృద్ధుడైన సిద్దార్థుని మాటలు విని తండ్రి తో "ఓ మహారాజా !సర్వ సుఖములను పరిత్యజించి అన్ని విషయముల అందు ఆశక్తిని వీడిన నాకు చతురంగబలముతో పనియేమి ?అట్లే మీరు నా వెంట పంపదలచుకున్న సేనలు సమస్త వాహనములు ,ధనధాన్యములు ,మొదలగువాటన్నిటిని భరతుడికి ఇచ్చివేయుచున్నాను . నా కొఱకు వల్కలములు మాత్రము తెప్పించుడు . 14సంవత్సరములు వనములలో నివసించుటకు వెళ్లుచున్న నాకు ఒక పలుగు ,గంపను ఇచ్చిన చాలు . "అని పలికెను . 
అపుడు కైకేయి నారచీరలు స్వయముగా తీసుకువచ్చి సిగ్గుఎగ్గులు లేకుండా జనుల సమక్షంలో శ్రీరాముడికి ఇచ్చి ధరించమని చెప్పెను . శ్రీరాముడు వాటిని తీసుకుని తన మెలి వస్త్రము స్థానములో నారచీరలు అక్కడే ధరించెను . లక్ష్మణుడు కూడా నారచీరలు ధరించెను . ఎల్లపుడు పట్టువస్త్రములనే ధరించే సీత నారచీరలు చూసి వాటిని ఎలా ధరించాలో తెలియక సిగ్గుపడెను . అట్టి చీరలు ధరించుట కొత్త అగుటచే ఆమె ధరించుట చేతకాక ఒక చీరను కంఠము  చుట్టూ చుట్టుకొని మరియొక చీరను చేత పట్టుకుని నిలబడెను . 
అది చూసిన శ్రీరాముడు సీత వద్దకు వెళ్లి ఆమె పట్టుచీర పైనే నారచీరను చుట్టెను . రాముడు స్వయముగా సీతకు నారచీరలు కట్టబెట్టుట చూసిన అంతః పుర స్త్రీలందరూ దుఃఖితులై కంట తడిపెట్టి శ్రీరామునితో "నాయనా !మీ తండ్రి గారు సుకుమారి అయిన సీతకు వనవాసము విధించలేదుకదా . మీ తండ్రిగారి ఆజ్ఞను పాటించి వనవాసము ముగించుకుని తిరిగిరా అప్పటివరకు ఈ సీతను మేము జాగ్రత్తగా చూసుకుంటాము . ఈమె మిక్కిలి సుకుమారి వనములలో ఈమె కష్టములు అనుభవించలేదు . "అని పలికిరి . శ్రీరాముడు వారి మాటలు పట్టించుకొనక సీత చేత నారచీరలు ధరింపచేసెను . 
సీత నారచీరలు ధరించుట చూసిన వశిష్ఠుడు ఆమెను వారించి ,కైకతో "ఓ దుష్టురాలా !వంశ మర్యాదను మంటకలుపుచూ హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు . సీతాదేవి వనములకు పోనక్కరలేదు . శ్రీరామునికి మారుగా ఆమె సింహాసనమును అధిష్టించగలదు . సీతాదేవి వనములకు వెళ్ళుట జరిగినచో మేమందరము వారితో వెళ్ళెదము . అంతేకాక పురజనులు కూడా వెళ్ళెదరు . సీతారాములు నివసించు ప్రదేశమే అయోధ్య . కావున సమస్త జనులు అక్కడికి చేరెదరు . అంతేకాదు భారతశత్రుఘ్నులుకూడా నారచీరలు ధరించి శ్రీరాముడు నివసించు ప్రదేశమునకు వెళ్లి  అక్కడనే జీవింతురు . ప్రజలందరూ వెళ్ళిపోయినా పిమ్మట చెట్లుచేమలే మిగిలివున్న ఈ భూమిని ఏకాకివై నీవే ఏలుకొమ్ము . భరతుడు కి శ్రీరాముడన్న అపార ప్రేమ ఆయన తండ్రి ఇష్టముగా ఇవ్వని రాజ్యమును ఏలుకోనడు . జనులు కాదు పశుపక్షాదులు కూడా శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళుట నీవేచూస్తావు . చెట్లు కూడా వదిలిన ముఖములతో శ్రీరాముడు వెళ్లిన దిక్కుగానే చూస్తాయి . 
ఓ కైకేయి !నీ కోడలయిన సీతాదేవికి వల్కలములు తీసివేసి ఆమెకు అమూల్యమైన వస్త్రములు ఆభరణములు ఇమ్ము . ఈమెకు వల్కలములు ఇచ్చుట ధర్మము కాదు . 
శ్రీరాముని వనవాసమునే కోరుకుంటివి సీత వనవాసము కాదు . కనుక ఈమె నిత్యమూ వస్త్రాలంకారభూషిత అయి వనములో శ్రీరామునితో కూడి ఉండును . ఈ రాజకుమారి వస్త్రములతో ,సకల సౌకర్యములతో ,ముఖ్యలైన పరిచారికలతో కూడి వాహనము వెళ్తుంది . "అని కోపావేశమున పలికెను . 
వశిష్ఠుడు ఈ విధముగా పలుకుచున్నను సీతాదేవి  మాత్రమువస్త్రభూషణాదుల మీద ఆశక్తి చూపక తన ప్రాణతుల్యుడైన శ్రీరామునితో సమానముగా నారచీరలనే ధరించెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  












 

Sunday 6 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిఆరవసర్గ

                                       రామాయణము 

                                     అయోధ్యకాండ -ముప్పదిఆరవసర్గ 

సుమంత్రుడు నయానా భయాన ఎంతగా చెప్పినను కైకేయి మారుమాట్లాడకుండెను . దశరధుడు మిక్కిలి వగచుచు కన్నీరు పెట్టుచూ సుమంత్రుడితో "ఓ సుమంత్రా !రత్నములతో సుసంపన్నమైన చతురంగ బలములను రాముని సేవలకై వెంటనే ఆయనతో పంపుము . మరియు ఆ సేవలతో కూడా నర్తకీ మణులను ,చతురోక్తులు పలుకువారిని ,మిగులు సంపన్నులైన వ్యాపారులను పంపించుము . శ్రీరాముడికి తోడుగా ఉండుటకు ,మల్లయుద్ధప్రదర్శనాదులతో రామునకు ఆహ్లాదమును గూర్చుటకు ,తగిన  వారిని సువర్ణములు ,రత్నములు ,వస్త్రాదులను బహూకరించి వారిని ఆ సేనల వెనక పంపుడు . 
ముఖ్యమైన ఆయుధములను నగరవాసులను ఆహార పదార్ధములలో కూడిన బళ్ళను అడవులలో మార్గము చూపునట్టి ఆటవికులు శ్రీరామునికి తోడుగా పంపుము . శ్రీరాముడు అడవులలో క్రూరమృగములను ,ఏనుగులను వేటాడుచు అచట లభించేడి తేనెలు త్రాగుచు ,వివిధ నదీ ప్రవాహములను దర్శించుచు హాయిగా కాలము గడుపుతాడు . నిర్జనారణ్యములో నివసించే రామునికై ఎద్దులపైనను ,ఒంటెల పైనను నా ధన ధాన్యములను పంపుడు . అలా చేసినచో వనవాస కాలములో శ్రీరాముడు ఆయా పుణ్యస్థలములయందు యజ్ఞములను ఆచరించుచు ,ఋత్విజులు మున్నగు వారికి యజ్ఞదక్షిణలు ఇచ్చుచు ,ఋషులను సేవించుచు అచట సుఖముగా ఉండగలడు . "
దశరధుడు ఇలా పలుకగా కైకేయికి భయము పట్టుకొనెను . ఆమె ముఖము వెలవెల బోయెను . అప్పుడా కైకేయి విచార గ్రస్తురాలై రాజుకు ఎదురుగా నిలిచి" ఓ రాజా !ఏమి లేని ఈ రాజ్యము భరతుడికి అక్కరలేదు . "అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కైకేయితో దశరధ మహారాజు "నీచురాలా !ఎందుకిలా పలుకుతున్నావు . ఇప్పుడు పలుకుతున్న ప్రతిబంధకములు వారములు కోరినపుడు నీవు కోరలేదు . ఈటల వంటి మాటలతో నన్ను ఎలా భాదించుచున్నావు ?"అని పలుకగా కైకేయి తన పన్నాగము దెబ్బతినునను బాధపడుచుండెను . అప్పుడు కైకేయి "అయ్యా !మీ వంశము వాడైన సగరుడు తన జ్యేష్ఠ పుతృడిని అసంజసుడిని రాజ్యము నుండి వెళ్ల గొట్టినాడు . ఆ విధముగా నీవు కూడా నీ జ్యేష్ఠ ఉట్రుడిని వనములకు పంపుము . "అని పలుకగా 
అచటనే వున్న సిద్దార్ధుడు అను వృద్ధ మంత్రి "అసమంజసుడు వీధులలో ఆడుకుంటున్న పిల్లలను తీసుకు వెళ్లి సరయు నదిలో ముంచి వారు బాధ పడుచుండగా అది చూసి ఆనందించెడివాడు . ప్రజలు రాజు అయినసాగరుడితో మోర పెట్టుకోగా ఆయన తన పెద్ద కుమారుడిని అతడు చేస్తున్న తప్పిదము కారణముగా రాజ్య బహిష్కరణ చేసినాడు . శ్రేష్ఠుడైన శ్రీ రామునితో తరచి చూసినా ఒక్క తప్పిదము కూడా కానరాదు . నీవు అతడితో ఒక్క తప్పును చూపించు వనవాసమునకు మేమందరము సమ్మతించెదము "అని పలికెను . 
ఆ వృద్ధ మంత్రి మాటలు విని దశరధ మహారాజు కైకేయి తో "ఓ పాపాత్మురాలా !ఈ సిద్దార్ధుని పలుకులు నీకు రుచించుటలేదా !రాజ్యాధికారమును ,సుఖసంపదలను వీడి నేనును నేడే శ్రీరామునితో అడవులకు వెళ్లెదను . ఇక నీవును భరతుడు ఈ రాజ్యమును మీకు ఇష్టమొచ్చినట్లు మీరు కోరినంత కాలము హాయిగా ఏలుకొనుడు "అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

























































































































































































































































































































































































































































































































































































Saturday 5 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పది ఐదవసర్గ

                                        రామాయణము 

                                      అయోధ్యకాండ -ముప్పది ఐదవసర్గ 

దశరధుని రధసారధి అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి తేరుకొనిన పిదప పట్టరాని కోపముతో ఊగిపోయెను . పండ్లు పటపట కొరుకుతూ ,కన్నులెఱ్ఱజేసెను . మనస్సు వుడికిపోవుచుండుటచే అతని దేహకాంతి మారెను . పొంగిపొర్లుచున్న పరితాపమును ఆపుకొనలేక అతడు కోపోద్రుక్తుడయ్యెను . అంతట కైకేయితో సుమంత్రుడు "ఓ కైకేయి దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు . ఈ అయోధ్య రాజ్యములోని సమస్త జీవులకు నాధుడు . అట్టి మహాప్రభువుని తృణీకరించి ,ఇట్టి ఘోర కృత్యమునకు పాల్పడినావు . దీనిని బట్టీ చూడగా నీవు నీ పతిని మాత్రమే కాదు ఈ ఇక్ష్వాకువంశమునే రూపుమాపేదవనిభావిస్తున్నాను . 
దశరథ మహారాజు నీకు కోరిన వరములను ఇచ్చి చక్కగా చూసుకుంటున్నారు . అట్టి ప్రభువును నీవు అవమానింప తగదు . రాజు పరలోకగతుడైనచో అతని కుమారులలో జ్యేష్ఠుడు రాజగుట ఇక్ష్వాకు వంశ ఆచారము . పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించివుండగనే మంటకలుపుటకు పూనుకొంటివి . 
అయోధ్యలోని పౌరులు ,రాజ్యములోని ఇతర జానపదులు మొదలగు వారితో కూడి మేమందరము రాముని మార్గమున నడిచెదము . బంధుమిత్రులు ,సాధువులు ,బ్ర్రాహ్మణులు మున్నగువారంతా ఈ రాజ్యమును వీడి వెళ్ళెదరు . అట్టి రాజ్యము వలన నీకేమి లాభము ?
నాకు ఆష్క్యార్యము కలుగుతున్నది . శ్రీరాముని నిర్దాక్షిణ్యముగా వనములపాలు చేయుచున్న నిన్ను వశిష్టాది మహర్షులు తమ ఛీత్కారములచే ,భయంకరములయిన శాపాయుధములచే ఎలా దహించివేయుటలేదు ?నీ తల్లి మూర్ఖపు పనుల గురించి ఇదివరకే మేము వినివున్నాము . ఒకానొక గంధర్వ యోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించెను . దాని ప్రభావమున ఆ మహారాజు సమస్త ప్రాణుల అరుపులు ,వాటి భావములను గ్రహించగలడు . ఒక రోజు ఒక పక్షుల జంట మాట్లాడుకొనుచుండగా దాని భావము తెలిసిన  ఆయన రెండు పర్యాయములు నవ్వేను . దానికి మీ తల్లి తనను చూసి (గేలి చేయుచు )నవ్వుతున్నాడని తలచి మిక్కిలి కోపోద్రిక్తురాలయ్యెను . ఆమె మీ తండ్రిని ఎందుకు నవ్వినారని అడిగెను . దానికి మహారాజు "దేవి !దానిని గూర్చి నీకు వివరించినచో నేను మరణించెదను "అని పలికెను . 
అప్పుడామె "నీవు జీవించి వుందువో లేదో నాకు తెలియదు . నన్ను మాత్రము గేలి చేయకు . నవ్వినా కారణము చెప్పుము "అని అడిగెను . తన భార్య ఇలా పలికిన పిమ్మట కేకేయ మహారాజు తనకు వరమును ప్రసాదించిన ఆ గంధర్వ యోగికి జరిగిన విషయమును అంతా వివరించెను . అంతట వరమిచ్చిన ఆ సాధువు రాజుతో "ఓ రాజా !నీవీ విషయము ఆమెకు తెలిపినచో నీకు చావు తప్పదు . ఆమె మరణించినను లేక ఏమయినను ఈ రాహస్యమును తెలుపవలదు . "అని చెప్పెను . అప్పుడు మీ తండ్రి ఆ సాధువు మాటలు పాటించి మీ తల్లి కోరికని త్రోసిపుచ్చి హాయిగా ఉండెను . తండ్రుల లక్షణములు కొడుకులకు తల్లి లక్షణములు కుమార్తెకు వచ్చునని లోకోక్తి నిన్ను చూస్తే నిజమనిపిస్తోంది . 
ఈ దశరథ మహారాజు సమస్త ప్రజలకు రక్షకుడు . నీవు పాపబుద్ది కలదానివై అట్టి మహారాజుచే అధర్మ కార్యములను (జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట చిన్న వానిని యువరాజుగా చేయుట )చేయింపవలదు . ఇట్లు సుమంత్రుడు రాజు సమక్షమున పదేపదే స్వా o తన వచనములతో ,తీవ్రమైన హెచ్చరికలతో కైకేయిని కలత చెందినట్లు చేసి కృతాంజలియై నిలబడెను . ఆ కైకేయి అతని మాటలను ఏ మాత్రము చెవి శోకానీయలేదు మనసున పరితపింపనూలేదు . ఆమె ముఖమున కించిత్తయినను మార్పు కనబడలేదు . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









 

Friday 4 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదినాల్గవసర్గ

                                   రామాయణము 



                         అయోధ్యకాండ -ముప్పదినాల్గవసర్గ 

సుమంత్రుడు దశరధుని భవనములోనికి ప్రవేశించి దుఃఖ సాగరంలో మునిగిపోయివున్న దశరథ మహారాజుని చూసి రాముడు వచ్చిన సంగతిని విన్నవించెను . అపుడు మహారాజు "నా భార్యలందరిని తీసుకురమ్ము వారితో కలసి నేను రాముని చూడదలిచాను . "అని పలుకగా సుమంత్రుడు దశరథ మహారాజు భార్యలందరి వద్దకు వెళ్లి మహారాజు గారి ఆజ్ఞ తెలిపెను . రాముని వనవాస విషయము తెలిసి మిక్కిలి రోధించుటచే వారి కళ్లు ఎరుపెక్కి వున్నవి . అట్టి 350మంది దశరధుని భార్యలు కౌశల్యాదేవితో కూడి దశరధుని భవనమునకు చేరిరి . అపుడు మహారాజు సుమంత్రునితో రాముని తీసుకురమ్మని చెప్పేను . భార్యల మధ్యలో కూర్చున్న దశరథ మహారాజు ఆసనము నుండి లేచి  రామునికి  వడివడి నడకతో ఎదురేగి రాముని చేరకనే స్పృహ తప్పి పడిపోయెను . 
అప్పుడు ఆ భవనము అంతా స్త్రీల రోదనలతో ఆభరణములు చప్పుడుతో మారుమ్రోగేను . రామలక్ష్మణులు పరుగున వచ్చి దశరథ మహారాజును లేవదీసి శయ్యపై పరుండబెట్టిరి . అంత కొంత సేపటికి మహారాజుకి స్పృహ రాగా శ్రీరాముడు "తండ్రీ మీరు మాత కైకేయికి ఇచ్చిన వారము ప్రకారము నేను వనవాసమునకు బయలుదేరుతున్నాను .  లక్ష్మణుడు సీత నన్ను అనుసరించుతున్నారు . మాకు అనుజ్ఞ ఇవ్వండి . మేము వనవాసములకు వెళ్ళెదము "అని పలుకగా దశరధుడు కైకేయికి వారములు ఇచ్చి నేను మోసపోయాను . నీవు నా ఆజ్ఞను వదిలి స్వయముగా ఈ అయోధ్యకు రాజువు కమ్ము వనవాసములకు వెళ్ళవద్దు "అని పలుకగా 
శ్రీరాముడు "తండ్రీ ఎన్ని సంవత్సరములకు అయినను ఈ అయోధ్యకు మీరే ప్రభువులు . మీ మాట జవదాటుట నాకు ధర్మమూ కాదు . కావున వనములకు వెళ్లి అక్కడ 14 సంవత్సరములు విహరించి తిరిగి వచ్చి మీ సేవ చేసుకుంటాను . "అని పలికెను . 
దశరధ మహారాజు "తండ్రీ నిన్ను ధర్మపాలన నుండి మరల్చుట ఎవ్వరికిని సాధ్యము కాదు . ఈ ఒక్కరోజయినా నా కాళ్ళ ముందు ఉండుము "అని అర్ధించగా రాముడు "తండ్రీ నేను ఒక్క క్షణమైనా ఈ నగరములో ఉండరాదు . 14 సంవత్సరములు గడిచిన పిమ్మట మీ దర్శనము చేసుకొనెదను "అని పలుకగా దశరధుడు తనను ,కైకేయిని తిట్టుకుంటూ చేసేది లేక "నాయినా జాగ్రత్తగా వెళ్ళిరా !వనములలోని క్రూర మృగములనుండి ,భయంకర రాక్షసుల నుండి నీకు ఎటువంటి ఆపద రాకుండు గాక !"అంటూ తీవ్రముగా రోధించసాగెను . 
రాముడు "తండ్రీ వనము లోని వన్య మృగములతో కాలక్షేపము చేస్తూ అచటి సెలయేళ్ళను చూస్తూ నేను అక్కడ ప్రశాంత జీవనము గడిపెదను కావున మీరు నా కొరకు దుఃఖించకుండా ప్రశాంతముగా ఉండండి "అని పలికెను శ్రీరాము ఈ విధముగా వివరింపగా పుత్ర వియోగ భాదను భరించ లేక దశరధుడు శారీరకంగా కృషుయించుచు ,మానసికముగా కృంగిపోవుచు తీరని బాధకు లోనయ్యేను . వెంటనే అతడు శ్రీరాముని హృదయమునకు హత్తుకుని స్పృహను కోల్పోయెను . ఒక్క కైకేయి తప్ప అక్కడ వున్నా రాణులందరూ ఒక్కసారిగా బోరున ఏడ్చిరి . సుమంత్రుడు కూడా ఏడ్చుచు మూర్ఛపోయెను . ఆ మందిరము అంతా హాహాకారములతో నిండిపోయెను . 

రామాయనము అయోధ్యకాండ ముప్పదినాల్గవ సర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















Thursday 3 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిమూడవసర్గ

                                   రామాయణము 

                                 అయోధ్యకాండ -ముప్పదిమూడవసర్గ 

సీతారామలక్ష్మణులు బ్ర్రాహ్మణోత్తములకు విరివిగా దానములు ఇచ్చి ,తండ్రి అయిన దశరథ మహారాజు ను దర్శించుటకై బయలుదేరిరి . ఆ విధముగా ఆయుధములు ధరించి నడచి వెళ్తున్న వారిని చూచుటకు జనములు వీధులు కాలి లేక తమ ఇండ్లపైకి ఎక్కి చూడసాగిరి . ఆ విధముగా వెళ్తున్న సీతారామలక్ష్మణులు చూసి మిక్కిలి దుఃఖితులయ్యిరి . తండ్రి మాటకై వనములకు వెళ్తున్న సీతారామలక్ష్మణులు వనములో ఇబ్బంది పడునని జనులంతా  శోకములో మునిగిపోయిరి . 
మరియు వారిలోవారు మనము కూడా రాముడితో పాటు వనములకు వెళ్ళెదము . అప్పుడు మన గృహములలో నిధులు దొంగలు తృవ్వుకొనిపోవుదురు . ఇళ్లన్నీ బూజులు పట్టి వాకిట ముగ్గులు వేసేవారులేక పాడుపడినట్లుండును . అటువంటి ఇల్లు కలిగిన ఈ అయోధ్యను ఆ కైకేయి తన కొడుకుతో పాటు ఏలుకుంటుంది . రాముడు వున్నది అరణ్యమైనా మనకు అయోధ్య వలె ఉండును . మనమందరము సమూహముగా వెళ్ళుటచే అక్కడి క్రూరమృగములన్నీ వనము వదిలి వెళ్లిపోవును . కావున మనము రాముని చూస్తూ హాయిగా కాలము గడపవచ్చు . అని నిర్ణయముకు వచ్చిరి . 
రాముడు ఆ వీధులన్నీ దాటి తండ్రి భవనమున ప్రవేశించెను . అక్కడి వారందరు ఎంతో దుఃఖితులై ఉండిరి . రాముడు తన ఆగమనం గూర్చి తండ్రికి తెలియబరుచుటకు సుమంత్రుడి వద్దకు వెళ్లి తన రాకను మహారాజుకి నివేదింపమని కోరెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











Wednesday 2 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిరెండవసర్గ

                                 రామాయణము 

                       అయోధ్యకాండ -ముప్పదిరెండవసర్గ 

లక్ష్మణుడు అన్న గారి ఆజ్ఞ మేరకు కులగురువు వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుని ఇంటకు వెళ్లి ఆయనను వెంట పెట్టుకుని తీసుకువచ్చెను . ఆయన రాక గురించి తీసిన శ్రీరాముడు సీతాసమేతుడై ఎదురేగి సాదరముగా ఆహ్వానించి ,ఆయనకు తన ఆమూలాయమైన ఆభరణములను ఇంకా అనేక రకములైన బంగారు ,వజ్ర ,రత్నములు మొదలయిన విలువైన వస్తువులను ఇచ్చి "నిర్మలమైన హృదయము కల ఓ మిత్రమా !సీతాదేవి నాతోకూడి వనములకు వచ్చుచున్నది . కావున తన ఆభరణములను మీ భార్య కొఱకు ఇవ్వకోరుచున్నది . ఇంకనూ కొన్ని విలువైన వస్తువులను ఇవ్వకోరుచున్నది కావున దయతో గ్రహించుడు . "అని పలికి సీతాదేవిచే అవన్నీ ఇప్పించేను . శ్రీరాముడి మేనమామ ఇచ్చిన 'శత్రుజయము 'అనే మదగజమును వేయి ఏనుగులను .వేయి బంగారు నాణెములను సుయజ్ఞునికి ఇచ్చెను . 
అంత రాముడు లక్ష్మణుడిని పిలిచి బ్రాహ్మణోత్తములను ఇలిచి వారికి సమృద్ధిగా బంగారము ,డబ్బు ,పట్టు వస్త్రములు వేలకొలదిగా దానము చేయమని ఆజ్ఞాపించెను . అంతః ఉరమున కల దాసదాసీ జనములకు సమృద్ధిగా కానుకలు ఇచ్చెను . రాముడు తన కోశాగారము కల దానము నంతా తెప్పించి కుప్పగా పోయించెను . ఆ ధనము నంతా బ్ర్రాహ్మణోత్తములకు ,దాస దాసీ జనములకు ఇచ్చివేసెను . అందరికి 14 సంవత్సరములకు సరిపడా ధనము ,వస్తువులు ఇచ్చెను . రాముడు దానము పుచ్చుకుని సంతృప్తిపడని వారు ఒక్కరు కూడా లేరు . 
అయోధ్యకు సమీపములో పింగళి వర్ణ కేశములు కల ఒక బీద బ్ర్రాహ్మణుడు ఉండెడివాడు . దరిద్రమును తట్టుకొనలేక అతడి భార్య శ్రీ రాముడి వద్దకు వెళ్ళినచో మన జీవనోపాధికి ఏదేని మార్గము దొరుకునని చెప్పగా ఆమె మాటలు విని ఆ బీద బ్ర్రాహ్మణుడు రాముని వద్దకు వెళ్లి తన స్థితిని గూర్చి చెప్పగా శ్రీరాముడు చిన్నగా నవ్వి "ఓ విప్రోత్తమా !నీకు వేయి గోవులు ఇచ్చినను తక్కువే . కావున నీ చేతి కఱ్ఱను బలముగా విసురుము . ఎంత దూరము విసరగలవో అంత గోవుల సమూహమును ఇచ్చెదను "అని పలికెను అంత ఆ బీద బ్రాహ్మణుడు కండువా నడుముకి బిగించి కట్టి తన శక్తి కొలది కర్రను దూరముగా విసరగా అది సరయూ నది దాటి ఆవలి వడ్డుకు వెళ్లెను . రాముడు ఆ ప్రమాణము కల గోవుల సమూహమును గోపాలురను ఆ బీద బ్రాహ్మణుడికి ఇంటికి పంపి "ఓ బ్రాహ్మణోత్తమా !మీకు ఇంకేమన్నా కావలిసిన యెడల మొహమాట పడకుండా అడుగుమనిన ఆ బ్ర్రాహ్మణుడు రాముడు దానగుణమును మెచ్చుకొనెను . శ్రీరాముడిని ఆశీర్వదించెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదిరెండవ సర్గసమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Tuesday 1 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ

                              రామాయణము 

                            అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ         

కౌశల్యా దేవి గృహము నుండి రాముని వెంటే వచ్చిన లక్ష్మణుడు సీతారాముల సంభాషణ విని ,తానూ కూడా వనములకు వచ్చుటకు తన అన్నాను ఎలా ఒప్పించాలా ?అని ఆలోచించసాగెను . ఆయన రాముడి పాదములపై పడి సీతాదేవిని ప్రార్ధించి "అన్నా !నీవు వనములకు వెళ్ళవలెననే నిర్ణయించుకొన్నచో నేను కూడా నీతో వనములకు వచ్చెదను దయతో కాదనకు నీవు లేని అయోధ్య నాకు నరకములో సమానము "అని వేడుకొనెను . 
అప్పుడు రాముడు నీవు నాతొ వచ్చినచో తల్లి కౌశల్యను ,సుమిత్రను ఎవరు జాగ్రత్తగా  చూసుకుంటారు . నేను ,సీతా లేకపోవుటచే ఆ తల్లులు ఇరువురు బాధతో క్రుంగి పోవుదురు . ఇక నీవు కూడా లేకపోతె వారి మంచి చెడు పట్టించుకునేది ఎవరు ?కనుక నీవు ఇక్కడే ఉండుము . అని చెప్పెను . 
అప్పుడు లక్ష్మణుడు "అన్నా !కౌశల్యా దేవి గారిని ఒకరు చూసుకొనవలసిన అవసరము లేదు . ఆవిడ ను ఆశ్రయించుకున్నవారిని ,మా తల్లి గారైన సుమిత్రాదేవిని కూడా చూసుకొనుటకు కౌశల్యాదేవికి వేళా ఏకారముల భూములు కలవు . అదీకాక భరతుడు నీ వలెనే తల్లితండ్రుల పట్ల అపారమైన గౌరవ మర్యాదలు కలవాడు  కావున అతడు తల్లులను జాగ్రత్తగా చూసుకొనగలడు . 
కావున నన్నునూ మీతో పాటు రానివ్వుడు "అని పలికెను . అంత రాముడు లక్ష్మణుడు వనములకు వచ్చుటకు రాముడు అంగీకరించెను . అప్పుడు రాముడు వశిష్ట మహర్షి మహర్షి ఇంట వున్నదివ్య ఆయోధములను వెంటనే తీసురమ్మని ఆజ్ఞాపించెను . అప్పుడు లక్ష్మణుడు తన వారి వద్ద వనవాస గమనమునకు అనుమతి తీసుకుని వశిష్ట గృహమున కల ఆయుధములు తెచ్చి అన్నగారికి చూపించెను . అప్పుడు రాముడు లక్ష్మణుడి గమన వేగతను  మెచ్చుకుని బ్ర్రాహ్మణోత్తములకు దానములు ఇవ్వదలిచాను . వశిష్టుని పుత్రుడైన సుయజ్ఞుని ,ఇంకా గొప్ప వారైన బ్రాహ్మణోత్తములను వెంటనే తీసుకురమ్ము "అని ఆజ్ఞాపించెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదిఒకటవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .