Sunday 6 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిఆరవసర్గ

                                       రామాయణము 

                                     అయోధ్యకాండ -ముప్పదిఆరవసర్గ 

సుమంత్రుడు నయానా భయాన ఎంతగా చెప్పినను కైకేయి మారుమాట్లాడకుండెను . దశరధుడు మిక్కిలి వగచుచు కన్నీరు పెట్టుచూ సుమంత్రుడితో "ఓ సుమంత్రా !రత్నములతో సుసంపన్నమైన చతురంగ బలములను రాముని సేవలకై వెంటనే ఆయనతో పంపుము . మరియు ఆ సేవలతో కూడా నర్తకీ మణులను ,చతురోక్తులు పలుకువారిని ,మిగులు సంపన్నులైన వ్యాపారులను పంపించుము . శ్రీరాముడికి తోడుగా ఉండుటకు ,మల్లయుద్ధప్రదర్శనాదులతో రామునకు ఆహ్లాదమును గూర్చుటకు ,తగిన  వారిని సువర్ణములు ,రత్నములు ,వస్త్రాదులను బహూకరించి వారిని ఆ సేనల వెనక పంపుడు . 
ముఖ్యమైన ఆయుధములను నగరవాసులను ఆహార పదార్ధములలో కూడిన బళ్ళను అడవులలో మార్గము చూపునట్టి ఆటవికులు శ్రీరామునికి తోడుగా పంపుము . శ్రీరాముడు అడవులలో క్రూరమృగములను ,ఏనుగులను వేటాడుచు అచట లభించేడి తేనెలు త్రాగుచు ,వివిధ నదీ ప్రవాహములను దర్శించుచు హాయిగా కాలము గడుపుతాడు . నిర్జనారణ్యములో నివసించే రామునికై ఎద్దులపైనను ,ఒంటెల పైనను నా ధన ధాన్యములను పంపుడు . అలా చేసినచో వనవాస కాలములో శ్రీరాముడు ఆయా పుణ్యస్థలములయందు యజ్ఞములను ఆచరించుచు ,ఋత్విజులు మున్నగు వారికి యజ్ఞదక్షిణలు ఇచ్చుచు ,ఋషులను సేవించుచు అచట సుఖముగా ఉండగలడు . "
దశరధుడు ఇలా పలుకగా కైకేయికి భయము పట్టుకొనెను . ఆమె ముఖము వెలవెల బోయెను . అప్పుడా కైకేయి విచార గ్రస్తురాలై రాజుకు ఎదురుగా నిలిచి" ఓ రాజా !ఏమి లేని ఈ రాజ్యము భరతుడికి అక్కరలేదు . "అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కైకేయితో దశరధ మహారాజు "నీచురాలా !ఎందుకిలా పలుకుతున్నావు . ఇప్పుడు పలుకుతున్న ప్రతిబంధకములు వారములు కోరినపుడు నీవు కోరలేదు . ఈటల వంటి మాటలతో నన్ను ఎలా భాదించుచున్నావు ?"అని పలుకగా కైకేయి తన పన్నాగము దెబ్బతినునను బాధపడుచుండెను . అప్పుడు కైకేయి "అయ్యా !మీ వంశము వాడైన సగరుడు తన జ్యేష్ఠ పుతృడిని అసంజసుడిని రాజ్యము నుండి వెళ్ల గొట్టినాడు . ఆ విధముగా నీవు కూడా నీ జ్యేష్ఠ ఉట్రుడిని వనములకు పంపుము . "అని పలుకగా 
అచటనే వున్న సిద్దార్ధుడు అను వృద్ధ మంత్రి "అసమంజసుడు వీధులలో ఆడుకుంటున్న పిల్లలను తీసుకు వెళ్లి సరయు నదిలో ముంచి వారు బాధ పడుచుండగా అది చూసి ఆనందించెడివాడు . ప్రజలు రాజు అయినసాగరుడితో మోర పెట్టుకోగా ఆయన తన పెద్ద కుమారుడిని అతడు చేస్తున్న తప్పిదము కారణముగా రాజ్య బహిష్కరణ చేసినాడు . శ్రేష్ఠుడైన శ్రీ రామునితో తరచి చూసినా ఒక్క తప్పిదము కూడా కానరాదు . నీవు అతడితో ఒక్క తప్పును చూపించు వనవాసమునకు మేమందరము సమ్మతించెదము "అని పలికెను . 
ఆ వృద్ధ మంత్రి మాటలు విని దశరధ మహారాజు కైకేయి తో "ఓ పాపాత్మురాలా !ఈ సిద్దార్ధుని పలుకులు నీకు రుచించుటలేదా !రాజ్యాధికారమును ,సుఖసంపదలను వీడి నేనును నేడే శ్రీరామునితో అడవులకు వెళ్లెదను . ఇక నీవును భరతుడు ఈ రాజ్యమును మీకు ఇష్టమొచ్చినట్లు మీరు కోరినంత కాలము హాయిగా ఏలుకొనుడు "అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

























































































































































































































































































































































































































































































































































































No comments:

Post a Comment