Sunday 13 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదిఒకటవసర్గ

                                       రామాయణము 

                                 అయోధ్యకాండ -నలుబదిఒకటవసర్గ 

పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వనవాసమునకు వెళ్లిన పిమ్మట అంతః పుర స్త్రీల ఆర్తనాదములు మిన్నుముట్టెను . పుత్రుని ఎడబాటుకు మిగుల విలవిలలాడుచున్న ఆ దశరథ మహారాజు అంతః పురమున చెలరేగిన భయంకరమైన ఆ ఆర్తనాదములను విని ,ఇంకను దుఃఖముతో కృంగిపోయెను . జనులందరు రాముని వనవాస బాధలో మునిగిపోయి ఉండిరి . అందుచే నిత్యకార్యకలాపములన్నీ స్తంభించిపోయెను . నిత్యాగ్నిహోత్రులు అగ్ని కార్యము చేయకుండిరి . గృహస్తుల ఇండ్లలో స్త్రీలు పొయ్యిలు వెలిగించలేదు . పౌరులందరిని దైన్యమావహించెను . పౌరులలో ఏ ఒక్కరికి ఆహారవిహారముల మీదకు మనసు పోకుండెను . ఒక్కరి ముఖమునందయినను సంతోషము లేకుండెను . 
గాలులు చల్లదనము కోల్పోయెను . చంద్రుడు సౌమ్య లక్షణము నకు దూరమయ్యెను సూర్యతాపము సన్నగిల్లెను . జగత్తంతయు క్షోభమున మునిగెను . శ్రీరాముని మిత్రులందరూ మతులు పోయినవారై ,శోకభారమున మంచము పట్టిరి . వారి కదలికలే ఆగిపోయెను . మహాత్ముడైన శ్రీరాముడు లేకుండుటచే తీవ్ర భయశోకములు అలముకొనగా అయోధ్య ,ఇంద్రుని భయము కారణముగా పర్వతములతో కూడిన భూమి వలె ఎంతో చలించెను . మఱియు అది యోధుల రోదన ధ్వనులతో ,గజాశ్వముల దుఃఖనాదములతో ప్రతిధ్వనించేను . 

రామాయణము అయోధ్యకాండ నలుబదిఒకటవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
 


 

No comments:

Post a Comment