Friday 11 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదియవ సర్గ

                             రామాయణము 

                     అయోధ్యకాండ -నలుబదియవ సర్గ                

సీతారామలక్ష్మణులు తల్లితండ్రుల సేవకు దూరమగుచున్నందుకు దీనులై .మహారాజు కు ప్రదక్షణ పూర్వకముగా పాదాభివందనములు చేసిరి . తండ్రి అనుజ్ఞ తీసుకుని తల్లి కౌశల్యా మాతకు నమస్కారము చేసెను . పిమ్మట సుమిత్రాదేవికి నమస్కారము చేసెను . వారిని సుమిత్రాదేవి దీవించెను లక్ష్మణుడికి  అన్నగారికి ,వదినగారి సేవచేయమని ప్రోత్సాహపరిచేను . 

ఆ విధముగా అందరికి వీడ్కోలు పలికి సీతారామలక్ష్మణులు వనవాసమునకు బయలుదేరిరి . దశరధుడు సీతాదేవికి ఇచ్చిన 14 సంవత్సరములకు సరిపడా వస్త్రములు ,ఆభరణములను సుమంత్రుడు రథములో పెట్టించెను . ఇంకా రామలక్ష్మణుల కొరకు ఆయుధములు ,కవచములు డాళ్లు ,పలుగు ,గంప మొదలగు వాటిని రధము వెనక భాగములో పెట్టెను . అంతసీతారామలక్ష్మణులు శీఘ్రముగా రధమును అధిరోహించిరి . 
సుమంత్రుడు' జరుగుము జరుగుము 'అని అరుచుచు రధమును ముందుకు నడిపెను . ఆ విధముగా రాముడు వనవాసమునకు బయలుదేరుట చూసిన జనులు పెక్కు మంది మూర్చిల్లిరి .మిగిలిన వారు దుఃఖముతో ఎక్కీఎక్కి ఏడ్చిరి . మదపుటేనుగుల ఘీంకారములతో ,దిక్కుతోచక తిరుగుతున్న గుఱ్ఱముల సకిలింపులతో ,వాటి ఆభరణములు రొదతో జనుల చెవులు దిమ్మెక్కెను . జనులు దిక్కుతోచనివారయ్యెను . ఆ జనులలో పెక్కు మంది రధము వెనుక పరిగిడిరి . కొంత మంది రధమును ఇరువైపులా ,వెనకభాగములో రధమును పట్టుకుని వేలాడిరి . 
స్త్రీల మధ్య వున్న దశరథ మహారాజు శ్రీరాముని ఒక్కసారి చూస్తాను అని బయటకు వచ్చెను . తండ్రి దీనావస్థను రధము మీద నుండే గమనించిన శ్రీరాముడు రధమును త్వరగా పోనిమ్ము అని సుమంత్రుని తొందరపెట్టెను . రధమునకు వేలాడుతున్న జనులు ఓ సారధి !ఒక్కసారి రధమును ఆపుము  మా రాముని కన్నులారా చూడనిమ్ము . అని పలుకసాగిరి . అప్పుడు సుమంత్రునికి ఎవరి మాటను పాటించాలో అర్ధము కాకుండెను . శ్రీరాముని రధము ముందుకు సాగిపోవుచుండగా లేచిన దుమ్ము జనుల కన్నీటి జలములతో అణగారిపోయెను . ప్రజలందరు మిక్కిలి పరితాపమునకు గురిఅయ్యిరి . వారి కన్నీటి తో ఆ నగర వీధులన్నీ తడిసిపోయెను . శ్రీరాముడు కానరాకపోవటం ,జనుల దీనావదనాలు చూసిన దశరధుడు ఒక్కసారిగా స్పృహతప్పిపోయెను . అది చూసి జనులందరూ ఆక్రన్దనలు చేసిరి . 
రాముని చూడవలెనని కోరిక బలీయమగుటచే కౌశల్యాదేవి రధము వెళ్లన వైపు పరుగెడుతూ రామా !లక్ష్మణా !సీతా !అని ఆక్రోశించసాగెను . దశరధుడు తేరుకుని రధమును ఆపుము ఆపుము అని అరిచెను . రాముడు త్వరగా పోనిమ్ము అని పలికెను సుమంత్రుడు ఎవరి ఆజ్ఞను పాటించాలో తెలియని స్థితిలో పడెను . చివరకి రాముని ఆజ్ఞను పాటించి రధమును వేగముగా నడిపెను . అంతః పురజనులు రాముడు కనిపించనంత దూరము వెళ్లిన పిమ్మట మనస్సులోనే రామునికి ప్రదక్షణ నమస్కారములు చేసి వెనుతిరిగిరి . వారు తమ కన్నీటి ధారాలను ఆపుకొనలేకుండిరి . అప్పుడు దశరధుని శరీరము చెమర్చి ఉండెను . అతని శరీరమంతా మిక్కిలి వాడిపోయివుండెను . అత్యంత దీనావస్థలో ఆ మహారాజు రాణులతో కూడి తన పుత్రుని వైపే చూస్తూ అచటనే నిలబడిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment