Wednesday 16 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదిరెండవసర్గ

                                         రామాయణము 

                                         అయోధ్యకాండ -నలుబదిరెండవసర్గ 

వనములకు వెళ్లుచున్న శ్రీరాముని రాధా చక్రముల వేగమునకు రేగిన దుమ్ము కనపడునంతవరకు దశరథ మహారాజు అచటనే నిలబడి శ్రీరాముడు కనపడకుండుటచే దుమ్ము వంక చూస్తూ నిలబడెను .   అది కూడా కనుమరుగయినా తదుపరి మహారాజు ఆర్తితో అలమటించుచు నేలపై పడిపోయెను . అది చూసి కౌశల్య ,కైకేయిలు ఆయనను లేపుటకు వచ్చిరి . అప్పుడు దశరధుడు కైకేయితో నీవు నన్ను తాకకుండుము . నేను నిన్ను త్యజించుచున్నాను . నేటి నుండి నేను నీకు నేను భర్తను కాను . నిన్ను ఆశ్రయించుకున్నవారికి కూడా నేను ప్రభువును కాను  అని పలికెను . 
కౌశల్యా దేవి ఆయనను లేవనెత్తెను . దశరధుడు తన భవనంలోకి వెళ్లుటకు వెనుతిరిగేను . కౌశల్యాదేవి భవనమునకు వెళ్లెను . రాముడు లేని భవనము,ఆ రాత్రి  ఆయనకు కాళరాత్రి వలె అనిపించెను . "అల్లారు ముద్దుగా భోగభాగ్యాల మధ్య పెరిగిన నా శ్రీరాముడు ఎన్ని కష్టములు అనుభవించునో ,జనకుని ముద్దుల కూతురు సింహ గర్జనలు మొదలగు క్రూర మృగముల అరుపులకు ఎంత భయపడునో "అని తలుచుకుని మిక్కిలి పరితపించసాగెను ." ఈ 14 సంవత్సరముల తదుపరి రాముని చూచు కన్నులు ఎంత భాగ్యము కలవో ,ఆ భాగ్యము నాకు వున్నదో లేదో "అని వెక్కి వెక్కి ఏడవసాగెను . 
ఇంకనూ ఆయన కౌశల్య ను పిలిచి "పవిత్రురాలా !నన్ను ఒక్కసారి నీ చేతితో తాకుము . నీవు తాకిన ఆ స్పర్శ రామునిదిగా భావింతును . (కౌశల్యా రాముని జనని కావున )"అని పలికెను . తల్పంపై   పరుండి ,అనుక్షణము శ్రీరామునేస్మరించుచున్న మహారాజుని చూసి ,కౌశల్యా దేవి ఆయన పక్కన కూర్చుండి శోకమూర్తియై విలపించెను . 

              రామాయణము అయోధ్యకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment