Friday 4 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదినాల్గవసర్గ

                                   రామాయణము 



                         అయోధ్యకాండ -ముప్పదినాల్గవసర్గ 

సుమంత్రుడు దశరధుని భవనములోనికి ప్రవేశించి దుఃఖ సాగరంలో మునిగిపోయివున్న దశరథ మహారాజుని చూసి రాముడు వచ్చిన సంగతిని విన్నవించెను . అపుడు మహారాజు "నా భార్యలందరిని తీసుకురమ్ము వారితో కలసి నేను రాముని చూడదలిచాను . "అని పలుకగా సుమంత్రుడు దశరథ మహారాజు భార్యలందరి వద్దకు వెళ్లి మహారాజు గారి ఆజ్ఞ తెలిపెను . రాముని వనవాస విషయము తెలిసి మిక్కిలి రోధించుటచే వారి కళ్లు ఎరుపెక్కి వున్నవి . అట్టి 350మంది దశరధుని భార్యలు కౌశల్యాదేవితో కూడి దశరధుని భవనమునకు చేరిరి . అపుడు మహారాజు సుమంత్రునితో రాముని తీసుకురమ్మని చెప్పేను . భార్యల మధ్యలో కూర్చున్న దశరథ మహారాజు ఆసనము నుండి లేచి  రామునికి  వడివడి నడకతో ఎదురేగి రాముని చేరకనే స్పృహ తప్పి పడిపోయెను . 
అప్పుడు ఆ భవనము అంతా స్త్రీల రోదనలతో ఆభరణములు చప్పుడుతో మారుమ్రోగేను . రామలక్ష్మణులు పరుగున వచ్చి దశరథ మహారాజును లేవదీసి శయ్యపై పరుండబెట్టిరి . అంత కొంత సేపటికి మహారాజుకి స్పృహ రాగా శ్రీరాముడు "తండ్రీ మీరు మాత కైకేయికి ఇచ్చిన వారము ప్రకారము నేను వనవాసమునకు బయలుదేరుతున్నాను .  లక్ష్మణుడు సీత నన్ను అనుసరించుతున్నారు . మాకు అనుజ్ఞ ఇవ్వండి . మేము వనవాసములకు వెళ్ళెదము "అని పలుకగా దశరధుడు కైకేయికి వారములు ఇచ్చి నేను మోసపోయాను . నీవు నా ఆజ్ఞను వదిలి స్వయముగా ఈ అయోధ్యకు రాజువు కమ్ము వనవాసములకు వెళ్ళవద్దు "అని పలుకగా 
శ్రీరాముడు "తండ్రీ ఎన్ని సంవత్సరములకు అయినను ఈ అయోధ్యకు మీరే ప్రభువులు . మీ మాట జవదాటుట నాకు ధర్మమూ కాదు . కావున వనములకు వెళ్లి అక్కడ 14 సంవత్సరములు విహరించి తిరిగి వచ్చి మీ సేవ చేసుకుంటాను . "అని పలికెను . 
దశరధ మహారాజు "తండ్రీ నిన్ను ధర్మపాలన నుండి మరల్చుట ఎవ్వరికిని సాధ్యము కాదు . ఈ ఒక్కరోజయినా నా కాళ్ళ ముందు ఉండుము "అని అర్ధించగా రాముడు "తండ్రీ నేను ఒక్క క్షణమైనా ఈ నగరములో ఉండరాదు . 14 సంవత్సరములు గడిచిన పిమ్మట మీ దర్శనము చేసుకొనెదను "అని పలుకగా దశరధుడు తనను ,కైకేయిని తిట్టుకుంటూ చేసేది లేక "నాయినా జాగ్రత్తగా వెళ్ళిరా !వనములలోని క్రూర మృగములనుండి ,భయంకర రాక్షసుల నుండి నీకు ఎటువంటి ఆపద రాకుండు గాక !"అంటూ తీవ్రముగా రోధించసాగెను . 
రాముడు "తండ్రీ వనము లోని వన్య మృగములతో కాలక్షేపము చేస్తూ అచటి సెలయేళ్ళను చూస్తూ నేను అక్కడ ప్రశాంత జీవనము గడిపెదను కావున మీరు నా కొరకు దుఃఖించకుండా ప్రశాంతముగా ఉండండి "అని పలికెను శ్రీరాము ఈ విధముగా వివరింపగా పుత్ర వియోగ భాదను భరించ లేక దశరధుడు శారీరకంగా కృషుయించుచు ,మానసికముగా కృంగిపోవుచు తీరని బాధకు లోనయ్యేను . వెంటనే అతడు శ్రీరాముని హృదయమునకు హత్తుకుని స్పృహను కోల్పోయెను . ఒక్క కైకేయి తప్ప అక్కడ వున్నా రాణులందరూ ఒక్కసారిగా బోరున ఏడ్చిరి . సుమంత్రుడు కూడా ఏడ్చుచు మూర్ఛపోయెను . ఆ మందిరము అంతా హాహాకారములతో నిండిపోయెను . 

రామాయనము అయోధ్యకాండ ముప్పదినాల్గవ సర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















No comments:

Post a Comment