Saturday 5 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పది ఐదవసర్గ

                                        రామాయణము 

                                      అయోధ్యకాండ -ముప్పది ఐదవసర్గ 

దశరధుని రధసారధి అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి తేరుకొనిన పిదప పట్టరాని కోపముతో ఊగిపోయెను . పండ్లు పటపట కొరుకుతూ ,కన్నులెఱ్ఱజేసెను . మనస్సు వుడికిపోవుచుండుటచే అతని దేహకాంతి మారెను . పొంగిపొర్లుచున్న పరితాపమును ఆపుకొనలేక అతడు కోపోద్రుక్తుడయ్యెను . అంతట కైకేయితో సుమంత్రుడు "ఓ కైకేయి దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు . ఈ అయోధ్య రాజ్యములోని సమస్త జీవులకు నాధుడు . అట్టి మహాప్రభువుని తృణీకరించి ,ఇట్టి ఘోర కృత్యమునకు పాల్పడినావు . దీనిని బట్టీ చూడగా నీవు నీ పతిని మాత్రమే కాదు ఈ ఇక్ష్వాకువంశమునే రూపుమాపేదవనిభావిస్తున్నాను . 
దశరథ మహారాజు నీకు కోరిన వరములను ఇచ్చి చక్కగా చూసుకుంటున్నారు . అట్టి ప్రభువును నీవు అవమానింప తగదు . రాజు పరలోకగతుడైనచో అతని కుమారులలో జ్యేష్ఠుడు రాజగుట ఇక్ష్వాకు వంశ ఆచారము . పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించివుండగనే మంటకలుపుటకు పూనుకొంటివి . 
అయోధ్యలోని పౌరులు ,రాజ్యములోని ఇతర జానపదులు మొదలగు వారితో కూడి మేమందరము రాముని మార్గమున నడిచెదము . బంధుమిత్రులు ,సాధువులు ,బ్ర్రాహ్మణులు మున్నగువారంతా ఈ రాజ్యమును వీడి వెళ్ళెదరు . అట్టి రాజ్యము వలన నీకేమి లాభము ?
నాకు ఆష్క్యార్యము కలుగుతున్నది . శ్రీరాముని నిర్దాక్షిణ్యముగా వనములపాలు చేయుచున్న నిన్ను వశిష్టాది మహర్షులు తమ ఛీత్కారములచే ,భయంకరములయిన శాపాయుధములచే ఎలా దహించివేయుటలేదు ?నీ తల్లి మూర్ఖపు పనుల గురించి ఇదివరకే మేము వినివున్నాము . ఒకానొక గంధర్వ యోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించెను . దాని ప్రభావమున ఆ మహారాజు సమస్త ప్రాణుల అరుపులు ,వాటి భావములను గ్రహించగలడు . ఒక రోజు ఒక పక్షుల జంట మాట్లాడుకొనుచుండగా దాని భావము తెలిసిన  ఆయన రెండు పర్యాయములు నవ్వేను . దానికి మీ తల్లి తనను చూసి (గేలి చేయుచు )నవ్వుతున్నాడని తలచి మిక్కిలి కోపోద్రిక్తురాలయ్యెను . ఆమె మీ తండ్రిని ఎందుకు నవ్వినారని అడిగెను . దానికి మహారాజు "దేవి !దానిని గూర్చి నీకు వివరించినచో నేను మరణించెదను "అని పలికెను . 
అప్పుడామె "నీవు జీవించి వుందువో లేదో నాకు తెలియదు . నన్ను మాత్రము గేలి చేయకు . నవ్వినా కారణము చెప్పుము "అని అడిగెను . తన భార్య ఇలా పలికిన పిమ్మట కేకేయ మహారాజు తనకు వరమును ప్రసాదించిన ఆ గంధర్వ యోగికి జరిగిన విషయమును అంతా వివరించెను . అంతట వరమిచ్చిన ఆ సాధువు రాజుతో "ఓ రాజా !నీవీ విషయము ఆమెకు తెలిపినచో నీకు చావు తప్పదు . ఆమె మరణించినను లేక ఏమయినను ఈ రాహస్యమును తెలుపవలదు . "అని చెప్పెను . అప్పుడు మీ తండ్రి ఆ సాధువు మాటలు పాటించి మీ తల్లి కోరికని త్రోసిపుచ్చి హాయిగా ఉండెను . తండ్రుల లక్షణములు కొడుకులకు తల్లి లక్షణములు కుమార్తెకు వచ్చునని లోకోక్తి నిన్ను చూస్తే నిజమనిపిస్తోంది . 
ఈ దశరథ మహారాజు సమస్త ప్రజలకు రక్షకుడు . నీవు పాపబుద్ది కలదానివై అట్టి మహారాజుచే అధర్మ కార్యములను (జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట చిన్న వానిని యువరాజుగా చేయుట )చేయింపవలదు . ఇట్లు సుమంత్రుడు రాజు సమక్షమున పదేపదే స్వా o తన వచనములతో ,తీవ్రమైన హెచ్చరికలతో కైకేయిని కలత చెందినట్లు చేసి కృతాంజలియై నిలబడెను . ఆ కైకేయి అతని మాటలను ఏ మాత్రము చెవి శోకానీయలేదు మనసున పరితపింపనూలేదు . ఆమె ముఖమున కించిత్తయినను మార్పు కనబడలేదు . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









 

No comments:

Post a Comment