Tuesday 8 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదియేడవసర్గ

                                       రామాయణము 

                       అయోధ్యకాండ -ముప్పదియేడవసర్గ 

వినయ విధేయతలు కల శ్రీరాముడు మంత్రులలో వృద్ధుడైన సిద్దార్థుని మాటలు విని తండ్రి తో "ఓ మహారాజా !సర్వ సుఖములను పరిత్యజించి అన్ని విషయముల అందు ఆశక్తిని వీడిన నాకు చతురంగబలముతో పనియేమి ?అట్లే మీరు నా వెంట పంపదలచుకున్న సేనలు సమస్త వాహనములు ,ధనధాన్యములు ,మొదలగువాటన్నిటిని భరతుడికి ఇచ్చివేయుచున్నాను . నా కొఱకు వల్కలములు మాత్రము తెప్పించుడు . 14సంవత్సరములు వనములలో నివసించుటకు వెళ్లుచున్న నాకు ఒక పలుగు ,గంపను ఇచ్చిన చాలు . "అని పలికెను . 
అపుడు కైకేయి నారచీరలు స్వయముగా తీసుకువచ్చి సిగ్గుఎగ్గులు లేకుండా జనుల సమక్షంలో శ్రీరాముడికి ఇచ్చి ధరించమని చెప్పెను . శ్రీరాముడు వాటిని తీసుకుని తన మెలి వస్త్రము స్థానములో నారచీరలు అక్కడే ధరించెను . లక్ష్మణుడు కూడా నారచీరలు ధరించెను . ఎల్లపుడు పట్టువస్త్రములనే ధరించే సీత నారచీరలు చూసి వాటిని ఎలా ధరించాలో తెలియక సిగ్గుపడెను . అట్టి చీరలు ధరించుట కొత్త అగుటచే ఆమె ధరించుట చేతకాక ఒక చీరను కంఠము  చుట్టూ చుట్టుకొని మరియొక చీరను చేత పట్టుకుని నిలబడెను . 
అది చూసిన శ్రీరాముడు సీత వద్దకు వెళ్లి ఆమె పట్టుచీర పైనే నారచీరను చుట్టెను . రాముడు స్వయముగా సీతకు నారచీరలు కట్టబెట్టుట చూసిన అంతః పుర స్త్రీలందరూ దుఃఖితులై కంట తడిపెట్టి శ్రీరామునితో "నాయనా !మీ తండ్రి గారు సుకుమారి అయిన సీతకు వనవాసము విధించలేదుకదా . మీ తండ్రిగారి ఆజ్ఞను పాటించి వనవాసము ముగించుకుని తిరిగిరా అప్పటివరకు ఈ సీతను మేము జాగ్రత్తగా చూసుకుంటాము . ఈమె మిక్కిలి సుకుమారి వనములలో ఈమె కష్టములు అనుభవించలేదు . "అని పలికిరి . శ్రీరాముడు వారి మాటలు పట్టించుకొనక సీత చేత నారచీరలు ధరింపచేసెను . 
సీత నారచీరలు ధరించుట చూసిన వశిష్ఠుడు ఆమెను వారించి ,కైకతో "ఓ దుష్టురాలా !వంశ మర్యాదను మంటకలుపుచూ హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు . సీతాదేవి వనములకు పోనక్కరలేదు . శ్రీరామునికి మారుగా ఆమె సింహాసనమును అధిష్టించగలదు . సీతాదేవి వనములకు వెళ్ళుట జరిగినచో మేమందరము వారితో వెళ్ళెదము . అంతేకాక పురజనులు కూడా వెళ్ళెదరు . సీతారాములు నివసించు ప్రదేశమే అయోధ్య . కావున సమస్త జనులు అక్కడికి చేరెదరు . అంతేకాదు భారతశత్రుఘ్నులుకూడా నారచీరలు ధరించి శ్రీరాముడు నివసించు ప్రదేశమునకు వెళ్లి  అక్కడనే జీవింతురు . ప్రజలందరూ వెళ్ళిపోయినా పిమ్మట చెట్లుచేమలే మిగిలివున్న ఈ భూమిని ఏకాకివై నీవే ఏలుకొమ్ము . భరతుడు కి శ్రీరాముడన్న అపార ప్రేమ ఆయన తండ్రి ఇష్టముగా ఇవ్వని రాజ్యమును ఏలుకోనడు . జనులు కాదు పశుపక్షాదులు కూడా శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళుట నీవేచూస్తావు . చెట్లు కూడా వదిలిన ముఖములతో శ్రీరాముడు వెళ్లిన దిక్కుగానే చూస్తాయి . 
ఓ కైకేయి !నీ కోడలయిన సీతాదేవికి వల్కలములు తీసివేసి ఆమెకు అమూల్యమైన వస్త్రములు ఆభరణములు ఇమ్ము . ఈమెకు వల్కలములు ఇచ్చుట ధర్మము కాదు . 
శ్రీరాముని వనవాసమునే కోరుకుంటివి సీత వనవాసము కాదు . కనుక ఈమె నిత్యమూ వస్త్రాలంకారభూషిత అయి వనములో శ్రీరామునితో కూడి ఉండును . ఈ రాజకుమారి వస్త్రములతో ,సకల సౌకర్యములతో ,ముఖ్యలైన పరిచారికలతో కూడి వాహనము వెళ్తుంది . "అని కోపావేశమున పలికెను . 
వశిష్ఠుడు ఈ విధముగా పలుకుచున్నను సీతాదేవి  మాత్రమువస్త్రభూషణాదుల మీద ఆశక్తి చూపక తన ప్రాణతుల్యుడైన శ్రీరామునితో సమానముగా నారచీరలనే ధరించెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  












 

No comments:

Post a Comment