Sunday 30 April 2017

                                             రామాయణము 

                                            అరణ్యకాండ ---ఇరువది రెండవసర్గ 

రాక్షసులందరి సమక్షమున శూర్పణఖ శూరుడైన ఖరుడిని ఆ విధముగా అవమానింపగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతో "ఓ సోదరీ !నీకు జరిగిన ఈ అవమానము నాలో క్రోధము ను ప్రజ్వల్లింపచేయుచున్నది . మానవ మాత్రుడైన అల్పాయుష్కుడైన రాముడు నాకొకలెక్కా ?అతడినే కాదు అతడి తమ్ముడు లక్ష్మణుడిని కూడా యమపురికి ఈ దినమునే పంపెదను . నీవు భయమును వీడుము ,కన్నీరును తుడుచుకొనుము . రణరంగమున ఆ రాముడిని పరిమార్చెదను . వాడి వేడి నెత్తురు నీవు ద్రాగుదువు . "అని పలికెను . 
ఖరుడి నోటి వెంట వచ్చిన ఆ మాటలు విని శూర్పణఖ ఎంతో పొంగిపోయెను . తన అన్నను పరిపరి విధములుగా ప్రస్తుతించేను . పిమ్మట ఖరుడు మిక్కిలి బలశాలురైన 14000 మంది రాక్షసులతో ,కత్తులు ,శూలాలు ,బల్లెములు ,బాణములు మొదలగు వాడి ఆయుధములు ధరించి శ్రీరాముడిపై యుద్ధమునకు బయలుదేరెను . ఖరుడి రథచక్రముల శబ్దములకు భూమి దద్దరిల్లేను . అడవిలోని మృగములు ,పక్షులు అన్నీ బెదిరి పారిపోతుండగా ఖరుడు తన సేనతో సహా శ్రీరాముడి పై యుద్ధమునకు ముందు కు కదిలెను . 

రామాయణము అరణ్యకాండ ఇరువది రెండవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము అరణ్యకాండ -ఇరువదియొకటవసర్గ

                                          రామాయణము 

                                           అరణ్యకాండ -ఇరువదియొకటవసర్గ 

సమస్త రాక్షసుల వినాశనం కొఱకే దాపురించిందా అన్నట్లు  ఎదుట ఏడ్చుచు మరల వచ్చిన శూరపణఖను చూసిన ఖరుడు  క్రుద్ధుడై "ఏమి సోదరి !ఎందులకు ఏడ్చుచున్నావు ?నీవు ఏడ్చుచున్నావనే కదా !భీకరులైన రాక్షసులను పంపివుంటిని . ఏమి జరిగినది ? నేను పంపిన వీరులు భయంకరులు ,ఎదుటివారిని చంపి తినెడినరరూప రాక్షసులు ,అంతే కానీ చచ్చెడివారు కాదు . అంతటి మహా వీరులను నీతో పంపినప్పటికీ మరలా నీవు ఎందుకు ఏడ్చుచుంటివి ?ఏమి కొంప ములిగినది ?"అని ప్రశ్నించెను . 
అప్పుడా పెద్ద పొట్టగల రాక్షసి ఐన శూర్పణఖ "అన్నా !నా ముక్కు చెవులు కోసిన కారణముగా నీ వద్దకు వచ్చి గోడు వెలబోసుకుంటిని . నీవు వీరులైన పదునాలుగు మంది రాక్షస యోధులను పంపి వంటివి . వారినందరిని నిముష కాలములో ఆ దశరథ పుత్రుడు పరిమార్చినాడు . అతడు గొప్ప పరాక్రమశాలి . అతడి ముందు నీ బలము కూడా చాలదని నా ఉద్దేశ్యము . నీవు కనక అతడిని వధించలేకపోయినట్లయితే నీవు ఈ దండకారణ్యములో వుండు అర్హతను కోల్పోతావు . ఒక మానవుడిని ఎదిరించలేనట్లయితే నీ బతుకు వ్యర్ధము . నీవు పలికే ప్రగల్బాలన్నీ ఒట్టి గాలి మూటలే అవుతాయి . మన రాక్షస జాతికే అవమానము "
అని పలుకుతూ ఆ రాక్షసి రొప్పుతూ ,ఏడ్చుచు ,గగ్గోలు పెడుతూ బిగ్గరగా అరుస్తూ కొంత సేపటికి మూర్ఛపోయెను . 

రామాయణము అరణ్యకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Sunday 23 April 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదియవసర్గ

                                       రామాయణము 

                                       అరణ్యకాండ -ఇరువదియవసర్గ 

ఖరుడిచే పంపబడిన క్రూరులైన పదునాలుగు మంది రాక్షసులు ,శూర్పణఖ శ్రీరాముని ఆశ్రమమునకు వచ్చి ఆసీనులైవున్న సీతారామలక్ష్మణులను చూసిరి . వారినందరిని చూసిన శ్రీరాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !వికృతాకారి అయిన ఈ రాక్షసి రాక్షసులను వెంటబెట్టుకుని వచ్చినది . నీవు ఒక్క క్షణకాలం అప్రమత్తుడవై మీ వదినను రక్షించుము . నేను వీరిని మట్టికరిపించెదను "అని పలికి 
రాక్షసులవైపు తిరిగి ఆ రాక్షసులతో "హింసా ప్రవ్రుత్తి కల మీ వంటి పాపాత్ములను వధించుటకే ,మహర్షుల ఆదేశము అనుసరించి ధనుర్భాణములు ధరించినాను . మీరు నాతొ యుద్ధము చేయదలిచినట్లయితే పారిపోక నిర్భయముగా ఉండుము . ప్రాణములమీద ఏమాత్రము ఆశ ఉన్నచో వెనువెంటనే ఇచట నుండి పొమ్ము "అని పలికెను . 
బ్రహ్మహత్యాపాతకులైన ఆ వికృతాకార రాక్షసులు శ్రీరాముడి పలుకులకు మండిపడి "మహాకాయుడు మాకు ప్రభువు అయిన మా ప్రభువు ఖరుడికి నీవు కోపము తెప్పించినావు . నేడు రణరంగమున నీకు చావు తప్పదు . మేము పెక్కుమంది మి ,నీవు వంటరివి . రణరంగమున మా ఎదుట నిలబడలేవు . ఇక యుద్ధము చేయుట కూడానా ?యుద్ధమునకు రమ్ము !ఈవేళ నీ గర్వమును అణిచివేసి ,నీ ప్రాణములు తీసివేయుదుము "అని పలికి వారందరూ ఒక్కసారిగా వాడియైన శూలములను శ్రీరాముడిపై ప్రయోగించిరి . 

శ్రీరాముడు బంగారు కాంతితో మెరిసిపోయే బాణములతో వాటిని ముక్కలు చేసి అనంతరము వాడి అయిన పదునాలుగు బాణములను ఒకేసారి ఆ పదునాలుగు మందిపై ప్రయోగించెను . ఆ బాణములు వారి శరీరములను చీల్చి బయటకు వచ్చినవి . వారందరూ అక్కడిక్కడే మరణించారు . అది అంతా కళ్లారా చూసిన శూర్పణఖ భీకర శబ్దాలతో గగ్గోలు పెట్టుచు ,ఏడ్చుచు ,ఆర్తనాదములు చేయుచు తన సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళినది . 

రామాయణము అరణ్యకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
















Thursday 20 April 2017

రామాయణము అరణ్యకాండ -పంతొమ్మిదవసర్గ

                                          రామాయణము 

                                          అరణ్యకాండ -పంతొమ్మిదవసర్గ 

ముక్కు ,చెవులు రక్తమోడుతూ విలపిస్తూ ,తన వద్దకు వచ్చిన తన సోదరి అయిన శూర్పణఖను చూసి ఖరుడు మిక్కిలి క్రుద్ధడై "నీయీ దురవస్థకీ కారణమేమి ?నీకు ఈ గతి పట్టించిన మూర్ఖుడెవడు ?"అని ప్రశ్నించెను . అప్పుడా శూర్పణఖ "రామలక్ష్మణులను రాకుమారులు ఒక సౌనదర్యవతితో కలిసి మన దండకారణ్య ప్రాంతము నందే వసించి వున్నారు . వారి వలననే నాకు ఈ దురవస్థ తటస్తించినది . వారి రక్తమును త్రాగిన కానీ ,నాకు ప్రతీకారము తీరదు . "అని కోపముతో ,అవమానంతో రగిలిపోతూ పలికెను . 

అప్పుడా ఖరుడు తన సోదరికి జరిగిన అవమానమునకు గాను రగిలిపోతూ ,పదునాలుగు మంది మిక్కిలి బలవంతులయిన రాక్షస వీరులను పిలిచి "మీరు వెనువెంటనే వెళ్లి మా సోదరిని అవమానించిన వారి ప్రాణములు తీసిరండు "అని ఆజ్ఞాపించెను .

అప్పుడా రాక్షస వీరులు శూరపణఖ దారి చూపగా ,రాముని ఆశ్రమమునకు వెళ్లి రామునిపై నిశిత బాణములను ప్రయోగించసాగిరి . అయినను మదగజములు మండుతున్న అగ్నిజ్వాలలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయిరి . 

రామాయణము అరణ్యకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు తెలుగు పండితులు .    

Tuesday 18 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునెనిమిదవసర్గ

                                          రామాయణము 

                                           అరణ్యకాండ  -పదునెనిమిదవసర్గ 

భయంకరాకారము కల శూర్పణఖ ను చూస్తూ శ్రీరాముడు "ఓ సుందరీ !నేను వివాహితుడను . ఇదిగో ఈ సుందరి సీత నా భార్య . ఇక్కడ ఉన్న పరాక్రమవంతుడు ,సుందరాంగుడు నా తమ్ముడు అతడు తన భార్యకు దూరముగా వున్నాడు . కావున అతడిని వివాహమాడి హాయిగా వుండు 'అని పలుకగా రాక్షసి అయిన శూర్పణఖ రాముడి మాటలు నిజమని నమ్మి లక్ష్మణుడి వద్దకు వెళ్లి వివాహము చేసుకోమని కోరుతుంది అప్పుడా లక్ష్మణుడు 
"ఓ విశాలాక్షీ !నేను మా అన్నావదినలకు సేవ చేయుటకే ఇచట వుండినాను . నన్ను వివాహము చేసుకొనిన యెడల నీవు కూడా వారికి దాసీవి అగుదువు . మా అన్నగారికి చిన్న భార్యవయి సుఖముగా వుండు . మా వదినగారు నడుమువంగినది ,వృద్ధురాలు ఆయన నిన్ను వివాహము చేసుకుని హాయిగా ఉండును "అని పలికెను . అప్పుడా శూరపణఖ నిజమని నమ్మి శ్రీరాముడి వద్దకు వెళ్లి 
"ఓ రామా !నీకు ఈ వృద్ధురాలు ఎందులకు ?యవ్వనవంతురాలునైన నన్ను వివాహమాడు . ఈమె కారణముగానే నన్ను తిరస్కరించుచున్నావు  ఈమెను ఇప్పుడే మింగి వేయుదును "అని పలికి వికృతాకారముతో సీతపై పడసాగెను . అప్పుడు శ్రీరాముడు "లక్ష్మణా !రాక్షసులతో పరిహాసములు పనికిరావు . వెనువెంటనే ఈ రక్కసి చెవులు ముక్కు త్రెంచివేయుము "అని ఆజ్ఞాపించెను . 

లక్ష్మణుడు క్షణమాలోచించక వెనువెంటనే శూర్పణఖ ముక్కు ,చెవులు కోసివేసెను . అప్పుడది పెద్దగా ఏడ్చుచు ,తన సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్లెను . ఆ సమయమున ఖరుడు రాక్షసుల పరివారముతో కలిసి ఉండెను . 

రామాయణము అరణ్యకాండ పదునెనిమిదవసర్గ సమాప్తము . 

                              శశి 

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Tuesday 11 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునేడవసర్గ

                                         రామాయణము 

                                           అరణ్యకాండ -పదునేడవసర్గ 

ఆ విధముగా సీతారాములు పురాణగాధలతో ,కథలతో ఆ ప్రదేశమునందు హాయిగా ఉండగా ,లక్ష్మణుడు జాగరూకుడై వారికి సేవలు చేయుచుఉండెను . 


అట్లు శ్రీరాముడు సుఖాసీనుడై పురాణగాథాప్రసంగములో మునిగి యుండగా విధివశమున శూర్పణఖ అను ఒకానొక రాక్షసి అచటికి వచ్చి ,శ్రీరాముని రూపలావణ్యములను చూసి ,ఆయనను మోహించి ఆయన వద్దకు వచ్చి "నీవెవరు ?ఇచట భార్యా సమేతుడవై ఎందులకు వసించుచున్నావు ?"అని అడిగెను . 
అప్పుడు రాముడు "దశరధుడను మహారాజు కుమారుడను . మా తండ్రి గారి కోరిక పై వనవాసమునకు వచ్చితిని . నీవెవరు ?ఎవ్వరికి చెందినదానవు ?"అని శూర్పణఖను ప్రశ్నించెను . అప్పుడు శూర్పణఖ "నా పేరు శూర్పణఖ ,నేను దశకంఠుడి చెల్లెలను . అతడు మహా బలశాలి ,పరాక్రమవంతుడు . ఎల్లప్పుడూ నిద్రించు స్వభావము కల కుంభకర్ణుడు నా సోదరుడే ,విభీషణుడు నా సోదరుడే . రణరంగమున తిరుగులేని ఖరదూషణాదులు కూడా నా సోదరులే . నేను కామరూపురాలిని  నీయెడ మోహపరవశురాలినయ్యిని . కావున నన్ను వివాహమాడుము . ఈమె నీ భార్యగా ఏమాత్రము తగదు . మనకు అడ్డుగా వున్న ఈ మానవకాంతని ,నీ సోదరుడిని నేను తినివేస్తాను "అని పలికెను . 
మత్తిల్లిన రాక్షసి అయిన శూర్పణఖ మాటలకు శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుతూ ఇలా మాట్లాడసాగెను . 

రామాయణము అరణ్యకాండ పదునేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Monday 10 April 2017

రామాయణము అరణ్యకాండ - పదునాఱవసర్గ

                                                 రామాయణము 

                                                      అరణ్యకాండ  - పదునాఱవసర్గ 

సీతారామలక్ష్మణులు పంచవటిలో నివసించుచుండగా సకల ప్రాణులకు ఇష్టమైన హేమంతఋతువు ప్రవేశించెను . ప్రక్రుతి రామణీయముగా ఉండెను . వాతావరణము చల్లగా ఉండెను . ఎండబాధించకుండెను . ఆ సమయములో ఒక నాడు ప్రాతః కాలమున లక్ష్మణుడు శ్రీరాముడితో "అన్నా !నీకెంతో ఇష్టమైన హేమంత ఋతువు వచ్చినది . వాతావరణము చల్లగా హాయిగా ఉన్నది . నదులలో నీరు మిక్కిలిగా చల్లగా ఉండి ,స్నానమునకు అనువుగా వుండవు . భరతుడు  కష్టములు తెలియక పెరిగాడు . అతడు నీపై కల ప్రేమవలన జటావల్కల ధారియై తానునూ వనవాస దీక్షను చేయుచున్నాడు . కందమూలాదులు ,పళ్ళు మాత్రమే భుజిస్తూ ,నేలపైనే పరుండుతున్నాడు . 

అతడు చల్లగా వుండు నదీ జలములలో   ఎటుల స్నానము చేయుచున్నాడో ?"కొడుకులు  తండ్రి మాటను అనుసరించక తల్లి మాటను విందురు "అను లోకోక్తిని భరతుడు వమ్ము చేసినాడు . దశరథ మహారాజు భార్య ,భరతుడికి తల్లి ఐన కైకేయి ఇట్టి దురాఘతానికి ఎటుల పాల్పడినదో కదా !"అని పలికెను . ఆమాటలు విన్న శ్రీరాముడు "నాయనా !లక్ష్మణా !పినతల్లిని తప్పుపట్టకుము . ప్రస్తుతము భరతుడి గూర్చి మాట్లాడెదము . నాకును భరతుడు పదేపదే జ్ఞప్తికి వచ్చుచున్నాడు . నీవు ,నేను ,భరతుడు ,శత్రుఘ్నుడు అంధరము కలసి సంతోషముగా వుండు రోజు ఎప్పుడు వచ్చునొకదా !"అని పలికెను . 

ఆ విధముగా మాట్లాడుకొనుచు వారు మువ్వురు గోదావరి నదీ తీరమునకు చేరి స్నానములాచరించి ,దేవతలకు ,ఋషులకు ,పితృదేవతలకు తర్పణములు వదిలిరి . పిమ్మట సూర్యభగవానుని పూజించిరి . 

రామాయణము అరణ్యకాండ పదునాఱవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు .

 

 








 

Sunday 9 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునైదవసర్గ

                                            రామాయణము 

                                                     అరణ్యకాండ -పదునైదవసర్గ 

సీతారామలక్ష్మణులు పంచవటికి చేరిరి . ఆ ప్రదేశమంతా సర్పములు ,మృగములతో ,నిండి ఉండెను . చక్కగా పుష్పించిన వృక్షములతో కాదు రమ్యముగా వున్నది .

 శ్రీరాముడు లక్ష్మణునితో "నాయనా !లక్ష్మణా !అగస్త్యమహాముని చెప్పిన పంచవటి కి చేరుకున్నాము . నీవు ,నేను ,మీ వదిన చక్కగా మసలుటకు అనువుగా ఉన్న ,పక్కనే జలాశలయము ఉండవలెను . చుట్టూ పూలవృక్షములతో ఉండవలెను . అగ్నికార్యాది నిత్యవిధులకు లోటురాకుండా సమిధలు ,పూలు ,దర్భలు ,జలములు చేరువులో ఉండునట్లు ఉండవలెను . "అని పలికెను . 
లక్ష్మణుడు "అన్నా !నేను నీ సేవకుడను అటువంటి ప్రదేశము ఎక్కడుందో సెలవివ్వుము . "అని పలికెను . పిమ్మట శ్రీరాముడు అటువంటి ప్రదేశము ను లక్ష్మణునికి చూపెను . లక్ష్మణుడు ఆ ప్రదేశములో మట్టితో ,వెదురు ,జమ్మి సహాయముతో చక్కటి ,అందమైన ,దృఢమైన పర్ణశాలను నిర్మించెను .

 పిమ్మట ఆ పర్ణశాలను తన అన్నా వదినలకు చూపెను . ఆ పర్ణశాలను  చూసిన శ్రీరాముడు సంతోషముతో లక్ష్మణుని కౌగిలించుకొనెను . 
సీతాలక్ష్మణులు సేవచేయుచుండగా ,శ్రీరాముడు స్వర్గలోకమున దేవేంద్రుడు వలె హాయిగా జీవించెను . ఇట్లు కొంత కాలము గడిచెను . 

రామాయణము అరణ్యకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .

 

 

 

    

Saturday 8 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునాల్గవసర్గ

                                          రామాయణము 

                                             అరణ్యకాండ -పదునాల్గవసర్గ 

సీతారామలక్ష్మణులు వంచవటికి పయనించు దారిలో ఒక దృఢమైన శరీరము కల గ్రద్దను చూసేను . మఱ్ఱిచెట్టుమీద వున్న దానిని చూసిన రామలక్ష్మణులు పక్షి అవతారంలో వున్న రాక్షసుడని భావించి ,"నీవెవరు ?నీపేరేమి ?"అని ప్రశ్నించెను . అప్పుడా గ్రద్ద "నాయనా !రామా !నేను మీ తండ్రి అయిన దశరధుని మిత్రుడను . "అని పలికెను . 
తన తండ్రి మిత్రుడని తెలియగానే శ్రీరాముడు ఆ గ్రద్దను పూజించి ,నీవంశము యొక్క పుట్టుపూర్వత్తరాలేవి ?నీపేరేమి ?"అని ప్రశ్నించెను . 

అంతట ఆ గ్రద్ద తన వంశమును గూర్చి ,తనను గూర్చి తెలుపబోవుచు ,ప్రశంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇలా వివరించెను . "ఓ రామా !ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు . వరుసగా విక్రీతుడు ,శేషుడు ,సంశ్రయుడు ,బ్రహ్మపుత్రుడు ,స్థాణువు ,మరీచి ,అత్రి ,క్రతువు ,పులహుడు ,దక్షుడు ,వివస్వంతుడు ,కశ్యపుడు ,పులస్త్యుడు ,అంగిరసుడు ,ప్రచేతేసుడు ,అను పదునైదు మంది మిగిలిన ప్రజాపతులు వారిలో కశ్యపుడు చివరివాడు .
దక్షప్రజాపతి కి 60 మంది వారిలో అదితి ,దితి ,ధనువు ,కాళిక ,తామ్ర ,క్రోధవశ ,మనువు ,అనల అను 8మంది సుందరీమణులు ను కశ్యపుడు వివాహమాడాడు . ఓ అరి నూదనా !అదితి యందు ద్వాదశ ఆదిత్యులు ,అష్టవసువులు ,ఏకాదశరుద్రులు ,ఇరువురు అశ్విని దేవతలు మొత్తం ముప్పైమూడుమంది దేవతలు జన్మించిరి . దితి యందు జన్మించినవారు దైత్యులు . పూర్వము ఈ భూమి మీద అధికారము దేవతలకు ,రాక్షసులకు  ఉండేది . ధనువు అనే ఆమె యందు పుట్టినవాడు ఆశ్వగ్రీవుడు ,నరకుడు ,కాలకుడు అనువారు 'కాలిక 'యొక్క పుత్రులు . తామ్ర అను ఆమె క్రౌంచి ,భాసి ,స్వేని ,దృతరాష్ట్రి ,శుకి అను 5గురికి జన్మనిచ్చెను . 
వారిలో' క్రౌంచి' గుడ్లగూబలకు ,;భాసి' నీటి కాకులకు , కోళ్లకు ,'స్వెని 'డేగలు ,గ్రద్దలకు జన్మలనిచ్చిరి . దృతరాష్ట్రి అందు హంసలు ,కలహంసలు ,చక్రవాకములు ,జన్మించెను . శుకి అందు 'నత' పుట్టెను . 'నత 'కుమార్తె వినత . కశ్యపుని భార్య అయిన 'క్రోధవశ 'అను ఆమె యందు మృగి ,మృగమంద ,హరి ,భద్రమధ ,మాతంగి ,శార్దూలి ,స్వేత ,సురభి ,సురస ,కద్రువ అను పదిమంది జన్మించిరి . ఓ పురుషోత్తమా !మృగములన్నియు మృగి యొక్క సంతానము . ఎలుగుబంట్లు ,సవరపుమెకములు ,చమరీ మృగములు ,'మృగమదం'యొక్క సంతానము . 'హరి 'అను ఆమె యొక్క సంతానము  సింహములు ,వానరములు . 'భద్రమధ 'అను ఆమె కూతురు ఐరావతి . 'ఐరావతి 'సంతానము ఐరావతము . 'మాతంగి 'అను ఆమె యొక్క సంతానము ఏనుగులు .' శార్దూలి 'అను ఆమె సంతానము కొండముచ్చులు ,పెద్దపులులు . 
సురభి అను ఆమెకు 'రోహిణి 'గంధర్వి 'అను ఇరువురు కుమార్తెలు కలిగారు . గోవులన్నియు రోహిణి యొక్క సంతానము . గన్ధర్వీ సంతానము అశ్వములు . నాగుల తల్లి సురస . కద్రువ యొక్క సంతానము పాములు . 'మనువు 'అను ఆమె సంతానమే మానవులు . మధురఫలములతో కూడిన వృక్షములన్నియు 'అనల 'అను ఆమె సంతానము . వినతకు 'అనూరుడు (సూర్యుని రద సారధి ),గరుడుడు (విష్ణుమూర్తి వాహనము )అను ఇరువురు కుమారులు కలిగిరి . నేను ,మా అన్న సంపాతి ఆ అనూరుని కుమారులము . నా పేరు జటాయువు . మా తల్లి పేరు స్వేని . అనగా నేను స్వేని ,అనూరుల కుమారుడును . 
నాయనా !ఇది దట్టమైన కీకారణ్యము . క్రూర మృగములు ,రాక్షసులు ఇచట సంచరించుచు ఉందురు . నీవు సమ్మతించినచో నేను మీరు ఫల,మూలములకు వనములో కి వెళ్లిన సమయములో ఈ చిన్నారి బాలిక అయిన సీతను రక్షిస్తూ ఇచటనే ఉండేదను "అని పలికెను . ఆ మాటలు అన్నీ విని శ్రీరాముడు జటాయువును కౌగలించుకుని సీతా రక్షణకు  తన సమ్మతమును తెలిపెను . 

రామాయణము అరణ్యకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Friday 7 April 2017

రామాయణము అరణ్యకాండ -పదుమూడవసర్గ

                                            రామాయణము 

                                               అరణ్యకాండ -పదుమూడవసర్గ 

ఆ విధముగా అగస్త్యుడు శ్రేష్ఠములైన ఆయుధములను శ్రీరామునకు సమర్పించి ,రామలక్ష్మణులతో "రామలక్ష్మణులారా !మీకు శుభమగుగాక !మీ పట్ల ప్రసన్నుడనయితిని . నాపై కల అభిమానంతో మీరు నా ఆశ్రమమునకు విచ్చేసితిరి . అందులకు ఎంతో సంతసించితిని . అడవిమార్గములో పలు శ్రమలకోర్చి పలుదూరము ప్రయాణించారు . కావున మిక్కిలి అలసియుంటిరి . భర్తవయిన నీపై కల ప్రేమభిమానముల కారణముగా సీతాదేవి ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన సాహస కృత్యము . 
ఓ రఘువరా !సాధారణముగా స్త్రీలు భర్త తనకు అనుకూలముగా వున్నప్పుడు ఆయనపై ప్రేమానురాగములు ప్రదర్శించెదరు . పతి దురవస్థలపాలైనప్పుడు స్త్రీ అతనిని పరిత్యజించెదరు . ఇది స్త్రీల సహజ లక్షణము . స్త్రీలు విద్యుత్తువలె చంచల స్వభావము కలవారు ,గరుడుని వలే వాయువు వలె తీవ్ర ప్రభావము కలవారు . కానీ నీ భార్య అగు సీతాదేవి లో మాత్రము ఈ దోషములేవియు మచ్చుకకైనను కానరావు . ఈ జానకి అరుంధతి వలె పరమ సాద్వి . అందువలన ఈమె కడు పూజ్యురాలు . ఓ రామా !సీతాలక్ష్మణులతో కలసి ఇక్కడే మా ఆశ్రమమందే నీవు హాయిగా ఉండవచ్చును . "అని పలికెను . 

అప్పుడు శ్రీరాముడు "పరమ పూజ్యుడా !ఓ మహామునీ !మా యెడ ప్రసన్నుడవై మాకు అనేక వరములను ప్రసాదించితివి . మేము మువ్వురము ధన్యులము . జలములు ,పాళ్ళు సమృద్ధిగా కల ప్రదేశమును ఆశ్రమము నిర్మించుకొనుట కొరకు మాకు తెలుపుడు "అని పలుకగా ,ఆ మహా ముని "ఓ రామా !నేను నా దివ్య దృష్టితో నీ చరితను ,నీ మనసులోని భావనను గమనించాను . నీవు ఇచట ఉండుట వలన నీ ఆచూకీ సర్వులకు తెలియునను భావించుచున్నావు . సరే ,ఇచట నుండి ఎంతో దూరము లేని పంచవటి అను ప్రదేశము పళ్ళు ,పూలు లేళ్ళగుంపులతో మనోహరముగా ఉండును . మీదు మిక్కిలి అది గంగా నదీ తీరమున కలదు . అచట మీరు సుఖముగా వుండగలరు . 
ఓ మహావీరా !అదిగో అచట దట్టమైన ఇప్పవనము కనపడుచున్నది . అచటి నుండి ఉత్తర దిశగా మర్రిచెట్టుపై అభిముఖంగా వెళ్ళినచో ఒక పర్వతము వచ్చును . దానికి సమీపమునందే 'పంచవటి 'అను సుప్రసిద్ధ ప్రదేశము కలదు . ఆ వనం ఎల్ల వేళలా పుష్పశోభతో విలసిల్లుచుండును . "అని పలికెను . ఆ ముని మాటలు విని సీతారామలక్ష్మణులు అగస్త్యుడికి పాదాభివందనం చేసి తమ ప్రయాణమునకు అనుమతి కోరి ,ఆ ముని చెప్పిన దిశగా ప్రయాణము సాగించెను . 



రామాయణము అరణ్యకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 










Wednesday 5 April 2017

రామాయణము అరణ్యకాండ -పండ్రెండవసర్గ

                                         రామాయణము 

                                             అరణ్యకాండ -పండ్రెండవసర్గ 

లక్ష్మణుడు వెంటనే ఆశ్రమములోకి ప్రవేశించి అచట వున్న ఒక శిష్యునితో సీతారాముల ఆగమన వార్తను తెలిపి ,ఆ వార్తను అగస్త్యమునికి నివేదించమని పలికెను . అప్పుడా శిష్యుడు వెళ్లి అగస్త్యునితో "స్వామి !అయోధ్యాధీశుడైన దశరధుని కుమారులైన రామలక్ష్మణులు ,రాముని పత్ని అయిన సీత తమరి దర్శనము కొఱకై ఇచటకు వచ్చివున్నారు . తమ ఆజ్ఞ కొరకు ఆశ్రమము వెలుపల వేచివున్నారు . "అని అంజలి  ఘటించి పలికెను . 

వెనువెంటనే అగస్త్యుడు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి "ఏమి నా భాగ్యము ఇంతకాలమునకు నాకు ఆ దశరథరాముని దర్శనము లభించబోవుచున్నది . వారిని ఎందులకు ప్రవేశపెట్టలేదు . ఇంతకీ వారెచటవున్నారు . వెనువెంటనే వారి ఎంతో ఆదరాభిమానములతో తోడ్కొనిరమ్ము . "అని పలికెను . 
అప్పుడా శిష్యుడు పరుగున వెళ్లి లక్ష్మణునితో "ఏరి సీతారాములేరి ?వారిని చూచుటకై మా గురుదేవులే ఇచటకు వచ్చేలావున్నారు "అని పలుకగా లక్ష్మణుడు ఆ శిష్యుని తీసుకువెళ్లి ,సీతారాములను చూపించెను .


 అప్పుడా శిష్యుడు అగస్త్యుడు పలికిన పలుకులను యధావిధిగా వారికి విన్నవించి ,వారిని గౌరవ మర్యాదలతో ఆశ్రమములోపలికి తోడ్కొని వెళ్లెను . 
ఆ ఆశ్రమములో ఒక్కో దేవుడికి ఒక పూజామందిరము చప్పున అనేక పూజామందిరములు కలవు . శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ పూజా మందిరములన్నిటిని శ్రద్దాసక్తులతో దర్శించెను . ఇంతలో అగస్త్యుడు శిష్యులతో కలసి శ్రీరామునికి స్వాగతము పలుకుటకు ఎదురుగా వచ్చెను . వారిని చూసిన శ్రీరాముడు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న అగస్త్యుని గుర్తించి లక్ష్మణునికి చెప్పెను . అగస్త్యుడు వారికి స్వాగతము పలికి మార్గాయాసము తీర్చుకొనమని పలికెను . సీతారామలక్ష్మణులు ఆయనకు పాదాభివందనం చేసిరి . 
అగస్త్యుడు అగ్నికార్యము ముగించుకు వచ్చి సీతారామలక్ష్మణులు అతిధి మర్యాదలు చేసెను . పిమ్మట ఆముని విశ్వకర్మచే నిర్మితమయిన విష్ణుచాపము ,రెండు అక్షయముగా బాణములు కలిగే తూణీరములు ,బంగారు ఒరకల 
సువర్ణ ఖడ్గమును రామునికి ఇచ్చెను . అవన్నీ ఆయనకు బ్రహ్మదేవుడి నుండి లభించెను . శ్రీరామునికి వాటిని ఆ ముని సంతోషముగా వాటిని ఇచ్చివేసెను . 

రామాయణము అరణ్యకాండ పండ్రెండవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Tuesday 4 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునొకండవసర్గ

                                                 రామాయణము 

                                                      అరణ్యకాండ -పదునొకండవసర్గ 

వనప్రయాణములో రాముడు ముందు నడుచుచుండగా సీత ఆయనవెనక ఆవెనక లక్ష్మణుడు అనుసరించుచుండెను .

 క్రమముగా వారు వివిధ పర్వతసానువులను ,వనములను ,కనులకింపగు నదులను ,దర్శించుచు సాగిపోవుచుండిరి . వారు మునులతో కూడి ఇలా కొంతదూరము  వెళ్లిన పిమ్మట సూర్యుడు అస్తమించు సమయము ఆసన్నమాయెను . అప్పుడు వారు మనోహరముగా ఉన్న ఒక తటాకమును కాంచిరి . ఆ  ఎఱ్ఱ తామరలు ,నల్లకలువలు ,ఏనుగుల గుంపులు ,నీటిలో సంచరించే బెగ్గురుపక్షులు ,రాజహంసలు ,కలహంసలు చూడముచ్చటగా ఉండెను . 




స్వచ్ఛమైన జలములతో మనోహరముగా  వున్న ఆ సరస్సు నుండి వీణావేణుమృదంగతాళధ్వనులతో కూడిన మధురగానము వారికి వినపడెను . కానీ అచట ఎవరు కనపడకుండిరి . రామలక్ష్మణులు తమతో వచ్చుచున్న మునులలో 'భృతుడను 'మహర్షిని "ఈ అద్భుత సంగీతము మాకు కుతూహలము రేపుచున్నది . అతిగోప్యము కానిచో దానిని గూర్చి మాకు తెలుపుడు "అని పలికిరి . అప్పుడా 'ధర్మభృతుడు ' "ఓ రామా !ఈ సరస్సు పేరు 'పంచాప్సరము '. మాండకర్ణి అనే మహర్షి తన తపః ప్రభావముచే దీనిని నిర్మించెను . 
ఆ మాండకర్ణి మహర్షి గాలిని ,నీటిని మాత్రమే ఆహారముగా తీసుకొనుచు 10,000 సంవత్సరములు తీవ్రముగా తపమాచరించెను . ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలందరూ భయకంపితులయ్యిరి . వారందరూ వారిలో ఒకరి స్థానమును ఆక్రమించుటకే ఈ మహర్షి ఈ విధముగా తపస్సుచేయుచున్నాడు అని బావించిరి . పిమ్మట ఆ దేవతలు విద్యుత్కాంతులవలె మిఱుమిట్లు గొలిపెడి ఐదుమంది మేటి అప్సరసలను నియోగించిరి . పిమ్మట ఆదివ్యాంగనలు ఆ మాండకర్ణి మునిని వశపరుచుకొనిరి . ఫలితముగా ఆ ఐదుగురు అప్సరసలు ఆ మునికి భార్యలు అయ్యిరి . 
వారికొఱకై ఈ తటాకము యొక్క అడుగుభాగమున ఒక గృహమును ఆ ముని తన తపః ప్రభావమున నిర్మించెను . ఆ ముని తన తపః ప్రభావముచే యవ్వనమును పొంది వారితో కలిసి హాయిగా ఇచటనే ఉంటున్నాడు . ఆ అప్సరసల మధురగానమే ఇప్పుడు మీరు విన్నది . "అని పలికెను . అచటకు దగ్గరలోనే ఉన్న మునుల ఆశ్రమములలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అచటనే కొంతకాలము వసించెను . పిమ్మట పూర్వము తానూ దర్శించి వసించిన మునుల ఆశ్రమములకు మఱియొక పర్యాయము వెళ్లెను . 
సీతారామలక్ష్మణులు ఒక ఆశ్రమమం నందు పదిమాసములు ,మఱియొకచోట ఒక సంవత్సరము ,వేరొకచోట నాలుగు మాసములు ,అట్లే తదితర ఆశ్రమముల నందు వరసగా ఐదుమాసములు ,ఆఱుమాసములు ,ఏడుమాసములు వసించెను . ఇంకనూ వారు వేరువేరు ఆశ్రమములనందు ఒకమాసము ,ఒకమాసము కంటే ఎక్కువ ,అర్ధమాసము కంటే ఎక్కువ మూడుమాసములు ,ఎనిమిది మాసములు హాయిగా వసించెను . ఆ విధముగా పదియేండ్లు గడిచెను . పదిసంవత్సరముల తదుపరి వారు మువ్వురు తిరిగి సుతీక్షణ మహర్షి ఆశ్రమమునకు వెళ్లిరి . అచట కొంతకాలము గడిచిన పిమ్మట అగస్త్యముని ఆశ్రమమును దర్శించవలెననే కోరికను రాముడు సుతీక్షణ మహర్షికి విన్నవించెను . 
ఆయన కోరిక విన్న సుతీక్షణమహర్షి మిగుల సంతసించి ,ఆశ్రమమునకు దారి చెప్పెను . ముందుగా అగస్త్యభ్రాత (అనగా అగస్త్యముని సోదరుడు . ఈయన గురించి ఎక్కడ వచ్చినను ఈయన పేరు తెలుపబడలేదు . అగస్త్యభ్రాత అని మాత్రమే పేర్కొనుట జరిగినది )ఆశ్రమమునకు దారి తెలిపి ,అచట నుండి అగస్త్యుని ఆశ్రమమునకు దారి తెలిపెను . సీతారామలక్ష్మణులు ఆ మహాముని తెలిపిన దారిలో నడుచుకుంటూ అగస్త్యభ్రాత ఆశ్రమము దగ్గరకు వచ్చిరి . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో "సోదరా !మనము సుతీక్షణ మహర్షి తెలిపిన విధముగానే అగస్త్యభ్రాత ఆశ్రమము దగ్గరకు వచ్చితిమి . ఈయన సోదరుడగు అగస్త్యుడు తన తపః ప్రభావమున లోక హితముకొఱకు మృత్యువును జయించి ఈ దక్షిణ దిశను సురక్షితమయినదిగా చేసెను . 
పూర్వము ఇచట క్రూరులైన వాతాపి ,ఇల్వలుడు అను రాక్షస సోదరులు ఉండెడివారు . వారిలో నిర్దయుడైన ఇల్వలుడు బ్ర్రాహ్మణ రూపమును ధరించి సంస్కృతభాషలో బ్ర్రాహ్మణులను ఆహ్వానించెడివాడు . ఇల్వలుడు తన సోదరుడైన వాతాపిని శాకరూపమున మార్చి శ్రాద్దమునకు తగినట్లుగా కూరగా వండి ,విధివిధానంగా శ్రార్ధ కర్మను జరిపి ,బ్ర్రాహ్మణులకు భోజనపదార్థములలో ఆ కూరను వడ్డించెడివాడు . ఆ విప్రుల భోజనము ముగిసిన పిమ్మట ఇల్వలుడు బిగ్గరగా "వాతాపి బయటకురా "అని అరిచెడివాడు . సోదరుడి పిలుపు విని వాతాపి మేక వలె మారి ఆ బ్ర్రాహ్మణుల ఉదరమును చీల్చుకుని బయటకు వచ్చెడివాడు . ఆ విధముగా నరమాంస భక్షకులైన ఆ రాక్షస సోదరులు వేలకొలది గా బ్ర్రాహ్మణులను హతమార్చుచుండెడివారు . 

ఆ రాక్షసుల ఆగడములు దేవతలు అగస్త్యునికి మొరపెట్టుకొనగా ,అంత ఆ మహాముని వారి ఇంటికి శ్రార్ధ కర్మకు వెళ్లి వారు పెట్టిని భోజనమును భుజించెను . "ఈ భోజనంతో నేను తృప్తి పడితినని "ఆ ముని పలికెను . అప్పుడు ఇల్వలుడు "వాతాపి సోధరా !బయటకు రా "అని పిలిచెను . అప్పుడు అగస్త్యుడు "ఇంకనూ మీ సోదరుడు ఎక్కడ !అతడు ఎప్పుడో జీర్ణమయ్యెను . ఈ పాటికే యమపురికి వెళ్ళినాడు "అని పలికెను . ఆ మాటలు విన్న ఇల్వలుడు ఆమునిపైకి హింసకు దిగెను . అప్పుడాముని తన కంటి చూపుతో వాడిని భస్మము చేసెను . "అని పూర్వ వృత్తాంతమును తెలిపెను . వారు మువ్వురు అగస్త్యభ్రాత  ఆశ్రమమునకు చేరిరి అచట అదితిసత్కారములు పొంది ఆ రాత్రి అచటనే ఉండి మరునాడు ఉదయమే అగస్త్యుడి ఆశ్రమమునకు వెళ్లుచున్నామని చెప్పి అచట నుండి బయలుదేరెను . 
వారు వనములోని అనేక ప్రదేశములను ,వృక్షములను ,చూడముచ్చట గా కల సరస్సులు దాటుకుంటూ అగస్త్యుని ఆశ్రమమునకు దగ్గరకు  చేరిరి .  అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !మనము అగస్త్యముని ఆశ్రమము చేరువకు చేరుకొంటిమి . తన తపః ప్రభావముచే వింధ్యపర్వతమును స్తంభింపచేసినందున ఆ మహర్షి "అగస్త్య నామముతో "విఖ్యాతుడయ్యెను .ఈ మునికి భయపడి రాక్షసులు ఇచటకు రారు సరికదా ఈ వైపు కన్నెత్తి కూడా చూడరు . ఇచట దేవతలు ,యక్షులు ,నాగజాతివారు ,గరుడాద్రి పక్షిజాతి వారు ఆహార నియమములను పాటించుచు ,ధర్మనిరతులై నివసించుచుందురు . 
ఈ ఆశ్రమము ప్రాంతము నందలి తపస్సిద్ధి నొందిన మహాత్ములు ,మహర్షులు ,తమ స్థూలదేహములను వీడి దివ్యదేహములను దాల్చి ,సూర్యతేజస్సుతో వెలుగొందెడి విమానములపై స్వర్గము చేరుచుందురు . ఈ ప్రదేశమున శ్రద్దగా సత్కర్మలు ఆచరించెడివారికి వారు ఆరాధించే దేవతలు రాజ్యసంపదలను ,అమరత్వమును ప్రసాదించెదరు . అట్టి మహిమాన్వితమైన ఆశ్రమమునకు మనము రానే వచ్చితిమి . ముందుగా నీవు వెళ్లి నేను సీతా వచ్చామని ఆ మహామునికి విన్నవించు "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ పదునొకండవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  
















Sunday 2 April 2017

రామాయణము అరణ్యకాండ -పదియవసర్గ

                                              రామాయణము 

                                                    అరణ్యకాండ -పదియవసర్గ 

పతిభక్తి పరాయణ అయిన సీతాదేవి పలికిన పలుకులు విని ,ధర్మనిరతుడైన శ్రీరాముడు ఆమెకు ఇలా ప్రత్యుత్తరమిచ్చెను . 

"దేవీ !నీవు మహోన్నతమైన జనకమహారాజు వంశమున జన్మించినదానవు . ధర్మజ్ఞురాలవు . నాపై నీకు గల అనురాగము గాఢమైనది . అన్నివిధములుగా నీకు తగినట్లుగా నా హితము కోరుచు వచించితివి . ఓ సీతా !దండకారణ్యము నందు దీక్షతో తపస్సాచరించుచున్న  ఆర్తులై స్వయముగా వచ్చి నన్ను శరణు జొచ్చితిరి . వారు రక్షింపదగినవారు . వారు వనములలో కందమూలాదులను ఆహారముగా తీసుకొనుచు ,ధర్మనిరతులై జీవించుచున్నారు . క్రూరాత్ములైన రాక్షసుల ఆగడములను తట్టుకొనలేక భయగ్రస్తులై వారు సుఖశాంతులకు దూరమయ్యిరి . 
వారు నిరంతరమూ తపోనిధులలో నిరతులై యుందురు . నరమాంసభక్షకులైన భయంకరమైన ఆకారులు అయిన రాక్షసులు ఆ సాధుపురుషులను చంపి తినివేయుచుందురు . దండకారణ్యవాసులు ,ద్విజోత్తములు అయిన ఆ మునులు 'మమ్ములను అనుగ్రహింపుడు 'అని నన్ను వేడుకొనిరి . వారు ఆవిధముగా అభ్యర్ధించుటచే నేను "మీరు నన్ను అభ్యర్ధించుట తగదు . శాసించవలెను . "అని అతి వినమ్రుడనై వారి ఎదుట పలికితిని . అప్పుడు ఆ మునిపుంగవులు "క్రూర రాక్షసులు పెట్టే బాధలు తట్టుకొనలేక ,మమ్ము ఆడుకొనువారి కొరకై వెతుకుచుంటిమి . మా తీవ్రమైన తపః ప్రభావమున ఆ నిశాచరులను (నిశా అనగా రాత్రి . అనగా రాత్రి పూట సంచరించువారైన రాక్షసులు )భస్మము చేయగల శక్తి మాకు కలదు . 
కానీ పెక్కు ఏండ్లు ఆచరించిన తపః ప్రభావమును వారికి వ్యర్ధము చేయుట మాకు సమ్మతము కాదు . ఆ రాక్షసులు నిత్యమూ మమ్ము పెక్కు ఇబ్బందులకు గురి చేస్తుంటారు . మా సహనమును పరీక్షచేస్తుంటారు . ఆ రాక్షసులచే పీడింపబడుచున్న మమ్ము లక్ష్మణునితో కలసి నీవు రక్షింపుము ."అని కోరిరి . ఋషుల విరోధులు అందరూ నాకు విరోదులే . అందువల్లనే రాక్షసులను పూర్తిగా పరిమార్చెదని ప్రతిజ్ఞ చేసినాను . ఓ సీతా !ఆ మునీశ్వరులు నన్ను అడగకున్నను  నేను వారిని రక్షించెదను . ఇప్పుడు నేను ప్రతిజ్ఞ కూడా చేసితిని . మాట నేను తప్పను నీకు సర్వము తెలుసును కదా . సీతా !మన ప్రేమానురాగముల వలన నీ సహృదయము వలన ఈ విషయము ప్రస్తావించివుంటివి . ఇందులకు నేను ఎంతయో సంతసించితిని . ఆత్మీయులు అయిన వారే ఇటుల మాట్లాడగలరు . 
ఓ వైదేహి !నీవు నీ వంశమునకు ,నీ స్వభావమునకు తగినట్లుగా మాట్లాడినావు . నీవు నాకు ప్రాణముల కంటే మిన్న . నీవు నా సహధర్మచారిణివి కదా !కావున నా ధర్మాచరణలో నాతొ పాలుపంచుకొనుము . "అని పలికేను . ఆ తరువాత సీతాలక్ష్మణులతో శ్రీరాముడు తపోవనములకు బయలుదేరెను . 

రామాయణము అరణ్యకాండ పదియవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  












Saturday 1 April 2017

రామాయణము అరణ్యకాండ -తొమ్మిదవసర్గ

                                            రామాయణము 

                                            అరణ్యకాండ -తొమ్మిదవసర్గ 

సీతారామలక్ష్మణులు సుతీక్షణ మహర్షి ఆశ్రమము నుండి ముందుకు నడుస్తూ మునులధర్మము గురించి చర్చించుకుంటూ ,నడవసాగిరి . అప్పుడు సీతాదేవి "ఆర్యాపుత్రా !మునుల ధర్మము వేరు ,ధనుర్భాణములు ధరించి క్షత్రియ ధర్మము నిర్వహించుట వేరు . ఇవి రెండు పరస్పరము విభిన్నములు . ధనుర్భాణములు ధరించినచో ముని వృత్తి సక్రమముగా అవలంభించలేము . 

పూర్వము ఒక  మహా ముని పరమ నిష్టాగరిష్ఠుడై ముని ధర్మమును అవలంభించుచు వనములో ఉండెడివాడు . ఒక నాడు ఇంద్రుడు ఆయన కడకు వచ్చి ఒక దివ్యాఖడ్గమును ఇచ్చి ,జాగ్రత్తపరిచి తిరిగి ఇమ్మని మునిని కోరెను . ఆ ముని అందులకు అంగీకరించి ,ఆరోజు నుండి ఆ ఖడ్గమును జాగ్రత్తముగా చూచుకొనుచు ఉండెను . ఆ ఖడ్గమును జాగ్రత్త పరుచుచు ఆయన ద్యాస దాని మీదే పెట్టుటచే ముని వృత్తి నిర్లక్ష్యము చేయసాగెను . 
నెమ్మిదిగా ఆ ఖడ్గమును రక్షించు క్రముమున హింసావృత్తి పెరగసాగెను తత్ఫలితముగా ఆయన నరకమునకు వెళ్లెను "కావున మీరు కూడా ఈ ధనుర్భాణములు విడిచి ముని వృత్తిని అవలంభించుట యుక్తమని నా అభిప్రాయము .  మీ సోదరుడగు లక్ష్మణునితో బాగుగా యోచించి ఏది మంచిదో అది చేయుము . "అని సీతాదేవి పలికెను . 

రామాయణము అరణ్యకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .