Wednesday 5 April 2017

రామాయణము అరణ్యకాండ -పండ్రెండవసర్గ

                                         రామాయణము 

                                             అరణ్యకాండ -పండ్రెండవసర్గ 

లక్ష్మణుడు వెంటనే ఆశ్రమములోకి ప్రవేశించి అచట వున్న ఒక శిష్యునితో సీతారాముల ఆగమన వార్తను తెలిపి ,ఆ వార్తను అగస్త్యమునికి నివేదించమని పలికెను . అప్పుడా శిష్యుడు వెళ్లి అగస్త్యునితో "స్వామి !అయోధ్యాధీశుడైన దశరధుని కుమారులైన రామలక్ష్మణులు ,రాముని పత్ని అయిన సీత తమరి దర్శనము కొఱకై ఇచటకు వచ్చివున్నారు . తమ ఆజ్ఞ కొరకు ఆశ్రమము వెలుపల వేచివున్నారు . "అని అంజలి  ఘటించి పలికెను . 

వెనువెంటనే అగస్త్యుడు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి "ఏమి నా భాగ్యము ఇంతకాలమునకు నాకు ఆ దశరథరాముని దర్శనము లభించబోవుచున్నది . వారిని ఎందులకు ప్రవేశపెట్టలేదు . ఇంతకీ వారెచటవున్నారు . వెనువెంటనే వారి ఎంతో ఆదరాభిమానములతో తోడ్కొనిరమ్ము . "అని పలికెను . 
అప్పుడా శిష్యుడు పరుగున వెళ్లి లక్ష్మణునితో "ఏరి సీతారాములేరి ?వారిని చూచుటకై మా గురుదేవులే ఇచటకు వచ్చేలావున్నారు "అని పలుకగా లక్ష్మణుడు ఆ శిష్యుని తీసుకువెళ్లి ,సీతారాములను చూపించెను .


 అప్పుడా శిష్యుడు అగస్త్యుడు పలికిన పలుకులను యధావిధిగా వారికి విన్నవించి ,వారిని గౌరవ మర్యాదలతో ఆశ్రమములోపలికి తోడ్కొని వెళ్లెను . 
ఆ ఆశ్రమములో ఒక్కో దేవుడికి ఒక పూజామందిరము చప్పున అనేక పూజామందిరములు కలవు . శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ పూజా మందిరములన్నిటిని శ్రద్దాసక్తులతో దర్శించెను . ఇంతలో అగస్త్యుడు శిష్యులతో కలసి శ్రీరామునికి స్వాగతము పలుకుటకు ఎదురుగా వచ్చెను . వారిని చూసిన శ్రీరాముడు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న అగస్త్యుని గుర్తించి లక్ష్మణునికి చెప్పెను . అగస్త్యుడు వారికి స్వాగతము పలికి మార్గాయాసము తీర్చుకొనమని పలికెను . సీతారామలక్ష్మణులు ఆయనకు పాదాభివందనం చేసిరి . 
అగస్త్యుడు అగ్నికార్యము ముగించుకు వచ్చి సీతారామలక్ష్మణులు అతిధి మర్యాదలు చేసెను . పిమ్మట ఆముని విశ్వకర్మచే నిర్మితమయిన విష్ణుచాపము ,రెండు అక్షయముగా బాణములు కలిగే తూణీరములు ,బంగారు ఒరకల 
సువర్ణ ఖడ్గమును రామునికి ఇచ్చెను . అవన్నీ ఆయనకు బ్రహ్మదేవుడి నుండి లభించెను . శ్రీరామునికి వాటిని ఆ ముని సంతోషముగా వాటిని ఇచ్చివేసెను . 

రామాయణము అరణ్యకాండ పండ్రెండవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment