Tuesday 18 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునెనిమిదవసర్గ

                                          రామాయణము 

                                           అరణ్యకాండ  -పదునెనిమిదవసర్గ 

భయంకరాకారము కల శూర్పణఖ ను చూస్తూ శ్రీరాముడు "ఓ సుందరీ !నేను వివాహితుడను . ఇదిగో ఈ సుందరి సీత నా భార్య . ఇక్కడ ఉన్న పరాక్రమవంతుడు ,సుందరాంగుడు నా తమ్ముడు అతడు తన భార్యకు దూరముగా వున్నాడు . కావున అతడిని వివాహమాడి హాయిగా వుండు 'అని పలుకగా రాక్షసి అయిన శూర్పణఖ రాముడి మాటలు నిజమని నమ్మి లక్ష్మణుడి వద్దకు వెళ్లి వివాహము చేసుకోమని కోరుతుంది అప్పుడా లక్ష్మణుడు 
"ఓ విశాలాక్షీ !నేను మా అన్నావదినలకు సేవ చేయుటకే ఇచట వుండినాను . నన్ను వివాహము చేసుకొనిన యెడల నీవు కూడా వారికి దాసీవి అగుదువు . మా అన్నగారికి చిన్న భార్యవయి సుఖముగా వుండు . మా వదినగారు నడుమువంగినది ,వృద్ధురాలు ఆయన నిన్ను వివాహము చేసుకుని హాయిగా ఉండును "అని పలికెను . అప్పుడా శూరపణఖ నిజమని నమ్మి శ్రీరాముడి వద్దకు వెళ్లి 
"ఓ రామా !నీకు ఈ వృద్ధురాలు ఎందులకు ?యవ్వనవంతురాలునైన నన్ను వివాహమాడు . ఈమె కారణముగానే నన్ను తిరస్కరించుచున్నావు  ఈమెను ఇప్పుడే మింగి వేయుదును "అని పలికి వికృతాకారముతో సీతపై పడసాగెను . అప్పుడు శ్రీరాముడు "లక్ష్మణా !రాక్షసులతో పరిహాసములు పనికిరావు . వెనువెంటనే ఈ రక్కసి చెవులు ముక్కు త్రెంచివేయుము "అని ఆజ్ఞాపించెను . 

లక్ష్మణుడు క్షణమాలోచించక వెనువెంటనే శూర్పణఖ ముక్కు ,చెవులు కోసివేసెను . అప్పుడది పెద్దగా ఏడ్చుచు ,తన సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్లెను . ఆ సమయమున ఖరుడు రాక్షసుల పరివారముతో కలిసి ఉండెను . 

రామాయణము అరణ్యకాండ పదునెనిమిదవసర్గ సమాప్తము . 

                              శశి 

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment