Friday 7 April 2017

రామాయణము అరణ్యకాండ -పదుమూడవసర్గ

                                            రామాయణము 

                                               అరణ్యకాండ -పదుమూడవసర్గ 

ఆ విధముగా అగస్త్యుడు శ్రేష్ఠములైన ఆయుధములను శ్రీరామునకు సమర్పించి ,రామలక్ష్మణులతో "రామలక్ష్మణులారా !మీకు శుభమగుగాక !మీ పట్ల ప్రసన్నుడనయితిని . నాపై కల అభిమానంతో మీరు నా ఆశ్రమమునకు విచ్చేసితిరి . అందులకు ఎంతో సంతసించితిని . అడవిమార్గములో పలు శ్రమలకోర్చి పలుదూరము ప్రయాణించారు . కావున మిక్కిలి అలసియుంటిరి . భర్తవయిన నీపై కల ప్రేమభిమానముల కారణముగా సీతాదేవి ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన సాహస కృత్యము . 
ఓ రఘువరా !సాధారణముగా స్త్రీలు భర్త తనకు అనుకూలముగా వున్నప్పుడు ఆయనపై ప్రేమానురాగములు ప్రదర్శించెదరు . పతి దురవస్థలపాలైనప్పుడు స్త్రీ అతనిని పరిత్యజించెదరు . ఇది స్త్రీల సహజ లక్షణము . స్త్రీలు విద్యుత్తువలె చంచల స్వభావము కలవారు ,గరుడుని వలే వాయువు వలె తీవ్ర ప్రభావము కలవారు . కానీ నీ భార్య అగు సీతాదేవి లో మాత్రము ఈ దోషములేవియు మచ్చుకకైనను కానరావు . ఈ జానకి అరుంధతి వలె పరమ సాద్వి . అందువలన ఈమె కడు పూజ్యురాలు . ఓ రామా !సీతాలక్ష్మణులతో కలసి ఇక్కడే మా ఆశ్రమమందే నీవు హాయిగా ఉండవచ్చును . "అని పలికెను . 

అప్పుడు శ్రీరాముడు "పరమ పూజ్యుడా !ఓ మహామునీ !మా యెడ ప్రసన్నుడవై మాకు అనేక వరములను ప్రసాదించితివి . మేము మువ్వురము ధన్యులము . జలములు ,పాళ్ళు సమృద్ధిగా కల ప్రదేశమును ఆశ్రమము నిర్మించుకొనుట కొరకు మాకు తెలుపుడు "అని పలుకగా ,ఆ మహా ముని "ఓ రామా !నేను నా దివ్య దృష్టితో నీ చరితను ,నీ మనసులోని భావనను గమనించాను . నీవు ఇచట ఉండుట వలన నీ ఆచూకీ సర్వులకు తెలియునను భావించుచున్నావు . సరే ,ఇచట నుండి ఎంతో దూరము లేని పంచవటి అను ప్రదేశము పళ్ళు ,పూలు లేళ్ళగుంపులతో మనోహరముగా ఉండును . మీదు మిక్కిలి అది గంగా నదీ తీరమున కలదు . అచట మీరు సుఖముగా వుండగలరు . 
ఓ మహావీరా !అదిగో అచట దట్టమైన ఇప్పవనము కనపడుచున్నది . అచటి నుండి ఉత్తర దిశగా మర్రిచెట్టుపై అభిముఖంగా వెళ్ళినచో ఒక పర్వతము వచ్చును . దానికి సమీపమునందే 'పంచవటి 'అను సుప్రసిద్ధ ప్రదేశము కలదు . ఆ వనం ఎల్ల వేళలా పుష్పశోభతో విలసిల్లుచుండును . "అని పలికెను . ఆ ముని మాటలు విని సీతారామలక్ష్మణులు అగస్త్యుడికి పాదాభివందనం చేసి తమ ప్రయాణమునకు అనుమతి కోరి ,ఆ ముని చెప్పిన దిశగా ప్రయాణము సాగించెను . 



రామాయణము అరణ్యకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 










No comments:

Post a Comment